క్రితం భాగంలో: బాలచంద్రుడు తన తమ్ముళ్ళతో కలిసి, కాలరుద్రుడిలా రణరంగంలో చెలరేగుతాడు. అసహాయశురుడై విజౄంభిస్తాడు. అతను, అతని తమ్ముళ్ళ ధాటికి తట్టుకోలేక నలగాముని సైనికులు పలాయనం చిత్తగిస్తారు. ఒక్కణ్ణి చేసి బాలుణ్ణి మట్టుబెట్టాలని తలచిన నరసింగరాజు తన సైనికుల్లో ధైర్యాన్ని నింపి యుద్ధానికి వస్తాడు. కానీ అతని ఎత్తుగడ ఫలించక నలగాముని శిబిరంలో దాక్కుంటాడు. నరసింగుని వంటి వాడి శిరస్సును ఖండించి తీసుకొస్తాడు బాలచంద్రుడు. అది నరసింగుని తల కాదని బ్రహ్మన్న చెప్పడంతో మళ్ళీ యుద్ధభూమికి వస్తాడు. |
Click here to download eBook of Palnati Veerabharatam
ప్రస్తుత భాగం:
బాలచంద్రుడు కాసెగట్టి, గోచిపెట్టి “సామంత రాగోల” అనే భయంకరమైన ఆయుధాన్ని చేత ధరించి యుద్ధరంగంలోకి చిచ్చరపిడుగులా మళ్ళీ దూకాడు.
ఐతే బాలచంద్రుని వదిలి అతని తమ్ములు ఎన్నడు ఉండలేదు. బాలచంద్రుడి వెంటే వున్నారన్నది నిర్వివాదాంశం. అవక్రపరాక్రమంతో రెండవ బాలచంద్రుడిలా విజృంభించినవాడు వెలమల దోర్నీడు. బాలుడు ‘సామంత రాగోల’మనే ఆయుధాన్ని పట్టుకుంటే, అతని తమ్ముళ్ళు గదలు ధరించారు. మదమెక్కిన సింహాల్లా శత్రువుల మీదకు దూకారు. దెబ్బతిన్న బెబ్బులుల్లా వీరవిహారం చేసారు.
రణక్షేత్రంనుంచి నరసింగుడు తప్పుకుంటే బాలుడు పెద్దగొంతుతో ఇట్లా పిలిచాడు – “పిరికిపంద నరసింగుడెక్కడ్రా? వీరుడైతే – వీరరక్తం వుంటే నా ఎదుట రమ్మనండి. చేవచచ్చిన చవట! ప్రాణభయంతో పారిపోయాడు.”
బాలచంద్రుడి ఆడిన మాటల్ని చారుల ద్వారా తెలుగుకున్న నరసింగుడు పౌరుషం తెచ్చుకుని చాలామంది సైనికుల్ని వెంటబెట్టుకుని యుద్ధరంగానికి వచ్చాడు.
నరసింగును చూచిన బాలుడు – “మా అలరాజును చాటుగా చంపిన చవటా! రా! బాహాబాహీ పోరాడుదాం!” అన్నాడు.
నరసింగును కాపాడటానికి వచ్చిన కేరళ రాజు, కుమ్మరి పట్టి చేతుల్లో చచ్చాడు. కర్నాటరాజు కంఠాన్ని దోర్నీడు నరికాడు. మాళవరాజును మంగలి మల్లుడు వేటుకు కూల్చాడు.
అదే క్షణాన బాలచంద్రుడు, నరసింగరాజు ఎక్కిన భద్రగజ కుంభస్థలం మీదకు ఎగిరి దూకాడు. దూకి, సామంతరాగోలతో ఒక్క పోటు పొడిచాడు. నరసింగునికి భుజం భగ్గుమన్నట్టైంది. చూసుకుంటే – రక్తం చిమ్ముతోంది. కత్తివేటు వేసాడు నరసింగు. తప్పుకున్నాడు బాలుడు. రెండు గడియల సేపు జరిగిన ఈ భయంకర యుద్ధాన్ని అటు-ఇటు వీరులు తమ తమ పోరాటాల్ని ఆపి మరీ చూసారు. బాలుడు రానురాను పెచ్చు పెరిగిపోతుంటే, నరసింగు నిర్వీర్యమైపోతున్నాడు.
