గత భాగం: విడిపోదల్చుకున్న ఓ యువజంటను ఒక్కటి చేస్తాడు కేశవశర్మ. ఆ సందర్భంగా సుమతితో మాట్లాడుతూ సుఖమంటే వ్యక్తులు, వస్తువుల వల్ల దొరికేది కాదని, శాస్త్రసమ్మతమైన అనుసంధానం వల్లనేనని చెబుతాడు శర్మ. నిజమైన సుఖమేదో తెలిసిన భర్త దొరకడం తన అదృష్టమని చెబుతుంది సుమతి. రంజనిని కలుస్తాడు విశ్వేశ్వర్. అతని చెల్లెలు విశ్వజ్ఞ జైలుకు పోబోయి తన సహాయంతో బైటపడిందని తెలుసుకున్న రంజని సంతోషిస్తుంది. విశ్వజ్ఞకు తన టీమ్ లో చోటు దొరికేలా చేస్తుంది. కొద్దిరోజుల్లోనే విశ్వజ్ఞ చాలా లౌక్యం గల వ్యక్తిగా గ్రహిస్తుంది రంజని. సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోవచ్చునని ఉపేక్షిస్తుంది. |
బజారుకెళ్ళి ఇంట్లోకి వచ్చిన రంజని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
హాల్లో అనంత్ తో కబుర్లు చెబుతున్న విశ్వజ్ఞను చూసి డంగైపోయింది.
రంజని వచ్చింది చూసి ’హాయ్’ అన్నట్టు చేయూపి అనంత్ తో మాట్లాడుతూ ఉండిపోయింది విశ్వజ్ఞ.
రంజనికి చిర్రెత్తుకొచ్చింది. “ఎందుకొచ్చావ్…ఇక్కడికి?” అని కరుకుగా అడిగింది.
నవ్వడం ఆపి, సోఫాలో నుంచి లేచిన విశ్వజ్ఞ – “అదీ…మేడమ్! నెక్స్ట్ అపార్ట్మెంట్లోనే నా క్లాస్ మేట్ ఉంటోంది. దాన్ని చూసేందుకొచ్చాను. అట్లాగే మిమ్మల్ని చూసెళ్దామని….” అని ఆగిపోయింది.
“ఓకే!” అంది రంజని, ఇంకేం మాట్లాడాలో తోచకుండా.
“షీ ఈజ్ వెరీ టాకిటివ్. నీకు ఆఫీసులో మంచి కాలక్షేపమే!” అన్నాడు అనంత్.
అతని వైపు కొరకొరమంటూ చూసింది రంజని. ఆ చూపులోని తీవ్రతను గమనించిన అనంత్ మరింకేమీ మాట్లాడకుండా ఊరకేవుండిపోయాడు.
మరో పదినిముషాల్లో వెళ్ళిపోయింది విశ్వజ్ఞ.
“ఎంతసేపైంది అదొచ్చి?” విసురుగా అడిగింది రంజని.
“నీవొచ్చేదానికి ఓ పదినిముషాలముందనుకుంటా! ఐనా ఎందుకంత రాష్ గా అదీ ఇదీ అని అంటున్నావ్?” అన్నాడు అనంత్.
“పదినిముషాల్లోనే యికయికలు పకపకల దాకా పెరిగిపోయిందా?”
“వాట్?”
“అదే! మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్! జోకులేసుకొని విరగబడి నవ్వేంతదాకా పెరిగిపోయిందా….ఇన్ జస్ట్ టెన్ మినిట్స్!” అంది రంజని.
“డోంట్ టాక్ నాన్సెస్!” అన్నాడు అనంత్ కోపంగా.
“అవున్లే! నేను చెప్పేదాంట్లో నీకెప్పుడు సెన్స్ కనబడింది?” అంటూ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ను విసిరేసింది రంజని.
“ఏయ్! ఏమైంది నీకు?ఆ…పిచ్చేమన్నా పట్టిందా?” అన్నాడు అనంత్.
“నువ్వు చేస్తున్న పన్లకి అదొక్కటి పట్టడమే తక్కువ!” గట్టిగా అరిచింది రంజని.
“వో వో వో! కామ్ డౌన్! అలా గట్టిగా అరవొద్దు!” అన్నాడు అనంత్.
అక్కడి నుంచి లేచి మరో గదిలోకి వెళ్ళింది రంజని. అనంత్ కూడా ఆమె వెంటే వెళ్ళాడు.
“లీవ్ మీ అలోన్!” మళ్ళీ గట్టిగా అరిచింది రంజని.
“ష్…ష్…ఏమిటా అరుపులు? ఇప్పుడేమైందని?” అన్నాడు అనంత్ రంజని దగ్గరగా వస్తూ.
“స్టాప్ దేర్! దగ్గరకు రావొద్దు. నీకు నాపై ఇంట్రెస్ట్ పోయిందని నాకు తెలుసు. డోంట్ ట్రై టు యాక్ట్!” అంది రంజని.
అడుగు ముందుకు వేసిన అనంత్ అక్కడే ఆగిపోయాడు.
“ఏం మాట్లాడావో తెలుసా?” అన్నాడు. అతని మొహంలో కరుకుదనం పేరుకోసాగింది.
“ట్రూత్! నిజం మాట్లాడాను. ఓవైపు షైనా…మరోవైపు ఇప్పుడొచ్చింది. చూస్తూనే వున్నాను!” – రంజని గొంతులోను, మనసులోను, మాటలోను పట్టుదల గట్టిపడ్తోంది.
“నీ బొంద ట్రూత్! నాన్సెస్!” అని నిర్లక్ష్యంగా అన్నాడు అనంత్.
