ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వైకుంఠపాళీ – పద్దెనిమిదవ భాగం

Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: అనంత్ వెళ్ళిపోయాక కూడా నింపాదిగా ఉండసాగింది రంజని. ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అరవింద్. వరసగా సెలవులు రావడంతో తన టీమ్ తో కలిసి ట్రిప్ వేస్తుంది రంజని. విహారయాత్రలో ఓ ప్రమాదం జరుగుతుంది. నీటిలో మునిగిపోయిన రంజనిని కాపాడుతుంది విశ్వజ్ఞ. ఆ ప్రమాదం రంజని ఆలోచలని మార్చివేస్తుంది. విశ్వేశ్వర్ దగ్గర మనుష్యల మధ్య సంబంధాలన్నవి ఎలా ఏర్పడతాయో తెలుసుకుంటుంది. విశ్వేశ్వర్ మాటలు ఇచ్చిన ఉత్సాహంతో అనంత్ కు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా వెంటనే తీసుకుంటాడు అనంత్.  వి

 

“నువ్వు చెబుతోంది నిజమేనా?” సుమతి చుబుకాన్ని ఎత్తిపట్టి అడిగాడు కేశవ శర్మ.

తల దించుకుని ఔనన్నట్టు తలనూపింది సుమతి.

“మరి వెంకాయమ్మ పిన్నిగారికి చెప్పావా లేదా?”

లేదన్నట్టుగా తలూపింది సుమతి.

“మొదటగా నాకే చెబుతున్నావా?”

మళ్ళీ ఔనన్నట్టుగా తలాడించింది సుమతి.

ఆమెను తన బాహువుల్లోకి తీసుకున్నాడు శర్మ – “ఇప్పుడు సంతోషమేనా?”

“జీవితం ధన్యం!”

“ధన్య అంటే కృతార్థత అనే అర్థముంది. కృతార్థత అంటే పరమసుఖమనే మరో అర్థముంది.” అన్నాడు శర్మ.

“అన్ని అర్థాలూ ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి!” అంది సుమతి.

ఒక నిముషం మౌనం తర్వాత – “నాదో చిన్న సందేహం!” అంది.

“అడుగు”

“అప్పుడే పుట్టిన పాపాయికి ఏ భాషా రాదు. కానీ తన బిడ్డకు ఏం కావాలో కన్నతల్లికి చక్కగా తెలిసిపోతుంది. ఇదెలా సాధ్యం?”

“అబ్బో! చాలా చాలా ఆలోచిస్తున్నావే?” అన్నాడు నవ్వుతూ శర్మ.

“చెప్పరూ!” అంది సుమతి గోముగా.

“నువ్వడిగే ప్రతి ప్రశ్నా నన్ను కవ్వించి, సమాధానాల్ని రప్పించేవే. తప్పకుండా చెబుతాను. తల్లికి-అప్పుడే పుట్టిన బిడ్డకు మధ్య సమాచారాన్ని చేరవేసేది ఎవరో తెలుసా?”

తెలీదన్నట్టు తలను అడ్డంగా ఊపింది సుమతి.

శర్మ నవ్వుతూ – “దేవుడు!” అన్నాడు.

“అన్నింటినీ నడిపేది ఆ దేవుడేనని తెలిసిందే!” అంది సుమతి, తను ఎదురుచూస్తున్న సమాధానం ఇది కాదన్నట్టు.

