ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అధ్యాయం 3- పల్నాటి వీరభారతం

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

 

బ్రహ్మనాయుని భార్య ఐతాంబ. మహాసాధ్వి. ఐతాంబలాంటి స్త్రీలు బాలచంద్రుడిలాంటి మహావీరుల్ని కనకపోతే, తెలుగుల చరిత్రలో విలువైన, వెలలేని వీరసాహిత్యం లభించకపోయివుండేదేమో?

ఎంతకాలానికీ పిల్లల్లేని బ్రహ్మనాయుడి భార్య, చెన్నకేశవుణ్ణి మొక్కుకుని, గజనిమ్మపళ్ళ వ్రతం చేస్తే – లేకలేక కల్గిన బిడ్డడు బాలచంద్రుడు.

చరిత్ర నమ్మలేని కొన్ని కథల్ని ఇక్కడ ఉటంకించడం అవసరమని భావించాలి.

నిజానికి బాలచంద్రుడు పుట్టిన క్షణాలు మంచివిగావని పల్నాటి నాగులేరు పొంగి, పల్నాటినంతా ముంచెత్తిందట.

బ్రహ్మనాయుడు దైవజ్ఞులను పిల్చి, కొడుకు జాతకాన్ని పరిశీలింపజేసాడు. దైవజ్ఞులు చెప్పిన సారాంశమిది – “పుట్టినవడు పెరిగి పెద్దవాడైతే, పల్నాటి చరిత్రలో రక్తపుటేరులు పారుతాయనీ, ఐనా ఇతగాడు మహావీరుడనీ” నిర్ధారించారు.

పుట్టిన బిడ్డడు పల్నాటినంతా వేడుకల్తో ముంచెత్తుతుంటే, పిల్లవాడి తండ్రి ఏకాంతమందిరంలో, ఆలోచనల్తో విలవిల్లాడిపోతున్నాడు.

ఎన్నో నోములు నోయగా లేకలేక కల్గిన బిడ్డ. కానీ ఈ పుట్టిన బిడ్డ పల్నాటినాట రక్తప్రవాహాన్ని సృష్టిస్తాడట.

పల్నాటి సౌభాగ్యానికి – పితృప్రేమకు మధ్య చిక్కిన బ్రహ్మనాయుడి ఆత్మ తలకిందులవుతున్నది.

– పల్నాడా? కన్నబిడ్డడా?

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

**********

రాత్రి రెండు ఝాములు గడిచినా, బ్రహ్మనాయుడికి ఆలోచన ఒకమార్గాన పడలేదు. పక్షిపిల్లల్ని తిన్న గుడ్లగూబ ఎక్కడో, దూరంగా కూసింది.

బ్రహ్మనాయుడు ఉలిక్కిపడ్డాడు.

ఏకాంతమందిరపు ఉత్తరపు కిటికీలోంచి చూస్తే, పల్నాటి ప్రజ నిద్రాదేవి రొమ్మున ఒదిగి, నిశ్శబ్దంగా నిద్రపోతున్నది. నాలులేరు ఆశీర్వదిస్తున్నట్టు వెన్నెల వర్షంలో స్నానం చేసిన పెద్ద ముత్తైదువులా ఉంటే, చల్లటిగాలి మెల్లగా వీస్తున్నది. ఉయ్యాలలో బిడ్డడు నిద్రిస్తున్నాడు.

ఐతాంబ మీద మాగన్ను నిద్రలో, తల్లినయ్యానన్న తృప్తితో, వెలుగుతున్న చిర్నవ్వు పెదవుల్తో – పట్టెమంచం మీద పడుకుని ఉన్నది.

ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు మహామంత్రి బ్రహ్మనాయుడు.

నాగులేరు తెల్లగా ప్రవహిస్తున్నది; కానీ బ్రహ్మనాయుడి కళ్ళకి అది రక్తంతో కలిసి ఎర్రగా ప్రవహిస్తున్నట్టంపించింది.

