గత భాగం: జగత్తుకే మాతాపితలైన లక్ష్మీనారాయణులు వైకుంఠంలో మొదలుపెట్టిన వైకుంఠపాళీ క్రీడ రెండు జంటల జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతోంది. సుమతి-కేశవశర్మలు నారాయణుని ఆటకాయలు కాగా, రంజని-అనంత్ లక్ష్మీదేవి నడిపే పావులయ్యారు. అనంత్ పనిచేస్తున్న కంపెనీ మూతబడ్డంతో ఆ దంపతుల మధ్య గొడవలొస్తాయి. పిల్లల్లేరన్న బాధతో సుమతి మనస్తాపం చెందితే, శర్మ ఓదార్చబోతాడు. |
తెల్లవారుజామునే ఇంటిపన్లలో మునిగిపోయిన సుమతిని చూసి, మాట్లాడించబోయిన శర్మ ఆగిపోయాడు. మౌనంగా పెరట్లోకెళ్ళి నాలుగు తుళసీదళాల్ని కోసుకొచ్చి, దేవుడి మండపం ముందు పెట్టి “స్నానానికెళ్తున్నాను” అన్నాడు. సుమతి మాట్లాడకుండా తల వూపింది.
స్నానం ముగించుకొచ్చి దేవతార్చనకు కూర్చున్నాడు శర్మ. అతనికి కావలసినవన్నింటినీ ఆలోపే సిద్ధం చేసేసింది సుమతి. పెళ్ళైన కొత్తల్లో భర్త పాటించే ఆచారాలేవీ తెలియని ఆవిడ రెండు నెలల్లోపే ఆ కర్మఠుని కఠిన నియమాలకు తనను తాను ఒదిగించుకునేసింది. తెలియనిదాన్ని కప్పిపుచ్చుకోకుండా అడిగి తెలుసుకునేది. ఒక్కసారి తెలుసుకున్నదాన్ని వీలైనంతగా గుర్తుపెట్టుకుని ఆచరించేది.“నీ పేరు సుమతి కాదు సుగుణ” అని తనెన్ని సార్లు అన్నాడో శర్మకే తెలియదు.
“నైవేద్యం!” అన్నాడు శర్మ.
ఇత్తడి పళ్ళెంలో అన్నం, పరమాన్నం, కొద్దిగా పప్పు, చారు వేసుకొచ్చింది సుమతి. ఆపై చెయ్యి కడుక్కుని చిన్ని చిన్ని వెండిపాత్రల్లో పాలు, పెరుగు, నీళ్ళు తీసుకొచ్చిపెట్టింది.
శర్మ నైవేద్యవిధిని నెరవేర్చాడు. మహామంగళారతి చేసాడు.
సుమతి హారతి కళ్ళకద్దుకుని అక్కడే నిలబడింది.
పూజ మొత్తం ముగించి, సాలగ్రామాలను, ప్రతిమల్ని జింకచర్మం చుట్టిన చెక్కపెట్టెలో పెట్టి, వాటిపై రెండు పూలు, తుళసీపత్రాన్ని పెట్టి మూసాడు. ఆ పెట్టెను ఓసారి తల మీద పెట్టుకుని మండపంలో ఎత్తైన పీట మీద పెట్టాడు.
శర్మ తీర్థాన్ని తీసుకున్న తర్వాత, అతని కాళ్ళకు దండం పెట్టి చెయ్యి చాచింది సుమతి. తీర్థాన్నిచ్చి, ఆమె చేతిలో చిటికెడు గంధం, పూలు వేసాడు.
“ఇప్పుడే వడ్డించనా? లేక…” ఆగిపోయింది సుమతి.
గడియారం వైపు చూసాడు. పదకొండు కావస్తోంది. ఏం చెప్పాలో తోచలేదు శర్మకు.
“పాలు తీసుకురానా? కాసేపాగి తిందురుగానీ!” అని అంది సుమతి. వంచిన తల ఎత్తకుండానే మాట్లాడుతోంది ఆవిడ.
నోటిమాటగా చెప్పక తలాడించాడు శర్మ. తలయెత్తని సుమతి, అతని మాటల కోసం వేచి చూస్తోంది.
శర్మ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తలెత్తింది సుమతి.
ఆవిడ కళ్లలోకి చూసాడు శర్మ. ఎప్పుడూ నిర్మలమైన మెరుపుతో కూడివుండే ఆ కళ్ళలో పల్చటి నీళ్ళ తెరలు. మెరుపుల్ని మూసేస్తూ…మాయంచేస్తూ.
