ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వైకుంఠపాళీ – ఇరవై ఒకటో భాగం

Like-o-Meter
[Total: 0 Average: 0]

గతభాగం

అరవింద్ కోరడంతో మరో వారం రోజులు అదనంగా పనిచేసిన రంజని, తన బాధ్యతలన్నింటినీ స్టెల్లాకు అప్పజెప్పింది.

ఆమె వెళ్ళిపోతున్నప్పుడు పావని, స్టెల్లా, విశ్వజ్ఞలు కన్నీరు పెట్టుకున్నారు.

ఎన్నడూ చలించని అరవింద్ కూడా కళ్ళను తుడుచుకుంటూ బలవంతపు నవ్వొకటి నవ్వి రంజనికి షేక్ హ్యాండిచ్చాడు.

ఇతర మిత్రులు, అధికారుల వీడ్కోలు తీసుకుని ఆఫీసు నుండి బైటపడింది రంజని.

కారు దగ్గరకెళ్ళి డోర్ లాక్ తీస్తుండగా “మేడమ్!” అన్న పావని గొంతు వినబడి వెనక్కు తిరిగింది.

“ఏం పావని?” అని చిరునవ్వుతో అడిగింది రంజని.

“అది…అంటే…నేను….మీరన్నట్టు కృష్ణ శతకం నేర్చుకోలేకపోయాను! ఐ యామ్ సారీ!” అని బిక్కమొహం వేసుకుని చెప్పింది పావని.

పకపకమని నవ్వింది రంజని – “థాంక్ గాడ్! ఆ శతకం ఒకటుందని, దాన్ని నువ్వు నేర్చుకోలేదని గుర్తుపెట్టుకున్నావ్. ప్రస్తుతానికి అది చాలు. బట్ లెర్న్ ఇట్. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్!” అని ఆ అమ్మాయి భుజం తట్టింది రంజని.

డోర్ తీయబోతున్న రంజనిని మళ్ళీ పిలిచింది పావని.

“మేడమ్! కొన్ని పద్యాలు నేర్చుకొన్నాను!” అంది.

“అరే! ఆ విషయం చెప్పకుండా అసలు రాదంటావేంటి. ఏం పద్యాలు వచ్చో చెప్పు!” అంది రంజని.

“ఊహూ….ఇక్కడ చెప్పను….అక్కడే…ఆ పార్కులో చెబుతా!” అని గోముగా అంది పావని.

“ఆహా! సెట్టింగు కూడా ఫిటింగ్ చేసేసుకుని డ్రామాలాడుతున్నావా! హాహాహా….బాగుంది. పద పద.” అంటూ కార్లో కూర్చుంది రంజని. పక్క సీట్లో పావని కూర్చుంది.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

– – – – – – –

రంజని, పావనిలు పార్కుకు వచ్చేసరికి విశ్వజ్ఞ, స్టెల్లాలు అక్కడికి వచ్చేసారు.

“దిక్కెవ్వరుప్రహ్లాదుకు

దిక్కెవ్వరుపాండుసుతులదీనులకెపుడున్

దిక్కెవ్వరయ్యహల్యకు

దిక్కెవ్వరునీవేనాకుదిక్కువుకృష్ణా!”

 

బృందగానంలా పద్యాన్ని చదివారు ఆ ముగ్గురమ్మాయిలు.

సంతోషం పట్టలేకపోయిన రంజని ఆ ముగ్గుర్ని ఒకేసారి కావలించుకుంది.

వాళ్ళలా ఉండడాన్ని చూస్తున్న పిల్లలు కొందరు చప్పట్లు కొట్టారు. వారి అల్లరికి మూసిన కళ్ళను తెరిచింది రంజని.

ఆమెను బెంచ్ మీద కూర్చోమని చెప్పి పక్కనేవున్న చెట్టు చాటుకెళ్ళి ఓ పెద్ద ఫోటోను పట్టుకొచ్చారు పావని, విశ్వజ్ఞ.

“వావ్!” అని గట్టిగా అంది రంజని.

పాడి ఆవు పొదుగు నుండి పాలు తాగుతున్న కృష్ణుడు అదే పాలను తాగడానికి వస్తున్న ఓ లేగదూడను దూరంగా తోస్తున్నాడు. పాలిస్తున్న గోమాత కృష్ణుని వీపును ప్రేమతో నాకుతోంది. ఇదీ ఆ బొమ్మ.