“పిచ్చిదానా! అన్నిటికీ దేవుడే ఉండేది. కానీ ఎక్కడ, ఎలా ఉంటాడని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయంలో అమ్మ-బిడ్డ అనే ఇద్దరున్నారు. అమ్మలోనూ భగవంతుడు ఉన్నాడు. అదేవిధంగా బిడ్డలోనూ ఉంటున్నాడు. భగవంతుని రూపాలు ఒకదానికొకటి అపరిచితాలు కావుగా! కాబట్టి బిడ్డ యొక్క కోరికను వెల్లడి చేసే భగవంతుని రూపం నుండి సమాచారాన్ని స్వీకరించిన అమ్మలోని రూపం బిడ్డ కోర్కెకు తగ్గట్టుగా ప్రతిస్పందిస్తుంది. ఆవిధంగా లోకంలో మొదటిసారిగా అమ్మ ఐన స్త్రీకి తన బిడ్డ అపరిచితమైనదైనా, ఈ భగవంతుని రూపాల వల్ల ఎన్నో రోజుల పరిచయమున్నట్లు ప్రవర్తిస్తుంది. అర్థమయిందా?” అన్నాడు శర్మ.

కళ్ళను పెద్దవిగా చేసి – “అద్భుతం!” అంది సుమతి.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

“అమ్మను సంస్కృతంలో అంబ అంటారు. అంభ్యతే శాబ్దతే ఇతి అంబా అని వ్యుత్పత్తి. అంటే, తన బిడ్డకు భయాన్ని పోగొట్టి సుఖాన్ని కలిగించే శబ్దాలు చేసే వ్యక్తిని ’అంబ’ అని పిలుస్తారు. నువ్వు చూసేవుంటావు, పిల్లలు ఏడుస్తుంటే తల్లులు ’జుజ్జుజ్జూ’ అనో, ’ఊళోళాయీ’ అనో కొన్ని విచిత్రమైన శబ్దాలు చేస్తారు. కాసేపయ్యాక ఏడుస్తున్న పిల్లలు చక్కగా నిద్రపోతారు…అవునా!”

“అవునండీ! ఆ మాటలకు ఏమైనా కొత్త అర్థాలున్నాయా?”

“ఊహూ! ఈ జుజ్జుజ్జూలకు ఎలాంటి అర్థాలూ లేవు. పసిపాప యొక్క ఆనుభవిక ప్రపంచం ఎంత చిన్నదో, ఈ మాటలు కూడా అంతే అర్థరహితాలు.” అని ఆగాడు శర్మ.

“మీరు పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు!” అంది సుమతి.

“సరే! మామూలు భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అప్పుడే పుట్టిన పాపకు మనలా జ్ఞానం ఉండదు. అవునా!”

“అవును.”

“మన జ్ఞానం, మనకు ఎదురయ్యే అనుభవాల వల్ల పెరుగుతుంది. అవునా!”

“అవును”

“అంటే మనకు చూసుకుంటే పసిపాపలకు ప్రపంచ జ్ఞానం చాలా తక్కువగా….నిజానికి దాదాపు శూన్యంగా ఉంటుంది. అలాంటి లోకజ్ఞానం లేని పిల్లలను పెద్ద పెద్ద సంస్కృత పదాల్లో పలుకరిస్తే అర్థం కాదు. పసిబిడ్డల జ్ఞానమెంత అల్పమో, వాళ్ళతో మాట్లాడేందుకు వాడే భాష కూడా అంతే సరళం. అలా సరళంగా పుట్టిన మాటలే ఈ జుజ్జుజ్జూలు, ఊళ్ళుళ్ళూలూనూ…” అన్న శర్మ మాటలకు గట్టిగా నవ్వింది సుమతి.

“అంటే ఆ పసిపాపలు అర్థంలేని మాటలకే తృప్తి పడ్తాయి పాపం!” అంది.

“అవును. అలా భాషే రాని పసిపాపల్ని సైతం మాట్లాడించగలిగే సామర్థ్యమున్న వ్యక్తి ఒక్క తల్లి మాత్రమే. అందుకే శాస్త్రం వారిని ’అంబ’ అన్న పేరుతో పిలిచింది. ఆవు కూడా ’అంబా’ అని అరుస్తుంది. ఇక్కడ ’అంబా’ అనే శబ్దానికి ’హితాహిత వేదనం’ అని వ్యాఖ్యానించారు శాస్త్రకారులు. దూడ తన పొదుగును కుడిచినా లేక తప్పిపోయినా ఆవు ’అంబా’ అనే రంకె వేస్తుంది. అంటే అటు సంతోషానికీ, ఇటు దుఃఖానికీ ఒకే భాషను కలిగిన జంతువు ఆవు. అదేవిధంగా ఒకట్రెండు పదాలతోనే తన బిడ్డ యొక్క భయాన్ని పోగొట్టి, సంతోషాన్ని కలిగించే వ్యక్తిని ’అంబ’ అని పిలిచారు పెద్దలు” అన్నాడు శర్మ.

“అబ్బా! ఈ మాటల్లో నిజంగా ఎంత సైన్స్ ఉందండీ!” అంది సుమతి, కళ్ళను పెద్దవి చేసి.

“అవును! అలానే అమ్మను ’మాతా’ అన్న పేరుతో కూడా పిలుస్తారు. మాతా అంటే పూజనీయమైన వ్యక్తి అని అర్థం. అంతేకాదు ’మతిత్వాత్ మాతా’ అన్నది మరో అర్థం. అంటే, తన బిడ్డకు ఎప్పుడు, ఏం కావాలో ముందుగానే తెలుసుకొగల మతివున్న వ్యక్తి అని అర్థం. ’అంబ, ’మాత’ – ఈ రెండూ ప్రతి స్త్రీలోనూ ఉండాల్సిన రెండు గొప్ప గుణాలు. అవి లేని వారు అమ్మ కాలేరు.” అన్నాడు శర్మ.

“అద్భుతం! ఏమిటో అనుకొన్నాను. సంస్కృతంలోని ఒక్కో పదం వెనుకా చాలా లోతుంది!” అంది సుమతి.

“అవును. పనికిరానిదని, అర్థంకానిదని కొట్టిపారవేయబడుతున్న ఈ భాషలో ఒక్కో పదం వెనుక అమోఘమైన సైన్స్ ఉంది. సైకాలజీ ఉంది. మనసును కదిలించే అర్థాలున్నాయి. ఈ భాష మానవులచేత తయారు కాలేదు. అందుకనే ఆ లోతు, ఆ గాంభీర్యం!” అన్నాడు శర్మ.

“ప్రతి అక్షరం భగవంతుని రూపమని మీరు చెప్పారు. అలాంటప్పుడు భాష కూడా అతని రూపమే కదా! భగవంతుణ్ణి, ఆయన రూపాల్నీ ఈ మానవులు సృష్టించలేరు. కనుక మానవుల కంటే భాష గొప్పది. భాష కంటే భగవంతుడు గొప్పవాడు. మాట్లాడే ప్రతి అక్షరం ఎంత స్పష్టంగా ఉంటే, మాట్లాడే ప్రతి మాటా ఎంత స్వచ్ఛంగా ఉంటే ఆ భగవంతుడికి మనం అంత దగ్గరౌతాం. ఔనుకదండీ!” అంది సుమతి.

ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు శర్మ.

“చిన్న చిన్న మాటల్లో నువ్వు చెప్పిన విషయం చాలా ముఖ్యమైంది సుమా!” అన్నాడు.

“మీరు చెప్పినదాన్నే నా మాటల్లో చెప్పాను గానీ ఇది నా స్వంతమా? ఐనా మీ నుండి ఇన్ని కొత్త విషయాల్ని రాబట్టాడూ అంటే, ఆ రాబోయేవాడు మిమ్మల్ని మించి పోతాడేమో!” అని ఛలోక్తిగా అంది సుమతి.

“జనులా పుత్రుని కనుగొని పొగడగ – పుత్రోత్సాహమ్ము నాడు పొందెదను……సుమతీ!” అన్నాడు శర్మ.

ఇద్దరి నవ్వులతో ఆ సాయంసంధ్య వింత రంగులతో మెరిసింది.

– – – – – – –

“ఈశ్వరత్వమనే గడి నుండి కదలి మాయాశక్తి అనే నూటాయిరవై తొమ్మిదో గడిని చేరింది మీ మొదటి పావు. దీని అర్థమేమిటి స్వామీ?” అని చేతులు జోడించి అర్థించింది సకలాభీష్టప్రదాయిని.

