ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వైకుంఠపాళీ – పదకొండవ భాగం

Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: ప్రాజెక్ట్ సక్సెస్ మీట్ లో సుమతితో కలిగిన పరిచయం గురించి, ఆ పరిచయం ఎలా తనను ప్రభావితం చేసిందో తన మిత్రులందరికీ వివరిస్తుంది రంజని. భారతీయ సనాతన సంప్రదాయ సాహిత్యాన్ని అందరూ చదవాలని కోరుతుంది రంజని. చప్పట్లతో తమ అంగీకారాన్ని తెలుపుతారు మిత్రులు.

సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నట్టు సుమతితో చెబుతాడు శర్మ. ఆ వార్తతో నిర్ఘాంతపోతుంది సుమతి. సుబ్రహ్మణ్యం వ్రాసిన ఉత్తరాన్ని శర్మ బలవంతం చేయడంతో చదువుతుంది. అందులో తన కొడుకుగా పుట్టాలన్న సుబ్రహ్మణ్యం కోర్కెను తెలుసుకుంటుంది. సుబ్రహ్మణ్యాన్ని తమతో బాటే పెట్టుకోకుండా అతని ఇంటికి పంపినందుకు సుమతి నుండి నిష్టూరాలను ఊహించిన శర్మ, ఆమె చూపించిన శాంతత్వాన్ని చూసి చలించిపోతాడు.

 
ఉద్యోగం పోయి ఐదు నెలలు కావస్తున్నా అనంత్ కు ఎక్కడా కొత్త కొలువు దొరకడంలేదు. అతనికి ఓపిక నశించిపోతోంది. అర్థం చేసుకునే భార్య ఉండడం వల్ల ఆమె సాహచర్యంలో ఉన్నంతసేపూ ఆ నిస్సహాయతను మర్చిపోగలుగుతున్నాడు. ఆమె ఆఫీసుకు వెళ్ళినప్పటి నుండీ తిరిగి వచ్చే వరకూ భరించలేని ఒంటరితనంతో కృంగిపోతున్నాడు. ఏం చేయ్యాలన్నది తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడతను.

“పోనీ, ఈ పని చేస్తే?” అంది రంజని సాలోచనగా.

“ఏమిటి?” అన్నట్టు కనుబొమలు ఎగరేసాడు అనంత్.

“నువ్వు ఓ బ్లాగ్ మొదలుపెట్టు. అందులో నీ డొమైన్ కు సంబంధించి ఆర్టికల్స్ పబ్లిష్ చెయ్.”

“నాకేంటి బెనిఫిట్?” అన్నాడు అనంత్.

“ఫేమ్!” అంది రంజని.

“అది సరే! ఇదీ” అన్నాడు ’డబ్బులు’ అన్నట్టు చేత్తో సైగ చేస్తూ.

“ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించేదివద్దు. జస్ట్ మేక్ ఏ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్.” అంది రంజని.

“ఓకే! నా ఆర్టికల్స్ నచ్చిన వాళ్ళల్లో ఎవరో ఒకరు హెల్ప్ కోసం నన్ను కాంటాక్ట్ చెయ్యొచ్చు. దాన్ని కన్సల్టెన్సీగా మార్చుకొనేందుకు ట్రై చెయ్యొచ్చు.” అన్నాడు అనంత్.

“దట్స్ నైస్” అంది రంజని.

మరునిముషంలో ఇద్దరూ అనంత్ ల్యాప్ టాప్ ముందున్నారు. బ్లాగ్ పేరు గురించి ఓ పదిహేను నిముషాలు చర్చించుకుని ఓ పేరును ఖరారు చేసారు. బ్లాగ్ తయారు చేసిన మరో గంటలో మొదటి వ్యాసాన్ని వ్రాసాడు అనంత్. ఆ బ్లాగ్ ను రెండు మూడు అగ్రిగేటర్లలో కూడా చేర్చాడు.

మరుసటి రోజు బ్లాగ్ తెరవగానే నాలుగు కామెంట్లు ఉండడంతో అనంత్ లో ఉత్సాహం వెల్లివిరిసింది. వెంటనే రంజనికి ఫోన్ చేసాడు. అనంత్ చూడకముందే రంజని ఆ నాలుగు కామెంట్లనీ చదివేసింది. కానీ ఏమీ తెలియనిదానిలా ’కంగ్రాట్స్’ చెప్పింది. వెంటనే జవాబులు రాయమని కూడా సలహా ఇచ్చింది.

