ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వైకుంఠపాళీ – నాల్గవ భాగం

Like-o-Meter
[Total: 1 Average: 5]

త భాగం  పిల్లల్లేరని పక్కింటామె వెక్కిరించడంతో బాధపడ్డ సుమతి తన భర్తను మరో పెళ్ళి చేసుకోమంటుంది. శర్మ సుమతిని సముదాయించుతాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇద్దరూ పరీక్షలు చేయించుకుంటారు. ఎలాంటి లోపమూ లేదని తెలుసుకున్న సుమతి చాలా సంతోషపడుతుంది. రంజని-అనంత్ ల మధ్య మెల్లగా భేదాభిప్రాయాలు మొదలౌతాయి. రంజని ఆఫీసులో స్పృహతప్పి పడిపోతుంది. ఆసుపత్రికి వెళ్ళిన అనంత్ కు రంజని గర్భవతి అని అప్పుడే తెలిసివస్తుంది. రంజనికి అబార్షన్ అవుతుంది.

 

రంజనిని ఇంటికి తీసుకువచ్చాక అనంత్ కొన్నిరోజుల పాటు ఆమెతో మాట్లాడలేక ఇబ్బందిపడ్డాడు. ఇంటికి వచ్చి వారం పైమాటే ఐనా ఇప్పటిదాకా రంజని ప్రెగ్నెన్సీ గురించి గానీ, దాన్ని దాచిపెట్టడం గురించీ ఒక్కమాట కూడా అనలేదు. అలాగని అనంత్ హటాత్తుగా ఋషిలా ఐపోలేదు. లోలోపలే కోపంతో ఉడికిపోతున్నాడు.

మొగుడన్న కనీస మర్యాద లేకుండా ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టిన రంజనిని చూసే కొద్దీ అతనిలో ప్రేమ స్థానంలో కోపం పుట్టుకొస్తోంది. రంజని ఇలాగే రహస్యాన్ని దాచిపెట్టివుంటే, కడుపు పెరిగి, ముందుకొచ్చేదాకా కూడా తనకు తెలిసేది కాదు. అలా తెలుసుకున్న తర్వాత తను ఓ వెర్రివాడే! తనను వెర్రివాడిగా చెయ్యడమేనా రంజని ఉద్దేశం? ఆమె తల్లిదండ్రుల్ని పిలుద్దామన్న తన సలహాను కూడా కొట్టిపారేసింది. అంటే నేను తనకు నౌకర్ననేగా? తలచుకునే కొద్దీ అతనిలో కఠినత్వం పెరిగిపోసాగింది.

రంజని ముడుచుకొని పడుకునుంది.

“ఏం? జ్యూస్ తాగవా! అక్కడపెట్టి గంటకావస్తోంది!” కోపంగా అడిగాడు అనంత్.

రంజని మాట్లాడలేదు.

అనంత్ బెడ్రూం బైటికెళ్ళిపోయాడు. అతని వెనకే ధడార్ మంటూ తలుపులు మూసుకున్నాయి.

రంజని కళ్ళు మూసుకుంది.

“అనంత్ కు చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేసాను. ఇప్పుడు చెబితే మీనింగ్ లెస్ అనిపిస్తుంది. కనీసం అతనైనా దీనిపై మాట్లాడితే చెబుదామంటే, అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు. ఓ గాడ్! ఒక్క క్షణంలో వచ్చే కోపంతో ఎన్నెన్ని కష్టాలు!”

ఆమె మనసులో ఎడతెగని ఆలోచనలు.

లేచి జ్యూస్ గ్లాస్ ను తీసుకుని నెమ్మదిగా తాగుతోంది. అప్పుడే లోపలికి వచ్చిన అనంత్ వాకిలి దగ్గరే నిలబడి చూడసాగాడు. అనంత్ ను చూడగానే రంజనిలో సారీ చెప్పాలన్న ఆత్రుత పెరిగిపోయింది.

“అనంత్! ఒక్కసాగి ఇలారా!” అంది.

అనంత్ వచ్చి కుర్చీలో కూర్చోబోయాడు.

“నా పక్కనే కూర్చో, ప్లీజ్!” అంది రంజని.

అనంత్ కూర్చోగానే, జ్యూస్ గ్లాస్ ను పక్కనపెట్టి అతని భుజం మీద తలపెట్టి ఏడ్వడం మొదలుపెట్టింది. అనంత్ కదలకుండా బిగుసుకు కూర్చున్నాడు.

“సారీ అనంత్! నా ప్రెగ్నెన్సీ విషయం నీకు చెప్పకుండా దాచిపెట్టాను. అప్పుడున్న సిచుయేషన్లో వెర్రికోపంతో అలా చేసాను. ప్లీజ్ ఫర్గివ్ మీ!”, వెక్కిళ్ళు అడ్డుపడుతుంటే అతికష్టం మీద వాక్యాన్ని పూర్తి చేసింది రంజని.

“సర్లే! ముగిసిపోయిన విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేసి ప్రయోజనం లేదు. టైమ్ కు తగ్గట్టు తిని, రెస్ట్ తీసుకో!” అన్నాడు అనంత్.

“నీకింకా కోపం తగ్గలేదు! నీ మాటల్లోనే తెలుస్తోంది. ప్లీజ్ అలా మాట్లాడకు!” అంది రంజని వేడుకోలుగా.

“ఓకే ఓకే! లంచ్ తీసుకొచ్చాను. తింటావా?” వీలైనంత మెత్తదనాన్ని పలికిస్తూ అడిగాడు అనంత్.

సరేనన్నట్టు తలనూపింది రంజని “నువ్వూ నాతోటే తినాలి!” అంది.

రంజనీని ఇమిటేట్ చేస్తున్నట్టు అనంత్ కూడా తలూపుతూ “నీతో పాటే తింతాను…ఆకలి తీరకపోతే నిన్నూ తింతాను…సలేనా?” అన్నాడు. భర్త క్రాఫ్ పై చెయ్యి వేసి చిందరవందర చేసింది రంజని.

భోజనమయ్యాక, అనంత్ పక్కనే ఒదిగి పడుకుంది రంజని. అనంత్ లో ఉన్నట్టుండి ఆమెపై అవ్యాజ ప్రేమ పుట్టుకొచ్చింది. రంజని ముంగురులని చూపుడువేలితో రాస్తూ ఉండిపోయాడు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

 *****

“రావణుడు మింగిన ఆటకాయ, కుక్కను చేరి, ఇప్పుడు సెలయేరయింది. దీనర్థమేమిటి దేవి?” అడిగాడు సర్వజ్ఞ శేఖరుడు.

“ప్రభూ! అహంకారం నీచత్వానికి దిగజార్చినా, మీ కరుణాదృష్టి అనే కుంభవృష్టిలో తడిసిన మానవహృదయం ఆ కరుణరసాన్ని పిల్లకాలువ రూపంలో మోయగలదేగానీ సముద్రంలా జీర్ణించుకోలేదు.” అంది శాంతిస్వరూపిణి.

“మరి నీ ఆకతాయి ఆటకాయ శాంతత్వాన్ని పొందుతుందా?”