బాలచంద్రుడు సామంతరాగోలతో నరసింగుడి పొట్టన పొడిస్తే, పేగులు ఆయుధాన్ని చుట్టుకుని బైటకువచ్చాయి. గుండెల్లో గుచ్చితే, గుండె రెండుగా చీలి, వీపు వెనక్కు వచ్చింది. ఆ తర్వాత వేటుకు తల నరికితే, ఏనుగు మీదే ప్రాణం విడిచాడు నరసింగరాజు. అతని చరిత్ర అట్లా అంతమైపొయింది.
EXPLORE UNTOLD HISTORY
**********
మలిదేవుడి సమక్షంలో బ్రహ్మనాయుడు కూర్చుని వుండగా, తెగనరికిన నరసింగరాజు తలను తీసుకెళ్ళి చూపించాడు బాలచంద్రుడు.
అనుగురాజు మరణం తర్వాత నరసింగరాజును తన గుండెల మీద వేసుకొని పెంచాడు బ్రహ్మన్న. ఆఖరుకి తన పుత్రుడి చేతిలో నరసింగుడు మరణించడం భగవంతుని లీలగా భావించాడు బ్రహ్మన్న. ‘బలీయమైన విధి నిన్ను ‘విధిగా’ ఈ విధంగా బలి తీసుకున్నదా నాయనా’ అని ఆక్రోశించాడు. ‘నీ అన్నదమ్ములు, అసంఖ్యాక బలగం మధ్యలో నీ చావు ఇట్లా వ్రాసిపెట్టబడివుందా?” అని అన్నాడు.
అంతట బాలచంద్రుడు చిరునవ్వు నవ్వితే, కుపితుడైన బ్రహ్మన్న – “బాలచంద్రా! గొప్ప వీరుణ్ణనుకుంటున్నావా? సిగ్గులేకపోతే సరి! నీ మూలాన ఈ యుద్ధం వచ్చి దాపురించింది. పిలవని పేరంటంగా వచ్చి ఈ పవిత్రభూమిని రక్తమయం చేసావు. దొంగచాటుగా వేటువేసి నరసింగుని చంపావు. దుర్మార్గుడా!” అన్నాడు.
బాలచంద్రుడు మండిపడి “పేరిందేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను! అలరాజు ఆత్మకు శాంతి చేకూర్చాను. అసలు ఈ యుద్ధానికి కారణం నువ్వు! నువ్వే మలిదేవుని పెళ్ళి పిలుపుకు వెళ్ళి మెత్తని ప్రభువు ఆజ్ఞ జవదాటడనే గర్వంతో కోడిపందానికి ఒప్పుకొని ప్రభువుల్ని అరణ్యాల పాలుజేసావు. భట్టును రాయబారానికి పంపక అలరాజును పంపి నాగమ్మ కుతంత్రానికి బలిపెట్టావు. యుద్ధరంగానికి కదలి వచ్చి, ఇప్పుడు ధర్మాలు ఉపదేశించావు! పనులన్నీ నీవు చేసి నా మీద నిందలు మోపటం తగదు! నరసింగుని వీరోచితంగా యుద్ధం చేసి చంపాను. నేను ముమ్మాటికీ వీరుణ్ణే!” అన్నాడు.
“ఛీ! పిరికిపందా! ఒక్క శత్రువు చంపి, తలపట్టుకుని వచ్చి, నీ వీరత్వాన్ని ప్రచారం చేసుకుంటున్నావే! యుద్ధం ఇంకా జరుగుతూనేవుంటే పేరు కోసం ఆశపడి శత్రువుకు వెన్నిచ్చి వస్తావా?” అన్నాడు బ్రహ్మన్న.
బ్రహ్మన్న పలికిన హీనమైన మాటలకు కించపడి బాలచంద్రుడు మళ్ళీ యుద్ధరంగానికి పరుగెత్తాడు.