రాత్రికి రంజని ఇల్లు చేరేవేళకు అనంత్ తన ల్యాప్ టాప్ ముందే కూర్చుని వున్నాడు. “రంజనీ! యూ నో…పొద్దున్నుంచి పన్నెండు కామెంట్లొచ్చాయి. అందులో ఆరు కామెంట్లు ప్యూర్ టెక్నికల్ డౌట్స్. అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసా.” అన్నాడు అనంత్. భార్య అలసిపోయివచ్చిందన్న ఆలోచనే తట్టలేదతనికి. రంజని నవ్వుతూ “వోవ్! ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రాండ్ సక్సెస్. కంగ్రాట్స్!” అంది షేక్ హ్యాండిస్తూ.

బ్లాగులో ఏదో వ్రాస్తూనే ఉండిపోయాడు అనంత్. మధ్యరాత్రి నిద్ర లేచిన రంజని గడియారం కేసి చూసింది. దాదాపు తెల్లవారుజామున ఒకటిన్నర కావొస్తోంది.

“కొత్త బిచ్చగాడు పొద్దెరుగడంట!” అంది రంజని. నిద్రతో మత్తు నింపుకున్న ఆమె గొంతు మాటల్ని ముద్దముద్దగా పలికించింది.

టక్కుమని ల్యాప్ టాప్ ను మూసేసి, ఆమెను తన మీదకు లాక్కున్నాడు అనంత్.

– – – – –

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

మూడు నెలల్లో అనంత్ బ్లాగును చదివే వారు కొన్ని వందల మంది తయారయ్యారు. ఆ చదువర్లల్లో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. వారు అనంత్ వ్రాసే టెక్నికల్ రైట్-అప్స్ ను చూసి, తమ ప్రాడక్ట్ లిటరేచర్ ను అతనితో వ్రాయించుకున్నారు. మరికొద్దిమంది తమ ప్రాజెక్ట్స్ కు అతన్ని కన్సల్టంట్ గా తీసుకుని రీటైనర్ ఫీజులు చెల్లించడం మొదలుపెట్టారు. ఇవన్నీ చాలదన్నట్టుగా కొన్ని ప్రసిద్ధి చెందిన టెక్నికల్ వెబ్ సైట్లు అనంత్ ను కాలమిస్ట్ గా తీసుకుని, అతను వ్రాసే ప్రతి రచనకు పారితోషికాన్ని ముట్టచెప్పడం మొదలెట్టాయి.

ఓ స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు తన బ్లాగులో ఆన్ లైన్ యాడ్స్ పెట్టాడు అనంత్. ఆవిధంగా తన సంపాదనను ఇంకొద్దిగా పెంచుకున్నాడు. దేశదేశాల్లో అతనికి మిత్రులు, అభిమానులు, శిష్యులు ఏర్పడ్డారు. వీటన్నిటితో అనంత్ కు ఇంకో ఉద్యోగం వెదుక్కునే అవసరం లేకుండా పోయింది. ఎన్ని పనులున్నా వారాంతాల్ని రంజనితో గడపేందుకే కేటాయించాడు.

ఆ ఆదివారం సాయంత్రం, పార్క్ లోని మ్యూజికల్ ఫౌంటెన్ చేస్తున్న విన్యాసాల్ని చూస్తూ కూర్చున్నారు రంజని-అనంత్ లు.

క్షణక్షణం ఎగసిపడే ఆశల్లా ఆ నీటిధారలు అందని ఆకాశం వైపు ఎగురుతున్నాయి. అనుక్షణం రంగులు మార్చే భావాల్లా వెలిగి ఆరుతున్నాయి లైట్లు. అచ్చు జీవితంలానే ఉందా ఫౌంటెన్.

రంజని-అనంత్ లు కూర్చున్న బెంచ్ కు కొద్దిగా ముందు, ఫౌంటెన్ కు దగ్గరగా పచ్చిక మీద కూర్చున్న ఓ జంట ఆ ఫౌంటెన్ను చూడ్డంలో లీనమైవున్నారు. అప్పుడే దోగాడ్డం నేర్చుకున్న వారి బిడ్డ, తన కొత్తవిద్యను మరోసారి ప్రదర్శించే నిమిత్తం వడివడిగా దోగాడుతూ వచ్చి రంజని చీరకుచ్చిళ్ళను పట్టుకుని నిలబడబోయింది.