ఎన్నడూ సుమతిని ఆవిధంగా చూడలేదు శర్మ. క్రితంరోజు జరిగిన ఘటనల్ని తల్చుకుని అదేపనిగా ఏడ్వడం, సాధించడమన్నది సుమతి చర్యల్లో ఏరోజూ కనబడలేదు. కానీ ఈరోజూ, ఇంతలా బాధపడుతుందంటే ఏదో బలమైన కారణమేవుండాలి అని అనుకున్నాడు.
పీట మీద కూర్చునే సుమతి చెయ్యి పట్టుకున్నాడు. ఆమాత్రం ఓదార్పుకే సుమతి గుండెల్లోని దుఃఖపు చెరువు కట్ట తెంచుకుంది. వెక్కిళ్లని అదుపుచేసుకోవడానికి అతిప్రయత్నం చేయసాగింది.
శర్మ సుమతిని కూర్చోమని చెప్పాడు. కూర్చున్నాక చుబుకం పట్టుకుని “ఏమిటిది సుమతీ? నన్ను చాలా భయపెడుతున్నావ్! ఏమైనా అనుకోనిది జరిగిందా? దేన్నైనా చూసి జడుసుకున్నావా? నాతో చెబితే పరిష్కారం వెదుకుతాను కదా? ఇలా బెంబేలెత్తిస్తే నాకెలావుంటుందో ఒక్కసారి ఆలోచించు! నిన్న రాత్రి నేనన్న మాటలకు ఇంత సాధించాలా? తప్పైతే క్షమించొచ్చుగా!” అన్నాడు.
“అయ్యొయ్యో! అలా అనకండి! మిమ్మల్ని భయపెట్టాలని కాదు. నిన్నేమైందంటే…” మళ్ళీ ఎగదన్నిన దుఃఖం, మాటల కడ్డు పడింది.
“ఏమైంది?” అన్నాడు శర్మ.
“నిన్న, మన ఎదురింటి వెంకాయమ్మ పిన్నిగారు నీకు ముప్పైయేళ్లు దాటిపోయాయిగా, ఇక పిల్లలేం పుడ్తారు? ఒకవేళ పుట్టిన చాలా బలహీనంగా పుడ్తారు. తొందరగా ఎవర్నైనా దత్తు తీసుకోండి అని అన్నారండీ!” అని మళ్ళీ సుడులు తిరుగుతున్న దుఃఖాన్ని ఏమాత్రం ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసింది సుమతి.
శర్మకు పరిస్థితి అర్థమైంది. నిన్నటి సుమతి ప్రశ్నలో ఆమెకు తగిలిన గాయం లోతేమిటో ఇప్పుడు అర్థమవసాగింది. సుమతి తలను తన భుజానికి ఆనించుకుని, చిన్నపిల్లను జోకొట్టినట్టు ఆమె వీపు మీద నెమ్మదిగా తట్టసాగాడు. అలా ఓ ఐదునిముషాల సేపు ఉండిపోయారా దంపతులు.
సుమతి కొద్దిగా తేరుకొని “ఏమండీ! మీరు ఇంకో పెళ్ళెందుకు చేసుకోరాదు?” అని అడిగింది సుమతి.
జోకొడుతున్న శర్మ చేతులు టక్కున ఆగిపోయాయి. సుమతి మళ్ళీ అడిగింది “నావల్ల మీరెందుకు సంతానం లేకుండా ఉండాలి? ఇంకో పెళ్ళి చేసుకోండి!” అంది.
శర్మ సుమతి తలను తన భుజం మీద నుండి తీసి, ఆమె రెండు చెంపల్నీ పట్టుకుని, కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు.
సుమతి బేలకళ్ళు భర్త కళ్ళలోకి చూడలేక అటు ఇటూ చాలా చంచలంగా తిరుగుతున్నాయి. “పిచ్చిదానా!” అని నవ్వాడు శర్మ – “ఇంకో పెళ్ళి చేసుకుంటే నాకు పిల్లలు పుడతారని నీకెందుకంత నమ్మకం?” నవ్వుతూనే అడిగాడు.
“పిల్లల్ని కనేది ఆడవాళ్ళేగా అందుకని” అంది సుమతి.
అది వ్యంగ్యమో లేక సుమతి అమాయకత్వమో అర్థం కాలేదు శర్మకు.
“నీకు వెర్రి ముదిరింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్. ఆ ఎదురింటి వెంకాయమ్మ అసలు పేరు వంకాయమ్మ. నీకు వంకాయంత వెర్రిని తాలింపు పెట్టి మరీ ఎక్కించింది.” – వాతావరణాన్ని తేలిక చేయడానికన్నట్టు మాట్లాడాడు శర్మ.