“ఫెంటాస్టిక్ ఇమాజినేషన్! సో క్యూట్! ఎక్కడ దొరికిందిది?” అని అడిగింది రంజని.

“ఓహ్! ఎన్నెన్ని షాపులు తిరిగామో. ఫైనల్గా రోడ్డు సైడు షాపులో దొరికింది. చాలా పాతదే ఐనా కొనేసి, ఫ్రేమ్ వేయించామ్. బావుందా మేడమ్!” అంది స్టెల్లా.

“ఎక్సలెంట్! ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను. దిసీజ్ ది బెస్ట్ గిఫ్ట్ దట్ ఐ హావ్ గాట్!” అని చెప్పింది రంజని.

మరోసారి అందరి దగ్గరా సెలవు తీసుకుని కారెక్కింది రంజని.

– – – – – – –

ఇంటికి రాగానే అపార్ట్మెంట్ కార్పెంటర్ ను పిలిపించి కొలీగ్స్ ఇచ్చిన కృష్ణుని ఫోటోని టీవీ వెనుకవున్న గోడకు బిగించింది రంజని. అంతేకాదు ఎలెక్ట్రీషియన్ను పరుగెట్టించి రెండు స్పాట్ లైట్స్ తెప్పించి అలంకరించింది. వాటితో బాటే మంచి గంధపు చెక్కతో చేసిన దండను వేసింది. ఓసారి ఆ లైట్స్ వేసి గంధపు దండతో నిండుగా వెలుగుతున్న ఆ ఫోటో కేసి తృప్తిగా చూసింది.

“చాలా బాగుండాది మేడమ్! ఇట్లాంటి ఫోటో యాడా చూడ్లా!” అని అన్నాడు కార్పెంటర్.

గర్వంగా నవ్వింది రంజని. “అవును! ఇది చాలా రేర్ ఫోటో. అదృష్టం కొద్దీ నాకు దొరికింది.” అని అంటూ పర్స్ లోంచి వంద రూపాయలు తీసి ఇవ్వబోయింది.

“అయ్యొయ్యో! నూర్రూపాయలా? ఒక్క మేకు కొట్టినాను. చానా చిన్న పని. దేవుడి పనికి డబ్బులొద్దు మేడమ్! ఇట్లాంటి ఫోటోని ఎక్కడా చూడ్లా! మీ పున్నెమాని ఈయాల చూసినా. గొప్ప పున్నెమొచ్చిండాది నాకు. అది చాలమ్మగారు!” ఫోటోకు దండం పెడుతూ అన్నాడు కార్పెంటర్.

“నీకు పిల్లలున్నారా?”

“ఆ…ఉండారు మేడమ్. పెద్దది తొమ్మిదో తర్గతి. చిన్నోడు ఐదు.” అన్నాడు సంతోషంగా.

పర్సులోంచి ఇంకో వంద తీసింది రంజని.

“నాకు పిల్లల్లేరు. ఇదో చేరో వంద….నీ పిల్లలకి. వద్దనకు!” అని ఆ కార్పెంటర్ చెయ్యి లాక్కుని అందులోకి నోట్లను కుక్కింది రంజని.

పెద్దింటి అమ్మగారు తన చెయ్యి లాక్కుని డబ్బులిచ్చినందుకు మెలికలు తిరిగిపోయాడా వ్యక్తి.

“కన్నయ్య ఈ ఇంట్లోకి వచ్చినాడు. మీకు పిల్లలు తప్పక ఔతారు అమ్మగారు.” అని నిండు మనసుతో అన్నాడా నిరుపేద.

నవ్వింది రంజని.

ఆమెకు దండం పెట్టి, మరోమారు కృష్ణుని పటానికి దండం పెట్టి వెళ్ళాడు కార్పెంటర్.

సోఫాలో కూర్చుని ఆ ఫోటో వంకనే చూస్తూ కూర్చుండిపోయింది రంజని.

కన్నయ్య ఈ ఇంట్లోకి వచ్చినాడు. మీకు పిల్లలు తప్పక ఔతారు అమ్మగారు.” – ఆ కార్పెంటర్ మాటలు ఆమె మనసులో ప్రతిధ్వనించాయి.

కృష్ణుడి వంక చూస్తూ – “ఏరా కన్నయ్యా! పిల్లల్ని ఇస్తావురా?” అని గట్టిగా అడిగింది

పటానికి అలంకరించిన గంధపు దండ కుడిభాగం వదులయిందేమో టక్కుమని జారింది.