“మీ దృష్టి పడిన తర్వాత పొందకపోతుందా శ్రీమాన్!”

“ఒక్కొక్కసారి, మానవుల బుద్ధిబలం కన్నా పక్కవారి సౌశీల్యం వారిని కాపాడుతుంది. నా మొదటి కాయను కదుపుతాను. ఏమౌతుందో చూద్దాం!” అన్నాడు ఉత్తుంగబదరీశిఖరవాసుడు.

“నమోన్నమః” అన్నది మందాకినీమాత.

ధ్వనిర్వినిర్ముక్త వేదాక్షర క్వణంలా నినదించాయి నారాయణుని చేత పాచికలు.

 

*****

దాదాపు పదిహేనురోజుల తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చింది రంజని.

మొట్టమొదటగా దేవుడి గుడి కెళ్ళాలనిపించింది. దగ్గర్లోనున్న వేంకటేశ్వరస్వామి గుడికి తెల్లవారుజామునే వచ్చింది. ఇంటర్వ్యూ వుందని ఇంట్లోనే ఆగిపోయాడు అనంత్.

అదో పురాతనకాలపు గుడి. పెద్దగా ప్రసిద్ధిలేదు. తామిద్దరూ ఆ ఊరికి వచ్చిన కొత్తల్లో ఒక్కసారి వచ్చారు. ఆమాటకు నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఆ తర్వాత ఉద్యోగాలు, అక్కడి సవాళ్ళు, ప్రమోషన్లు, ఇల్లు కొనుక్కోవడం వంటి వాటిల్లో పడిపోయి గుళ్లకు వెళ్లడం అరుదైపోయింది.

అనంత్ ఒక అగ్నోటిస్ట్. దేవుడున్నాడని గానీ లేడని గానీ వాదించడు. ఇంట్లో పూజలు చేసినప్పుడు దండం పెడతాడు. చెయ్యనిరోజున పెట్టడు. తనేమో దేవుణ్ణి నమ్ముతుంది. దుర్గాదేవి అంటే చాలా ఇష్టం. రోజూ బెజవాడ కనకదుర్గ పటానికి దండంపెట్టుకుంటుంది. కానీ ప్రతిరోజో, ప్రతివారమో గుడికెళ్ళాలన్న నియమం పెట్టుకోలేదు. పండుగలప్పుడు తనకు వెళ్ళాలనివున్నా అనంత్ మూడ్ ను బట్టి తనూ సర్దుకునేది.

“ఇన్నేళ్ళకు మళ్ళీ గుడిలోకి కాలుపెట్టడం జరిగింది. ఇకనైనా ప్రతి శనివారం ఈ గుడికి రావాలి.” అని అనుకుంది రంజని.

గుడిగంటను ఎవరో మోగించారు. ఆ శబ్దానికి ధ్వజస్థంభం పైనున్న పావురాళ్ళు తపతపా సవ్వడి చేసుకుంటూ ఎగిరాయి.

గర్భగుడి వద్దకు వెళ్లి, ఇద్దరి పేరునా అర్చన చేయించుకుంది రంజని. అర్చకుడు ఇచ్చిన ప్రసాదాన్ని బ్యాగ్ లో వేసుకుని ప్రధానాలయం మెట్లు దిగుతూ వస్తుంటే ఎక్కడినుంచో సన్నగా, సుశ్రావ్యంగా వేదనాదం వినిపించసాగింది.

చల్లటి వాతావరణం. స్తబ్దుగా ఉన్న పరిసరాలు. ఆ వేదస్వరం. సుస్పష్టమూ, సుశ్రావ్యమూ ఐన ఆ గాత్రం.

రంజని ఒళ్ళెందుకో ఒక్కసారి ఝల్లుమంది.

అది భయంవల్ల కలిగింది కాదు. ఊహించని విలువైన వస్తువు అనుకోకుండా దొరికినప్పుడు కలిగే జలదరింపు. మరీమరీ కోరుకునే సుఖం అసంకల్పితంగా లభించినపుడు మనసు చేసే కేరింతల వెల్లువ.

ప్రధానాలయం మెట్ల ప్రక్కనేవున్న పచ్చిక బయల్లో కాసేపు కూర్చుందామనిపించింది రంజనికి.

మార్గశీర్షపు తెల్లవారి లేత ఎండకు, చలిగాలి తోడై విచిత్రమైన ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఎండ, తాపాన్ని కలిగిస్తే చలిగాలి చల్లారుస్తోంది. సంసారబాధలకు వేడెక్కిన ఆత్మ, చల్లని దైవసాన్నిధ్యంలో సేద తీరుతోంది.

సన్నగా వినవస్తోన్న వేదఘోషకు అర్థం తెలియకపోయినా ఆ లయలో, ఆ ఆలయంలో, బాధలన్నీ లయమౌతుంటే సమస్యల వలయం విడిపోతున్న భావం కలుగుతోంది. అర్థం కానివన్నీ వ్యర్థం కావన్న కొత్తవిజ్ఞానం కళ్ళువిప్పుతోంది.

నిటారుగా నిలబడివున్న ధ్వజస్థంభం ఆకాశాన్ని మోస్తున్న మొనగాడి భుజస్థంభంలావుంది.

గాలిలో తేలివస్తున్న సుదూర భక్తుల విజ్ఞాపనల్ని గోపుర కళశం సాదరంగా స్వీకరిస్తోంది.

మౌనమ్ చైవాస్మి గుహ్యానాం” అన్న గీతాచార్యుని పలుకులా గర్భగుడిలోని దైవం నిశ్శబ్దంగా తన పనేదో చేసుకుపోతోంది. పూజారి గంట వాయించినా, మంత్రం చదివినా ఆ మూలవిరాట్టు తదేకమౌనం చెదరడం లేదు.

ఆ సనాతన మౌనాన్ని తమ లోనికి ఆహ్వానించేవారి కోసం ఎదురుచూస్తున్నది గర్భగుడి గడప.

పుష్కరిణిలో బద్దలవుతున్న నీటి బుడగలు జీవితసత్యాన్ని బోధిస్తున్నాయి. తేలుతున్న పండుటాకులు కర్తవ్యబోధ చేస్తున్నాయి. ఆహారంకై నిలువకుండా తిరుగుతున్న చేపలు మానవులు దిద్దుకోవల్సిన విషయాల్ని విశదపరుస్తున్నాయి.

“ప్రసాదం తీసుకొంటారా?”

రంజని ఏకాగ్రమౌనం చెదిరింది, ఆ మాటల్తో.

తలెత్తి చూసిన రంజని. ఎదురుగా చక్కటి సాంప్రదాయపు కట్టుబొట్టుతోవున్న ఓ స్త్రీ. అప్రయత్నంగా అరిచేతుల్ని ఒక్కటిగా చేర్చి దోసిలి పట్టింది. ఆమె నవ్వుతూ అరిటాకులో వున్న పొంగలిని ఆ దోసిలిలో వేసింది.

“కూర్చోండి!” అంది రంజని, ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటూ. ఆవిడ కూర్చుంది. రంజని మరోమారు ఆవిడవైపు చూసింది.