“నాలోనే లోపముందని వెంకాయమ్మగారన్నారు.” గొప్ప నిష్టుర సత్యాన్ని చెప్పేసాను వినుకో అన్నట్టుగా అంది సుమతి. ఆమె అంత గట్టిగా మాట్లాడ్డం అదే మొదటిసారి.
విషయం తీవ్రతను చూసిన శర్మ ముఖంలో నవ్వు మాయమయింది. సుమతి కేసి చూసి – “నీలో లోపముందా? మరి నాలో లేదా? నా గురించి వెంకాయమ్మగారు చెప్పలేదా?”
సుమతి ఏమీ మాట్లాడలేదు.
“ఏం మాట్లాడవ్? వెంకాయమ్మ గారో పెద్ద డాక్టర్ కదూ! ఈ వెధవ గురించి ఏమీ చెప్పలేదా అని అడుగుతున్నాను!” గద్దించినట్టు అడిగాడు శర్మ.
సుమతికి బెదురు పట్టుకుంది. ఆమె కూడా శర్మలోని గద్దింపు ధోరణని మొదటిసారిగా చూస్తోంది. పెళ్ళైన కొత్తల్లోనే కాదు, ఇప్పటికి కూడా తన నుంచి ఏ తప్పు జరిగినా కోప్పడకుండా సర్దుకుపోయే తత్వాన్నే చూసింది.
“చెప్పలేద”న్నట్టుగా తలను అడ్డంగా ఊపింది.
“చచ్చు వంకాయమ్మలతో మాట్లాడ్డం తగ్గించు. మనిద్దరం డాక్టర్ దగ్గరకు వెళ్దాం. లోపమెవరిదో అక్కడ తేల్తుంది. ఏం? సరేనా?” అదే గద్దింపు స్వరంతో హుంకరించాడు శర్మ.
ఏం చెప్పాలో తోచని సుమతి జోరుగా తలూపింది.
“ఇక వడ్డిస్తావా? లేక నేన్నీకు వడ్డించనా?” అంటూ పక్కనే ఉన్న విసనకర్రను చేతిలోకి తీసుకున్నాడు శర్మ.
వంటింట్లోకి పరుగుగెట్టింది సుమతి.
లోలోపలే నవ్వుకున్నాడు శర్మ.
*****
“మీ రెండో పావు వానరమయ్యింది స్వామీ!” అని అన్నది కమలప్రియ.
“వారేగా నిన్ను వెదికి, నాకు దక్కించింది!” అన్నాడు కమలాసనవంద్యుడు.
“మీ నోట ఆ చిన్ని కోతుల కథ వినాలని ఉంది. చెప్పరూ!” అని గారాబుగా అడిగింది జనక కుల పావని.
“మరి ఆట?” అన్నాడు శివధనుర్భంగధీరుడు.
“కాసేపు విరామం. ఆటకాయలు గడులు దాటి, దాటి అలసిపోయాయి.” నవ్వుతూ అన్నది ఊర్మిళాగ్రజ.
“ఐతే విను. హనుమ నిన్ను కనుగొన్న వార్త తెచ్చాక, సుగ్రీవుడు సమస్త వానరుల్నీ దండు కట్టాడు. ఆ సైన్యంలో హనుమ, సుగ్రీవ, అంగదాది భారీకాయులతో బాటు సింగిలీక లనబడే మరుగుజ్జు వానరులూ ఉన్నారు. వారు ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటారు. వారిని యుద్ధానికి తరలకుండా నేనే ఆపలేకపోయాను. అంతటి రామసేవాసక్తులు వారు. యుద్ధానికి వెళ్ళేముందు నేనొక ప్రతిజ్ఞ చేసాను. ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందినీ ప్రాణాలతో వెనక్కు తెస్తానని. రామ-రావణ యుద్ధం మహాఘోరంగా జరుగుతోంది. యుద్ధరంగంలోకి కుంభకర్ణు డొచ్చాడు. వాడు మా అందరికంటే భారీకాయుడు. ఆకాశమంత ఎత్తున్న రథమెక్కి వచ్చాడు. నేను వాడిని పడగొట్టాను. వాడు చచ్చి, నేలరాలుతున్న సమయంలో, వాడి రథానికి అలంకరించిన చిరుగంట ఒకటి తెగి నేలన పడింది. దాని క్రింద వెయ్యిమంది సింగిలీక కోతులు ఇరుక్కుపోయాయి. రావణుడూ చచ్చాడు. యుద్ధం ముగిసింది. నేను నిన్ను చేరేందుకు మునుపు నా ప్రతిజ్ఞ నిలుపుకోవడానికి గాను వానరసైన్యాన్ని లెక్కించమన్నారు. ఓ వెయ్యి సంఖ్య తక్కువస్తోంది. ఎన్నిసార్లు లెక్కించినా వెయ్యే తేడా! గణన చెయ్యడానికి నేనే వెళ్ళాను. ఒకవేళ యుద్ధరంగంలో ఎవరైనా గాయాల పాలై, బ్రతికేవున్నారేమోనన్న అనుమానం వచ్చింది. రక్తసిక్తమైన ఆ ఆహవరంగంలో ముందు హనుమంతుడు వెళ్తుండగా నేను, సుగ్రీవాదులూ వెళ్ళాం. విరిగిపడ్డ కుంభకర్ణుడి రథంకు కొద్దిదూరంలో పడివున్న గంట దగ్గర ఆగి హనుమను ఆ గంటను ఎత్తమన్నాను. తన తోకతో దాన్ని ఎత్తాడు హనుమ. ఆ గంట క్రింద, రామనామ జపంలో మునిగివున్న వెయ్యిమంది సింగిలీకులూ కనబడ్డారు. నా వెంటనున్న కపివీరులంతా జయజయధ్వానాలు చేసారు. ఆ జయఘోషకు ధ్యానభంగమై, కళ్లు తెరిచాయి ఆ చిన్ని కోతులు. ఆవిధంగా తక్కువ వస్తున్న వెయ్యి సంఖ్యను లెక్కలోకి వేయమని సుగ్రీవునికి చెప్పి ముందుకు కదిలాను.” అని ఆగాడు సింధుబంధనా దురంధరుడు.
“మీరెంత ఉదాత్తులు స్వామీ! ఆ సింగిలీకుల గుణగానమే చేసారు. దోషాన్ని దాచేసారు. భక్తవశంకరులంటే మీరే.” అన్నది సింధుకన్య.
“దోషమా? నా దృష్టిలో దోషాలేవీ లేవు దేవీ! అల్పజ్ఞానంతో చేసేవన్నీ సరిదిద్దుకోగల లోపాలే! పోనీ నువ్వే చెప్పు. తనయుల దోషాలను తల్లి ఎంచవచ్చులే!” అన్నాడా సింధుకన్యాపతి.
“గంటలో చిక్కుకున్న సింగిలీకలు, తమను ఎవరైనా రక్షిస్తారేమోనని ఎదురుచూసాయి. ఎంతకాలం గడిచినా ఎవ్వరూ గంటను ఎత్తలేదు, వాటిల్ని రక్షించలేదు. అప్పుడు అవి తమలో తాము మాట్లాడుకోసాగాయి. ఒక చిట్టి కోతి అంది ’చూసార్రా! ఈ మానవుల్ని నమ్మకండిరా అని ఆనాడే చెప్పాను. ఆ రాముడికి పెద్ద కోతులు కనబడతాయి గానీ మనలాంటి మరుగుజ్జులు కనబడ్తారా?’ అని అంది. మరో కుర్రకోతి ’రాముడి సంగతి వదిలెయ్యిరా! ఆ సుగ్రీవుడూ, ఆ హనుమంతుడూ మన రాజు-మంత్రులు కదా! వాళ్లకైనా మనం గుర్తుండాలి కదరా! యుద్ధానికేమో గుర్తున్నాం, ఇప్పుడు రక్షించాల్సివస్తే మనం కనబడం. తప్పంతా మన రాజు, మంత్రులదేరా’ అని అంది. మిగిలిన కోతులన్నీ ఆ ఇద్దరికీ వంత పాడాయి. ఓమూలగా ముడుచుకు కూర్చున్న ముసలి కోతి ఒకటి లేచి ’అబ్బాయిలూ! ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటారు! ఆ రాముడు ఆడిన మాట తప్పని వాడని నా నమ్మకం. పెద్దల మాట చద్దిమూట కదూ! అంచేత నేను చెప్పినట్టు చేసి చూడండి. నేటి నుంచీ అఖండ రామనామ జపం చేద్దాం. రాముడి కన్నా ఆయన పేరు గొప్పది. నా మాట నమ్మండి’ అన్నది. ఏ కళనున్నాయో లేక చేసేందుకు వేరే పనేమీ లేదనో మిగతా కోతులన్నీ ముసలి కోతి మాటల్ని ఒప్పుకుని రామనామస్మరణ మొదలెట్టాయి. ఏ ముహూర్తానికి అవి ముక్తిని పొందేంతగా మీ నామస్మరణపుణ్యాన్ని సంపాయించాయో, అదే సమయానికి మీ నీడయైన హనుమంతుడు గంట వద్దకు చేరుకున్నాడు. మీరు ఆనతినిచ్చారు. హనుమ దయవల్ల ఆ పొట్టికోతులకు గంట అడ్డంకితో బాటు అజ్ఞానమూ తొలగిపోయింది. తమ ఎదురుగా నిలబడ్డ మీ దివ్యమంగళరూపాన్ని చూసి, తాము ఆడిన చెప్పుడు మాటలు గుర్తుకువచ్చి, కళ్ళనీళ్ళతో మనసుల్ని ప్రక్షాళితం చేసుకున్నాయి. మీరు ఆదేశించినట్టుగా అనాటి నుండేగా అంజనాసుతుడు తన వాలంలో గంటను ధరించడం మొదలుపెట్టాడు!” అని ముగించింది నిత్యసుమంగళదేవత.