“మాయ అన్నది నా బంధకశక్తి. గ్రహాల్ని గతులు తప్పకుండా నిలుపుతున్నది ఆ శక్తే. చంద్రుణ్ణి శుక్లపక్షంలో వృద్ధి చేసి, కృష్ణపక్షంలో కృంగదీసేదీ ఈ శక్తే. సముద్రంలో అలలు తీరాన్ని దాటకుండా చూసేదీ ఈ మాయే. అంతేకాదు, కష్ట కార్పణ్యాలకు ఆలవాలమైన భూలోకంలో పుట్టిన ప్రతి ప్రాణీ తాను సుఖంగా ఉంటానని భ్రమించడం కూడా నా మాయశక్తి యొక్క పరాకాష్టతే! ఆయుష్షు మిగిలివున్న రోగి, ఔషధాల్ని తీసుకుంటే, దాన్ని ఫలింపజేస్తాను. కానీ మరణం ఆసన్నమైనవాడు ఎన్ని ఔషధుల్ని తీసుకున్నా వాటిల్ని నిర్వీర్యం చేస్తాను. ఇదీ నా మాయే. ఒక చిన్న విత్తనాన్ని వందలు, వేల పళ్ళనిచ్చే మహావృక్షంగా మార్చేదీ నా మాయే!” అన్నాడు నిత్యసత్యసంకల్పుడైన శ్రీహరి.

“మీ మాయాశక్తి అనంతమైనది. అప్రతిహతమైనది. అగాధమైనది! దీనిని దాటడం అంత సులభం కాదు కదా స్వామీ!” అంది త్రిజగన్మాత.

“దాటడం సులభమే దేవీ! ఎవరు నా నుండి ఎంత దూరం ఉంటారో, వారి నుండి నేనూ అంతే దూరంలో ఉంటాను. నేను ఎంత దగ్గరౌతానో, నా మాయ అంత దూరమౌతుంది.”

“ఆహా! ఎంత సులభోపాయం! ఈ సూక్ష్మాన్ని గ్రహించలేని జీవులు మీ నుండి దూరంగా పరుగెడుతూ మీ మాయాశక్తి అనే మరీచికల్ని తలచి తలచి అందుకోవడానికి తపిస్తుంటారు. అందక అలమటిస్తుంటారు. ప్రతి అక్షరంలోనూ మిమ్మల్ని ప్రత్యక్షీకరించుకోవాలని తపిస్తున్న మీ మొదటి ఆటకాయ ఈ మాయాశక్తిని తప్పక దాటుతుంది. ఆ విశ్వాసం నాకు కలుగుతోంది.” అంది విరించి సన్నుత.

“నీ రెండో పావు సాలోక్య సంచారం చేస్తోంది. అక్కడి నుండి ముందుకు నడుపు!” శ్రీరమణి కరకమల పూజితుడు.

“చిత్తం!” అని పాచికల్ని వేసింది చిత్తజ జనని.

ఆమె పాచికల్ని వేస్తే, అవి కుశ లవుల కాళ్లకు సీతమ్మ కట్టిన గజ్జెల్లా ధ్వనించాయి.

* * * * *

రంజని ఎదుట తలవంచుకుని కూర్చున్నాడు అనంత్.

అతను అలా కూర్చోబట్టి పదిహేను నిముషాల పైమాటే అయింది. రంజని నుండి ఫోన్ రాగానే రివ్వున వచ్చి వాలిపోయాడే గానీ వచ్చినప్పటి నుండీ ఆమెతో ఒక్క అక్షరం కూడా మాట్లాడలేకపోయాడు. రంజని కూడా మౌనం వహించి ఉండిపోవడంతో లోలోపలే ఇబ్బండి పడిపోసాగాడు అనంత్.

అంతలో రంజని మొబైల్ మోగింది.