భుజాల నిండుగా కప్పుకున్న చీర చెరుగు. నుదుటన దీపపు జ్యోతిలా కుంకుమ బొట్టు, నిలువుగా మెరుస్తోంది. చెంపలకు అంటుకుని పచ్చగా కనబడుతున్న పసుపుచారలు. భుజాలమీదనుంచి కప్పుకున్న చెరుగులోనుంచి లీలగా కనబడుతున్న మాంగల్యం. అన్నిటికీ మించి ఆ కళ్ళలోనున్న నిర్మలమైన భావం రంజనిని ఆకట్టుకుంది. “ముత్తైదువంటే ఇలా ఉండాలి!” అని అనుకుంది రంజని.

“మీరు కూడా ప్రసాదం తీసుకునేవుంటారు. కానీ దేవుని ప్రసాదాన్ని ఒకరికి పంచిరావాలని మావారు చెప్పారు. ఈరోజు మీరే మొదటగా కనబడ్డారు.” అంది ఆవిడ.

“నా అదృష్టం” అంది రంజని.

కొద్దిసేపు ఇద్దరి మధ్యా మౌనం. ఆవిడేదో చెప్పుకుంటున్నట్టుగా పెదవుల్ని మెల్లిగా కదిలిస్తోంది.

రంజని ఆ మౌనాన్ని, ఆ ముత్తైదువ ఉపస్థితిని ఎంతగానో ఆస్వాదిస్తోంది. “ఎందుకో ఇంత ఎంజాయ్మెంట్?” అని తనని తాను మాటిమాటికీ ప్రశ్నించుకుంటోంది కూడా.

దైవస్తుతి చెప్పుకోవడం ముగిసినట్లుగా ఆ ముత్తైదువ రెండు చేతుల్నీ జోడించి, గుడివైపు చూస్తూ నమస్కారం చేసింది. ఆ తర్వాత తలత్రిప్పి రంజని వైపు చూసి నవ్వి “ప్రసాదం తీసుకోండి!”

మాట్లాడే అవకాశం కోసమే కాచుకున్నట్లుగా “ఇంతకీ ప్రసాదమంటే ఏమిటండి? సారీ, తమాషా కోసం అడగడంలేదు. ఆ పదానికి ఎగ్జాట్ మీనింగ్ తెలీదు. తెలుసుకోవలనే ఇంట్రెస్టుతో అడుగుతున్నాను. తప్పుగా అనుకోకండీ.” అని అంది రంజని.

“అయ్యో! తమాషాకై అడిగినా మనకు తెలిసినంతలో సమాధానమివ్వాలని చెప్పారు మావారు. “ అంది ఆవిడ.

“దట్స్ వెరీ నైస్. ప్లీజ్…చెప్పండి.” అంది రంజని.

“మానవులు కడుపు నింపుకోవాలంటే పళ్ళు, ఆకుకూరలు, ధాన్యాలు మొదలైనవాటినే తీసుకోవాలికదండీ. ఆ పళ్ళచెట్లు, పంటలు అన్నీ జీవులేనట. అంటే అవి కూడా మనలాగే ప్రాణమున్నవే. మనం కడుపు నింపుకునే నిమిత్తం వాటిల్ని కోసి, నలిపి, పిండి చేసి హింస కలిగిస్తాం కదా. అవన్నీ కూడా పాపాలేనంట. కానీ అవి మనం తప్పనిసరై చేసే హింస. అందుకని మనం తెచ్చుకున్న పళ్ళు, వండుకున్న పదార్థాలనూ దేవునికి నైవేద్యం పెడితే, దేవుడు ఆ పదార్థాలలో ఉన్న జీవులందరికీ కలిగిన బాధను పోగొడ్తాడంట. అలాగే మనం చేసిన హింసను కూడా పుణ్యంగా మార్చేస్తాడంట. దాన్నే ప్రసాదం అంటారు. ప్రసాదమంటే ప్రశాంతిని కలిగించేది, శుభాన్ని కలిగించేది, ఉపశమనం కలిగించేది…ఇలా చాలా అర్థాలున్నాయి. మావారికి అన్ని అర్థాలు తెలుసు. నాకు ఇన్నే గుర్తున్నాయి.” అంది ఆవిడ.

రంజని విశాలంగా నవ్వింది.

“అయ్యో! మీకు అర్థం కాలేదనుకుంటా. మావారైతే చాలా చక్కగా చెబుతారు. నాకు అలా చెప్పడం చేతకాదు. నిజానికి ఆయన ఎన్నో చెబుతారు. కానీ నాకే పూర్తిగా గుర్తుండవు.” అంది ఆ ముత్తైదువ.

అందుకు రంజని – “మీరు కూడా చాలా బాగా చెప్పారు. ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా లేకుండా ప్యూర్ తెలుగు మాటలు. చాలా బాగున్నాయి. మీ పేరు?”

“సుమతి.”

“నా పేరు రంజని.”

“రంజని అంటే ఆకర్షణీయమైనది, రమణీయమైనది అని అర్థం. మీకు సరిగ్గా సరిపోయే పేరు పెట్టారు.” అంది సుమతి.

రంజని తన పేరుకు గల అర్థం గురించి ఏనాడూ ఆలోచించనేలేదు. నిజానికి రంజని చాలా అందంగా ఉంటుంది. కాలేజ్ బ్యూటీ అని పేరుపొందింది కూడా! స్నేహితులు బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొనమని తెగ బలవంతం చేసినా, తనకు నచ్చక మానేసింది. ఇప్పుడు తన పేరుకు ఇంత అందమైన అర్థముందని తెలుసుకుని చాలా సంతోషపడింది.

“థాంక్స్ సుమతిగారు! నా పేరుకు ఇంత గొప్ప మీనింగ్ ఉందని నాకే తెలీదు. అసలు మా అమ్మానాన్నకి కూడా తెలిసుండదు. బేబీ నేమ్స్ బుక్ లో చూసి పెట్టారు. ఫన్నీ పార్ట్ ఏంటంటే నాకు నా పేరుకు అర్థం తెలియకపోయినా మీ పేరుకు అర్థం బాగా తెలుసు!” అని పకపకా నవ్వింది.

సుమతి కూడా నిశ్శబ్దంగా నవ్వింది.

“ఇంతకు ముందు, మీరు మంత్రాలేవో చదివారు కదా! వాటిల్ని గట్టిగా చెప్పలేదు ఎందుకు?” మళ్ళీ ప్రశ్నించింది రంజని.

“అదా! మంత్రమైనా లేదా ఎలాంటి ప్రార్థననైనా మౌనంగా చెప్పుకుంటే ఉత్తమఫలం. కొద్దిగా వినబడేట్టు చెప్పుకుంటే మధ్యమ ఫలం. బిగ్గరగా చెబితే అధమఫలం. పెదవుల్ని మెల్లగా కదిలిస్తూ చెప్పుకున్నా అది మౌనంలోకే వస్తుందట. మావారు చెప్పారు.” అంది సుమతి.