చిరునవ్వు నవ్వాడు సర్వలోకశుభంకరుడు.
మళ్లీ ఆట మొదలైంది.
తన వంతుగా పాచిక విసిరింది మహాలక్ష్మి.
*****
“ఇప్పుడేం చేస్తావ్?” టీ కప్పును సింక్ లో పడేస్తూ అడిగింది రంజని.
“ఇంకా ఆలోచించలేదు. ఐ నీడ్ సమ్ టైమ్!” అన్నాడు అనంత్.
“సమ్ టైమ్ ఓకే! కానీ హౌ మచ్ టైమ్ అని?” అడిగింది రంజని.
“అట్లీస్ట్ వన్ వీక్”
“ఆలోచించుకోవడానికే వారం రోజులా? ఆలోపు ఓ ఉద్యోగం సంపాదించుకోవచ్చు!” అసహంగా అంది రంజని. దాటవేసే ధోరణంటే ఆమెకు నచ్చదు.
“అవున్లే! మీ ఆడవాళ్ళకు ఉద్యోగాలు వారంలోనే దొరికిపోతాయేమో! మాకట్లా కాదులే. ఐనా నా ప్రాబ్లం గురించి నువ్వింత వర్రీ అవ్వాల్సిన పన్లేదు. నా పాట్లేవో నేనే పడతాను. యూ జస్ట్ రిలాక్స్ అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ జాబ్.” అన్నాడు అనంత్.
తమ మాటలు అర్థం లేని విధంగా సాగుతున్నట్టు అనిపించింది రంజనికి. ఆ విషయాన్ని అక్కడికే వదిలేసింది.
రెండు వారాలు గడచిపోయాయి. అనంత్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్నట్టు ఉంది. తనేం చేస్తున్నాడో రంజనికి తెలియనివ్వకుండా, గుంభనంగా ఉంటున్నాడు. రంజని కూడా గిరి గీసుకుని ఉండిపోయింది.
నెలరోజులూ గడిచిపోయాయి. అనంత్ దాదాపు ఇంటి పట్టునే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ రంజని ముఖప్రీతి కోసమన్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకుని బైటకెళ్ళి వస్తున్నాడు. అడపదడపా రంజని అడిగే ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానమిచ్చి తప్పించేసుకొంటున్నాడు. భర్త చేస్తున్నదేమిటో పూర్తిగా అర్థం కాని రంజని అనవసరపు గొడవలెందుకని మౌనంగా ఉండిపోసాగింది. రానురానూ ఇద్దరి మధ్యా ఏదో గోడ ఉన్నట్టుగా వాళ్ళకు అనిపించసాగింది. మొహాల్లో నవ్వులు తగ్గిపోయాయి. రంజని ఆఫీసులోనే తినేసి వచ్చేసేది. అనంత్ ఏం తింటున్నాడన్న విషయాన్ని కావాలనే పట్టించుకోవడం తగ్గించేసింది. ఒకట్రెండుసార్లు ఈ విషయంపై గొడవపడ్డాడు అనంత్. రంజని గొడ్డు మౌనాన్ని ప్రదర్శించింది. ఆ మౌనం అనంత్ ఈగోను మరింత దెబ్బకొట్టింది.