అంతే….
ఒక్క ఉదుటున ముందుకొచ్చిన రంజని అనంత్ ను ఉన్నపళాన గట్టిగా ఒక్క తోపు తోసింది.
అనుకోని ఆ తాకిడికి వెల్లకిలా నేల మీద పడ్డాడు అనంత్. వెంటనే లేచి నిలబడి రంజని చెంపను ఛళ్ళుమనిపించాడు.
ఒకసారి కాదు…రెండుసార్లు కాదు….
ఎరుపెక్కిన చెంపల్తో నిశ్చేష్టంగా నిలబడిపోయిన రంజనిని ఆ గదిలో వదిలేసి బైటకు వెళ్ళిపోయాడు అనంత్.
వెళ్తూ వెళ్తూ “నౌ ఐ హావ్ లాస్ట్ ఇంట్రెస్ట్…ఇన్ యూ…” అని వేలు చూపెట్టి మరీ వెళ్ళాడు.
ఆవేశంతో వణుకుతున్న శరీరం. ఆందోళనతో చంచలాలైన కళ్ళు. క్షణకాలపు ఉద్రేకంతో బద్దలైన మనసు…ఇవే రంజనికి తోడుగా నిలబడ్డాయి.
నెమ్మదిగా నేల మీద కూలబడింది రంజని. మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని మౌనంగా ఉండిపోయింది.
ఉప్పటి చెమటలో, ఉప్పటి కన్నీళ్ళు సంగమిస్తున్నాయి.
“బ్రతుకెంత దుర్భరం! విధికెంత నిర్దయ!”
– – – – – –
సాయంత్రం గొడవతో బైటికెళ్ళిన అనంత్ ఇంకా తిరిగిరాలేదు.
పొద్దున ఆలస్యంగా లేచిన రంజని అతని గురించి వాకబు చేసే ప్రయత్నమేమీ చెయ్యలేదు. అరవింద్ కు ఫోన్ చేసి సెలవు కావాలని అడిగింది. అతను సరేననడం జరిగిపోయింది.
స్నానం చేసి వచ్చి బెజవాడ కనకదుర్గ పటం ముందు నిలబడింది రంజని. రోజూ చూస్తున్న ఆ చిత్రం ఈరోజు విచిత్రంగా కనబడ్తున్నట్టుగా అనిపించింది.
గర్జిస్తున్న సింహవాహనంపై వీరాసనంలో కూర్చున్న అమ్మ చేతుల నిండా ఆయుధాలే! కానీ ముఖంలో దయ, పెదవులపైని చిరునవ్వులో కరుణ. అభయహస్తంలో స్రవిస్తున్న ప్రేమ.
చేతుల్లో ఆ ఆయుధాలెందుకు? ముఖంలో ఆ ప్రశాంతత ఎక్కడిది? ఆయుధాలున్న చోట ప్రశాంతత ఉండడం సాధ్యమా? – అని ప్రశ్నించుకుంది రంజని మనసు.
నేల పై కూర్చుని ఆ పటాన్నే చూడసాగింది రంజని. క్షణం క్రితం పుట్టుకొచ్చిన ప్రశ్నల్నే మళ్ళీ మళ్ళీ తల్చుకోసాగింది.
“అవును! చల్లనితల్లి చేతిలో భయం పుట్టించే ఆయుధాలెందుకు?”. రంజనికి హటాత్తుగా సుమతి గుర్తుకువచ్చింది.
“సుమతి ఉండుంటే ఈ చిక్కుప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చివుండేది. ఈమధ్య సుమతిని గుర్తుచేసుకోవడమే లేదు. ఆమెను కలిసివచ్చిన తొలిరోజుల్లో ప్రతిరోజూ ఏదో ఒక కారణానికి గుర్తుకువచ్చేది. ఇప్పుడు దాదాపు మర్చిపోయింది. ఆరోజు ఆమె ఆ గుడిలో కలవకపోయివుంటే నా పరిస్థితి ఎలావుండేది? ఇలా ఇంతదూరం సులభంగా రాగలిగేదాన్నా? ఆమె చెప్పిన మాటలు మంత్రాలుగా మారకపోయివుంటే నాలో ఇంత మనోధైర్యం నిండేదా? నో! అబార్షన్ అయ్యిందన్న బాధలోనే కుళ్ళిపోయివుండేదాన్ని. ఆ బాధకు జతగా అనంత్ వింత చేష్టలు ఖచ్చితంగా పిచ్చెక్కించేవి! మంచి వ్యక్తుల్ని, మంచి విషయాల్ని తొందరగా మర్చిపోయేట్టు ఎందుకు చేస్తాడా దేవుడు? అమ్మా! ఇంకోసారి సుమతి తో కలిసే పరిస్థితి వచ్చింది. ఆమె కలుస్తుందా? నువ్వు కలవనిస్తావా? నాకు శాంతిని కలిగిస్తావా? అమ్మా…అమ్మా…అమ్మా” – ఘోషిస్తోంది రంజని అంతరంగం.
పటంలోని కనకదుర్గ పెదాలపైని చిరునవ్వు చెదరడంలేదు. చెరోవైపు వెలిగించిన దీపాల శిఖలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. అగరొత్తి ధూపం వింత రూపాల్ని చూపుతూ మాయమౌతోంది.
రంజని మౌనాన్ని, ధ్యానాన్నీ భంగపరుస్తూ మోగింది ఫోన్. ఆమె లేవలేదు. ఆగిపోయిన మొబైల్ మళ్ళీ మోగింది. తియ్యడానికి మనసు రాలేదు రంజనికి.