అప్పటికే చాలా ఘోరాలు జరిగిపోయాయి.
వీరులైన సోదరులలో ఒక్కరూ జీవించిలేరు. కారెంపూడి రణక్షేత్రంలో రణచండి కాళ్ళకు తమ రక్తంతో పారాణిని అద్ది వెళ్ళిపోయారు. కలకాలం చెప్పుకోగల వీరగాధలుగా మిగిలిపోయారు.
తనను నమ్ముకుని వచ్చిన, తనలో తాముగా పెరిగిన ఆరుగురు సోదరులు మరణించాక, బాలచంద్రుడి ఉద్రేకానికి అంతులేకుండా పోయింది. చేత దొరికిన ఆయుధంతో అడ్డువచ్చిన ప్రతివాణ్ణి నరికాడు.
వీర అభిమన్యుణ్ణి తలచుకొని యుద్ధం చేసాడు. ఒకడు దొంగచాటుగా బల్లెంతో బాలుడి కడుపులో పొడిచాడు. బాలుడు బాధను ఓర్చుకుని, దాహంతో గంగధార మడుగుకు వచ్చి, నీరు త్రాగి, బైటకొచ్చిన ప్రేవుల్ని లోపలి దోసి, అవి కదలకుండా నడుముచుట్టూ ఉత్తరీయాన్ని బిగియగట్టి మళ్ళీ యుద్ధరంగంలోకి ఉరికాడు.
సాయం సూర్యుడు పడమట కొండ చాటున దాగి, బాలుణ్ణి ఒంటరిని జేసి దొంగ దెబ్బలతో కొడుతున్న వైరి వీరుల్ని చూసి, తలవంచుకున్నాడు.
ఆంధ్ర వీరభారతి కన్న అపురూప వీరుడు, బాలచంద్రుడు, భగవంతునిలో కలిసిపోయాడు.
సూర్యుడు అస్తమించిన తర్వాత, లోకం చీకటిని కప్పుకుంది. కన్ను తెరచినా కనిపించని గాఢాంధకారం! బాలచంద్రుడి మరణవార్త విన్న పెదమలిదేవుడు పసిపిల్లవానిలా కంటికి కడివెడుగా ఏడ్చాడు.
బ్రహ్మన్న కడుపులో మంట మండుతున్నది.
(బాలచంద్రుడి వీరమరణం తర్వాత ఒక “దీర్ఘ నిశ్వాసం” విడుస్తూ కవి చక్రవర్తి జాషువా గారు, తమ ఖండ కావ్య సంపుటిలో ఇలా వ్రాసారు..
“నాయకురాలి మాయ కదనంబున, మా పలనాటి పౌరుష
శ్రీ యడుగంటె? గడ్డి మొలిచెం బులిచారల గద్దె మీద; గెం
జాయ మొగాన గ్రమ్మ జలజ ప్రమదామణి నాగులేటిపై
వాయుచున్న దిప్పటికి బాలుని శౌర్య కథా ప్రబంధముల్ “
పల్నాటి చరిత్ర జరిగిన ఇన్నేళ్ళకు సమీక్ష చేస్తే కనిపిస్తున్న నగ్నసత్యమిదే!)
*****
భర్త మరణవార్త మేడపిలో విన్న వీరపత్ని మాంచాల పురుషవేషం ధరించి, జాతి గుర్రాన్నెక్కి, ఆఘమేఘాల మీద యుద్ధభూమికి వచ్చి, రణరంగంలో ప్రళయకాళికలా విజృంభించి, బరిసెపోటుకు నేలకూలి భర్త ప్రక్కకు దొరలుకుంటూ వచ్చి మరణించింది.
మాంచాల వంటి వీరపత్నుల రక్తంతో తడిసి పునీతమైన ఈ పుణ్య తెలుగుభూమిలో పుట్టినందుకు గర్వించని తెలుగువాడెవ్వడు? గౌరవంతో తల వాల్చి తల యూచని వాడెవ్వడు?
వీరత్వం నివాళిపట్టిన తెలుగు ఆడపడచుల కథలను విని కరుగని తెలుగు గుండె కలదా?