బ్రహ్మనాయుడు స్థిరనిశ్చయంతో -“చెన్నకేశవా!” అన్నాడు.

నిట్టూర్పు గుండె లోపల్నుంచి సుడులు తిరుగుతూ బైటికొచ్చింది.

“ప్రభూ! నా ఒక్క బిడ్డకోసం ఇంతమంది నా బిడ్డల్ని నిశ్చింతగా గుండెల మీద చేతులేసుకుని నిద్రపోతున్న అమాయకుల్ని యుద్ధరంగంలో బలిపెట్టుకోలేను. నా ప్రజల సౌఖ్యమే నా సౌఖ్యం. నా నమ్మిన సిద్ధాంతం నా విశ్వాసం, నా కడుపున పుట్టినవాడితో కళంకితం చేసుకోలేను. గతి తప్పిన నా మనస్సును అదుపులో పెట్టుకుంటున్నాను. శిశుహత్యా మహాపాతకం చుట్టుకోనివ్వు – అదీ కన్నకొడుకును – లేకలేక నీ వరంతో పుట్టిన నా ఏకైక పసికందును, పల్నాటి ప్రజాశ్రేయస్సుకై దూరం చేసుకుంటున్నాను. నా భార్యకు ఆత్మధైర్యం కలిగించు.”

బ్రహ్మనాయుడు బైటికొచ్చాడు. విశాలసౌధం దాదాపు రాత్రి సగం దీపపు వెల్తురులో నిశ్శబ్దంగా తన ఇష్ట పరివార సఖీ సఖ జనంతో విశ్రాంతి తీసుకుంటున్నది. దివాణంలో మూడుగంటలు కొట్టారు.

“ఎవర్రా అక్కడ?”

“ఆజ్ఞ..మంత్రివర్యా” అన్నాడు రాత్రి కాపలా సైనికుడు.

బ్రహ్మనాయుడు ఆత్మను అదుపులోపెట్టుకుని – “ఆ ఉయ్యాలలో వున్న బిడ్డను ఇటు పట్టుకురా” అన్నాడు.

“చిత్తం!”

“ఏమీ అలికిడి కాగూడదు; ఎవరూ కన్ను తెరవకూడదు.”

“చిత్తం!”

**********

మరి రెండుక్షణాల్లో ఉయ్యాల్లో వున్న బాలచంద్రుణ్ణి, సేవకుడు పొత్తిళ్ళ గుడ్డలతో సహా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు.

బిడ్డవంక చూస్తున్న బ్రహ్మనాయుడి కళ్ళల్లో రెండు కన్నీటి చుక్కలు నిల్చాయి. ఆ తర్వాత బ్రహ్మనాయుడు నెమ్మదిగా, గంభీరంగా ఇట్లా అన్నాడు.

“ఈ బిడ్డను అడవిలో దూరంగా తీసుకెళ్ళి వదిలేయ్ !”

“ప్రభూ…” సేవకుడి చెయ్యి వణికింది.

“మహామంత్రి బ్రహ్మనాయుడు శాసిస్తున్నాడు. చెప్పింది చెయ్యి. మరెవ్వరికంటా పడకూడదు. ఈ భయంకర రహస్యం నీలో, నాలో వుండిపోవాలి. ప్రజాశ్రేయస్సే లక్ష్యమనుకునేవారు – ప్రభువుల మాటలను, చేతలను తమలోనే ఉంచుకుంటారు. అర్థమయిందా?”

“చిత్తం మహామంత్రి!”

“ఇక పోవచ్చు!”

ఐతే ఇదే క్షణాన, మంచం మీద పరున్న ఐతాంబ సోదరుడు గండు కన్నమ్మకు నిద్రలో ఛటక్కున మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. ఇద్దరు మగవాళ్ళ గొంతులు గుసగుసలాడుకుంటున్నాయి.