“హలో! ఆ….విశ్వేశ్వర్! చెప్పండి!”

“గుడీవినింగ్ మేడమ్! మా గురువుగారిని కలవాలన్నారు కదా! ఇప్పుడే బయల్దేరి రాగలరా?”

“ఆ(….ఇప్పుడా?”

“అవును మేడమ్! ఇంకో గంట గంటన్నరలో ఆయన వేరే ఊరికి వెళ్తున్నారు. నేను వాళ్ళింటి నుండే మాట్లాడుతున్నాను. మీ ఇంటి నుండి ఇక్కడికి రావడానికి ఓ అరగంట పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా వస్తే కొద్దిసేపైనా మాట్లాడ్డానికి అవకాశం ఉంటుంది. రాగలరా?” గుక్క తిప్పుకోకుండా చెప్పేసాడు విశ్వేశ్వర్.

వెంటనే ఏం చెప్పాలో తోచలేదు రంజనికి. “విశ్వేశ్వర్! యాక్చువలీ…..అనంత్ ఈజ్ హియర్!” అంది.

“ఓహ్! వోవ్! వెరీ నైస్…..” అంటూ ఆగిపోయాడు విశ్వేశ్వర్. “సో….!” అని మళ్ళీ అన్నాడు.

అనంత్ ఏదో మాట్లాడబోవడం చూసిన రంజని “ఇంకోసారి చూద్దాం!” అంది.

“ఇంకోసారా!……సరే…..చూద్దాం మేడమ్!” అని అన్న విశ్వేశ్వర్ గొంతులోని నిరాశని గమనించలేకపోయింది రంజని. ఫోన్ కట్ చేసింది.

“ఎవరి గురించి….ఈ ఫోన్?” అన్నాడు అనంత్.

“నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు! క్వశ్చన్స్ తోనే పెళ్ళి చూపులు మొదలుపెట్టావు. ఇప్పుడూ ఆ వెధవ క్వశ్చనింగే!” అంది రంజని చిరుకోపం నటిస్తూ.

“సారీ!” అన్నాడు అనంత్, నాలుక కరచుకుని.

“ఇట్స్ ఓకే! రోజంతా ఇలా శివుడి ముందు బసవడిలా కూర్చునేవుంటావా?” అంది రంజని.

వెంటనే తను కూర్చున్న కుర్చీలోనుంచి రంజని కూర్చున్న సోఫాలోకి మారాడు అనంత్. అతని భుజంపై తల పెట్టి ఆనుకుంది రంజని. అతను ఆమె ముంగురుల్ని సవరించసాగాడు. కళ్ళు మూసుకుంది రంజని.

క్షణం క్షణం ఆలోచనల్తో ఉప్పొంగే మనస్సులను సేద తీర్చే అమ్మ – మౌనం.

అనవరతం పరుగులెట్టే అంతరంగాలను ఆపి, దప్పిక తీర్చే చన్నీటి చలమ – మౌనం.

అరుపులతో ప్రపంచాన్ని జయింపజూసే అహంకారాన్ని శాంత పరచే హితబోధ – మౌనం.

వాదాలతో విరిగి, చెదరి, విడిపోయిన మనుష్యులు అనురాగాల్ని అందిపుచ్చుకునే స్వర్గం – మౌనం.

ఎంతసేపు అలా మౌనంగా గడిచిందో అంతసేపూ అనంత్-రంజనీల తనువులు, మనసులు దగ్గరగా వచ్చాయి. ఆమెను దగ్గరగా తీసుకుని గట్టిగా ముద్దుపెట్టాడు అనంత్. ఆరు నెలల సూర్యవిరహంతో గడ్డ కట్టిన అంటార్కిటికా మంచు ముక్కలా కరిగింది రంజని.

వారి ఏకాంత సాన్నిహిత్య తపస్సును భంగం చేస్తూ గట్టిగా మోగింది అనంత్ మొబైల్. జేబులోంచి తీసి, పేరు చూసాడు. “నో టైమ్ ఫర్ హిమ్!” అంటూ మొబైల్ ను టీపాయ్ మీదకు విసిరేసాడు.