మాంచాల మరణమొక కథగా ఆచంద్రతారార్కం అట్లా నిలిచిపోతుంది.
(ఐతే – అనపోతు బ్రతికివుంటే బాలచంద్రుడు మరణించేవాడు కాదేమో? అనే ప్రశ్న వస్తుంది. కానీ అట్లా జరుగలేదు కదా!)
**********
బాలచంద్రుడి మరణం తర్వాత మహోదగ్రుడైన కొమ్మనాయుడు రణరంగంలోకి వచ్చాడు. వీరనాయకులకు పేరుపేరునా మ్రొక్కాడు.
కొమ్మరాజు యుద్ధరంగంలో కొచ్చేసరికి యుద్ధ పరిస్థితి పూర్తిగా తల్లక్రిందులయింది. నలగాముని సైన్యం భయంతో హాహాకారాలు చేసింది.
కొమ్మరాజు ద్రోణాచార్యుడంతటి విలువిద్యా ప్రవీణుడు. నిష్ఠాగరిష్ఠుడైన శివభక్తుడు. అంతేగాక యుద్ధరంగపు మెలకువలు తెలిసినవాడు. అటువంటి వాడు యుద్ధరంగానికి వచ్చాడన్న వార్త వినగానే నాగమ్మ కాళ్ళు చల్లబడ్డాయి. కొమ్మరాజుకు ఎదురునిలబడి యుద్ధం చేయగల్గిన వాడెవడూ తమ పక్షంలో లేడు. “తను యుద్ధరంగానికి వచ్చి నిలబడివున్నాననీ, ధైర్యముంటే వచ్చి కాచుకో”మని కబురుపంపాడు కొమ్మరాజు.
దానితో కొమ్మరాజు సాటి కాకపోయిన, తన దగ్గర వున్నవాళ్ళలో ఎన్నదగ్గ విలుకాడైన ‘సోమశేఖరుడనేవాణ్ణి పిలిపించాడు నలగాముడు. ఈ సోమశేఖరుడే అనుగురాజు బిడ్డలందరికీ విలువిద్య నేర్పింది. సోమశేఖరుడు చాలమంది వీరుల్ని వెంటబెట్టుకుని యుద్ధరంగానికి బయలుదేరాడు.
యుద్ధంలో కొమ్మరాజు విలువిద్యా ప్రావీణ్యతను చూసి సోమశేఖరుడికి మతి చెడింది. అర్జునుడు అమ్ములపొదిలోంచి బాణాలను వదిలినట్లు కొమ్మరాజు యుద్ధం చేస్తుంటే శత్రువులు బాణానికొక్కరుగా నేలకూలుతున్నారు. అతని యుద్ధం చూసిన ప్రజలకు అదొక చిత్రంగా కనిపించింది.
సోమశేఖరుడు తన వెంట తెచ్చుకున్న సైన్యం సర్వనాశనం కాగానే బెంబేలెత్తిపోతే, నాగమ్మ ధైర్యం చచ్చిపోయింది. ఐనా, ఇంకొంతమంది బలగాన్ని తీసుకెళ్ళమని సోమశేఖరుణ్ణి హెచ్చరించింది. కొమ్మరాజు యుద్ధం చేస్తున్నాడని విని, అతని తమ్ములు నలుగురు “అన్నా! నువ్వు తప్పుకొని విశ్రాంతి తీసుకో! ఈ సోమశేఖరుణ్ణి మేము ముగిస్తాం” అన్నారు.
కొమ్మరాజు తమ్ములు చూపించిన అవక్ర పరాక్రమానికి దెబ్బతిన్న సోమశేఖరుడు సైన్యాన్ని సమాయత్తపర్చి – “ధర్మయుద్ధంలో ఈ వీరుల్ని గెలవలేము గనుక అధర్మ యుద్ధం చేసైనా కొమ్మరాజును హతమార్చండి.” అన్నాడు.