హటాత్తుగా తన చీరను ఎవరో లాగినట్టవడంతో ఉలిక్కిపడింది రంజని. క్రింద చూసేసరికి నిలబడినా బ్యాలెన్స్ దొరక్క అటుయిటు ఊగుతూ, బోసినవ్వులు రువ్వుతున్న ఆ పసిపాపను చూడగానే ఆమె మనసు పొంగిపోయింది. “అర్రెర్రెర్రే” అంటూ బిడ్డను ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది.

నిత్యచైతన్యానికి చిరునామాలా ఉన్న ఆ పాప, రంజనికి మరింత ఉత్సాహం నింపేలా చిత్రమైన శబ్దాల్ని చేస్తోంది. ఆ బిడ్డడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని తన ఒడిలోనే నిలబెట్టింది రంజని. దాంతో ఆ పసిపాప ఆమె ఒడిలోనే గెంతసాగింది. ఆ పాప గెంతులకి తగ్గట్టుగా అనంత్ చప్పట్లు కొడుతూ ఓ పాటను అందుకున్నాడు.

ఫౌంటెన్ షో ఐపోవడంతో ఇహలోకంలోకి వచ్చిన పాప తల్లిదండ్రులు, బిడ్డ కనబడక కంగారుగా లేచి చుట్టూ చూడసాగారు, రంజని ఒడిలో ఆడుకుంటున్న బిడ్డను చూసిన ఆ తల్లి పరుగుపరుగున వచ్చింది. పరుగెట్టివస్తున్న అమ్మను చూసిన పాప మరింత జోరుగా కేకలేస్తూ గెంతసాగింది.

రొప్పుతూ తన ముందు నిలబడింది బిడ్డ తల్లేనని పోలికల్ని బట్టి గ్రహించిన రంజని టక్కున లేచి ఆ పాపను ఆమె చేతుల్లోకి చేర్చింది. ఆ తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుని “థాంక్స్!” అంది. ఆ కృతజ్ఞతలెందుకో అర్థం కాని రంజని జోరుగా తలను ఊపింది. ఇంతలో బిడ్డ తండ్రి కూడా అక్కడకు వచ్చాడు. అనంత్ వైపుకు చెయ్యి చాచి “మా పాప చాలా యాక్టివ్. క్షణం ఒకచోట ఉండదు. మీరున్నారు కాబట్టి ఈ దొంగని పట్టుకొని మాకు అప్పగించారు. థాంక్స్!” అన్నాడు.

“ఓహ్! అవును. షీ ఈజ్ వెరీ వెరీ యాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ టూ.” అన్నాడు అనంత్ ఆ అపరిచితుడి చేతిని జోరుగా ఊపేస్తూ.

వెళ్ళొస్తామంటూ ఆ దంపతులు చెప్పి బయల్దేరారు. అమ్మ భుజం మీద నుంచి తనకేసి చూస్తూ కేరింతలు వేస్తున్న ఆ బిడ్డను చూస్తూ ఉండిపోయింది రంజని.

ఆమె భుజం మీద చేయివేసి “వెళ్దామా?” అన్నాడు అనంత్.

ముందుకు కదిలింది రంజని.

ఆరాత్రి రంజని మౌనానికి పర్యాయపదంగా మారింది.

“నువ్విలా మౌనంగా తపస్సు చేస్తే పిల్లలు పుట్టినట్టే…” అన్నాడు అనంత్, మౌనాన్ని చెదరగొట్టే నిమిత్తం.

“మన పాప పోయి అప్పుడే ఒకటిన్నర సంవత్సరం కావస్తోంది. ఉండివుంటేనో….” అంది రంజని.

ఆమె మోకాళ్ళ మీద తన గడ్డాన్ని ఆన్చుకుని మంచం మీద కూర్చునుంది.

పడుకునివున్న అనంత్ లేచి కూర్చున్నాడు.

“ఆ విషయం గురించి నిన్ను మర్చిపొమ్మని చెప్పలేను. కానీ, దాన్ని మర్చిపోతేనే మంచిది.” అన్నాడు అనంత్.

“అలా మరవడం మగవాళ్ళకి సాధ్యమేమో!” అంది రంజని.

“ట్రై అండ్ ట్రై అన్నాడు కాళిదాసు. ప్రయత్నః ప్రయత్నః అన్నాడు షేక్ స్పియర్.” అన్నాడు అనంత్.

“అన్నీ రివర్సులే!” అంది రంజని చిన్నగా నవ్వుతూ.