ఒకరోజు రంజని ఆఫీస్ కొలీగ్ నుండి అనంత్ కు ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆఫీస్ కు రమ్మని సారాంశం. అనంత్ కావాలనే నింపాదిగా వెళ్లాడు. రంజని టీమ్ మేనేజర్ ఆఫీస్ రిసెప్షన్లో వేచివున్నాడు. అతని మొహంలో చిరాకు, కోపం ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఏమాత్రం గౌరవం ధ్వనించని మాటల్తో హటాత్తుగా మూర్ఛపోయిన రంజనిని అర్జెంటుగా హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టు చెప్పాడు. హాస్పిటల్ చిరునామా ఇచ్చి త్వరగా అక్కడి కెళ్లమన్నాడా మేనేజర్. అనంత్ బయల్దేరబోతుండగా “ఆమెలో చాలా మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఐ హోప్ యూ నో ఇట్. ప్లీజ్ టేక్ ఎ గుడ్ కేరాఫ్ హర్.” అని చెప్పి, షేక్ హ్యాండ్ కూడా చెయ్యకుండా తన కేబిన్ తలుపు మూసేసాడు మేనేజర్.
తల కొట్టేసినట్టైంది అనంత్ కు. “అంటే వీడితో మన విషయాలన్నీ మాట్లాడేసినట్లుంది! లేకపోతే వీడెందుకు ఇంత లెవెల్ చూపిస్తున్నాడు? నాగురించి చెప్పేటప్పుడు నేనో ఐ.ఐ.టి. క్వాలిఫైడ్ ఇంజనీర్ నని చెప్పినట్టు లేదు. దీని సంగతి చూస్తా.” అని లోలోపలే పళ్ళు కొరుకుని అక్కడి నుంచి కదిలాడు అనంత్.
హాస్పిటల్ కు వచ్చి, రంజని ఎక్కడుందో కనుక్కునేసరికి పదిహేను నిముషాలపైనే పట్టింది. ఐ.సి.యు బైట కుర్చీలో కూర్చుని, డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికి రంజని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి నాలుగు గంటలపైనే ఐపోయింది. ఐనా అనంత్ లో ఎలాంటి ఉద్వేగమూ లేదు. భార్య ఎందుకలా హటాత్తుగా మూర్చపోయిందన్నదానిపై ఆలోచన కూడా చేయడం లేదు. అతని మనసంతా మేనేజర్ అన్న చివరి మాటల చుట్టూనే తిరుగుతోంది.
ఐ.సి.యు. వార్డ్ తలుపుల్ని తోసుకుంటూ ఓ లేడీ డాక్టర్ బైటకొచ్చింది. అనంత్ లేచి నిలబడ్డాడు. “అనంత్?” అని అడిగింది డాక్టర్. “యా! ఐ యామ్ అనంత్!” అన్నాడు.
షేక్ హ్యాండ్ ఇచ్చింది డాక్టర్ “ఇ యామ్ డాక్టర్ దీప్తి నారంగ్” అంది. “నైస్ మీటింగ్ యూ డాక్టర్!” అన్నాడు అనంత్ ముక్తసరిగా.
“రంజని, మీ భార్య, షీ ఈజ్ రెస్పాండిగ్ టు ద ట్రీట్మెంట్. కానీ వుయ్ కుడ్ నాట్ సేవ్ ద డే. అందువల్ల ఈరోజంతా ఆవిడ మా అబ్జర్వేషన్లో ఉంటే మేలు. నా కేబిన్ కు వెళ్ళి మాట్లాడుకుందాం. ప్లీజ్ వైట్ హియర్. ఇంకో పేషంట్ ను చూసేసి వస్తాను.” అని మళ్ళీ వార్డ్ లోకి వెళ్లిపోయింది డాక్టర్ దీప్తి.
అప్పటికి కూడా అనంత్ రంజని గురించి ఆలోచించడం లేదు. ఆ క్షణంలో అతను దేని గురించీ ఆలోచించడం లేదు. అతని హాస్పిటల్ వాతావరణం, ఆ వాసనలంటే ఎలర్జీ. అదోరకమైన భయం కూడా!
పది నిముషాలు గడిచాక డాక్టర్ దీప్తి ఐ.సి.యు నుంచి బైటకు వచ్చింది. అనంత్ ఆమె వెంటే కేబిన్లోకి వెళ్ళాడు.
“ఐయామ్ ఎక్స్ ట్రీమ్లీ సారీ ఫర్ ద లాస్ అనంత్! “ అంది డా. దీప్తి.
అర్థం కానట్టు చూసాడు అనంత్. ఆ అర్థంకానితనాన్ని పలికిస్తూ “డాక్టర్?” అన్నాడు.
