ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏముంది?

Like-o-Meter
[Total: 1 Average: 5]

పుల్లయ్య గుప్తనిధి

 

కొండ మీద ఏముంది?

భయం చాలా గొప్పది.

ఒక్క గెంతులో వంద గజాల్ని అవలీలగా దూకేసేవాణ్ణి కూడా పట్టి ఆపేస్తుంది. అలాంటి వాడి చేతా అడుగులో అడుగును వేయిస్తుంది.

పుల్లయ్య ఆటగాడు కాడు. గొప్ప వీరుడూ కాడు. వాడో పదహైదేళ్ళు నిండిన కుర్రవాడు. భయస్తుడు. పిరికివాడు. బొద్దింకను చేత్తో పట్టుకొని పారేయగలిగేంత ధైర్యం మాత్రం కలవాడు.

వాడిప్పుడు ఆ పర్వతపాదం దగ్గర నిలబడి, తలెత్తి, ఆకాశానికి వేసిన నిచ్చెనలా కనబడ్తున్న ఆ కొండను చూస్తూ భయపడిపోతున్నాడు.

భయం గొప్పోళ్ళనే కాదు పిరికోళ్ళనీ కూడా దగ్గరగా తీసుకొంటుంది. అందుకే భయం చాలా గొప్పది.

పైకెక్కేసిన గొప్పోళ్ళు ఎప్పుడు పడిపోతామోనని భయపడ్తుంటే, కిందనే వుండిపోయిన పిరికోళ్ళు ఎక్కబోతే ఏమైపోతుందోనని గాభరాపడ్తుంటారు. భయం తనలో తారతమ్యం లేకుండా చూసుకొంటూనే భయస్తుల తారతమ్యాల్ని బాగా తెలుసుకొని మరీ భయపెడ్తుంది. అందుకే భయం చాలా గొప్పది.

ఇప్పుడు పుల్లయ్యకి ఇంకా బాగా భయం వేస్తోంది.

వాడేమీ తత్వవేత్త కాదు ఇలా భయం గురించి ఆలోచిస్తూ భయపడిపోవడానికి కానీ భయపడుతున్నాడు. పుల్లాయి కారణాలు పుల్లాయిలకుంటాయి మరి!

నిచ్చెనలా నిటారుగా వున్న ఆ కొండ చిటారున ఓ పెద్ద బండ ఉంది. ఆ బండ తన నెత్తిన ఓ పెద్ద చెట్టును మోస్తోంది. వాటిల్ని చూసి పుల్లయ్య భయపడ్తున్నాడు. వాడికి పక్కింటి ముసలమ్మ చెప్పిన ’ఒంటికొమ్ము రాచ్చసుడు, ఒంటికన్ను రాకాసి” గుర్తుకొస్తున్నాయి. అంతేకాదు, మొన్న రాత్రి చెప్పిన కథలో చెట్టు రూపంలో ఉన్న పిశాచి కథానాయకుడి మిత్రుణ్ణి అమాంతం నమిలి మింగేసింది. అందుకే పుల్లయ్య భయపడ్తున్నాడు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
కొండ దాకా వాడి వెంట కులాసాగా ప్రయాణం చేసొచ్చిన ’బుర్ర’ ఇప్పుడెక్కడుందో తెలీడం లేదు. ఆ మాటే అనుకొన్నాడు పుల్లయ్య. “బుర్రా!” అని నెమ్మదిగా గొణిగాడు. అలా పిలిచినప్పుడల్లా లోపల్నుంచి ఎప్పుడూ వచ్చే ’బుస్’ మనే శబ్దం రాలేదు. ఉన్న ఒక్క తోడూ పలక్కపోవడంతో పుల్లయ్యకు భయం భయంకరంగా పెరిగిపోయింది. దానికి తోడు చుట్టూ నిశ్శబ్దం. ఒక పిచ్చుక గానీ, ఒకే ఒక్క ఆవుగానీ, కనీసం ఓ పాము గానీ లేదు. ఉన్నా కనబడ్డం లేదు.

“అవి కూడా కొండను చూసి భయపడి ఎక్కడికో పోయేసి వుంటాయి. ఎంతైనా కొండ కొండనే.” అని అనుకొన్నాడు పుల్లయ్య.

ఆ మరుక్షణంలోనే వాడికి గొప్ప ఊరట కలిగింది.

“అదీ…అందుకే కొండయ్య అనే పేరు కావాలి. నాకు కొండయ్య పేరంటే చానా ఇష్టం. ఇలాంటి కొండలంటే కూడా చానా ఇష్టం. ఈ కొండల్ని మా నాన్న తుండుగుడ్డ కాదు గదా పెద్దగాలి కూడా ఏం చెయ్యలేదు.” అని అనుకొన్నాడు.

అలా అనుకోగానే కొంచెం ధైర్యం గుండెలో నిండినట్లయింది. వాడి పొగడ్తకు కొండ కూడా పొంగిపోయిందేమో ఓ కోయిల కూతను వినిపించింది. ఆవు అరచినప్పుడు పుట్టి, అడుగడుగునా కంగారు పెట్టిన అనుమానం ఆ కోయిల కూతతో కాస్త కంగారును తగ్గించుకొన్నట్టుంది, పుల్లయ్య కాళ్ళు వణకడం ఆపాయి.

కోయిల కూత శుభ శకునంగా అనిపించింది.

అడుగు ముందుకు వేసి కొండ మీద కాలుపెట్టబోయాడు కానీ ఏదో గుర్తొచ్చి ’బుర్రా!’ అని పిలిచాడు. ఊహూ…ఎక్కడా దాని చప్పుడే లేదు. ఏం చెయ్యాలో వాడికి తోచలేదు. ఇంతకాలం ’బుర్ర’ లేకుండా తను ఏ పనీ చెయ్యలేదు. ఒక్క అడుగు కూడా కదపలేదు. ఇప్పుడేమో అదెక్కడుందో తెలీడం లేదు. ఐనా ముందుకు వెళ్ళాలనే నిశ్చయించుకొన్నాడు.

మరోమారు కొండ కేసి చూస్తే వాడికి ఓ కొత్త భావం పుట్టుకొచ్చింది. కొండంటే గౌరవం కలిగింది. వంగి దండం పెట్టాడు. ఒక చల్లటి పిల్లగాలి పుల్లయ్యను తాకింది. ఆ గాలితో బాటూ ఏదో కొత్త పరిమళం తగిలీ తగలనట్టుగా తగిలింది.

ఇప్పుడు భయం స్థానంలో విశ్వాసం వచ్చి నిల్చుంది. పుల్లయ్య కాలు కదిపి కొండ ఎక్కసాగాడు.

– – – –