మూడోసారి కూడా మోగడంతో నిరాసక్తంగా లేచి ఫోన్ తీసుకుని “హలో” అంది. ఆమె గొంతు ఆమెకే వినబడ్డం లేదు.
“నమస్తే మేడమ్! నేను…విశ్వేశ్వర్ని!” అంది అవతలి గొంతు.
నిద్రించిన నాగుపాము లేచినట్టుగా కోపం కట్టలు తెంచుకుంది రంజనిలో. చెవి దగ్గరినుంచి ఫోన్ తీసేసి డిస్ కనెక్ట్ చెయ్యబోయింది.
“ఇంపార్టెంట్ మ్యాటర్ మేడమ్. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను!” అన్న విశ్వేశ్వర్ మాటలకు రంజనిని మళ్ళీ ఫోన్ ను చెవికి ఆనించింది.
“నిన్న నా చెల్లెలు మీ ఇంటికి మీతో చెప్పకుండా వచ్చిందంట కదా! ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ మేడమ్!”
“మీరెందుకు సారీ చెప్పడం? ఆల్సో…మీకెలా తెల్సింది?”
“ఆమె చెప్పడానికి భయపడ్తోంది మేడమ్. అందుకని నేనే చేసాను అండ్ షీ ఈజ్ మై సిస్టర్. నాతో అన్నీ చెబుతుంది…” ఆగిపోయాడు విశ్వేశ్వర్.
“ఓకే! ఇంకెప్పుడూ అలా చెయ్యొద్దని చెప్పండి.” అంది రంజని. ఆమె గొంతులో అధికారం ధ్వనించింది.
“ష్యూర్! థాంక్స్! ఉంటాను మేడమ్” అన్నాడు విశ్వేశ్వర్.
“అలాగే!” అన్న రంజని వెంటనే “వన్ మినిట్! మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనివుంది.” అంది.
“ఓహ్!” అన్న విశ్వేశ్వర్ కొన్ని సెకన్ల తర్వాత “అడగండి! ప్లీజ్!” అన్నాడు.
“మన దేవుళ్ళ చేతుల్లో వెపన్స్….అదే….ఆయుధాలెందుకుంటాయ్?” అని అడిగింది రంజని.
విశ్వజ్ఞ పై ఆమె ఏ బ్రహ్మాస్త్రమో సంధించబోతోందని కంగారుపడ్డ విశ్వేశ్వర్, రంజని అడిగిన ప్రశ్నకు స్థిమితపడి – “అదా! అదీ! అంటే….” అన్నాడు.
సహనమన్నదే పోయిన రంజని మనసు అతని నాన్చుడు ధోరణికి చిర్రెత్తుకొచ్చింది. “మీకు తెలుసా లేదా?” అని కోపంగా అంది.
“సారీ! ఎస్! నాకు ఆన్సర్ తెలుసు మేడమ్!” – వడివడిగా అన్నాడు విశ్వేశ్వర్.
“మీరు జీనియస్ గా…వెంటనే చెప్పండి…ఎందుకా నసుగుడు?” అంది రంజని.
“ష్యూర్ మేడమ్! ఏదైనా దేవుడు లేదా దేవత చేతిలో ఆయుధం ఉంటే అది వీరత్వానికి గుర్తు. పువ్వు ఉంటే ప్రకృతికి నిదర్శనం. పుస్తకం ఉంటే అధ్యయనానికి గుర్తు. జపమాల ఉంటే ధ్యానానికి చిహ్నం. వీణ, పిల్లనగ్రోవి మొదలైన సంగీత వాయిద్యాలుంటే అవి మానవుల మనోభావాల్ని డిలైట్ అంటే రంజింపజేసే కళలను సూచిస్తాయి.” చకచకా చెప్పుకుపోయాడు విశ్వేశ్వర్.
అవతలి వైపునుండి ఎలాంటి స్పందనా లేకపోవడంతో అనుమానమొచ్చిన అతను “హల్లో మేడమ్! వింటున్నారా?” అన్నాడు.
“ఎస్..ఎస్..బట్, కనకదుర్గమ్మ మనకు అమ్మ కదా! ఆమె చేతిలో అన్ని వెపన్స్ ఎందుకు? ఓ అమ్మకు అన్ని హారిబుల్ వెపన్స్ కావాలా?” అంది రంజని.
“ఓహో! అదా మీ అనుమానం. దుర్గమ్మ చేతిలో ఉండే గద ఆయుధమే ఐనా అదొక సింబల్. గమ్యాన్ని చేర్చేదాన్ని గద అంటారు. అలాగే ధనస్సు-శరం కూడా సింబల్సే! ముక్తిని కోరుకునే వాళ్ళకి వాళ్ళ శరీరమే ధనస్సు, సాధనయే శరం. ప్రతి బాణానికీ ఒక లక్ష్యమున్నట్లే ముక్తి అనే లక్ష్యాన్ని ఛేదించాలి అనేదే అందులోని అర్థం. వేదనాదానికి సింబల్ శంఖం. ఇలా ఒక్కో ఆయుధానికీ స్పిరిచువల్ మీనింగ్స్ వున్నాయి. ఆల్ దోజ్ వెపన్స్ ఆర్ ఫిల్డ్ విత్ మెటాఫోరికల్ సింబాలిజమ్!” – ఆగాడు విశ్వేశ్వర్.
“ఎక్సలెంట్! ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం దొరికింది. బై ద వే, హౌ డూ యూ నో ఆల్ దీజ్ థింగ్స్?” అని అడిగింది రంజని.
