ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పుల్లయ్య గుప్తనిధి – సన్యాసి కథ

Like-o-Meter
[Total: 1 Average: 5]

పుల్లయ్య గుప్తనిధి

 

సన్యాసి కథ

 

తన కథను మొదలుపెట్టాడు సన్యాసి.

“మా నాన్న ఓ జ్యోతిష్కుడు….”

“అంటే?” అడ్డు తగిలాడు పుల్లయ్య.

“అంటే…పెళ్ళిళ్లకీ, పూజలకీ ముహూర్తాలు పెట్టేవాడు.”

“ఆహా….తెలిసింది.”

“నేను పుట్టగానే జాతకం వేసి అమ్మతో ’ఒసేవ్! వీడు ఉట్టి వెధవాయే అవుతాడు.’ అని అన్నాట్ట!”

విరగబడి నవ్వాడు పుల్లయ్య. ఆ నవ్వులో “అయ్యావుగా!” అన్న అర్థం వికవికా ధ్వనించింది.

సన్యాసి ఏమీ పట్టించుకోకుండా చెప్పుకోపోసాగాడు.

“నేను పుట్టిన మొదటి సంవత్సరంలో వర్షాలు బాగా కురిసాయ్. దాదాపు నాలుగేళ్ళ తర్వాత పడ్డ వర్షాలవి. ఎంతగా పడ్డాయంటే చెరువు కట్ట తెగి ఊళ్ళోకి నీళ్ళొచ్చేసాయి. కట్ట కింద ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఎగువున ఉన్న ఇళ్ళల్లోకి మోకాళ్ళ దాకా పారాయి చెరువు నీళ్ళు. నేల మీద పడుకొన్న అమ్మ ఉయ్యాలని కింది దాకా లాగి తనకు అందేటట్టుగా కట్టింది కదా, నేను ఆ నీళ్ళలోకి మునిగిపోయాను.”

“అమ్మోయ్” అన్నాడు పుల్లయ్య.

“అవును. అమ్మ నిద్రలేచి నన్ను పైకెత్తింది గానీ లేకుంటే నేను చచ్చిపోయేవాణ్ణి…అప్పుడే.”

కళ్ళు పెద్దవి చేసి వింటున్నాడు పుల్లయ్య.

“అట్లా మొదటి గండం నుంచి బైటపడ్డాను. ఐదేళ్ళొచ్చాక నాన్ననే ఇంట్లో చదువు చెప్పేవాడు. నాకు లెక్కలు అస్సలు వచ్చేవి కావు.”

“నాలాగే…” అన్నాడు పుల్లయ్య. వాడికెందుకో సన్యాసి కథ వింటుంటే మంచి సంబరంగా ఉంది.

“మరి నాన్నలాగా నేనూ పెద్ద జ్యోతిష్కుణ్ణి కావాలంటే లెక్కలు బాగా రావాలి. ప్రతి తప్పు లెక్కకూ వీపు చిట్లిపోయేది. అమ్మ వచ్చి నన్ను ఎత్తుకుపోయేదాకా అలా వీపు మోత మోగుతూనే ఉండేది. ఇలా మూడేళ్ళు జరిగింది. ఒకరోజు అంటే నాకు ఎనిమిదేళ్ళొచ్చినప్పుడు తిరుపతి కొండకు తీసుకెళ్ళి వడుగు చేసారు.”

“వడుగంటే?” ప్రశ్నించాడు పుల్లయ్య.

తన భుజం నుండి వేళ్ళాడుతున్న యజ్ఞోపవీతాన్ని చూపించి “ఇదీ” అన్నాడు.

“ఓహో, ఇదా! మావూళ్ళోని శాస్తుర్లకీ ఉంది ఈ దారం.” అన్నాడు.

“ఇది దారం కాదు…సర్లే, విను. అలా అందరితో బాటూ కొండకెళ్ళాను. వడుగైపోయింది. అందరమూ దర్శనానికెళ్ళాము. ఒకటే జనం. ద్వారమేమో చిన్నది, జనాలేమో పుట్టలు పుట్టలు. వాకిళ్ళు తెరవగానే ఒకటే తొక్కులాట. అమ్మావాళ్ళొక వైపు నేనొక్కణ్ణీ ఒకవైపూ ఐపోయాము. పిల్లవాణ్ణి గదా, పొట్టిగా ఉండబట్టి వాళ్ళ వీళ్ళ కాళ్ళ సందుల్లో కొట్టుకుపోయాను.”

“అయ్యో…’

“అయ్యో అన్నవాళ్లెవ్వరూ లేరు. అందరికీ దేవుణ్ణి చూసేయాలన్న తాపత్రయం. నాకేమో అమ్మను చూడలన్న తాపత్రయం. దేవుడికి, అమ్మకి పోటీ. చివరకు దేవుడే గెలిచాడు. అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను ఒక్కణ్ణే మిగిలిపోయాను.”

పుల్లయ్యకి వాడి అమ్మ గుర్తుకొచ్చింది. బిడ్డ కనబడక ఎంత తనకలాడిపోతూంటుందో ఈపాటికి!

