ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అధ్యాయం 2- పల్నాటి వీరభారతం

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

 

పల్నాటి చరిత్ర కాలచక్రంలో పదిహేనేళ్ళు తిరిగిపోయాయి.

రాజవిలాసాల్లో ముఖ్యమైనది – వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వేటకెళ్ళాడు.

పగలల్లా వేటాడి అలిసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపడు, నాగులేటి ఒడ్డుకొచ్చాయి.

ఇప్పుడు “అనుగురాజు”కు కావల్సింది కాసేపు విశ్రాంతి, మనుష్య సంచారం తక్కువైన ఈ ప్రాంతంలో తనకోసం చలువ పందిళ్ళు వేసి, విశ్రాంతికి విడిది చూపించినవాళ్ళెవరో అనుగురాజుకు అర్థం కాలేదు. పరివారమూ, అశ్వాలూ విశ్రాంతి తీసుకుంటున్నాయి.

అప్పటికి నాగమాంబకు పద్ధెనిమిదేళ్ళు. వేదవేదాంగాలు చదువుకున్న నాగమాంబ మేనమామ సింగారెడ్డిని పదమూడో ఏట పెళ్ళి చేసుకున్నది. కానీ కాలం కాటంది, సింగారెడ్డి పెళ్ళైన సంవత్సరానికే కన్నుమూస్తే – నాగమాంబ బాలవితంతువైంది. పంటరెడ్ల కుటుంబంలో పుట్టిన నాగమాంబ శివభక్తురాలు. భర్త పోయాక నాగమాంబ “నాగమ్మ” అయింది.

తనకు ఇన్ని సపర్యలు చేసిన మనిషి “స్త్రీ”అనీ, శివభక్తురాలనీ, వేదవేదాంగాల్లో నిష్ణాతురాలైన “నాగమ్మ”యనీ తెలుసుకున్న అల్పసంతోషి అనుగురాజు చాలా సంతోషపడి…

“నీ సపర్యలకు మెచ్చాను నాగమాంబా! నీకేం కావాలో కోరుకో” అన్నాడు.

నాగమ్మ సవినయంగా చేతులు జోడించి–

“ప్రభూ! అన్నీవున్న నాకు చిన్న కోరికున్నది. ప్రభులు అన్యధా భావించకపోతే సెలవిస్తాను” అన్నది.

**********

“అలాగే”

“ఏమీలేదు ప్రభూ, చాలా చిన్న కోరిక. పల్నాటి ప్రభువుల రాజ్యంలో ఏడు గడియల కాలం మంత్రిణిగా ఉండాలని ఉన్నది.”

“అవశ్యం” అన్నాడు అనుగురాజు.

రాచమర్యాదల్లో ముఖ్యమైనది “ఆడిన మాట తప్పకపోవటం”. పల్నాటి ప్రభులు కత్తికి కుత్తుకనైనా ఎదురొడ్డుతారుగానీ, అన్నమాట జవదాటరు.

అట్లా నాగమాంబ అనుగురాజు దగ్గర ఏడు గడియల మంత్రిత్వానికి అధికారాన్ని పొందింది.

*************

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

పల్నాటి సీమలో ఉన్న ముఖ్యమైన రెండు మతాలు – వైష్ణవ, శైవ మతాలు.

బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడైతే, నాగమ్మ వీరశైవురాలు. బ్రహ్మన్న వ్యక్తిత్వం విభిన్నమైనది. అతని సిద్ధాంతాలు విశ్వశ్రేయస్సుకు ప్రతిరూపాలు. కులమతాలు పాటించక “చాపకూటి” సిద్ధాంతాన్ని పల్నాట ప్రతిబింబించాడు. ఆచారాలు మనుష్యుల్ని సరైన మార్గాన నడిపించకపోతే, అధికుల్నీ – అధముల్నీ సౄష్టిస్తే – అవి లేకపోవడమే శ్రేయస్కరమని బ్రహ్మన్న సిద్ధాంతం.

**********

 ఆచారాలు మనుస్యుల్నీ, బ్రతుకుల్నీ నరకప్రాయం చేస్తే అది వెలిగే దీపంతో ఇల్లు కాల్చుకున్నట్టు.