అది శుభ శకునమో, అపశకునమో అర్థం కాలేదు రంజనికి. నిలువని మనసుతో వెంటనే విశ్వేశ్వర్ కు ఫోన్ చేసింది.

ఫోన్ తీసుకున్న విశ్వేశ్వర్ రంజని అనుమానాన్ని తీర్చాడు.

“చాలా శుభ శకునం మేడమ్! కృష్ణుడు మీకు వరమిచ్చాడు. ఇక నిశ్చింతగా ఉండండి. మరో పది నెలల్లో మీ ఇంట్లో కన్నయ్య దోగాడుతాడు.”

రంజని ఆనందానికి పగ్గాల్లేకుండా పోయాయి. విశ్వేశ్వర్ కు అనేకమార్లు ’థాంక్స్’ చెప్పి ఫోన్ పెట్టేసింది.

వెంటనే అనంత్ కు ఫోన్ చేసింది. ఎక్కడున్నాడో ఏమో ఫోన్ తీయలేదతను. మరోసారి చేసింది. తీయలేదు అనంత్.

విసుక్కోకుండా లేచి రాత్రికి వంట చేయడానికి సిద్ధమైంది రంజని.

– – – – – – –

“తల్లి యశోదా తనయుడు నేనిక తలుపులు తియ్యవే భామా

భామా తల వాకిలి తియ్యవే కొమ్మా

వాకిలి తీయమని వార్తలు తెలిపేవు

వచ్చిన మగవాడెవ్వరో సామి వచ్చిన మగవాడెవ్వరో

నా ముద్దుగుమ్మరో నిను పెండ్లాడిన

రామ కృష్ణులమే భామా రామ కృష్ణులమే భామా

రామ కృష్ణాదులకు రాతిరి వేళలో

వచ్చిన పని ఏమయ్యా రా కారణమేమయ్య

పచ్చని దవనము పరిమల గందము

నీ కంటా నేను తెస్తి భామా నేను నిను చూడాలని వస్తి కొమ్మా

పచ్చని దవనము పరిమల గందము నా కంట తెచ్చితే

నను చూడ వచ్చితే భామలకీపోవయ్య నువు భామలకీపోవయ్య

గండ బేరుండల మృగముల జంపితి

గాసి జెందితి భామా నేను గాసి చెందితిని కొమ్మా

గాసి తీర్చుటకు చెంచిత వున్నది

గరుడాద్రికి పోవయ్య నీవు శేషాద్రికి పోవయ్యా

దానితో ఎక్కడ దారి తెలియదు

దారి చూపవే భామా నీవు దారి చూపవే కొమ్మా

రుక్మిణి యింటికి అటు ప్రక్కనున్నాది

దారి చూపితి పోవయ్యా నీవు దాపు చేరు కోవయ్యా”

వంట చేస్తూ ఎప్పుడో బట్టీ పట్టిన కృష్ణ-సత్యభామల వాదులాటను వర్ణించే జానపద గేయాన్ని తనకొచ్చిన రాగాల్లో పాడుకుంటోంది రంజని.

మొబైల్ మోగడంతో కూనిరాగాన్ని ఆపి చూసింది. చేస్తున్నది అనంత్. గంట క్రితం తాను ఫోన్ చేసినట్టుగా అప్పుడు గుర్తొచ్చింది రంజని.

“హలో!”

“సారీ! ఇంపార్టెంట్ మీటింగులో ఉన్నాను. అందుకే తీసుకోలేదు.” ఉపోద్ఘాతంగా అన్నాడు అనంత్.

“ఇట్స్ ఓకే డియర్! ఎప్పుడొస్తావ్!” అంది రంజని.

“ఏమో తెలీదు. బహుశా ఇంకో ఫైవ్ సిక్స్……” ఆగాడు అనంత్.

“వాట్! ఇంకో ఫైవ్ సిక్స్ అవర్సా?” అంది రంజని.

“నో…..నానో సెంకడ్స్ పట్టొచ్చు!” అన్నాడు అనంత్.

అర్థం కాలేదు రంజనికి – “ఏం మాట్లాడుతున్నావ్?”

“బూ…..” అని వెనకాల గట్టిగా వినబడ్డంతో అదిరి పడింది రంజని.