ఏవో రిపోర్టుల్ని చూస్తున్న దీప్తి “రంజనికి అబార్షన్ అయింది. యూ షుడ్ బీ బ్రేవ్ నౌ. ఆవిడకు మీరే ధైర్యం చెప్పాలి.” అంది.
గుండెలో కలుక్కుమన్నట్టైంది అనంత్ కు. “అ..బా.ర్ష..న్…రంజనీకి!”. అనంత్ ఆ మాటల్నే మాటిమాటికీ అనుకోసాగాడు.
రిపోర్టుల్ని చూడ్డం ఐపోయినట్టుగా వాటిల్ని పక్కకు పెట్టి అనంత్ ముఖంలోకి చూస్తూ “మీ ఫీలింగ్స్ నాకర్థమౌతున్నాయి అనంత్. రంజనికి రెండో నెల నడుస్తున్నట్టుంది. ఈమధ్యకాలంలో ఆవిడ చాలా సైకలాజికల్ టెన్షన్స్ కు గురైనట్టుంది. ఆల్సో, ఆమె చాలా అండర్ నరిష్డ్ గా కనిపిస్తోంది. రంజని బాడీ ఇమ్యూనిటీ కూడా నాట్ గుడ్. ఐ థింక్ యూ వుడ్ బీ నోయింగ్ ఆల్ దీజ్ థింగ్స్. మీరు ఆవిడ తో కొద్దిగా ఎక్కువ టైం గడపాలి. నాకు తెల్సు, భార్యభర్తలిద్దరూ ఎంప్లాయీస్ ఐతే టైమ్ దొరకడం చాల కష్టమని. బట్, జస్ట్ మన కోసం బతికితే అది లైఫ్ కాదు. వుయ్ హావ్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ ఫర్ అదర్స్. మీరు కొద్దిరోజులు లీవ్ అప్లై చేసి రంజనితో ఉంటే బాగుంటుంది. అబార్షన్ వల్ల ఆమె హెల్త్ పై ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. కానీ సైకలాజికల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువుండొచ్చు. కాబట్టి యూ షుడ్ బీ వెరీ నైస్ టు హర్. యూ కెన్ సీ రంజని నౌ.” అని బజర్ నొక్కింది.
లోనికి వచ్చిన నర్స్ తో అనంత్ ను రంజని ఉన్న వార్డ్ కు తీసుకెళ్ళమని చెప్పింది. వాకిలి తీసి బైటికెళ్ళబోతున్న అనంత్ తో “అనంత్! మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలున్నా, వాటిల్ని మీరు మర్చిపోయి రంజనికి ఈ టైమ్ లో హెల్ప్ చేయాలి. ఓకే!” అంది డా. దీప్తి. “ఎస్! డాక్టర్!” అన్నాడు అనంత్.
నర్స్ వెనకే నడుస్తున్న అనంత్ మనసులో ఆలోచనల తుఫాను. “రంజని గర్భిణా? ఈ విషయాన్ని తన నుంచి ఎందుకు దాచింది? ఇప్పుడేం చెయ్యాలి? రంజనిని ఎలా పలకరించాలి?”
ఎనిమిది పడకలున్న ఐ.సి.యు ’బి’ వార్డది. ఐదు పడకలు ఖాళీగా ఉన్నాయి. రంజని కాక ఉన్న మరో ఇద్దరూ పెద్దవయసు మగవారు. ఆ ఇద్దరూ మంచినిద్రలో ఉన్నట్టున్నారు. రంజని మేలుకునేవుంది. నర్స్ రంజని బెడ్ దగ్గరకు వచ్చి సెలైన్ బాటిల్ను ఒకసారి చెక్ చేసి వెళ్ళిపోయింది.
బెడ్ పక్కనేవున్న ప్లాస్టిక్ చైర్లో కూర్చున్నాడు అనంత్. రంజని అతని వైపు ఒకసారి చూసి కళ్లు తిప్పేసుకుంది. అనంత్ తికమకలోనుంచి ఇంకా తేరుకోలేదు. ఒక్కమాట కూడా అతని నోట్లో నుండి రావడంలేదు. ప్రయత్నపూర్వకంగా రంజని కుడిచేతిని తాకాడు. ఆమె వేళ్లు సన్నగా వణుకుతున్నాయి. నెమ్మదిగా ఆ వేళ్ళను తన అరచేతిలో తీసుకుని కొద్దిగా వొత్తి పట్టుకున్నాడు.