రాతిస్థంభం చాటుకొచ్చి, ఒక లిప్తకాలం అక్కడే నిలబడ్డాడు. ఆజ్ఞ ఇచ్చిన బ్రహ్మనాయుడు తన విశ్రాంతిమందిరానికి పోయాక అతను సౌధంలోంచి బైటికొచ్చాడు.

ముందుపోతున్న గుర్రాన్ని అనుసరించాడు.

అప్పటిదాకా మసకవెన్నెల్లో మసలిన పల్నాడు మేఘాలతో అల్లుకుపోయి, చిరుజల్లుల్లో తడుస్తోంది.

గండు కన్నమ మొదటి గుర్రాన్ని పట్టుకునేటప్పటికి వర్షం బలం పుంజుకుని ఏకధారగా కురుస్తున్నది.

కన్నమను చూసి సేవకుడు భయపడిపోయి – “ప్రభూ…” అన్నాడు.

“ఏమిటిది?”

“బ్రహ్మనాయుడు ఈ బిడ్డను చంపిరమ్మని చెప్పారు” అన్నాడు భయంతో వణుకుతూ.

“ఐతే నువ్వుపోయి, ఈ బిడ్డను నరికానని మహామంత్రితో చెప్పు. ఇంకేమన్నా చెప్పావా, నీ తల తెగి నేలబడుతుంది”

“అట్లాగే!” అన్నాడు సేవకుడు సంతోషంగా.

ఈ రెక్కలు రాని చిన్నిగుడ్డును ఎలా నరకనా? అని వాడు మహా మధనపడిపోయాడు.

**********




 

వర్షంలో తడిసిన బిడ్డ చలితో వొణుకుతూ, కేర్ మని ఏడుస్తున్నాడు. ఇంత మహాపాపానికి తన బావ బ్రహ్మనాయుడు ఎందుకు ఒడిగట్టాడో గండుకన్నమకు అర్థం కాలేదు. అతను బిడ్డను వక్షం మీద వేసుకుని గొల్ల చంద్రమ్మ ఇంటికొచ్చేసరికి దివాణంలో నాలుగు గంటలు కొట్టారు.

“చంద్రమ్మా – చంద్రమ్మా”

చంద్రమ్మ నిద్రనుంచి ఉలుక్కిపదింది – “ఎవరూ?” అంది.

“నేను – గండు కన్నమను; వర్షం వస్తోంది. తలుపు తీయి” అన్నాడు.

పల్నాటి ప్రభువుల పేర్లన్నీ చంద్రమ్మకు తెలుసు. పల్నాటి సైనికుడిగా, యుద్ధంలో వీరమరణం పొందాడు చంద్రమ్మ భర్త. ప్రభువులకు నమ్మకమైనవాడు.

చంద్రమ్మ తలుపు తీసి – “మీరా ప్రభూ…ఇంత వానలో…ఇప్పుడు…ఇట్లా…” అన్నది.

“ఆ(!”

“ఈ పసికూన ఎవరు?”

“ఈ ప్రశ్న నన్నడక్కు. కాలం వొచ్చినప్పుడు నేనే చెబుతాను. బిడ్డల్లేని నీకు ఈ బిడ్డను ఇస్తున్నాను. ఈ పసికూనను పెంచే భారం నీది. ఈ బిడ్డ రక్షణకూ, పెంపకానికీ కావలసిన అన్ని సహాయాలు నీ కందజేస్తాను. వీరుడిగా పెంచాలి! ఈ బిడ్డ గురించి మరే వివరాలూ ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త”

“ఈ బిడ్డను నా బిడ్డలాగే పెంచుతాను.”

“మంచిది!”

వీర గండు కన్నమ వెనక్కి తిరిగితే, యాదవ చంద్రమ్మ బిడ్డను అంతులేని తమితో రొమ్ము కదుముకున్నది.

సశేషం 

**********