పుల్లయ్య గుప్తనిధి
తెల్లవారింది…
ఎవ్వరూ లేపకుండానే మెలకువైంది పుల్లయ్యకు.
అప్పటికే సన్యాసి లేచి, జింక చర్మం మీద ధ్యానం చేసుకొంటున్నాడు.
పుల్లయ్య హుషారుగా తెరచివుంచిన గుడిసె వాకిలి నుండి బైటకెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద కుంటలో నీళ్ళున్నాయి. చెంబుతో నీళ్ళు తీసుకొని మొహం కడుక్కొని వెంటనే స్నానం కూడా చేసేసాడు.
స్నానం చేసుకొంటున్నప్పుడు చూసుకొన్నాడు, దెబ్బలన్నీ మానిపోయాయి. కేవలం గుర్తులు మాత్రమే మిగిలున్నాయి. నొప్పులు కూడా మాయమైపోయాయి.
వాడికి ఉత్సాహం ఉప్పొంగి వస్తోంది. ఎంత త్వరగా కొండ దిగ గలిగితే అంత త్వరగా దిగెయ్యాలి. అమ్మనీ, నాన్ననీ చూసెయ్యాలి. ఊహల్లో తడుస్తూ స్నానం చేసాడు.
ముందు రోజు సన్యాసి ఇచ్చిన తుండుగుడ్డతో ఒళ్ళు తుడుచుకొని, అతనే ఇచ్చిన ఓ కొత్త పంచెను చుట్టుకొని గుడిసెలోకి వచ్చాడు.
సన్యాసి ధ్యానం ముగించేసివున్నాడు. పుల్లయ్య లోనికి రాగానే నవ్వుతూ దగ్గరకొచ్చాడు. వాడు అతని కాళ్ళకి దండం పెట్టాడు.
“పుల్లయ్యా! నీ పేరుకు అర్థం తెలుసుకోవాలనివుందా?” అన్నాడు సన్యాసి.
అయోమయం, సిగ్గు కలగలసిన మొహంతో అతని వైపుకు చూసాడు పుల్లయ్య. సన్యాసి కావాలని తనను ఎద్దేవా చేస్తున్నాడేమోనని పరీక్షించి చూసాడు.
లేదు. అలాంటి ఛాయలేవీ అతని కన్నుల్లోగానీ, మాటల్లోగానీ కనబడలేదు.
“చెప్పు స్వామీ! వింటాను.” అన్నాడు.
నవ్వుతూ నిండిన సన్యాసి ముఖంలో వెకిలిదనం లేదు సరిగదా ఆప్యాయత మెండుగా కనబడింది ఆ కుర్రవాడికి. అసలే పసివాడు బుద్ధిలేని బుర్ర సహవాసంతో, హద్దులెరుగని కుర్రకారుదనంతో తుళ్ళిపడ్డాడు గానీ నిజానికి పుల్లయ్య చాలా మంచివాడు. ఇప్పుడా మంచిదనానికి పచ్చదనం విచ్చింది.
మంచితనానికి చిరునామా కన్నీళ్ళేగా!
అవి ఇప్పుడు వాడి కంటినిండా నిండువున్నాయి.
“తప్పైపోయింది స్వామీ. ఇంకెప్పుడూ నాన్నతో నా పేరు గురించి కొట్లాడను. ఇల్లొదిలి పెట్టి పారిపోను.” అన్నాడు. వాడి గొంతులో ఓ ధృడత్వం ఉంది. వాడి గొంతు వాడికే కొత్తగా వినబడుతోంది.
“భేష్! నిజమైన బంగారువంటే నువ్వే. వెళ్ళు. వెళ్ళి మీ తాతల్లాగా, నాన్నలాగా గొప్పపేరు తెచ్చుకో!” అని ఆశీర్వదించాడు.
పుల్లయ్య భారంగా కదిలాడు. గుడిసె బైటకు వచ్చాడు.
“పుల్లయ్యా! ఆగు!” అన్నాడు సన్యాసి.
అక్కడే ఆగాడు వాడు. బైటకొచ్చిన సన్యాసి పుల్లయ్య చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. ఆ చేతిలోకి పట్టేంత ఒక ఇనుప ముద్ద వేసి దానిపై పసరునేదో వేసాడు. మరో నిముషంలో అది బంగారంగా మారిపోయింది.
“దీని అవసరం నీకెప్పుడైనా రావొచ్చు. ఉంచుకో! జాగ్రత్త సుమా! నా విషయం, ఈ బంగారు విద్య విషయం ఎవరికైనా చెప్పావంటే ఇది మళ్ళీ ఇనుముగా మారుతుంది.” అన్నాడు.
ఆ బంగారు ముద్దను పంచెలోకి భద్రంగా దోపుకొని సన్యాసికి మరోమారు దండం పెట్టి బయల్దేరాడు పుల్లయ్య.
ఎదురుగా సూర్యుడు వెలుగుతున్నాడు.
పుల్లయ్య కళ్ళు మూసుకొన్నాడు. చాలా వెలుతురుగా ఉంది.
కళ్ళు మూసినా, తెరిచినా వెలుతురుగా ఉండడమే ’గుప్తనిధి.’
పుల్లయ్య ఇప్పుడో నిధిపతి.
౦౦OOO స మా ప్తం OOO౦౦
– – – – –