“వెరీ నైస్ ఇన్ఫో! చక్కని విషయాలు చెప్పారు. మీకు చాలా తెలుసండీ” అంది రంజని.

సుమతిలో నిజాయితీతో కలిసిపోయిన అమాయకత్వాన్ని చూస్తుంటే రంజనికి తెగ ముచ్చటేస్తోంది.

“మీరు బయల్దేరాలేమో!” అంది రంజని.

“మావారితో బాటూ వచ్చాను. ఆయన దగ్గర్లోనే పని మీద వెళ్ళారు. వచ్చి తీసుకెళ్తారు. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను.” అంది సుమతి.

“ఓహ్! వండర్ఫుల్! నాకూ ఇంట్లో పనేమీ లేదు. మీవారు వచ్చేంత వరకూ మీకు కంపెనీ ఇస్తాను. నాకు మాటలెక్కువ. కాలేజ్ లో సుత్తి రంజని అని పిల్చేవాళ్ళు. బట్, ఈరోజు సుత్తి కొట్టను. మీరు ఏం చెబితే అది వింటానని హామీ ఇస్తున్నాను.” అంది రంజని ఉల్లాసంగా. తెలియని దగ్గరితనమేదో ఆమెను సుమతితో స్వేచ్ఛగా మాట్లాడింపజేస్తోంది. సుమతి మాటల్లోని సాదరభావం రంజనిలోని మొహమాటాన్ని మటుమాయం చేసింది.

సుమతి మళ్ళీ నిశ్శబ్దంగా నవ్వింది.

మాటలు కొనసాగించాలన్న తపనతో మరో ప్రశ్నను సంధించింది రంజని. “మీకెంతమంది పిల్లలు?”

సుమతి పెదవులపై నవ్వు నెమ్మదిగా మందగించింది. “ఇంకా లేదు.” అంది, దాదాపు గొణుక్కున్నట్టు.

“సారీ! సారీ అండి!” రంజని తప్పుచేసినట్లు.

“మీరడిగింది నా మనసుకు కష్టమైన విషయమే! కానీ తన సాన్నిధ్యంలో మీ నోట పిల్లల గురించి ఆ దేవుడు అడిగించాడంటే….త్వరలో మంచే జరగబోతుంది.” విశ్వాసం నిండిన గొంతుతో పలికింది సుమతి.

రంజని తల వంచుకుని, నిస్సారంగా నవ్వి “దేవుడే ఉంటే మంచివారికి కష్టాలనిస్తాడా?” అంది.

“ఆశ్చర్యం! సరిగ్గా ఇరవైరోజుల క్రితం నేనూ ఇవే మాటలు మావారితో అన్నాను….”

సుమతి మాటలకు తలెత్తి చూసింది రంజని.

“అవునండి. పోయిన నెలలో మాకు పెళ్ళై పన్నెండేళ్ళు నిండాయి. ఆరోజున, పిల్లలేరని ఎదురింటి పిన్నిగారు ఏమేమో అన్నారు. ఆ బాధతో మావారిని చాలా నిష్టూరాలాడాను.”

“ఓహ్! తర్వాత?”

“మావారు నన్ను చాలా సమాధానపర్చారు. ఎన్నెన్నో పురాణ కథలు చెప్పారు. రెండువారాల క్రితం ఆసుపత్రిలో పరీక్షలు కూడా చేయించుకొన్నాం. ఇద్దరిలోనూ ఎలాంటి లోపమూ లేదని డాక్టర్ చెప్పారు. నాకోసమని నా నిష్టూరాల్ని భరించి ఇన్ని చేసారాయన.” చివరి వాక్యం పలికినపుడు సుమతి గొంతులో భర్త పట్ల గల ఆరాధనా, అభిమానం స్పష్టంగా పలికాయి.

“సో నైస్! మీరన్నది వింటుంటే ఫైరీ టేల్ వింటున్నట్టుంది.” అంది రంజని.

“ఫేర్ టెల్ అంటే?” అర్థం కానట్టు అడిగింది సుమతి.

రంజనికి ఫెయిరీకి తెలుగుపదం తట్టలేదు దాంతో “ఫెయిరీ టేల్…అంటే….అంటే…దేవతల కథ” టక్కున చెప్పేసింది.

సుమతి మెల్లగా నవ్వి “ఓ! ఫెయిరీ టేలా… నేను పెద్దగా చదువుకోలేదు. మీ ఇంగ్లీషు ఉచ్ఛారణ కొద్దిగా కష్టంగా ఉంది నాకు.”

“మీ అంత సులభంగా అచ్చమైన తెలుగును మాట్లాడలేను. బట్, మీరు నా తెంగ్లీషును బాగా అర్థం చేసుకుంటున్నారు. సో, మీరే గ్రేట్. మీ భర్తగారు ఇంకా గ్రేట్. మీ ఇద్దరి కాంబినేషన్ రియల్లీ డివైన్. మీకు పిల్లలు కలగకపోవడమేంటి. జస్ట్ సరైన టైమ్ కోసం వెయిట్ చేయాలి. మీరిద్దరూ చాలా ఆప్టిమిస్టుల్లా కనబడుతున్నారు. గాడ్ విల్ ఆల్వేస్ సపోర్ట్ ఆప్టిమిస్ట్స్.” ఆవేశంగా మాట్లాడింది రంజని.

“అవును. తన సన్నిధిలో మీతో పిల్లల గురించి అడిగించాడు భగవంతుడు. మీ మాటలతో ఏమూలో నాలో ఉన్న నిరాశ పోయినట్టుగా అనిపిస్తోంది. ” చివరి వాక్యం పలుకుతున్నప్పుడు సుమతి కళ్ళలోనూ, గొంతులోనూ తొణికిసలాడిన భావాన్ని చూసిన రంజనికి స్వచ్ఛత అంటే ఏమిటో అర్థమైనట్టు అనిపించింది.

“మీరు చాలా లక్కీ సుమతిగారు! మీ భయాల్ని పోగొడుతూ, మంచి మంచి విషయాల్ని చెప్పే భర్త దొరకడం మీరు చేసుకున్న పుణ్యం.” స్వచ్ఛమైన మనసుతో అన్నది రంజని. “ఇఫ్ యూ డోంట్ మైండ్ సుమతిగారు! మిమ్మల్ని ఓదారుస్తూ మీవారేం చెప్పారో తెలుసుకోవాలనివుంది.”