“అదేదో సినిమాలో ఎస్వీ రంగారావు అన్నట్టు ఈ ఒక్క దేవుణ్ణి ఇంకోసారి నమ్ముకోరాదూ!” అన్నాడు అనంత్.

“మొగుడుగారూ! ఆ సినిమా అదేదో సినిమా కాదు స్వర్ణకమలం. ఆ డైలాగు సాక్షి రంగారావుది” అంది రంజని, ఇంకాస్త పెద్దగా నవ్వుతూ.

“మొగుడుగారా? వాడెవడు? ఎక్కడున్నాడు? ఖమాన్. చూపించు.” అని రంజనినీ ఊపెయ్యసాగాడు అనంత్.

“మొగుడుగారంటే మీరేనండీ అనంత్ గారూ.” అంది రంజని అనంత్ చేతుల్నించి తప్పించుకుంటూ.

“వాట్…కెవ్…వాట్! నన్ను గారండీ అని పిలిచావా? బాబోయ్….సూర్యుడు పశ్చిమ్మే వరువాన్…” అన్నాడు అనంత్.

“అంటే…సూర్యుడు వచ్చేదాకా..ఇలానే కోతిగెంతుల్తో గడిపేస్తారా ఓ నా దేవుడుగారూ?” అంది రంజని.

“అబ్బే! ఈ ప్రార్థన సరిపోదు.” అన్నాడు అనంత్ బెట్టుగా.

“ప్లీజ్ దేవుడూ!” అంది రంజని అతని చుబుకాన్ని పట్టుకొని.

“దేవుడితో ఇంత ఫ్రెండ్ షిప్పా! ఇదేనా భక్తులు ప్రార్థించే తీరు?” అన్నాడు అనంత్ మంచం మీదే లేచి నిలబడి.

“పోనీ ఇలా ప్రార్థించితేనో….” అని వంగి అతని కాళ్ళను పట్టుకుంది రంజని.

“వహ్వా…ఇదేదో భేషుగ్గా….” అని అతను వాక్యం పూర్తి చేసేలోపే అతని కాళ్ళని లాగింది రంజని.

వెల్లకిలా పడ్డ అనంత్, అదే ఊపులో రంజనిని తన మీదకు లాక్కున్నాడు.

“నేనేమో నా దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాను.” అంది రంజని.

“భేష్! ఆ దేవుణ్ణి నేను ప్రసన్నం చేసుకుంటానులే! గోవిందా! గోవిందా!!” అన్నాడు అనంత్, ఆమెను చుట్టేస్తూ.

“నువ్వూ – దేవుడ్ని ప్ర…సన్నం…అన్ బిలీవబుల్.” అంది రంజని అతనిలోకి కరిగిపోతూ.

“ఈ క్షణం మాత్రం బిలీవబుల్.” అన్నాడు అనంత్ కౌగిలిని మరింత బిగిస్తూ.

* * * * *

“అనూహ్యం స్వామీ! మీ గురించి ఆలోచించని నా రెండో ఆటకాయ మిమ్మల్ని ప్రార్థిస్తోంది. యాభైరెండవ గడిలోని యోగపు మెట్లెక్కి డెబ్భైరెండవ గడిని చేరింది.” అంది సులక్షణాదేవి.

“ఆ కిరాత హూణాదపి ఏ పాపి జీవాః తరంతి మమ మాయయా” అన్నాడు భగవద్గీతబోధకుడు.

“పాపులూ, మ్లేంఛులూ కూడా మీ నామస్మరణతో సంసారసాగరాన్ని దాటడం ఆశ్చర్యం!” అంది తమోహారిణి.

“దేవీ! జీవులలో నిత్యం వెలిగేది జ్ఞానజ్యోతియే. అదే స్వరూపం. జ్ఞానం వల్లనే సుఖం లభించేది. కావున జీవులు తమతమ స్వరూపాల్లో సుఖాత్ములే. కానీ బలిష్టమైన నీ ప్రకృతికి లోబడి, మాయావశులై, జడపదార్థాలలోనే సుఖముందన్న అపోహతో చావుపుట్టుకల చక్రంలో చిక్కుకుంటారు. ఎవరైతే స్వంత ఇచ్ఛతో, జడపదార్థాల పై మోహాన్ని దాటడానికి ప్రయత్నిస్తారో వారికి స్వరూపతత్త్వం తెలిసివస్తుంది. నిత్యసుఖకారకమైన స్వస్వరూప పరిచయంతో ప్రాకృతిక పదార్థాల మోహం పోతుంది. ఆ స్వరూపజ్ఞానసిద్ధికి నా అనుగ్రహమే కారణమౌతుంది. నాస్తికులు సైతం ’నారాయణా’ అని పలికినా వారికి నామోచ్ఛారణ పుణ్యాన్ని అనుగ్రహిస్తాను. నన్ను నమ్మకపోయినా ఇతరుల దుఃఖాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తే దానికీ పుణ్యానిస్తాను.” అన్నాడు చరాచరనియామకుడు.

