ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వైకుంఠపాళీ – ఇరవై ఎనిమిదవ భాగం

Like-o-Meter
[Total: 1 Average: 4]

గతభాగం

 

పల్లెటూరి గతుకుల దారిలో బస్సు నెమ్మదిగా పోతోంది.

ఉపాధ్యాయ, మరో పురోహితుడు తో బాటూ కూర్చున్న కేశవ శర్మ వాళ్ళు ముగించుకు వస్తున్న కార్యక్రమం గురించి పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు.

కండక్టర్ బస్సునాపి ఎవర్నో ఎక్కించుకున్నాడు.

ఆ వ్యక్తి లోనికి రాగానే సారాయి వాసన గుప్పుమని కొట్టింది. ఉపాధ్యాయ, మరో పురోహితుడూ కండూవాల్తో ముక్కుల్ని మూసుకున్నారు. ఆ వ్యక్తి తూలుతూ వచ్చి వాళ్ళ పక్క సీట్లో కూలబడ్డాడు. ఇప్పుడు సారా వాసనతో బాటూ మురికి బట్టల నుండి వస్తున్న గబ్బు తోడయింది.

ఆ కంపుకు బుర్ర తిరిగిపోయిన పురోహితుడు “ఏమండీ కండక్టర్ గారూ! ఇలాంటి వాళ్ళని ఎక్కించుకుంటారేమిటండీ?” అని అరిచాడు. దానికి సమాధానంగా ఆ కండక్టర్ “పంతులుగారూ! ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టు. టికెట్టు కొనేవాళ్ళెవరైనా బస్సు ఎక్కొచ్చు!” అని అన్నాడు. అబ్జెక్షన్ ఓవర్-రూల్డ్ ఐన న్యావాదిలా నోరు నొక్కేసుకున్నాడా పురోహితుడు.

సీటు చివరలో కూర్చునున్న శర్మ ఆ ప్రక్కనే కూలబడిన తాగుబోతును పరిశీలనగా చూసాడు. మాసి, మట్టిగొట్టుకుపోయున్న ప్యాంటు, షర్టు, బవిరిగడ్డం, తైలసంస్కారానికీ, క్షవరానికీ నోచుకోక ఉండలు గట్టి, గాలికి రేగుతున్న జుత్తు, భుజం నుండి వేళ్ళాడుతున్న జిప్పూడిపోయిన సంచీ. ఆ సంచీలో నుండి తొంగిచూస్తున్న కొన్ని గుడ్డలు. ఒక పిల్లనగ్రోవి. “అదొక్కటే అతకని వస్తువు!” అను అనుకున్నాడు శర్మ.

అరకొర మత్తులో కూరుకుపోయిన ఆ వ్యక్తి కళ్ళు తెరచి శర్మను చూసాడు. ఇద్దరూ పరస్పరం చూసుకుంటున్నారు. ఏమనిపించిందో గానీ ఆ తాగుబోతు శర్మను చూసి నవ్వాడు. వణుకుతున్న చేతుల్తో ఓ దండం కూడా పెట్టాడు. శర్మ భావరహితంగా చూస్తూనేవున్నాడు.

“ఛీ ఛీ ఛీ! కడుపులో నుండి వికారం తన్నుకొచ్చేస్తోంది. పాడువాసన, పాడు వాసన. ఇదిగో! నిన్నే! ఓయ్! ఆ వెనకాల సీట్లోకెళ్ళు.” అని విసుక్కున్నాడు పురోహితుడు. “అబ్బా! సీతాపతీ! ఊరుకోవయ్యా! అసలే తాగుబోతు. నీ అరుపులకు తిక్క రేగిందంటే ఏడేడు తరాల్నీ తీసుకొచ్చి తిడతాడు. వాడి నోటిని తెరిపించడం కంటే మనం ముక్కు మోసుకోవడం ఉభయతాపి క్షేమం!” అన్నాడు ఉపాధ్యాయ.

“అలా అంటారేమిటండీ! ఇది పబ్లిక్ బస్సని కండక్టరు ఎక్కించుకొనె. బూతులు తిడతాడేమోనని నన్ను నోరుమూసుకోమని మీరు చెప్తున్నారాయే. ఇదెక్కడి అన్యాయమండీ! ఇంతకీ నేనేమన్నాననీ! వెనక సీట్లో కూర్చుంటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదని చెబుతున్నానంతేగా! దానికే వీడు బూతులు తిడతాడా? ఒకవేళ ఆ పనే గనక చేస్తే….ఏమండోయ్! ఇదే చెబుతున్నా, నాకూ నాటు భాషవచ్చు. ఆ అప్రాచ్యపు మాటల్ని నేను పలికానా వీడు చచ్చూరుకుంటాడు. ఛీ! ముదనష్టపు జనాలు, ముదనష్టపు జనాలు!” అని విసుక్కుంటూ కిటికీలో నుండి బైటకు ముఖం పెట్టి కూర్చున్నాడు సీతాపతి అనబడే ఆ పురోహితుడు.