“అయ్యో! చెబుతాను. నేను ఏడ్చి, గోలపెడుతుంటే మావారన్నారు – పిచ్చిదానా! కుంతి కంటే ముందే తనకు పిల్లలు పుట్టాలని ఆశ పడ్డ గాంధారికి నూరుమంది దుష్టులు పుట్టారు. దేవకీదేవి కడుపున పుట్టిన ఆరుమందిని ఆమె అన్ననే చంపాడు. కానీ యశోద వద్దకు నారాయణుడు తానే స్వయంగా వచ్చి తన బాలలీలన్నీ చూపించి మురిపించాడు. నేనే దేవుడినని విర్రవీగిన హిరణ్యకశిపుడి కడుపున పరమవిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు. అతని కడుపున తాతను మించిన క్రూరుడైన విరోచనుడు పుట్టాడు. కానీ విరోచనుడి కడుపున ప్రహ్లాదుడి లాంటి భాగవతోత్తముడైన బలిచక్రవర్తి పుట్టాడు. మృకండ మహర్షి ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు అనుగ్రహించింది అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి. కనుకనే పిల్లల్ని కంటాం గానీ వాళ్ళ తలరాతల్ని కంటామా అనే సామెత పుట్టింది. పిల్లలు కావాలనుకోవడం మన ఆశ. కానీ మంచివాళ్ళు, సంఘానికి మేలు చేసేవాళ్ళు బిడ్డలుగా కావాలనుకోవడం తపస్సు. ఆశ త్వరగా తీరుతుందేమోగానీ తపస్సు అంత తొందరగా నెరవేరదు. కంచం ముందు కూర్చోగానే అన్నం వచ్చి పడదు కదా! కాబట్టి ఓపిక పట్టాలని చెప్పారు.” అంది సుమతి.

“వెల్ సెడ్…ఎక్సలెంట్…” అని చప్పట్లు కొట్టింది సుమతి. “నో డౌట్ సుమతిగారు!  మీరు, వన్ ఆఫ్ ద లక్కియెస్ట్ వుమెన్. మీ హజ్బెండ్ గారు రియల్లీ వండర్ఫుల్ పర్సన్.” చప్పట్లు కొడుతూనే అంది రంజని. “ఇంకా ఏం ఏం చెప్పారు? ముఖ్యంగా మంచి ఇన్స్పిరేషనల్ విషయాలుంటే చెప్పండి.” – అల పుట్టే క్షణంలో సముద్రంలో ఉండే ఉత్సాహం ఇప్పుడు ఆమెలోనూ ఉవ్వెత్తున ఉంది.

“మీరు కొత్తతరం వాళ్ళు. మావన్నీ ఛాదస్తాలుగా అనిపిస్తాయేమో?” అంది సుమతి.

“నా వయసు ఇరవై ఐదు. మీకు ఓ ఇరవై ఏడు-ముప్ఫై ఉంటాయా?” – రంజని లోని అల వేగం పుంజుకొంటోంది. ఆ వేగం ఆమె మాటల్లో దూకుడుగా మారుతోంది. లోకంలో అరుదుగా ఎదురుపడే నిక్కమైన అమాయకత్వం ఆమె ఎదురుగా ఉండి, గురుత్వాకర్షణలా పనిచేస్తోంది.

“నాకు ముప్ఫై రెండేళ్ళు.” అంది సుమతి.

“మీరు నాకన్నా ఏడేళ్ళు సీనియరా! ఐతే మీరు నన్ను మీరు అనకూడదు. జస్ట్ రంజని అని పిలవాలి. ఛాదస్తమో, గీదస్తమో…వాటెవర్ ఇటీజ్…మీవారు చెప్పిన మంచి విషయాలు చెప్పాల్సిందే…ప్లీజ్…ప్లీజ్” అంది రంజని.

“సరే! సరే! చెబుతాను…” నిష్కల్మషాన్ని నవ్వుగా మార్చి అంది సుమతి.

రంజని రెండు చేతుల్నీ గడ్డం క్రిందకు చేర్చి కూర్చుంది.

“ఆయన కొన్ని సంస్కృత సుభాషితాలను చెప్పారు. సూర్యుడు ఒంటి చక్రం వున్న రథాన్నెక్కి ఆకాశంలో తిరుగుతాడు. సూర్యుడి రథసారథియైన అనూరుడికి తొడల నుండీ కిందకు దేహం లేదు. ఒంటి చక్రపు రథం, వికలాంగుడైన సారథితో, ప్రతిరోజూ తన ప్రయాణానికి అడ్డుపడే రాక్షసుల్ని దాటుకుని ప్రయాణిస్తాడు సూర్యుడు. ఒక్కరోజు కూడా మానుకోడు. ఆవిధంగా గొప్పవాళ్ళు తమ సంకల్పబలంతో ఎదురుపడే అడ్డంకుల్ని దాటుకుని ముందుకే వెళ్తారు కానీ ఆగిపోరు.”

“వోవ్! రోజూ చూసే సూర్యుడిలో ఇంత గొప్పదనముందా? ఇంకో సుభాషితం చెప్పండీ!”

“మానవులంతా కొబ్బరిచెట్టు నుంచి చాలా నేర్చుకోవాలట. తోటమాలి తనకు పోసిన గుక్కెడు నీళ్ళకు ప్రతిఫలంగా, తియటి నీళ్ళు నిండిన, బరువైన కాయలను తన తలపై మోస్తూ నిలబడుతుంది కొబ్బరిచెట్టు. అలాగే మంచివాళ్ళెప్పుడూ తమకు సహాయం చేసినవారిని మర్చిపోరు. అంతేకాదు, ఎదుటివాళ్లు చేసిన అల్పమైన సహాయాన్ని ఎల్లప్పుడూ తలుచుకుంటూ, వారికి గొప్ప సహాయాన్నే చేస్తారు.”

“సూపర్బ్! సుభాషితాలే కాకుండా ఇంకేవైనా చెప్పారా?” – ఎంతో ఉత్సాహంతో తాను నిర్మించిన అలను తీరం మింగేసినా, పట్టుదలతో మరో అలను తయారుచేసుకునే సముద్రంలా ఉంది రంజని మనసు.

“ఊ…! ఇంకేమైనా అంటే……వైశాఖమాసమహాత్మ్యంలోని ఒక విశేషం చెప్పారు.”

“కథలైతే వద్దు. మంచి వండర్ఫుల్ విషయమైతేనే చెప్పండి.” గోముగా అడిగింది రంజని.

“ఇది కథ కాదు. ప్రకృతి పట్ల మానవులు ఎలా నడుచుకోవాలని చెప్పేది.” అంది సుమతి నవ్వుతూ.

“ఓకే! ఎన్వైర్మెంట్ అవేర్నెస్ అన్న మాట. ప్లీజ్ చెప్పండి.”

“వైశాఖమాసం అంటే వేసవికాలంలో ఇంటి ముందుగానీ, వెనుకగానీ- ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్కడ మట్టికుండ అడుగుభాగాన్ని భూమిలోకి పాతి అందులో నీళ్ళు పోసి, చుట్టూ గింజలు చల్లాలంట. దాహమేసిన పిట్టలు గింజలు తిని, నీళ్ళు తాగాలని ఋషులు ఈ ఏర్పాటును చేసారట. ఎండాకాలంలో దాహమేసిన వారందరికీ తాగడానికి నీళ్ళో, మజ్జిగో, పానకమో ఇస్తే అంత పుణ్యమంట.” అని ఆగింది సుమతి.

“కుండముక్కలో నీళ్ళు పోసి, గింజలు చల్లి, పక్షుల్ని పిలిచి నీళ్ళివ్వడం. అయ్యొ! సో క్యూట్. ఎంత మంచి ఐడియా. సిటీల్లో ఉండేవాళ్ళు ఎంత మిస్సౌతున్నారో కదా!” అంది రంజని.