“భక్తితోగానీ, నిర్లక్ష్యంతోగానీ, ద్వేషంతోగానీ, మరేవిధమైన భావనతో గానీ మీ పేరును పిలిస్తే, తత్క్షణంలో పుణ్యాన్ని ప్రసాదిస్తారు. సృష్టిలోని జీవులు, జడపదార్థాలూ మీ ప్రేరణతోనే తమతమ ధర్మాల్ని నిర్వర్తిస్తున్నాయి. ఒక నాస్తికుడు మిమ్మల్ని నమ్మకపోయినా వాని చేత లోకోపకారకమైన పని చేయించే ప్రేరణ మీదేగా! ఇందుకేగా మిమ్మల్ని కరుణాసముద్రుడని పిలిచేది!” అని చేతులు జోడించింది కమలాలయ.

“మరి నా పావుల్ని నడపనా?” అన్నాడు నందనందనుడు.

“తప్పకుండా” అంది త్రిలోకపూజిత.

నారాయణుడు పాచికల్ని విసిరితే పిల్లనగ్రోవి కణుపుల్లో గాలి చేస్తున్న కేరింతల్లా ధ్వనించాయి.

* * * * *

“ఏమండీ! ఈ చీకటికి అర్థమేమిటి?” – కొవ్వొత్తిని వెలిగిస్తూ అడిగింది సుమతి.

“ఏ చీకటి? కరెంటు పోయినప్పటిదా!” అని నవ్వుతూ అడిగాడు కేశవశర్మ.

“అనాది చీకటి.” అంది సుమతి.

శర్మకు ఆ పదబంధం బాగా నచ్చింది. “అనాది చీకటి! దుస్సమాసమైనా నాకెందుకో బాగా నచ్చింది.” అన్నాడు.

“ఐతే చెప్పండి….ఈ చీకటి ఎందుకు?” అంది సుమతి,

“గుండెల్ని పిండేసిన దుఃఖం ఆగిపోయాక ఎంతో సుఖంగా ఉంటుంది. తెలుసా!” అన్నాడు శర్మ. “అలాంటి సుఖమే ఈ అనాది తమస్సు!”

అతని గొంతులోని గాంభీర్యానికి తత్తరపడిన కొవ్వొత్తి రెప్పపాటు ఊగిసలాడి మళ్ళీ నిశ్చలమైంది.

సుమతి మౌనంగా ఉండిపోయింది.

“అలా ఎందుకడిగావ్?” – చప్పున అడిగాడు శర్మ.

“చాలారోజుల క్రితం, సుబ్రహ్మణ్యం మనింట్లో ఉంటున్నప్పుడు…దీపాలు పెట్టేవేళకి కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలిగించి వరండాలో కూర్చునివున్నాం. అప్పుడు వాడు అడిగిన ప్రశ్న ఇది.” అంది సుమతి.

“నువ్వేం చెప్పావ్?”

“మీ అంత బాగా చెప్పేదాన్నా?” అంది సుమతి.

“నువ్వేం చెప్పావ్?” మళ్ళీ అడిగాడు శర్మ.

“తల ఎత్తి చూడలేని ఆకాశాన్ని హాయిగా చూడగలిగే వేళ.”

“అంటే…” సాలోచనగా ఆగాడు శర్మ.

“సూర్యుడు పోయి నక్షత్రాలు వచ్చే వేళ అని అన్నాను.”

“ఓహ్!” అన్నాడు శర్మ. “వాడేమన్నాడు?”

“చప్పట్లు కొట్టాడు.” అంది సుమతి నవ్వుతూ.

అరవిచ్చుకున్న ఆమె పెదాల మీది తడిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని కొవ్వొత్తి మురిసింది కాబోలు, ఓ మెరుపు ఆ పెదాల పై విరిసింది.

శర్మ ముందుకు వంగి ఆ వెలుగును చుంబించాడు.