“ఎవరు?” అంది రంజని, అనంత్ నుండి కొద్దిగా పక్కకు జరిగి.

“నీ సవతి కాదులే!” అని అంటూనే “వినోద్ దూబే” అన్నాడు అనంత్. వెంటనే “మరి, ఇంతకు ముందు నీకొచ్చిన ఫోన్?” అన్నాడు.

“హారి అనుమానపు మొగుడుగారూ!” అంది రంజని చేతుల్ని నెత్తి మీద పెట్టుకుని “ఫోన్ చేసింది విశ్వేశ్వర్. అతనికో స్పిరిచువల్ గురూ ఉన్నాడు. అతన్ని కలవాలని నేను చెప్పినందుకు ఫోన్ చేసాడు. ఎనీ డౌట్స్?” అంది.

“నో డౌట్స్! బట్ వన్ డౌట్!!” అన్నాడు అనంత్, తనూ చేతుల్ని నెత్తి మీద పెట్టుకుంటూ.

“ఏమిటీ?” అన్నట్టు కనుబొమల్ని ఎగరేసింది రంజని.

“అంతగా కలవాలనుకొన్న వ్యక్తిని కలవకుండా ఎందుకుంటున్నావ్? – నేనొచ్చాననా?”

“అఫ్ కోర్స్!”

“వై కాంట్ వుయ్ మీట్ హిమ్? టుగెదర్!” అన్నాడు అనంత్.

అతని మాట పూర్తి కావస్తుండగానే సోఫాలో నుండి చెంగుమని లేచి నిలబడింది రంజని. “ఈ మాట ముందే అనాల్సింది. ఇంకో గంటలో ఆయన ఊరెళ్తున్నారని విశ్వేశ్వర్ అప్పుడనంగా చెప్పాడు….” అని తన మొబైల్ తీసి విశ్వేశ్వర్ ఫోన్ వచ్చిన సమయాన్ని చూసింది. “హెల్!” అని గట్టిగా అంది.

“ఏమైంది?” అన్నాడు అనంత్.

“జస్ట్ పది నిముషాలుంది. వాళ్ళింటికెళ్ళడానికి మన ఇంటి నుండి అరగంట పడుతుందని చెప్పాడు విశ్వేశ్వర్. వుయ్ కాంట్ మేకిట్!” అని నిస్తేజంగా సోఫాలోకి కూలబడింది రంజని.

“అయ్యో!” అంటూ తనూ కూలబడ్డాడు అనంత్.

వెంటనే, “ఇంకోసారి విశ్వేశ్వర్ కు ఫోన్ చేసి చూడు. అతను అక్కడేవుంటే కనీసం ఫోన్లోనైనా మాట్లాడొచ్చుగా!” అన్నాడు.

“బ్రిలియంట్!” అంటూ అనంత్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి చకచకా నంబర్ డయల్ చేసింది రంజని.

రెండు రింగుల్లోనే విశ్వేశ్వర్ ఫోన్ తీసుకోవడంతో ఉత్సాహం రెట్టించింది రంజనిలో – “హల్లో విశ్వేశ్వర్ గారూ! మీరెక్కడున్నారు? గురువుగారున్నారా? వెళ్ళిపోయారా?” అని గట్టిగా అరిచింది.

“నేను బస్టాండులో ఉన్నాను మేడమ్. ఆయన ఇప్పుడే అలా వెళ్ళారు!”.

“అయ్యో! అనంత్ రావడం వల్ల ఈరోజు కుదర్లేదు. ఆయన ఊరెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తారు?”

కొన్ని సెకన్ల మౌనం తర్వాత – “ఆయన పర్మనెంటుగా వెళ్ళిపోతున్నారు మేడమ్. మళ్ళీ ఈ సిటీకి రారు!” అని నెమ్మదిగా పలికాడు విశ్వేశ్వర్.