ఇష్టపడి చేసుకున్న అలలన్నీ ఐపోతే, చిరాకు పడ్డ సముద్రం ముడుచుకుపోయినట్టు, హటాత్తుగా మౌనం వహించింది రంజని. నిజానికి సుమతి చెప్పిన ఆసక్తికరమైన విషయాల్ని మర్చిపోకూడదని మననం చేసుకుంటోంది రంజని.

అప్పుడు దూసుకొచ్చింది ఓ బాణం.

“మరి మీకూ…పిల్లలు…” నెమ్మదిగా అడిగింది సుమతి.

“ఇరవై రోజుల క్రితం నాకు అబార్షన్ అయింది. అదే నా ఫస్ట్ ప్రెగెన్సీ!” అని అంది రంజని.

ఈసారి నివ్వెరపోవడం సుమతి వంతయింది. “అయ్యొయ్యో! దయచేసి క్షమించండి.” సుమతి కళ్ళల్లో ఉన్నపళాన నీళ్లు కమ్మాయి.

“అరెరే! మీరెందుకు ఏడుస్తున్నారు? మీరడిగిన దానికి నేను అస్సలు బాధపడ్డం లేదు. ఇన్ఫాక్ట్ నేనే మీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను.” సమాధానపరుస్తున్నట్టుగా అంది రంజని.

సుమతి తలను అడ్డంగా ఊపి – “లేదండీ! ఆ వెర్రి ప్రశ్నతో మీకెంత బాధ కలిగిందో నాకు తెలుసు!  నన్ను క్షమించండి.” అంది, కన్నీళ్లని చెంగుతో ఒత్తుకుంటూ.

“నో నో నో! అలాంటిదేమీ లేదన్నాగా!” అంటూ సుమతి చేతుల్ని పట్టుకుంది రంజని. మెత్తని చేతులు వెచ్చగా ఉన్నాయి. రంజని చేతులు తాకినంతనే సుమతి రెండు చేతుల నిండా ఉన్న మట్టిగాజులు గలగలమన్నాయి. ఆ నీరవ వాతావరణంలో ఆ గాజుల చప్పుడు రంజని చెవులకు వింతగా సోకింది. ఆ చప్పుడులో ఏదో పురాతన రహస్యమొకటి తనతో మాట్లాడినట్టుగా అనిపించింది రంజనికి.

సుమతి చేతుల్ని గట్టిగా పట్టుకుని “మహాలక్ష్మిలా ఉన్నారు. మీరు నవ్వుతూ ఆశీర్వదిస్తే నాకు మంచి జరుగుతుంది! ప్లీజ్! ఏడవకండీ!” అంది రంజని. సుమతి దుఃఖాన్ని అదిమేందుకు ప్రయత్నించింది. ఒకట్రెండు నిముషాల్లో సర్దుకుంది. అంతసేపూ సుమతి చేతుల్ని పట్టుకునేవుంది రంజని. సుమతి మామూలుగా కావడంతో ఆమె చేతుల్ని వదిలిపెట్టింది.

చేతుల్ని వెనక్కు తీసుకోగానే చలిగాలి తన వేళ్ళని కసిగా కొరికినట్టైంది రంజనికి. అమ్మవొడిలాంటి వెచ్చదనం ఈమె చేతుల్లోకి ఎలా వచ్చిందని చకితురాలయింది. ఆ చేతుల్ని పట్టుకున్నంతసేపూ తనలోకి ప్రవహించిందేమిటి? స్వచ్ఛతా! నిశ్చలత్వమా! విశ్వాసమా! పరిపూర్ణతా! – తెలీదు. కానీ ఒకానొక మార్పు మాత్రం రక్తనాళాల్లో కొత్తగా ప్రవహిస్తోందని అనిపించింది రంజనికి.

“హమ్మయ్య! ఇప్పుడు మీరు మళ్ళీ సుమతిగా మారిపోయారు. థాంక్ గాడ్!” నవ్వుతూ అంది రంజని.

సుమతి దించిన తల ఇంకా ఎత్తనే లేదు.

అంతలో ఆవైపుకే నడుచుకుని వస్తున్న ఓ సంప్రదాయస్తుడ్ని చూసి, సుమతి అనేకమార్లు తల్చుకున్న “మావారు” ఆయనే కావొచ్చునని ఊహించింది రంజని. “సుమతిగారు! అక్కడ వస్తున్నది…” అర్థవంతంగా ఆగిపోయింది.

తలెత్తి చూసిన సుమతి “మావారే!” అని చెప్పి గబగబా కళ్లను తుడుచుకుని నిలబడింది. రంజని కూడా లేచి నిలబడింది.

వాళ్లిద్దరి దగ్గరకూ వచ్చిన కేశవశర్మ మొదట రంజనికేసి చూసి ఆ వెంటనే సుమతి వైపు చూసాడు.

“ఏమండీ! ఈవిడ రంజని. ఇక్కడే, ఇప్పుడే పరిచయమయ్యారు. మీరు వచ్చేవరకూ నాకు తోడుగా ఉన్నారు.” అంది సుమతి.

“ఓ! అలానా! సంతోషం!” అన్నాడు శర్మ.

సుమతి అతని పక్కకు వెళ్లి నిలబడింది.

బాగా పైకి వచ్చిన సూర్యుని ఏటవాలు కిరణాలు ఆ దంపతుల మీద పడి మెరుస్తున్నాయి.

అతను –మనిషికీ, పిట్టకూ, జంతువులకూ ఏకకాలంలో దాహం తీర్చే సరస్సులా ఉన్నాడు. ఆ సరస్సులోకి అమాయకంగా వొలికే వెన్నెల్లో, తడిసి విరిసిన ముగ్ధకలువలా ఆమె.

అతను – నిశ్చయ జ్ఞానానికి నిర్వచనంలా కనబడుతున్నాడు. ఆమె – అచంచలమైన అంకితభావానికి, మొక్కవోని నమ్మకానికి రూపుకట్టినట్లుంది.

ఎవరన్నారు? పెద్ద చదువులు, పెద్ద జీతాలు, పెద్ద పెద్ద మహళ్ళలోనే సుఖముంటుందని?

రంజని వినయంగా వంగి అతని పాదాల్ని తాకింది. ఆ వెంటనే సుమతి కాళ్ళనూ తాకింది.

క్షణమాత్రంలో జరిగిన ఈ ఘటనకు దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు.

నమస్కారం చేసి, లేచిన రంజని పర్సులోనుంచి వెయ్యి రూపాల నోటు తీసి శర్మకు ఇస్తూ – “అమ్మకు చీర కొనిపెట్టండి!” అంది.

మొదటి ఆశ్చర్యం నుంచే తేరుకోని శర్మ “ఏమిటండీ?” అన్నాడు.