నవ్వాడు విశ్వేశ్వర్. “నాకో గురువుగారున్నారు లేండి. ఆయన చెప్పారు!” అన్నాడు.
“ఓహో! ఎవరాయన?” అంది రంజని.
“శర్మగారని!” అన్నాడు విశ్వేశ్వర్.
“వెరీగుడ్! కన్వే మై నమస్కారమ్స్ టు హిమ్!” అంది రంజని.
“తప్పకుండా మేడమ్! సారీ టు బాదర్ యూ!” అన్నాడు విశ్వేశ్వర్.
“నో నో! ఇట్స్ మై ప్లెజర్ టు టాక్ టు యూ అండ్ గెట్ ఆన్సర్స్!” అంది రంజని.
మరోమారు నమస్కారం చెప్పి ఫోన్ పెట్టాడు విశ్వేశ్వర్.
మొబైల్ ను చేత్తో పట్టుకుని మళ్ళీ కనకదుర్గ పటం దగ్గరకు వచ్చింది రంజని.
దుర్గమ్మ నవ్వులో ప్రేమ హెచ్చినట్టుగా అనిపించింది ఆమెకు. విశ్వేశ్వర్ ఇచ్చిన వివరణను గుర్తుకుతెచ్చుకుని దుర్గ చేతిలోని ఆయుధాల్ని చూసింది. ఇప్పుడవి భయపెట్టేట్టుగా లేవు.
“గమ్యాన్ని చేర్చేదే కదా గద? ఇప్పుడు నా జీవితాన్ని ఓ గమ్యానికి చేర్చాలంటే నాకు నేనే గదలా మారాలి! అంటే పైకి చూసేందుకు బలంగా, భయపెట్టేటట్టుగా! కానీ లోపల మెటాఫోరికల్ సింబాలిజంలా దుర్గమ్మ పెదవుల మీది చిరునవ్వులా! ఐనా ఎంత ఆశ్చర్యం! సుమతి గురించి అనుకోగానే నా ప్రశ్నకు జవాబు దొరికింది. ఇది మిరాకల్ అనుకోవాలా లేక కోయిన్సిడెన్సా? వాటెవర్. ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్. థాంక్స్ అమ్మా” అని అనుకుంటూ మొబైల్ పక్కనపెట్టి కనకదుర్గ పటాన్ని చేతిలో తీసుకుని గుండెలకు హత్తుకుంది రంజని.
* * * * *
“నీ మొదటి పావుకు భక్తి ఎక్కువైనట్టుంది సుమా!” అన్నాడు సుమనసపూజ్యుడు.
చేతులు జోడించింది సుమశరుని జనని.
“జోడించిన నీ కరపద్మాలు భక్తులకు వరప్రదాలు!” అన్నాడు ముకుందుడు.
“అది మీ అనుగ్రహమేగా స్వామీ!” అంది మంగళదుర్గ.
“ఇంతకూ ఎనిభైఎనిమిదవ గడికి చేరిన నీ మొదటి ఆటకాయ ఏం సూచిస్తోంది దేవీ?” అన్నాడు అహిగిరివాసుడు.
“స్వామిన్! యథామతిగా వివరిస్తాను. అదే వరుసలో డెబ్బైఎనిమిదవ గడిలో ఉన్నవాడు గ్రస్త సూర్యుడు” అంది సూర్యకోటిసమప్రభ.
“అంటే…” సాలోచనగా ఆగాడు ఆర్తత్రాణపరాయణుడు.
“అంటే గ్రహణకాలం నాటి వెలుగు కోల్పోయిన సూర్యుడు ప్రభూ! కర్మసాక్షిగా ప్రతిరోజూ పూజలందుకునే సూర్యుడు, గ్రహణకాలంలో ఆ పూజార్హతను కోల్పోతాడు. పైగా గ్రస్తసూర్యుని దర్శనం అనేక పాపాలకు, రోగాలకూ దారితీస్తుందని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆవిధంగా లోకంలో, అనుకోకుండా వ్యసనాలకు బానిసలైపోయే ఉత్తములు కూడా పూజార్హతను కోల్పోతారు.”
“మరి అలాంటి వారికి త్రోవ యేది సాక్షిభూతా?” అన్నాడు విశ్వచక్షువు.
“మీ నామస్మరణ త్రోవయే త్రోవ స్వామి. జ్ఞానము, బ్రహ్మలోకము, వైరాగ్యమనే మూడు గడులను దాటిన వారు ఎనభైయెనిమిదవ గడిలోకి చేరి గ్రహణముక్త సూర్యునిలా సంపూర్ణజ్ఞానంతో వెలుగుతారు. ఎవ్వరూ వేలెత్తి చూపలేని సౌశీల్యంతో అలరారుతారు.” అంది దైత్యసంతాపకారిణి.
“ఈ సమన్వయం చాలా బావుంది.” అని త్రివిక్రముడంటే – “మీ మొదటి ఆటకాయ ఏం చెప్పబోతోందో!” అని ఉత్సుకతను ప్రదర్శించింది త్రైలోక్యకుటుంబిని.
“చూద్దాం!” అన్నాడు పారాయణపరాయణుడౌ నారాయణుడు.
ఆయన పాచికలు వేస్తే అవి నటరాజ జటాజూట బద్ధ వియద్గంగా భంగ తరంగాల్లా గలగలమన్నాయి.
* * * * *
గుడి గంట మ్రోగగానే, చెదిరిపోయిన పాపాల్లాగా గాల్లోకి ఎగిరాయి పావురాళ్ళు.
వరదనీరు తీరం దాటి దూసుకువచ్చినట్టుగా ఘంటానాదపు ప్రకంపనలు సన్నగా వినబడ్తున్నాయి.