“యూ….” అంటూ వెనక నిలబడివున్న అనంత్ మీదకు పోయింది రంజని. ఆమెను గట్టిగా వొడిసి పట్టుకున్నాడు అనంత్.

“ఛీ! దొంగలా ఇంట్లో దూరడానికి సిగ్గులేదా?” అంది రంజని.

“సిగ్గా! అంటే ఏంటబ్బా?” అన్నాడు అనంత్, కౌగిలి పట్టును బిగిస్తూ.

“నీకు లేనిది!” అంది రంజని అతని భుజాన్ని గిల్లుతూ.

“నాకు లేనిది, నీకు పోనిదీ సిగ్గన్న మాట. ఐతే మనకి ఫ్రెండ్షిప్ కుదర్దంటే కుదర్దుగా?”

“బేషరమ్! కుదుర్తుంది. అద్సరే నువ్వు లోపలికెప్పుడొచ్చావ్?” అంది రంజని అతని కౌగిలి నుంచి తప్పించుకుంటూ.

“నువ్వదేదో వాకిలి తియ్యీ అంటూ పాట పాడుతున్నావే…అప్పుడొచ్చాను.” అన్నాడు అనంత్.

“ఓహ్!” అంది రంజని.

“ఫోక్ సాంగా?”

“అలా పాడు భాషలో అడిగేకంటే జానపద గేయమా అని అడక్కూడదూ? ఎస్…చాలా తమాషా పాట. మళ్ళీ పాడనా” అంది రంజని.

“ఆకలి ముందు అన్నీ బలాదూర్లా ఉన్నాయ్. ముందు ఫుడ్డు. తర్వాతే ఫోక్ సాంగ్….సారీ….నీ జానపద గీతం!” అన్నాడు అనంత్

“అంతా రెడీగా ఉంది. తమరు దయచేయడమే ఆలస్యం.” అంది రంజని.

విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు అనంత్.

– – – – – – –

అనంత్ కంటే త్వరగా భోజనం చేసిన రంజని, హాల్లోకి వచ్చి లైట్లు తీసేసి, కృష్ణుని ఫోటోకున్న స్పాట్ లైట్స్ మాత్రం ఉంచింది. తన ల్యాప్ టాప్ తెరిచి ఓ పాటను ప్లే చేయడానికి సిద్ధంగా ఉంచుకుంది.

చేతులు తుడుచుకుంటూ అనంత్ హాల్లోకి రావడం చూసి, టక్కున పాటను ప్లే చేసి, వేగంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది రంజని.

“పాట పాడుమా కృష్ణా – పలుకు తేనెలొలుకునటుల

మాటలాడుమా ముకుందా – మనసు తీరగా…ఆ…ఆ…ఆ”

చీకటి – వెలుగు ఆ గదిలో ఆటలాడుకొంటుండగా సున్నితంగా మొదలైన ఆ గాత్రానికి, ఆ రాగానికి, సోఫాలో వయ్యారంగా కూర్చుని నవ్వుతున్న రంజనిని డంగైన అనంత్ “ఓహోయ్!” అన్నాడు.

“శ్రుతిలయాదులన్నీ జేర్చి యతులు నిన్ను మదిని దలచే

సదమలహృదయా నిను సన్నుతించు వరనామము”

అనంత్ పక్కన కూర్చోగానే అతని భుజం మీద తలను వాల్చింది రంజని. “ష్….మాట్లాడకు! కళ్ళు తెరిచి, నేరుగా చూస్తూ పాట విను!” అని గుసగుసగా అంది.

ఆమె చెప్పినట్టే నేరుగా చూసాడు. ఎదురుగా కొత్త ఫోటో.

అందులో ఆవు పొదుగు నుండి పాలను తాగుతున్న బుజ్జి కృష్ణుడు. అతని చేతిలో చిక్కిన లేగదూడ. “ఫెంటాస్టిక్!” అన్నాడు అనంత్. “ష్….” అంది రంజని. మారుమాటాడక మౌనం వహించాడు అనంత్.

“సామవేదసారము సంగీతము సాహిత్యమెగా

దానికంత మధుగానము పాట కూర్చి పాడుమా”

 

సాలూరి రాజేశ్వరరావు గాత్రం హొయలు పోతూ పలుకుతోంది.

“నాకు కృష్ణుడు కావాలి!” అంటూ అనంత్ ను తన మీదకు లాక్కుంది రంజని.

మాటలు అవసరంలేని స్థితి ఒకటి ఆ గదిని, దంపతుల్ని ఆవరించుకుంది.