యుద్ధాన్ని కొనసాగిస్తున్న తమ్ముళ్ళ దగ్గరకు కొమ్మరాజు వచ్చి వారిని కాసేపు విశ్రాంతి తీసుకోమన్నాడు.
కొమ్మరాజు యుద్ధరంగానికి తిరిగిరాగానే సోమశేఖరుడు అధర్మయుద్ధాన్ని మొదలుపెట్టాడు.
సోమశేఖరుడికీ, కొమ్మరాజుకీ ఘోరమైన యుద్ధం జరిగింది. కొమ్మరాజు సోముడి తలను నరికాడు.
కానీ, ఈలోపు, విశ్రాంతి తీసుకుంటున్న కొమ్మరాజు తమ్ముళ్ళని వెనుకపోటుగా బల్లాలతో పొడిపించి చంపించింది నాగమ్మ.
తమ్ముల మరణ వార్త విన్న కొమ్మరాజు అవిశ్రాంతంగా పోరాడాడు. నాగుబామై, జాతి అశ్వాన్ని ఎక్కి విజృభించాడు. నాగమ్మ ఎన్ని వ్యూహాలు పన్నినా కొమ్మరాజును నిలువరించడం అసాధ్యమని స్పష్టమైపోయింది.
కొమ్మరాజు మీద వేలాదిగా సైనికులు వచ్చిపడుతున్నా ఆ మహావీరుణ్ణి ఎవరూ ఎదిరించి గెల్వలేకపోయారు.
అయితే అలరాజు హత్యతో, బాలచంద్రుడి మరణంతో, తమ్ముళ్ళ చావుతో తన “కళ్యాణరాజ” వంశం అంతమైపోయిందన్న దుగ్ధతో కొమ్మరాజు అస్త్రసన్యాసం చేసి యుద్ధరంగంలో శత్రువుల చేత బాణాలతో కొట్టించుకుని మరణించాడు.
పల్నాటి వీర భారతంలో కొమ్మరాజు మరణంతో మరో ధృవతార రాలిపోయింది.
కొమ్మరాజు మరణవార్త విన్న పెదమలిదేవుడు “కోడిపందాలతో మొదలైన పోరు ఆఖరుకు కొమ్మరాజును కూడా బలి తీసుకున్నది. అలరాజు, బాలచంద్రుడు, బాదన్న, యాదన్న, పేర్నీడు లాంటి మహావీరులను దాయాది పగలతో కారెంపూడికి బలిపెట్టాను. ఎందుకీ తుచ్ఛ జీవనం? ఇంతమంది వీరులను పోగొట్టుకొని, నేను పాలించేదేమిటి? ఎవరి కోసమీ విజయం?” అని విరక్తుడై, అన్నపానాదులు మాని, మౌనవ్రతం పాటించి దేహత్యాగం చేసుకుని ఈ ప్రపంచం నుంచి శాశ్వత నిష్క్రమణను పొందాడు.
పెదమలిదేవుడి మరణంతో నాగమ్మ చాలా సంతోషపడి “ప్రభువు మరణించాడు. విజయం మనదే! ఇక ఒకే ఒకడు మిగిలివున్నాడు. అతనే బ్రహ్మన్న! అతణ్ణి బంధిద్దాము.” అంది.
బ్రహ్మన్నకు దీటైనవాడైన “పచకుల బ్రహ్మన్న” అనేవాణ్ణి పిలిచి బ్రహ్మనాయుడి మీదకు ఉసిగొల్పాడు నలగాముడు.
బ్రహ్మన్న – పచకుల బ్రహ్మన్న ఇద్దరూ ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవటం వల్ల బ్రహ్మనాయుడికి తన సహాధ్యాయి పై యుద్ధం చెయ్యటం ఇష్టం లేకపోయింది. కానీ పచకుల బ్రహ్మన్న బాగా కవ్వించటం వల్ల కుంతం పట్టుకుని ఉత్తమాశ్వాన్ని ఎక్కి బ్రహ్మనాయుదు యుద్ధరంగంలోకి కాలు పెట్టాడు.