పగలు-రాత్రి అనే రెండు కుంచెల్తో ఆయుష్షు అనే రాశిని ఇవతలి నుంచి అవతలికి కొలిచి వేస్తున్న కాలదేవత యొక్క కరకంకణాల చప్పుడు ఆ దేవాలయప్రాంగణంలో వినిపించదేమోనన్నట్టుగా నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది.
సుమతి, శర్మ ఓ మారుమూల గ్రామంలోని ఆ గుడికి వచ్చారు.
శర్మ హటాత్తుగా ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేసినా “ఎందుకు?” అని ప్రశ్నించకుండా బయల్దేరింది సుమతి. ఎన్నడూ వినని ఈ గుడికి రావడంలో తన భర్త ఉద్దేశ్యమేమిటన్నది తెలియకపోయినా సరైన సమయం వచ్చినప్పుడు ఆయనే చెబుతారన్న నమ్మకం ఉంది సుమతికి.
గోధూళి వేళకు ఆ చిన్ని పల్లెలో దిగగానే సుమతికి ఏదో చిరపరితమైన భావన ఒకటి గాలిలో తేలివచ్చి పలకరించినట్టైంది. ఇరుకు వీధుల్లోని ప్రతి మలుపు ఎప్పుడో తిరిగినట్టుగా అనిపించింది. గుడికి వెళ్ళే దారిలో ఎదురుపడ్డ పెద్ద దిగుడు బావి వద్దకు రాగానే ఒళ్ళు ఝల్లుమంది. భయంతో కాదు, అది చెప్పదల్చుకున్న రహస్యపు లోతు చూసి.
వింతైన భావాలతో గుడి ప్రాంగణంలోకి ప్రవేశించిన సుమతికి మరో ఆశ్చర్యం ఎదురైంది.
గర్భగుడికి చేరేందుకు ఉన్న మెట్లకు రెండు వైపులా తంబూరలు మీటుతున్న రెండు పురుష విగ్రహాలున్నాయి.
“ఏమండీ! ఈ గుడిని ఇంతకు మునుపెప్పుడో చూసానండీ!” అంది సుమతి.
“ఇదేగా మొదటిసారి….మనం ఇక్కడకు రావడం!” అన్నాడు శర్మ, మెట్లపై నిలబడి.
“కావొచ్చు….కానీ నాకెందుకో అలా అనిపిస్తోంది. ఈ గుడి…ముఖ్యంగా ఈ రెండు విగ్రహాలు…”అంటూ వాటి కేసి చూపించింది.
శర్మ ఆ రెండు విగ్రహాలను పరీక్షగా చూసాడు. ఎక్కిన రెండు మెట్లు దిగి సుమతి దగ్గరకు వచ్చి “ఏదో కలలో చూసుంటావు!” అన్నాడు.
“కలా? అలా అనిపించడం లేదండీ!” అంది సుమతి.
“ఖచ్చితంగా కలలోనే చూసుంటావు. పద” అంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకు నడిచాడు.
వాళ్ళు రంగమండపంలోకి వచ్చి నిలబడగానే, గర్భగుడిలో ఉన్న అర్చకుడు బైటకు వచ్చి శర్మకు నమస్కరించాడు.
శర్మ ఆయనకు ప్రతినమస్కారం చేస్తే, సుమతి వంగి కాళ్ళకు దండం పెట్టింది.
“సుపుత్రప్రాప్తిరస్తు” అన్నాడా అర్చకుడు.
శర్మ వైపుకు చూస్తూ “మా ఇంట్లోనే బస ఏర్పాటు చేసాను. కార్యక్రమం రేపటి నుండి మొదలుపెడదాం!” అన్నాడాయన.
“అలాగే!” అన్నాడు శర్మ.
మరో అరగంట గడిచాక గుడి వాకిలి వేసి, టార్చ్ లైట్ తీసుకుని ఆ అర్చకుడు ముందు నడుస్తుంటే శర్మ దంపతులు అనుసరించారు.
ఇల్లు చేరాక సాయం సంధ్య ముగించి, భోజనానికి కూర్చున్నప్పుడు మరుసటిరోజు జరుగబోయే కార్యక్రమం గురించి వివరాలు తెలిసాయి సుమతికి. అనేక జన్మల్లో కూడబెట్టబడిన పాపాల నివృత్తికి కోసం హోమం చేయాలని తన భర్త అనుకున్నట్టు, ఆ హోమాన్ని ఒక ఏకాంత పవిత్ర ప్రదేశంలో నిష్టాగరిష్టుడైన ఋత్వికుని చేత చేయించాలని సంకల్పించి ఇక్కడకు వచ్చినట్టు అర్థమైంది సుమతికి. ఆమె మనస్సు భర్త మనసులో మెదలుతున్న సద్భావంతో మమేకమైపోయింది.
ఆరుబైట కురుస్తున్న వెన్నల, సుమతి హృదయంలో భర్త పట్ల గల ఆరాధనా భావంలా ప్రకాశించసాగింది.
– – – – – –
మరుసటిరోజు ప్రొద్దున హోమానికై వస్తూ మెట్లెక్కుతున్న సుమతికి తంబూరల్ని మీటుతూ నిలబడివున్న ఆ పురుష విగ్రహాల్ని చూడగానే ఒళ్ళు గగుర్పొడిచింది. ఎక్కడో చూసినట్టు బలంగా అనిపిస్తున్నా గుర్తురావడం లేదు.