* * * * *

“గుడ్లగూబను వదిలి మొసలిని చేరిందే!” అన్నాడు రవిశతతేజుడు, లక్ష్మీదేవి కదిపిన ఆమె మొదటి పావును చూస్తూ.

“అవును స్వామీ! ఈ కదలికలోని తత్త్వసారం మీరే బోధించాలి.”

“ఆహా….నీవే చక్కగా సమన్వయం చేయగలవు. కొనసాగించు!” అన్నాడు పార్వతీశ వినుతుడు.

“యథామతి ప్రయత్నిస్తాను స్వామిన్! ఈ గడి ’గజేంద్రమోక్షా’న్ని, అందులోని తత్త్వసిద్ధాంతాన్ని తెలుపుతోంది. బుద్ధిహీనులై ఓ మహర్షిని ఆటపట్టించబోయిన హాహా, హూహూ గంధర్వులు శాపాల పాలై ఒకరు కరి గాను, మరొకరు మకరి గానూ జన్మించారు. ఒకనాటి మిత్రులు నేడు పరస్పర శత్రువులై పెనుగులాడుతున్నారు. ఎవ్వరూ తోడురాని నిస్సహాయ స్థితిలో ’కావవే వరదా! సంరక్షింపు భద్రాత్మకా!’ అని మొరబెట్టిందా ఏనుగు. అప్పుడు….”

“నీకున్ జెప్పక బయల్దేరానని కించిత్ కినుకా!” అన్నాడు నగధరుడు.

మనోజ్ఞంగా నవ్వింది మంజులభాషిణి.

“ఎంత మాట! భక్తులపై మీకున్న అనురాగాన్ని అనుక్షణం ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం నాది. ఇది అందరికీ లభించేనా?” అని చేతులు జోడించింది.

“కొనసాగించు…” అన్నాడు కువలయ మర్దనుడు.

“అప్పుడు…సిరికిన్జెప్పక మీరు కదిలారు. మకరిని చంపి కరిని రక్షించారు.”

“ఈ కథ అందరికీ తెలిసినదే. ఇందులో తత్త్వ రహస్యమేమున్నది ప్రియా?” అన్నాడు చతుర్యుగమూర్తి.

“దీనుల ఉద్ధారార్థమై అలా అడుగుతున్నారు గానీ మీకు తెలియని రహస్యమున్నదా? వివరిస్తాను. మిమ్మల్ని రప్పించింది ఏనుగు. కానీ మొదటగా శాపవిముక్తమైనది మొసలి. మీ దాసుల కంటే దాసానుదాసులని మీరు త్వరగా ఉద్ధరిస్తారు. అందులోనూ ఆ మొసలి మీ దాసుడైన ఏనుగు యొక్క పాదాల్ని పట్టుకుంది. అంటే శరణుజొచ్చిందనేగా? అందువల్ల మీ దాసుడి పాదదాసుడైన మొసలిని మొదటగా అనుగ్రహించారు. ఆ తర్వాతే కరిని కాపాడారు. కనుక ’తద్దాస దాస దాస కిం న దదాసి పుంసః’ అన్నట్టు తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, పండితుల్ని, జ్ఞానుల్ని ఇతోధికంగా సేవించే వారే మీ సత్వరానుగ్రహానికి పాత్రులౌతారు. ఇదే గజేంద్ర మోక్షంలోని తత్త్వ రహస్యం!” అంది హేమాంబర కంఠీరవ మణిగణ ధారిణి యైన లక్ష్మి.

“అద్భుతం! నిగూఢ రహస్యాన్ని సులలితంగా వివరించావు దేవీ. వేదపీఠవైన నీ అనుగ్రహానికి గురైన వారికి ఈ తత్త్వద్యోతనం అత్యంత సులభం.” అన్నాడు పురహరనుతుడు.

“ధన్యోస్మి! మరి మీ రెండో పావును నడపండి. అది తలుపబోయే ఉపదేశామృత్తాన్ని ఆస్వాదించాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది.” అంది తామరసాంబక.

“అలాగే!” అంటూ పాచికల్ని కదిపాడు దైత్యమత్తేభ దమనుడు.

ఆయన వేసిన పాచికలు కరి-మకరి పెనుగులాటలో పోటెత్తిన కోనేటి నీటి సవ్వడిలా హోరుమన్నాయి.

* * * * *