బ్రహ్మనాయుణ్ణి చూసిన పచకుల బ్రహ్మన్న – “ప్రజలు నిన్ను భగవంతుడిగా ఆరాధిస్తున్నారు. ధైర్యం వుంటే నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.
అందుకు బ్రహ్మనాయుడు నవ్వి “పచకుల బ్రహ్మన్నా! గురువు తండ్రిలాంటివాడు. మనమిద్దరం ఒకే గురువు దగ్గర అస్త్ర, శస్త్ర విద్య నేర్చుకున్నాం. కాబట్టి నువ్వు నా సోదరుడు వంటి వాడివి. అలా నిన్ను చంపితే నాకు పాపం వస్తుంది. నా మాట విని వెళ్ళిపో!” అన్నాడు.
పచకుల బ్రహ్మన్న హేళనగా నవ్వి “నీ పిరికితనం కప్పుకో ప్రయత్నిస్తున్నావు. యుద్ధం చెయ్యి. ఇన్ని మాటలెందుకు?” అన్నాడు.
బ్రహ్మన్న “ఇది నీ తుది నిర్ణయమా?” అని ప్రశ్నిస్తే “ఔను” అని పచకుల బ్రహ్మన్న బదులు చెప్పి బ్రహ్మనాయుని మీదకు కత్తి విసిరితే తప్పుకుని ఒక్క వేటు వేస్తే పచకుల బ్రహ్మన్న తల సర్రున త్రెగి కిందపడింది.
తన సహాధ్యాయిని చంపుకున్నందుకు బ్రహ్మన్న విచారపడి “నీకు కలకాలం వీరపూజ జరిగేట్లు నేను చూస్తాను. వీరగంధం ఈ పల్నాట నీ పేరు మీద తొలుత ఇచ్చే కట్టుదిట్టం చేస్తాను” అని అన్నాడు.
పచకుల బ్రహ్మన్న మరణాన్ని చూసి నలగాముని సైనికులు కంపించిపోయారు.
బ్రహ్మన్నతో యుద్ధం చెయ్యగల్గిన వీరులెవరూ మిగిలిలేరు
గురజాల వైపు మిగిలిన ముఖ్యుల్లో ఒకరు నలగాముడు. మరొకరు నాగమ్మ. మాచెర్ల వైపు మిగిలిన వారు బ్రహ్మనాయుడు; మాల కన్నమదాసు.
దాదాపు ఈ యుద్ధానికి ఇదే ముగింపు అని చెప్పొచ్చు. కానీ ముగింపు ముందు నాగమ్మ బ్రహ్మనాయుడి దగ్గరకెళ్ళి – “వీరత్వముంటే నాతో యుద్ధం చెయ్యి బ్రహ్మన్నా!” అన్నది.
“నేను స్త్రీలతో యుద్ధం చెయ్యను” అన్నాడు.
“నేను యుద్ధరంగంలో వీరనారిగా నీ చేతిలో చావాలనుకుంటున్నాను” అన్నది నాగమ్మ.
బ్రహ్మన్న శాంత గంభీర స్వరంతో “నాగమాంబా! ఈ పల్నాటి సర్వనాశనానికి కారణమై, నీ కుత్సితమైన ఆలోచనలతో, స్వార్థపర చింతనతో సహజంగా మంచివాళ్ళైన గురజాల ప్రభువులను తోలుబొమ్మలు చేసి ఆడించావు. నీవు జరిపించిన ఈ మారణహోమంలో వయోవృద్ధులైన కొమ్మరాజు మొదలైన వారినుండి ముక్కుపచ్చలారని పసిబాలురు అలరాజు, బాలచంద్రుడు, అతని తమ్ముళ్ళ వరకూ ఆహుతయ్యారు. స్వార్థం, ద్వేషం, మోసం ఎక్కడి దాకా దారితీస్తుందో భావి తరాలకు నువ్వు నిరూపించావు. మతం పేరుతో లేనిపోని ద్వేషాలను రగిలించావు. పుణ్యసంపాదన చెయ్యాల్సింది పోయి లోకాన్ని పాపపంకిలం చేసావు. దీన్ని నా చెన్నకేశవుడే కాదు నీవు నమ్మిన పరమశివుడు కూడా హర్షించడు. పో! ఇకనైన బుద్ధి గలిగి, రాగద్వేషాలను వదలి, ఆధ్యాత్మిక సాధనతో నీ శేష జీవితాన్ని ముగించు.” అన్నాడు.