రంజని కళ్ళు మూసుకుంటే, రెండువైపులా వెచ్చటి ప్రవాహాలు జలపాతాల్లా దూకాయి. అమితమైన తమితో మెత్తటి దిండు వాటిల్ని తనలో కలిపేసుకుంది.
అనంత్ రంజనిని నిర్వ్యాపారంగా చూస్తున్నాడు!
*****
మహాలక్ష్మి రెండో పావు పదిహేడో గడి చేరితే అక్కడే నక్కివున్న “రావణాసురుడు” అనే పాము ఆ కాయను మింగేసింది. జర్రున జారిన పావు “కుక్క” ను చేరుకొంది.
“రావణుడి దృష్టిలో పడ్డ నీ ఆటకాయ శునకమైపోయింది. దీనర్థమేమిటి?” అని అడిగాడు నిత్యతృప్తుడు.
“అహంకారం, మూర్ఖత్వం ఒకేసారి చెలరేగితే ఆవ్యక్తి పతనం నీచత్వానికి దారి తీస్తుంది ప్రభూ!” అంది నిత్యతృప్తుని సత్యప్రియభామిని.
“మరి దీనికి తరుణోపాయం?”
“కుక్కలోని గొప్ప గుణం విశ్వాసం. నీచజన్మ సంభవించినా మీ పట్ల మొక్కవోని విశ్వాసాన్ని ప్రదర్శించడమే తరుణోపాయం, మహాభాగా!” అన్నది లక్ష్మి.
నవ్వాడు నారాయణుడు.
“మీ పావుకు దిశానిర్దేశం చేయండి.” అన్నది ఆవిడ.
దిక్కుతోచని వారికి నేనే దిక్కు అన్న మాటల్ని ధ్వనిస్తున్నట్టుగా ఖణేల్మని పడ్డాయి పాచికలు.
*****
హాస్పిటల్ రిసెప్షన్లో కూర్చునువున్నారు కేశవశర్మ, సుమతి.
ఇద్దరూ వారివారి పరీక్షల్ని పూర్తిచేసుకున్నారు. ఫలితాలు రావడమే తరువాయి.
సుమతి ముఖంలో ఆత్రుత స్పష్టంగా కనబడుతోంది. శర్మ మాత్రం లోపలి ఆత్రుతని దైవస్మరణతో అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
“శర్మగారూ! రండి” అని పిలిచాడు డాక్టర్. ఇద్దరూ లోనికెళ్ళారు.
“శర్మగారూ! మీరిద్దరూ పర్ఫెక్ట్‘లీ ఆల్రైట్. ఇద్దరిలోనూ ఎలాంటి సమస్యా లేదు. బహుశా మీరు తీసుకొనే ఆహారం బలవర్ధకంగా లేనట్టుంది. కొద్దిగా దానిపై శ్రద్ధపెట్టండి. ముఖ్యంగా సుమతిగారు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మానసికమైన ఒత్తిళ్ళను దూరం పెట్టుకుని హాయిగా సంసారం చేసుకుంటే మీరు కంటున్న కల తప్పకుండా నిజమౌతుంది.” – అచ్చమైన తెలుగులో, హాయైన నవ్వును పెదాల మీద వెలిగించి చెప్పాడు డాక్టర్.
మెడికల్ రిపోర్టుల్ని తీసుకుని బైటకొచ్చారు శర్మ దంపతులు.
ఇంట్లోకి రాగానే, సుమతి భర్తను గట్టిగా కౌగిలించుకుంది. శర్మ కూడా ఆవిడని గట్టిగా పొదివిపట్టుకున్నాడు. “నీ అనుమానం తీరిందిగా! రేపే మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా!” అన్నాడు చిలిపిగా. సుమతి ఏం మాట్లాడలేదు. ఆవిడకు ఏదీ వినబడ్డం లేదు…ఒక్క అందమైన భవిష్యత్తు తప్ప.
*****
నారాయణుని రెండో పావు కదిలి “సుగుణము” అనే గడిని చేరుకుంది.
“సుగుణం సాలోక్యాని సోపానం!” అంది లక్ష్మి.
“భార్యాభర్తలిద్దరూ ఒకే ఆలోచనా తరంగాలపై విహరించడమే సాలోక్యం! అవునా దేవీ?”
“మీకు చెప్పేంతదానినా ప్రభూ!”
“మరి నీ మొదటిపావు సంగతేమిటో చూద్దాం. నడిపించు” అన్నాడు సర్వజీవప్రేరకుడు.
పాచికలను వేసింది ప్రకృతినియామకురాలు.
*****
(సశేషం…)