“వాట్! వై…వై?” అని ఉద్వేగంగా అడిగింది రంజని.

“రీజన్స్ నాకూ పూర్తిగా తెలీదు మేడమ్! ఈరోజు పొద్దునే నాతో అన్నారు, ఇక్కడి నుండి ఓ చిన్న పల్లెటూరికి షిప్ట్ అవుతున్నట్టుగా. నేనూ షాకయ్యాను. సాయంత్రమే వాళ్ళింటికి వచ్చాను. మీ గురించి చెప్పి ఒక్కసారైనా కలవాలని అడిగాను. సరేనన్నారు. అందుకే మిమ్మల్ని అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసాను. బట్……”

“ఓహ్! హెల్!…..పోనీ కనీసం ఫోన్లోనైనా మాట్లాడొచ్చా?” ఉద్వేగం కాస్తా ఉద్విగ్నంగా మారిపోయి రంజనిని కుదిపేస్తోంది.

“గురువుగారు రాగానే నేను ఫోన్ చేస్తాను…..” అని విశ్వేశ్వర్ అంటుండగా వెనక ఎవరో “సుమతీ! సుమతీ!” అని గట్టిగా పిలవడం వినబడింది రంజనికి.

ఆ పేరు చెవిన పడగానే ఒళ్ళు ఝల్లుమంది ఆమెకు.

“విశ్వేశ్వర్! సుమతి…..ఆ సుమతి ఎవరు?” అని నెమ్మదిగా అడిగింది.

“గురువుగారి భార్య మేడమ్! చాలా మంచి మనిషి. సాక్షాత్తు లక్ష్మీదేవే అనుకోండి!” అన్నాడు విశ్వేశ్వర్.

రంజని కళ్ళ ముందు ఓ మెరుపు మెరిసినట్టైంది. ఆమె మస్తిష్కంలో ఆ పురాతన దేవాలయం, మార్గశీర్షపు నునువెచ్చని ఉషఃకాలం, తన ఒంటరితనం, ఆ నిండుముత్తైదువ, ఆమె నిష్కల్మష హృదయం, పారిపోయిన తన దుఃఖం – అన్నీ కాశీపటంలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి.

“సుమతి….సుమతి….విశ్వేశ్వర్ గారు! అర్జెంటుగా ఆమెకివ్వండి. ఐ హావ్ టు టాక్ టు హర్! ఐ హావ్ టు టాక్ టు హర్!”.

రంజని మాటల్లోనూ, గొంతులోనూ స్పష్టమౌతున్న ఆదుర్దాను గ్రహించిన విశ్వేశ్వర్ ఆశ్చర్యపోయాడు. “డూ యూ నో హర్! మేడమ్?” అన్నాడు.

“ప్లీజ్ విశ్వేశ్వర్! ఐ కెనాట్ లూజ్ దిస్ ఆపర్చ్యునిటీ. ప్లీజ్ గివ్ ఫోన్ టు హర్….” ఆవేశపడిపోసాగింది రంజని.

ఒక్క క్షణం తర్వాత అవతలి నుంచి ఓ మెత్తని స్వరం “హలో” అంది.

వాయుతరంగాలపై తేలివచ్చిన శబ్దతరంగాలు అంతరంగ తంత్రుల్ని మీటినట్టవడంతో రంజనికి మాటలు కరువయ్యాయి.

ఆ మెత్తని స్వరం “హలో” అని మరోమారు పలికింది.

గొంతు పెగుల్చుకుంటూ “హలో! అమ్మా! నేను….నేను….” అంది రంజని.

“ఎవరు? గొంతు గుర్తుపట్టలేకపోతున్నాను. దయచేసి పేరు చెబుతారా?”

“అమ్మా! నేను…..వెంకటేశ్వరస్వామి గుడిలో….పొంగల్ ప్రసాదం! గుర్తున్నానా?” ఆనందంతో రంజని పొడిపొడి మాటల్ని మాట్లాడసాగింది.