కేశవశర్మ, ఆ గుడి పూజారి హోమగుండం ముందు కూర్చుని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
నెయ్యి పడగానే ఎగసిన జ్వాలలు క్షణానికో రూపాన్ని దాలుస్తున్నాయి. ఒకసారి కాళిక నాలుకలా, మరోసారి త్రినేత్రుని త్రిదలనంలా, ఆ వెనువెంటనే రామబాణంలా, ఐరావతపు దంతాల్లా, మందారపువ్వులా….
ఆ అగ్నిశిఖల్నే చూస్తూ కూర్చున్న సుమతికి ఎక్కడికో, సుదూర తీరాల్లోకి జారిపోతున్నట్టుగా అనిపించసాగింది. సమిధల్ని వేస్తున్నప్పుడల్లా కమ్ముకుంటున్న ధూమంలో ఆమెకు దారి తెలిసీ తెలియనట్టుగా అగుపించసాగింది.
“ఏమౌతోంది? ఎందుకిలా అనిపిస్తోంది?”
మరునిముషంలో సుమతికి దివ్యదేహధారులైన ఇద్దరు వ్యక్తులు అమోఘమైన సంగీతాన్ని పాడుతూ కనిపించారు. మైమరపించే గమకాలతో, రాగతాళాలతో వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నారు. దగ్గరదగ్గరగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు సుమతికి వారు స్పష్టంగా కనబడుతున్నారు. ఒకరు మానవ శిరస్సుతో ఉంటే మరొకరు గుర్రపు తలతో ఉన్నారు. వారు ఇంకా దగ్గరగా వచ్చారు. ఘుమ్మని సువాసన వెదజల్లుతున్న పూలమాలలు వాళ్ళ కంఠసీమలో వేళ్ళాడుతున్నాయి. భుజాల నుండి నడుం వరకూ వెళ్ళాడుతున్న ఉత్తరీయాల అంచులు బంగారుతో కూడినవేమో తళతళమని మెరుస్తున్నాయి. రత్నపుటుంగరాలు పొదిగిన వాళ్ళ వేళ్ళు చకచకా కదులుతూ మీటుతున్నాయి…ఆ తంబూరల్ని.
తంబూరలు….తంబూరలు….
దివ్యపురుషులు వాయిస్తున్న గంభీరనాద ఘోషధారలు ఆ తంబూరలు. అలౌకిక సంగీత ఝురుల్ని కురిపిస్తున్న తంబూరలు. సర్వేశ్వరారాధనాభరితులైన గానగంధర్వుల చేతుల్లో అనన్యసామాన్య రాగాలాపనలు చేస్తున్న తంబూరలు. నాదోపాసనామార్గానురక్త, ముక్తాసక్త, అమలిన భక్తిసిక్త మానసులైన అమరగాయకుల అక్షరోచ్ఛారణా బధ్ధ సిధ్ధ సాధనా సంగీత తప్త తంబూరలు – దగ్గర దగ్గరగా వచ్చేస్తూ….విచ్చేస్తూ…తనలోకి ప్రవేశిస్తూ….
“సుమతీ!” అని బిగ్గరగా వినబడ్డ శర్మ అరుపుకు చటక్కున మేలుకుంది సుమతి.
“నిద్రపోతున్నావా?” – అనుమానంగా అడిగాడు శర్మ. అతని గొంతులో ఆశ్చర్యం వ్యక్తమౌతోంది.
“లేదండీ!” అంది సుమతి తడబాటుగా.
“ఐతే ఆ పరధ్యానమెందుకు? సమిధలు ఇంకొన్ని కావాలి. అర్చకుల వారింటికెళ్ళి తీసుకురావాలి…” అన్నాడు శర్మ.
“వెంటనే తీసుకొస్తాను.” అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి పరుగులాంటి నడకతో అర్చకుల ఇంటికి బయల్దేరింది సుమతి.
ఆమె వెళ్ళాక “మీ ఆవిడది ఏమరుపాటు! నిద్రకాదు!” అన్నాడు గుడి అర్చకుడైన త్ర్యయంబక ఉపాధ్యాయ.
’అవునా!’ అన్నట్టు నొసలు ముడివేసి చూసాడు శర్మ.
శర్మ చేసిన ఆ భావ వ్యక్తీకరణకు జవాబుగా నవ్వుతూ ’కొనసాగించ’మన్నట్టుగా సైగ చేసాడు ఉపాధ్యాయ.
– – – – – –
మొదటిరోజు కార్యక్రమం సక్రమంగా సాగడంతో కేశవశర్మ చాలా సంతోషంగా, సంతృప్తితో నిండిపోయాడు.
రాత్రి భోజనాలయ్యాక ఉపాధ్యాయ ఇంటి ముందున్న ఆరుబయల్లో కూర్చునివున్నారు సుమతి, శర్మలు.
పాలు నిండిన పాత్రలా ఆకాశం వుంటే, ఆ పాలపై తేలుతున్న బుడగల్లా నక్షత్రాలు వెలుగుతూ ఆరుతున్నాయి. ఆ బుడగల్ని ఊదుతున్న బుడుతడిలా నిండుజాబిల్లి చలాకీగా నవ్వుతున్నాడు.
నిశ్శబ్దానికి నిర్వచనంలా ఉంది ఆ వాతావరణం. మనసు పెట్టి వింటే వెన్నెల కురుస్తున్న చప్పుడు వినవచ్చునేమో!
“పొద్దున, హోమం దగ్గర ఏమిటా నిద్ర?” అన్నాడు శర్మ.
“అది నిద్ర కాదండి!”
“మరి?”
“ఓరకమైన మైమరుపు…ఏమరుపాటులాంటిది!” సంజాయిషీగా చెప్పింది సుమతి.