మొండిపట్టుకు మారుపేరైన నాగమ్మ విషపు నవ్వొక్కటి నవ్వి కత్తి పైకెత్తితే, కుపితుడైన బ్రహ్మన్న కుంతంతో నాగమ్మ గుర్రాన్ని ఒక్కపోటు పొడిస్తే అది విలవిలా తన్నుకు చచ్చింది. “స్త్రీ హత్యకంటే జంతు వధే మేలని తలచాను కనుక బ్రతికి పోయావు. ఇకనైనా యుద్ధరంగాన్ని వీడి వెళ్ళు” అని అధికారయుతంగా ఆదేశించాడు బ్రహ్మన్న.
నాగమ్మ భయంతో అక్కడినుంచి పారిపోయింది.
అంతట బ్రహ్మన్న నలగాముణ్ణి ఎక్కడున్నా పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసాడు. తన ఓటమి తప్పదని తెల్సుకున్న నలగాముడు ప్రాణభయంతో “కొదమగండ్ల” అనే చోటుకు పారిపోయి ప్రాణ రక్షణ గావించుకొన్నాడు.
తన ప్రజల రక్తంతో తడిసిపోయిన స్మశానంలాంటి కారెంపూడి రణక్షేత్రాన్ని చూసి, దుఖం తన్నుకొచ్చిన బ్రహ్మన్న ప్రతిజ్ఞను విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు (తపస్సు కోసం ‘గుత్తికొండ బిలం‘ అనే గుహలోకి బ్రహ్మన్న వెళ్ళాడన్న మరో కథనం కూడా ఉంది).
ఆనాటి పల్నాటి ప్రజలు బ్రహ్మన్నను భగవంతునిగా పూజించారట. కానీ ఇది ఉత్ప్రేక్ష మాత్రమే. ఏదిఏమైనా, బ్రహ్మన్న వల్ల అప్పటి సమాజానికి గొప్ప మేలు జరిగిందన్నది నిర్వివాదాంశం.
నాగమ్మ, బ్రహ్మన్న చెప్పిన విధంగా తన శేషజీవితాన్ని శివ సాన్నిధ్యంలోనే గడిపింది.
వీరులైన తమ భర్తలు యుద్ధంలో మరణించాక, మేడపిలోని వారి భార్యలు ఆత్మాహుతి చేసుకున్నారు.
అలా పచ్చని పల్నాడు హత్యలతో, వీరమరణాలతో, ఆత్మాహుతులతో మహాస్మశానమైపోయింది.
క్రూరమైన ఆలోచనలు ఎలాంటి నరకాన్ని సృష్టిస్తాయో అని చెప్పడానికి సోదాహరణంగా మిగిలిందీ పల్నాటి వీర భారతం.
మారుతున్న కాలంతో బాటు పల్నాడు కూడా మారిపోయింది. కానీ వీరపూజలు పోలేదు. వీరగాధలు పూర్తిగా కనుమరుగు కాలేదు. ఎంత మారినా, ఎంత ముందుకు పొయినా, మన జాతినీ, చరిత్రనీ మర్చిపోలేము.
**********
ముగింపు మాటలు:
ఈ కథలో మన చరిత్ర ఉంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఎన్నో వున్నాయి. నేర్చుకోవలసిన పాఠాలూ ఉన్నాయి.
ఇంతటి చేవగల్గిన తెలుగు వీరగాధ పొట్టికూటి కోసం పాటలు, పద్యాలు పాడుకునే వాళ్ళ నోళ్ళలోనే నిలబడిపోవడం శోచనీయమైన విషయం. దీన్ని తల్చుకుంటే బాధ వేస్తుంది.
**********
~ పల్నాటి వీరభారతం – సమాప్తం ~
Click here to download eBook of Palnati Veerabharatam
pay per click