మాధ్వీకచషకంలో చిక్కిన మధ్వకంలా ఆమె.

రివ్వుమంటూ ఎగిరే గువ్వల జంట వర్షంలో తడిచి రెమ్మల మధ్యలో ముడుచుకుపోయినట్టుగా చిక్కుబడ్డ పెదాలు.

వామదేవుని వామభాగంలో ఉమాభామ సమాగమించి, సంగమించి, సగం కరిగి, సగం మిగిలి….

* * * * *

“ఇదేమిటి స్వామీ? వైకుంఠంవాసియైన మీ మొదటి ఆటకాయలో ఆ భోగలాలసత్వం?” అంది వైభోగలక్ష్మి, ’అంబరీషు’డనబడే పామును తృటిలో తప్పించుకుని నూటపన్నెండవ గడిని చేరిన నారాయణుని మొదటి ఆటకాయను చూస్తూ.

“వేదపీఠవు, నీకు తెలియని సుఖభోగసూక్ష్మాలా?” అన్నాడు వేదవేద్యుడు.

“ఈ చిత్రమేమిటో, ఈ లాలసత్వంలోని ధర్మమర్మమేమిటో మీరే వివరించాలి!” అంది కూర్మరూపి మనోహారిణి.

“దేవీ! యం జ్ఞానం అని కదూ వ్యుత్పత్తి?” అన్నాడు సర్వలోక ఉత్పత్తి హేతువైన నారాయణుడు.

“అవును స్వామీ!” అంది సర్వలోకశరణ్య.

“సద్గుణభరితమైన సత్కర్మాచరణం కూడా ఓ యజ్ఞమే. అమలినమై, ఉత్తమసంతానధారణ కారణమైన ఈ భోగం వామయజ్ఞమని పిలువబడుతుంది. ఇది చెప్పు, డెబ్బైఐదవ గడిలోని కర్కోటకుడు మింగితే చేరేది ఎక్కడికి?”

“పదవగడిలోని పందిని.”

“మురికికూపాన్నే అమోఘసుఖంగా ఆస్వాదించడమే పందిలోని గుణం. వ్యర్థ పదార్థాల్ని మేస్తూ అది చేసే శబ్దంలో హేయమైన దాని మలిన సుఖం వ్యక్తమౌతుంది. ఆవిధంగా అసభ్యమైన, అతి జుగుప్సాకరమైన భావాలతో చేసే శృంగారమే విషయలాలసత్వమని అనిపించుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా మంచి బిడ్డల్ని కని, భక్తి-వినయం-సత్పాత్రతతో నిండిన సంఘాన్ని నిర్మించాలన్న సంకల్పంతో జరిపే శృంగారం మైథునీభావసృష్టిగా పిలువబడుతుంది. నా నాభికమలం నుండి సృష్టికర్తయైన బ్రహ్మ పుట్టినట్టుగా, తల్లి గర్భంలో పేగుబంధంతో మానవులు పుడతారు. సాధనా శరీరప్రాప్తికి కారణమయ్యే ఈ రతికార్యం మంగళారతిలానే పవిత్రమైంది దేవీ!” అన్నాడు పరమపురుషుడు.

“ధన్యోస్మి స్వామీ, ధన్యోస్మి! నాభి నుండి పుత్రుణ్ణి, పాదం నుండి పుత్రికను ప్రభవింపజేసిన స్వరమణులు మీరు. పురుషునిలోనూ, స్త్రీలోనూ నిలచి వారివారికే ప్రత్యేకమైన ఇంద్రియసుఖాన్ని ఇచ్చి, ఆపై సంతానభాగ్యాన్ని ప్రసాదించేది మీరే. పిమ్మట వారి వార్ధక్యంలో యోగ్యులైన పుత్రులలో నిలచి కాపాడే శిష్టేష్టపరాయణులూ మీరే. మీ లీలలను నేనెన్న తరమా?” అని చేతులు జోడించింది పద్మలోచని.

“మాటలేనా! ఆట లేదా?” నర్మగర్భంగా అన్నాడు పద్మగర్భుడు.

“శ్రీవారి ప్రీతికై…ఇదిగో…” అంటూ పాచికల్ని వేసింది సదమలయోగివృందవందిత చరిత.

మరో మధురపుష్పాన్ని వెదుకుతూ సాగుతున్న మదపు తుమ్మెద రెక్కల ఝుంకారాన్ని ధ్వనిస్తూ పడ్డాయి పాచికలు.

* * * * *

(సశేషం…)