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

“ఎవరో నా చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా జనాల్ని దాటించారు. గుడి బైటకొచ్చాక తలెత్తి చూసాను. ఎవరో గుబురు గడ్డం ఆసామి. నొసటన ఇంత పెద్ద నామాలు. బక్కగా ఉన్నాడు. ఒంటి మీద ఒక పంచె, భుజం మీద ఒక తుండుగుడ్డా వేసుకొనివున్నాడు. నన్నెత్తుకొని వివరాలు అడిగాడు. నాకెంత తెలుసో అంత చెప్పాను. పాపం రెండు రోజులు అన్ని సత్రాలూ తిరిగాడు. ఎక్కడా అమ్మ జాడ లేదు. నాన్నా కనబడలేదు. నాకు చాలా ఏడుపొచ్చింది. ఆ పెద్దాయన ధైర్యం చెప్పి తనతో బాటే తీసుకెళ్ళాడు.”

పుల్లయ్యకి సన్యాసి మీద చాలా జాలేసింది. అమ్మా నాన్న ఉండి కూడా వాళ్ళతో లేకపోవడం ఎంత దారుణం.

“నేను బ్రాహ్మణ పిల్లవాడినని తెలిసిన పెద్దాయన ఆయన ఊరికెళ్తూ దారిలో కనబడిన రామానుజ కూటం ఒకదాంట్లో నన్నొదిలి పోయాడు. పదహారేళ్ళు వచ్చేదాక కూటంలో ఉంటూ చాలా శాస్త్రాలు చదువుకొన్నా.”

“మరి జ్జోతీషం నేర్చుకొన్నావా?” ఉండలేక అడిగేసాడు పుల్లయ్య.

నవ్వాడు సన్యాసి – “లేదు. నాన్న కోరికను తీర్చాలనే అనుకొన్నా. కానీ నాకా విద్య రాలేదు.”

“పాపం…”

“పాపమే. నాన్న పేరు నిలబెట్టకపోవడం పాపమే.” నిట్టూర్పుతో కలిసి వచ్చాయా మాటలు.

పుల్లయ్యకి నాన్న గుర్తుకొచ్చాడు. ఊళ్ళో ఎంత పెద్ద పేరున్న మనిషో. కొండ దిగిపోగానే నాన్న పేరును నిలబెట్టెయ్యాలి.

“ఆ తర్వాతేమైంది?”

“ఒకరోజు, ఎవరో మ్లేంఛులంట ఊళ్లను కొల్లగొడ్తూ, జనాల్ని చంపుతూ మా ఊరికీ వచ్చారు.”

“చంపడమెందుకు?”

“వాళ్ళ మతాన్ని ఒప్పుకోనివాళ్ళను చంపాలంట. అది వాళ్ళ పధ్ధతి.”

“ఘోరం…”

“అవును. మా ఊళ్ళో చాల ఘోరాలే జరిగాయి. కనిపించిన ప్రతివారినీ పొడిచి చంపేసారు. మా కూటంలోకి దూరి అక్కడున్న మమ్మలందరినీ ఒకచోట చేర్చారు. ఆ ముఠా నాయకుడొకడు వచ్చీరాని తెలుగులో మమ్మల్నందరినీ వాళ్ళ మతానికి మారమన్నాడు లేకపోతే చంపేస్తామన్నాడు.”

“అప్పుడు….”

“ప్రాణాల మీద ఆశవున్న కొద్దిమంది ఒప్పుకొని బ్రతికిపోయారు. ఎదిరించినవాళ్ళు చంపబడ్డారు. ఏదీ చెప్పకుండా తలవంచుకొనివున్న నాలాంటివాళ్ళ చేతులు, కాళ్ళకి సంకెళ్ళు వేసి లాక్కెళ్ళారు. అలా వెళ్తుండగా మా దేశం రాజుగారు పెద్ద సైన్యంతో ఎదురుపడ్డారు. గొప్ప యుద్ధం జరిగింది. మమ్మల్ని బంధించిన వాళ్ళందరూ చచ్చిపోయారు. మా సంకెళ్ళు తెగిపోయాయి. అందరూ వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఒక్కడినే మిగిలిపోయాను. అక్కడినుంచీ ఒకచోట కూడా కాలు నిలవలేదు. తిరిగి తిరిగి ఈ కొండకు వచ్చాను. అప్పట్నుంచీ ఇక్కడే ఉంటున్నాను.”

“మరి ఆ బంగారం? ఆ బంగారం ఎక్కడిది?” లోపల్నుండీ ఆగకుండా ఉరుకుతున్న అత్యుత్సాహం పుల్లయ్య చేత ఈ ప్రశ్నను వేయించింది.

నిర్ఘాంతపోయాడు సన్యాసి.

“నీకెలా తెలుసు?”

“నువ్వు జపం చేసుకొంటున్నప్పుడు చూసాను.” చెప్పాడు పుల్లయ్య.

మాట్లాడలేదు సన్యాసి.

తప్పు చేసినవాడిలా తల దించుకొన్నాడు పుల్లయ్య.

“ఇక పడుకో…” అన్నాడు సన్యాసి.

చేసేది ఏమీ లేక బల్ల మీద పడుకొన్నాడు పుల్లయ్య.

సన్యాసి మాత్రం శూన్యంలోకి చూస్తూ ఆ బొంతకు అలా జారిగిలబడే ఉండిపోయాడు.

– – – –