ఒక్క క్షణం మౌనం తర్వాత “రంజని!” అంది సుమతి.

“అవును! రంజనిని! గుర్తున్నానా?” నవ్వు, ఏడ్పు కలిసిపోయిన స్వరంతో అడిగింది రంజని.

“ఎలా మర్చిపోగలను! మీరు నాకెప్పుడూ గుర్తుంటారు! ఎలా ఉన్నారు?” అని అడిగింది సుమతి.

“కనీసం ఇప్పుడైనా నన్ను ఏకవచనంతో పలకరించండి…మీరలా పలకరిస్తే వినాలనివుంది….ప్లీజ్!” అంది రంజని.

పూరేకులు కదిలినంత మెత్తగా ఓ నవ్వు వినబడింది – “అలాగే! ఎలా ఉన్నావు రంజని!”.

“నేను బ్రహ్మాండంగా ఉన్నానమ్మా! మీరెలా ఉన్నారు? శర్మగారంటే మీవారా? ఎన్ని నెలల నుండీ విశ్వేశ్వర్ మీవారి గురించి చెబుతున్నాడో! కానీ ఒక్కరోజు కూడా కలవాలని నా మట్టిబుర్రకు తోచలేదు. ఈరోజు కలవాలనుకుంటే నేను రాలేకపోయాను. మీరేమో ఊరే వదిలి వెళ్లిపోతున్నారంట! ఐ మిస్డ్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చ్యునిటీ!” గద్గదికమైన గొంతుతో వణుకుతూ పలికింది రంజని.

తన భార్యలో చకచకా రంగులు మారుస్తున్న ఉద్వేగపరంపరల్ని, వాటి మార్పులనీ చూస్తూ ఆశ్చర్యపోసాగాడు అనంత్.

“అయ్యో! అలా అనుకోకు రంజనీ! మేమేమీ మహాత్ములం కాముగా? నువ్వింత బాధపడ్డానికి!” అంది సుమతి.

“అమ్మా! ఏ ఊరెళ్తున్నారు?” అంది రంజని.

అవతలి వైపునుండి జవాబు లేదు. మళ్ళీ అడిగింది. జవాబు లేదు. రంజని మళ్లీ మళ్ళీ అడుగుతూనే వుంది. అనంత్ ఆమె చేతిలో నుంచి మొబైల్ తీసుకుని “లైన్ కట్టైంది.” అని చూపించాడు.

“హెల్! హెల్!” అంటూ విశ్వేశ్వర్ సెల్ కు డయల్ చేసింది. లైన్ పోతూనే ఉంది కానీ రింగ్ కావడం లేదు. “కమాన్! కమాన్!” అంటూ మళ్ళీ డయల్ చేసింది.

లైన్ వెళ్తున్న చప్పుడే గానీ కనెక్ట్ కావడం లేదు. చటక్కున ముందుకు వంగి టీపాయ్ మీదున్న అనంత్ మొబైల్ తీసుకుని గబగబా విశ్వేశ్వర్ నెంబర్ను డయల్ చేసింది. “ది వొడాఫోన్ నెంబర్ డయల్డ్ బై యూ ఈజ్ ఔటాఫ్ కవరేజ్ నౌ. ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్”.

కళ్ళలో నీళ్ళు కమ్ముకుంటుంటే రెండు మొబైళ్ళనీ టీపాయ్ మీదకు జారవిడిచి, అనంత్ మీదకు వాలిపోయింది రంజని. తన భార్యలో చెలరేగుతున్న భావనాత్మక ప్రళయాల్ని చూస్తూ, అవి పూర్ణంగా అర్థంకాక, కానీ ఎప్పుడూ స్థిమితంగా ఉండే రంజనిని కూడా అల్లకల్లోలం చేయగలిగిన ఆ ’సుమతి’ ఎలాంటి వ్యక్తి అని ఆలోచిస్తూ, రంజనని జోకొట్టసాగాడు అనంత్.

– – – – – – –

(సశేషం…)