అర్థం కానట్టుగా ముఖం పెట్టి నవ్వాడు శర్మ.
సుమతికి కూడా ఆ అలౌకికానుభవాన్ని మామూలు మాటల్లో ఎలా చెప్పాలో తోచక నవ్వింది.
కాసేపు ఆగి – “ఏమండి! తంబూర అంటే ఏమిటి?” అని అడిగింది.
“ఏం! నా బుర్రను రామకీర్తన పాడించాలనుకున్నావా?” అన్నాడు శర్మ.
“అయ్యో! కాదండి. అక్కడ…గుడి మెట్ల దగ్గర తంబూరల్ని పట్టుకున్న రెండు విగ్రహాలున్నాయి కదా! వాటిల్ని చూసినప్పటి నుంచీ ఆలోచిస్తున్నాను…తంబూర అంటే ఏమిటీ అని!” అంది సుమతి.
“ఓహ్! అదా నీ మైమరుపుకు కారణం?” – ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు శర్మ.
అవునన్నట్టుగా తలూపింది సుమతి.
సుమతి కళ్ళలోకి చూసాడు శర్మ. అన్నేళ్ళుగా తనకు తెలియని మెరుపేదో ఆమె కళ్ళల్లో మెరుస్తున్నట్టు అనిపించింది అతనికి. ఆ మెరుపులో ఓ ఆకర్షణ….భౌతికమైనది కాదు…వెన్నెల్లా….ముత్యంలా…తామరాకుపైని నీటి బొట్టు చందంలా…అనిర్వచనీయమైనది.
ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోవాలన్నట్టుగా వెనక్కు వాలాడు శర్మ. రెండు కళ్ళూ మూసుకుని “తం బ్రూహి” అన్నాడు.
“ఏమన్నారు?” అంది సుమతి అర్థం కాక.
మూసుకున్న కళ్ళను తెరవకుండా “తంబూర అంటే తం బ్రూహి అన్న రెండు సంస్కృత పదాల కలయిక. తెలుగులో చెప్పుకుంటే ’అతనిని గురించి పలికేది’ అని..” అని ఆగాడు శర్మ.
“ఓహో!” అంది సుమతి, అర్థం కాని చిక్కు లెక్క కొద్దిగా అర్థం కాగానే ఊరడిల్లే విద్యార్థిలా.
“ఈ ’అతను’ – నేను, నీవు కాదు. వాడు…” అంటూ కుడి చేతిని ఆకాశానికేసి చూపాడు శర్మ.
“ఆ(….దేవుడి గురించి పలికేది తంబూరనా! అందుకేనా సంప్రదాయ సంగీతానికి అదే మూలాధారం?” అంది సుమతి.
అవునన్నట్టుగా తల పంకించాడు శర్మ. అతనింకా కళ్ళు మూసుకునేవున్నాడు.
“ఇది చాలా కొత్త విషయం. ఎప్పుడూ వినలేదు. కొద్దిగా వివరిస్తారా?” అని వినయంగా అంది సుమతి.
ఆమె అడగడమే తడవు అన్నట్టుగా కొనసాగించాడు శర్మ – “శరీర వీణ విద్య అన్నది గంధర్వులు చేసే సాధన. దేవలోక గాయకులైన ఆ దేవగంధర్వులు తమ శరీరాన్నే వీణగా భావించి, నాదోపాసనతో ముక్తి మార్గాన ప్రయాణిస్తారు. ఈ విద్యను ఉపాసించేవారు తమ శరీరాన్ని దండిగాను, నర-నాడుల్ని తంత్రులుగానూ భావించి, ప్రతి నరతంత్రినీ భగవంతుని నామోచ్ఛారణతో మీటి, వేదనాదాలతో శృతి చేసి, అతని లీలావిలాసాల్ని పలికిస్తారు. అదే తం బ్రూహి…అదే తంబూర!”
ఆ నీరంధ్ర నిశ్శబ్దంలో, ఆర్ద్రపూరితమైన శర్మ కంఠం నుండి వెలువడుతున్న ఒక్కో పదం మందరమై, షడ్జమమై, పంచకమై మోగుతున్నాయి. కపట మెరుగని ఓ స్త్రీ మనసు అనునాదమై, అనువాకమై, ఆ శీతల వాతావరణంలో నిరావరణమై భాసిస్తోంది.
దీర్ఘసమాధిలో ఉన్నట్టు మాట్లాడుతున్న శర్మ ముందుకు సాగాడు – “తంబూర పైభాగంలో తంత్రుల్ని బిగించేందుకు వుండే కీలులాంటిదే మన మేధస్సు. అనవసరపు ఆలోచనల్తో అది వదులైతే, సాధన శృతి తప్పుతుంది. అలాగని ఎక్కువగా బిగిస్తే, తెగిన తంత్రిలా విపరీత జ్ఞానంతో దారి తప్పుతుంది సాధన. మనిషికి అన్నింటిలోనూ, అన్ని సమయాల్లోనూ సమతూకం అవసరం. సుస్వరాల ఆలాపనకు తోడునిచ్చే తంబూరలాంటిదే భగవంతుని నామస్మరణ. అందుకనే మీటాలి….ఈ దేహాన్ని, మనస్సునీ, ఆలోచనల్నీ, అన్నింటినీ సమతూకంలో పెట్టి, స్మరణోపాసన అనే సుస్వరంతో శృతి చేసి మీటాలి. పలికించే వేళ్ళు ఆగేదాకా మీటుతూనే ఉండాలి. ఇదే తంబూర లోని సందేశం. ఇందుకే ప్రతి వాగ్గేయకారుడూ ’వేకువ జామున వెలయుచు తంబుర – చేకొని గుణముల చెలువొంద పాడుచు – శ్రీకరునికాశ్రిత చింతామణుని’ కంటూ తంబూర చేపట్టి మీటింది. తం బ్రూహి అని ఎలుగెత్తి చాటింది. ఎండిన కట్టెతో చేయబడిన తంబూరను జీవం నిండిన చెయ్యి పలికిస్తే మధురంగా పలుకుతుంది. జడమైన ఈ దేహంలో దేవదేవుని నామస్మరణ జీవాన్ని నిలుపుతుంది, నింపుతుంది, కడ దాకా సరైన దారిలో నడిపిస్తుంది. తం బ్రూహి…స్వామిన్…త్వమేవ పాహి!” అన్నాడు శర్మ.