“దయచేసి నన్ను బహువచనంతో పిలవకండి. నేను….జస్ట్ ఆర్డినరీ వుమన్. మీరిద్దరూ ఇలా కలిసి నిలబడివుండడం చూస్తుంటే…అది ప్యూర్ డివినిటీ. స్వచ్ఛమైన దైవత్వం ముందు నిలబడినట్టుంది. నా కష్టమేమిటో అమ్మతో చెప్పుకున్నాను. నన్ను ఆశీర్వదించండి. అమ్మకు చీర కొనిపెట్టండి. ఇది దానం కాదు. అమ్మకు చిరుకానుక! దయచేసి కాదనకండి!” – నిర్మలమైన గొంతుతో, నిశ్చలాలైన కళ్లతో, అవ్యక్త భావాలతో, కంపితమైన దేహంతో, చేతులు రెండూ జోడించి చెప్పింది రంజని.

జోడించివున్న రంజని చేతుల్ని పట్టుకుంది సుమతి. అమ్మవొడి వెచ్చదనం మరోమారు పలకరించింది. శర్మ చెయ్యెత్తి ఆశీర్వదించాడు.

వెళుతున్న ఆ దంపతులను చూస్తూ నిల్చుంది రంజని. రాజగోపురం దాకా వెళ్ళి, వెనక్కు తిరిగి చేయిని ఊపింది సుమతి. ఎందుకో, ఆ క్షణంలో రంజనికి మరోమారు ఒళ్ళు జలదరించింది. జలదరింపుతో వణుకుతున్న చేతిని ఎత్తి వీడ్కోలుగా ఊపింది రంజని.

మరో పదినిముషాలు అక్కడే గడిపిన రంజని అప్పుడే ఎగరడం నేర్చుకున్న పక్షిపిల్లలాంటి సంతోషంతో, నిప్పుని సైతం నిర్భయంగా తాకగల పసిపాప నిర్హేతుక ఉత్సాహంతో, వెలుగుతూ ఇంటికేసి బయల్దేరింది.

*****

“ఆశ్చర్యం! మహదాశ్చర్యం! మీ మొదటిపావూ, నా మొదటిపావూ స్వర్గలోకానికే చేరాయి!” అంది నిగమవందితుని పట్టపురాణి.

“నన గూడి నార తలకెక్కుట లేదా!” అన్నాడు ఆశ్చర్యచరితుడు.

“ఇది కాకతాళీయమా స్వామీ?”

“విధి” అన్నాడు చిత్రచరిత్రుడు.

“ఐతే అది బలీయమూ, ఉద్ధారహేతువూనూ!” అంది సముద్రతనయ.

“మన రెండవ ఆటకాయలు నిశ్చేష్టంగా ఉన్నాయి.” అన్నాడు నారదవరదుడు.

“సర్వులకూ చేష్టాప్రదులు మీరే. మీ కాయనే మొదటగా నడపండి.” అంది భీష్మకనందన.

“హన్నా! ఆటలో ఆధిపత్యం కూడదు. ఇప్పుడు నీదీ వంతు!” అన్నాడు నీరజనేత్రుడు.

అమ్మ చేతిలోకి ముద్దుపాపల్లా చేరిన పాచికలు, ఉయ్యాల నూపుతుంటే కిలకిల్లాడే బుజ్జాయిల్లా చప్పుడు చేసాయి.

*****

అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మైన్ గేట్ దాటి లోపలికి వచ్చిన రంజనికి వాచ్ మాన్ భార్య ఎదురుపడింది. ఆమె చంకలో బొద్దైన, చింకికళ్ల పిల్లవాడు. వెంటనే బ్యాగులో ఉన్న ప్రసాదం తీసి “భగవాన్ కా ప్రసాద్. లేలో” అంది. టక్కుమని అబ్బాయిని ఎత్తుకొని వాడి బూరబుగ్గల్ని చిదిమి మళ్ళీ తల్లి చేతికిచ్చింది రంజని. ఎప్పుడో గానీ కనబడని, కనబడినా మాట్లాడని “208 మేమ్ సాబ్” విన్యాసాల్ని వింతగా చూసింది ఆ గూర్ఖా భార్య.

లిఫ్ట్ లోకి వచ్చిన రంజనికి జీన్స్, టీ షర్ట్ వేసుకొన్న ఓ టీనేజ్ అమ్మాయి కనబడింది. రెండో ఫ్లోర్ నెంబర్ నొక్కి ఆ అమ్మాయి కేసి చూసింది. చటక్కున ఆ అమ్మాయి చెవి దగ్గర నోరుపెట్టి “యూ లుక్ హారిబుల్ ఇన్ దిస్ డ్రెస్. కం టు మై హోమ్. ఐ వుడ్ గివ్ యూ లంగా, వోణీ. యూ వుడ్ లుక్ ఫ్యాబ్యులస్…యా…బిలీవ్ మీ!” అంది. ఘమ్మని కొడుతున్న నేతి వాసన, అర్థంకాని రంజని మాటల్తో ఉక్కిరిబిక్కిరైన ఆ అమ్మాయి “ఆప్ క్యా బోలే సమఝ్ మే నహీ ఆయా ఆంటీ!” అంది. అంతలో రెండో అంతస్తు వచ్చేసింది.

లిఫ్ట్ తలుపులు మూసుకోబోతుంటే, రెండు చేతుల్తోనూ ఆపి – “మై ప్లాట్ నెంబర్ ఈజ్ 208. కమ్ ఎనీ టైమ్ అండ్ వియర్ లంగా, వోణీ. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్…ఐ బెట్…యూ నో ఐ బెట్!” అని కుడి బొటనవేలిని పైకెత్తింది. మూసుకుపోతున్న లిప్ట్ తలుపుల వెనక నోరెళ్ళబెడుతున్న ఆ టీనేజ్ కుర్రదాన్ని చూసి పకపకా నవ్వింది రంజని.

ప్లాట్ తలవాకిలిని తోసింది. తెరుచుకోలేదు. క్రిందనున్న ఫుట్ మ్యాట్ ను చూసింది. WELCOME అక్షరాలు తల్లక్రిందులుగా ఉన్నాయి. “అంటే అనంత్ ఆల్రెడీ వెళ్ళిపోయాడన్న మాట!”. చేతిగడియారం చూసుకుంది. ఎనిమిదిన్నర అవుతోంది. “అవును. ఇంటర్వ్యూ SEZ యూనిట్లో అని కదూ చెప్పాడు. పాతిక కిలోమీటర్లు వెళ్ళాలిగా. అందుకే పెందళాడే వెళ్ళిపోయాడు.” అని అనుకుంటూ తన దగ్గరున్న తాళంతో వాకిలిని తెరిచింది.

తిన్నగా సోఫా దగ్గరకెళ్ళి, అందులోకి దబ్బున కూలబడింది. వెనక్కి జారిగిలబడి కళ్ళు మూసుకుంది.

గుడి. గోపుర కళశం. ధ్వజస్థంభం. పచ్చికబయలు. సుమతి. మాటలు. కన్నీళ్ళు. ఆ దంపతులు. ఆశీర్వాదం.