ఈ మతాలు మనుష్యుల మనుగడకు ప్రతిబంధంకంగా ఉన్నాయనీ, మనుష్యుల్లో ఎక్కువ, తక్కువలు సౄష్టిస్తున్నాయనీ ఆలోచించిన బ్రహ్మనాయుడు అన్ని మతాల్నీ ఒకచోట సమీకరించి వర్గరాహిత్యాన్ని ఏర్పరిచాడు; కాదా సాధ్యమైనంతవరకూ ప్రయత్నించాడు.

ఐతే, ఈ సిద్ధాంతం వీరశైవులకు నచ్చలేదు. వర్ణసంకరం జరుగుతున్నదనీ, పుట్టుకతో వచ్చిన కులమతాల్నీ, హెచ్చుతగ్గుల్నీ మార్చే అధికారం బ్రహ్మన్నకు లేదనీ నిర్ధారించారు.

అంతేగాక తన ప్రాబల్యంతో బ్రహ్మన్న శైవమతాన్ని అణగద్రొక్కుతున్నాడనీ, శైవులకు అన్యాయం జరుగుతున్నదనీ సిద్ధీకరించారు.

శైవులంతా కట్టగట్టుకుని నాగమాంబ దగ్గరకు వెళ్ళి శైవానికి జరుగుతున్న అన్యాయమూ – పట్టబోతున్న దుర్గతిని గురించి చర్చించారు. (శైవుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు బ్రహ్మన్నకు మతానికి చెందిన మూఢత్వాన్నిగానీ, పాపాన్నిగానీ అంటగట్టలేదు)

అదీగాక నాగమాంబకు బ్రహ్మన్న మీద ఒకవిధమైన పగ ఉన్నది. బ్రహ్మనాయుడే తన తండ్రి హత్యకు కారణమని ఆవిడ సిద్ధాంతం (నిజానిజాలు చరిత్రల్లో ఎన్నడూ నిర్ధారించబడనివి). జిట్టగామాలపాడులో చెరువు త్రవ్వి, చెరువు కింద మెట్టభూములను మాగాణులుగా చేయాలని బ్రహ్మన్న సంకల్పం. అట్లా చెరువు తవ్వకానికి నిర్ణయించబడిన స్థలంలో రామిరెడ్డి పొలం కూడా ఉన్నది. తన భూమిని చెరువుకు ఇవ్వటానికి నిరాకరించిన రామిరెడ్డి, బ్రహ్మన్నపై కయ్యానికి కాలుదువ్వు, బ్రహ్మన్న సైన్యం చేతిలో మరణించాడు. నాగమాంబ అనాడు బ్రహ్మన్నను పదవీచ్యుతుణ్ణి చేస్తానని, సాధిస్తాననీ ప్రతినబూనింది.

**********

ఈ విషయం తెలిసిన బ్రహ్మనాయుడు నాగమ్మను సాధ్యమైనంతవరకూ రాజసభాప్రవేశం లేకుండా నిరోధించాడు. కానీ, అనుగురాజు దగ్గర ఏడుగడియల కాలం మంత్రిత్వానికి అనుమతిపత్రం పొందిన సంగతి బ్రహ్మనాయునికి తెలియదు.

(అసలు బ్రహ్మన్న మీద నాగమాంబ విద్వేషానికి ఈ కారణాలే గాక, బలవత్తరమైన మరో ఊహించరాని కారణం ఉన్నదనీ, అది ఇతమిథ్థంగా నిర్ణయించడం కష్టమనీ మరోరకం చరిత్రకారులు ఊహిస్తున్నారు. ఐతే చరిత్రలో నిల్చిన కథతో తప్ప, ఊహాగానాలు ఊరికే చచ్చిపోతాయి. ఇదీ అంతే అయ్యుండాలి)

ఏది ఏమైనా బ్రహ్మనాయుడి మీద నాగమ్మకు విద్వేషముందని చెప్పడానికి “మతాన్ని” ముఖ్యకారణంగా అభిభాషించవచ్చు.

                                                               సశేషం