మూసేవున్న అతని కళ్ళ నుండి కన్నీటి ధారలు సాగాయి.
అప్పటిదాకా మబ్బు చాటుకెళ్ళిన చంద్రుడు అప్పుడే తొంగి చూసాడు.
భూలోకంలోని ఓ భాగంలో, పర్ణశాలవంటి ఆ పల్లెటూరి ఇంటి ముందు ఉన్మత్త లౌకిక ప్రపంచానికి పట్టని విషయంలో తల్లీనత చెందిన ఆ దంపతుల్ని చూసి పులకించాడేమో వెన్నెల పోటెత్తింది. ఆ భక్తుడి కంటినీటి వెచ్చదనాన్ని చవిచూడడానికి తన వెలుగుల హస్తాన్ని చాచాడేమో, శర్మ కన్నీటిలోకి తెల్లటి వెన్నెల ప్రతిఫలించింది. అతని మౌనంలో దేవగంధర్వ గానం ప్రతిధ్వనించింది.
సుమతి చెయ్యి చాచి శర్మ చేయిని అందుకుని కళ్లకు అద్దుకుంది. లోకసీమాతివర్తనుడైవున్న తన భర్త చెయ్యి వణుకుతోంది.
భక్తిధునిలో అవ్యక్త భావనలతో ప్రకంపిస్తున్న ఆ చేయిలో శరీర వీణ విద్యానాదాన్ని లీలగా వింటున్నది సుమతి.
“తం బ్రూహి….స్వామిన్….త్వమేవ పాహి!” అని ఆమె కూడా మెల్లగా పలికింది.
– – – – – –
“మీ దయవుంటే సాధన అన్నది ఇంత సులభమా స్వామీ?” అని ప్రశ్నించింది సింధుకన్య.
“నీ దయకూడా నిక్కంగా అవసరమే కదా దేవీ!” అన్నాడు సింధుకన్యాపతి.
“ఎలా స్వామీ?”
“ప్రకృతికి నీవే నియామకురాలవు. నీవు దయతలచి తొలగిస్తేగా మాయాశక్తి నిరసించేది! సాధకులకు త్రోవ కనిపించేది!” అన్నాడు చిద్విలాసుడు చిరునవ్వుతో.
“మీరంటున్న నా శక్తికి బలం మీరే! ఇందుకేనా స్వామీ మీ మొదటి ఆటకాయ ఈశ్వరత్వపు గడిని అవలీలగా చేరింది!” అంది పృధ్వీతనయ.
“సందేహమెందుకు?” అన్నాడు భక్తమందారుడు.
“మీ సన్నిధిలో సందేహం లేదు స్వామీ, సమ్మోదం తప్ప! ఈ ఈశ్వరత్వము గడి గురించి ఉపదేశించండి!” అంది త్రిగుణమానిని.
“అనన్యమైన భక్తురాలివి, నీవు చెబితే వినాలనివుంది కమలజ!” అన్నాడు శ్రీహరి.
“అలాగే స్వామీ! ఈ అంటే లక్ష్మీదేవి. శం అంటే సుఖం. రం అంటే రమణత్వం. ఎవరైతే లక్ష్మీదేవికి తన రమణత్వం ద్వారా సుఖాన్ని కలిగిస్తున్నారో వారే ఈశ్వర శబ్దవాచ్యులు. జన్మరాహిత్యాన్ని సాధించిన వారికి మాత్రమే గోచరమయ్యేదే ఈ ఈశ్వరతత్వం. అటువంటు లక్ష్మీపతి తత్వాన్ని తెలియడమే సాధన. తెలిసిన తరువాత చేరేదే పరమపదం.” అని నమస్కరించింది పద్మదళనేత్రి.
“ఈశ్వరత్వం సిద్ధించే నూటాఇరవైయారవ గడిలో ఉన్న అక్షరం ’పా’. గీర్వాణభాషలో పాతీతి పా అని చెబుతారు. పాతి అంటే పతి అని, యజమాని అని అర్థం. పాతు అనే ధాతువు ప్రకారం రక్షకుడు అనే అర్థం వస్తుంది.” అన్నాడు ఏకోనారాయణుడు.
“సర్వ ప్రాణులకూ యజమాని, రక్షకులు ఐన ఈశ్వరులు మీరే! మీ తత్వచింతనలో మునిగి మీ మొదటి ఆటకాయ ధన్యమైంది!” అంది శ్రీరమణి.
“మరి నీ రెండో ఆటకాయను నడుపు. చూడాలని వుంది.” అన్నాడు శ్రీకరుడు.
“చిత్తం!” అంటూ అంబ పాచికల్ని వేస్తే అవి అమృతాన్ని పంచడానికి కదలిన మోహినీ కటిసీమలోని మణిమేఖలపు చిరుగజ్జెల్లా ఘల్లుమన్నాయి.
* * * * *
(సశేషం…)