ఐనా సుమతిని “అమ్మ” అని ఎందుకంది? తన కంటే జస్ట్ ఏడేళ్ళేగా పెద్ద? వయసు వల్ల కాదు తను అలా పిలిచింది. ఆ వెచ్చని చేతులు. అమ్మవొడిలోని వెచ్చదనాన్ని, నిశ్చింతనూ పొదవుకున్న ఆ మెత్తని చేతులు వల్ల. అందుకూ తను అమ్మా అని పిలిచింది. అంతేనా? ఇదొక్కటే కాదు. తను ఆ చేతుల్ని పట్టుకున్నప్పుడు…ఆ గాజుల శబ్దం. ఆ గలగలలు తన చెవుల్లో పలికిందే శబ్దం? “అమ్మ” అనేగా! ఎస్! అవును. అందుకే తన నోట్లోనుంచి “అమ్మ” పదం అప్రయత్నంగా వెలువడింది.

ఆ పచ్చికబయల్లో తన కోసమే వచ్చింది ఆ ముత్తైదువ. ఆమెను చూస్తే మొదట బెజవాడ దుర్గమ్మ ఫోటోనే గుర్తుకొచ్చింది. అవునవును! ఇది కూడా సుమతి “అమ్మ”గా మారడానికి కారణమే! బహుశా, ఏ పూర్వజన్మలోనో వాళ్ళే తన అమ్మానాన్న అయివుంటారు. లేకపోతే కొద్ది నిముషాల పరిచయంతో ఇంత సన్నిహితత్వమా?

ఆమె వెళ్లిపోతూ, చేయి ఊపితే తన ఒళ్ళెందుకు జలదరించింది? వేదం విన్నప్పుడూ జలదరించింది! అది, ఇదీ ఒకటేనా? అమ్మకు, నాదానికి అంత అవినాభావ సంబంధమా? ఏమో! తనకు ఇలాంటి విషయాలేవీ అంత లోతుగా తెలీవు.

ఆ బ్రాహ్మణుడు చెయ్యెత్తి ఏమని ఆశీర్వదించాడో?మంచి భార్యవు కమ్మనా! తల్లివి కమ్మనా? రెండూ ఐవుంటాయి.

అక్కడితో రంజని ఆలోచనలు ఆగిపోయాయి.

“ఏయ్! రంజూ! నిన్నే!” అన్న మాటలతో మెలకువైంది రంజనికి.

ఎదురుగా తన ముఖంలో ముఖం పెట్టు చూస్తున్న అనంత్.

అంటే…ఆలోచిస్తూ ఆలోచిస్తూ తను నిద్రపోయిందా? టైమెంతైందో!

“బైట ఫుట్ మాట్ రివర్స్ లోనే ఉంటే నువ్వు బైటికెళ్లావేమో అనుకున్నా! లోనికొచ్చి చూస్తే గుర్రుపెట్టి నిద్రపోతున్నావ్. ఒంట్లో బాగోలేదా?” పక్కనే కూర్చుంటూ అడిగాడు అనంత్.

“నో…నో…ఐ యామ్ ఫైన్.” అని అనంత్ భుజానికి తల ఆనిస్తూ అంది.

“మళ్ళీ నిద్రపోతావా ఏంటి? ఆకలేస్తోంది.” అన్నాడు అనంత్.

“అరెరే! గుడి నుంచి వచ్చినదాన్ని అలాగే పడుకునేసానే. వండనేలేదు. ఇప్పుడు టైమెంతైంది?” సన్నగా ఆవులిస్తూ అడిగింది రంజని.

“రెండు కావస్తోంది. పద. హోటల్ కు వెళ్దాం. పిచ్చ ఆకలి.” అన్నాడు అనంత్ లేస్తూ.

అతని చేయి పట్టి లాగింది రంజని – “గివ్ మీ హాఫ్ నవర్. చకచకా వండేస్తాను.” అంది.

ఆమె నెత్తి మీద మొటిక్కాయ వేసాడు అనంత్. “నువ్వు వండే వార్చే సరికి నేను….ఠా!” అన్నాడు.

“ఛస్! తప్పు! ఫస్ట్ నీకు టూ మినిట్స్ నూడుల్స్  చేసిస్తా. ఆపై వంట చేసేస్తా. నువ్వూ హెల్ప్ చేస్తే ఇంకా తొందరగా ఐపోతుంది. కమాన్!” అంది రంజని.

“నూడుల్స్ తిని, నీకు హెల్ప్ చేసి, ఆపైన ఆ వంట తిని….గోవిందో….గోవిందా” అన్నాడు రెండు చేతుల్ని నెత్తిన పెట్టుకుని.

“ఆహా! ఎన్నాళ్లకు నీ నోటి నుంచి గోవింద నామస్మరణ వచ్చింది. అంటే ఈరోజు ది బెస్ట్ రోజన్నమాట. చలో…చలో” అని అనంత్ ను తోసుకుంటూ వంటింటికి దారి తీసింది రంజని.

ఏ కళనున్నాడో రంజని చెప్పిన ప్రతి పనినీ శ్రధ్ధగా చేసాడు అనంత్. లేకపోతే ఒక పనికి వంద ప్రశ్నలేసి విసిగించేవాడు.

వంటంతా పూర్తైపోయింది.

పాత్రలనన్నింటినీ ఓసారి కలయజూసాడు అనంత్. “సంథింగ్ ఈజ్ మిస్సింగ్, బడ్డీ!” అన్నాడు కడుపుపై తాళమేసుకుంటూ.

“ఏంటది?” గడ్డం కింద చూపుడు వేలు పెట్టుకుని అడిగింది రంజని.

“ఎస్..ఖీర్…పాయసం…సంథింగ్ స్వీటీ” అన్నాడు అనంత్.

“ఓ..యా..కానీ ఇప్పుడు అకేషనేమీ లేదుగా?” అంది రంజని.

అనంత్ ఆమె దగ్గరగా వచ్చి, మెడ చుట్టూ చేతులు వేసి “నాకు జాబొస్తే….అహా…వస్తే…అది అకేషన్ కాదేంటమ్మా!” అన్నాడు.

“కెవ్..కెవ్వ్..వ్వ్..” అని కావాలనే అరిచింది రంజని. “నిజంగా..కంగ్రాట్స్!” అంది గెంతుతూ.

“ఇప్పుడొస్తున్న జీతమే వస్తుంది. ఇట్స్ ఓకే! దూరమే ఒక ప్రాబ్లం.” అన్నాడు.

“ఎంతో ఒకంత. నెలకు ఠంచనుగా జీతమొస్తే చాలు. ఇక డిస్టన్స్. లెటజ్ థింక్ అబౌట్ ఇట్ లేటర్. ప్రస్తుతానికి…తురుత్తురుత్తురూ….పాయసం చేసుకొందాం!” అంది రంజని.

ఆవేళ రంజని జీవితంలో నిజంగా ది బెస్ట్ డే.

*****

“అమోఘం! నీ రెండో పావు గోలోకాన్ని చేరిందే!” అన్నాడు గోపాలబాలుడు.

“మీ కరుణాదృష్టి ఫలితమే స్వామీ! మీ రెండో పావు సంగతి?” అన్నది కమలాలయ.

“చూద్దాం!” అన్నాడు చూతశరునితాత.

గాజుపలకపై ముత్యాలు పడ్డట్టు చప్పుడు చేసాయి పాచికలు.

*****

(సశేషం…)