సీతాపతి నసుగుడుకు మరో ఇద్దరు ప్రయాణీకులు కూడా గొంతు కలపడంతో కండక్టర్ లేచి వచ్చి ఆ తాగుబోతు జబ్బ పట్టుకుని “లే లే! ఆ వెనకాల కూర్చు!” అన్నాడు. ఆ తాగిబోతు లేవలేదు. మరోమారు చెప్పాడు కండక్టర్. అతను కదల్లేదు.  “ఏరా! కొవ్వెక్కిందా? చెప్పేది అర్థం కాదా!” అంటూ బూతులు లంకించుకున్నాడు కండక్టర్. ఐనా ఆ వ్యక్తిలో చలనం లేదు. మొండిగా సీటుకు అతుక్కుపోయి “పోరా…పోరా” అని ముద్దముద్దగా అన్నాడు. దాంతో వొళ్ళు మండిన కండక్టర్ విసురుగా చెంప మీద ఎడాపెడా కొట్టాడు. అలా కొట్టడాన్ని చూడలేకపోయిన శర్మ కండక్టర్ను ఆపాడు. “పోనివ్వండీ! కొట్టడమెందుకు? మేము సర్దుకుంటాం!” అన్నాడు. శర్మను చూడగానే చల్లబడ్డాడు కండక్టర్. “మీరు సర్దుకుంటానంటే నాకేం ఇబ్బందీ! ఆ పంతులుగారు గొడవెట్టారని గానీ….” అంటూ సీతాపతి కేసి చూసాడు. అప్పటిదాకా చోద్యం చూస్తున్నట్టు చూస్తున్న సీతాపతి చటుక్కున తలతిప్పుకున్నాడు.

కండక్టర్ తన సీట్లోకెళ్ళిపోయాడు. శర్మకు మరోమారు దండం పెట్టాడు తాగుబోతు.

అతను నవ్వుతున్నప్పుడు కనబడిందా రక్తం. “అయ్యో! మీ నొట్లో రక్తం!” అన్నాడు శర్మ క్రింది పలువరసకేసి చూపిస్తూ. ఏమీ పట్టనట్టుగా ఉండిపోయాడు ఆ తాగుబోతు. శర్మ మౌనం వహించాడు. కొన్ని నిముషాల తర్వాత సద్దుమణిగి, చాలామంది నిద్రలోకి జారుకున్నారు. సీతాపతి కిటికీకి తల ఆనించి జోరుగా నిద్రపోసాగాడు. తెల్లవారుజామున మూడింటికే లేచివుండడం వల్ల శర్మ కూడా కునుకులోకి జారుకున్నాడు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY


ఓ చక్కటి, శ్రావ్యమైన రాగమొకటి శర్మ మాగన్నును కుదిపి లేపింది. చప్పున కళ్ళు తెరచి చూశాడు శర్మ. ఆ తాగుబోతు పిల్లనగ్రోవిని వాయిస్తున్నాడు. వెనువెంటనే ఆ పాటేదో గుర్తించాడు. “క్షీరసాగర శయనా నను చింతల బెట్ట వలెనా?” దేవగాంధారి రాగంలోని త్యాగరాజు కీర్తన. ఆశ్చర్యంతో శర్మ కనుబొమలు ముడిపడ్డాయి. అతని ఆశ్చర్యానికి కారణం తాగుబోతు మురళి వాయించడం కాదు.

నెమ్మనెమ్మదిగా హెచ్చుతున్న వేణువు నాదానికి బస్సులోని అందరి నిద్రా పారిపోయింది. కళ్ళు నులుముకొంటో, కళ్ళజోళ్ళని సరిచేసుకుంటో అందరూ ఆ నాదం వస్తున్న దిశకు తలలు నిక్కించి చూస్తున్నారు. సారాయి మత్తో లేక అంతర్యామి ప్రేరణో ఆ తాగుబోతు మురళీగానం సాగిపోతూనేవుంది.

కునికిపాట్లనుండి లేచిన సీతాపతి నోరువెళ్ళబెట్టి ఆ నాదాన్ని వినసాగాడు. తెలియకుండానే అతని చేతులు దరువులు వేయసాగాయి. ఉపాధ్యాయ కూడా ఆ తాగుబోతు వైపుకు చూస్తూ ఉండిపోయి సంగీతాన్ని ఆస్వాదించసాగాడు. శర్మకు ఇప్పుడెలాంటి ఆశ్చర్యమూ లేదు. అతని మనసు తాగుబోతు వేళ్ళ కదలికలపైన, బుద్ధి గమకాలపైన, చిత్తం కీర్తనలోని భావం మీద కేంద్రీకరింపబడ్డాయి. అలాంటి తాదాత్మ్యంలో తుచ్ఛమైన, క్షుల్లకమైన లౌకికాశ్చర్య విడంబనాలకు చోటేది?

పది పదిహేను నిముషాల లలిత లలిత స్వర కలిత నాదోపాసన చేసి చటక్కున మురళిని పెదవుల నుండి తీసేసి వెర్రిగా నవ్వాడా తాగుబోతు. నవ్వుతూనే ఎక్కిళ్ళతో సతమతమౌసాగాడు. ముందుసీట్ల ఉన్నవాళ్ళలో ఒకరు నీళ్ళ బాటిల్ ను అందించారు. రెండు గుక్కల నీళ్ళు తాగి – “అబ్బా!” అని అన్నాడా తాగుబోతు.

“ఆ….మీరు ఇక్కడే దిగాలి!” అన్నాడు కండక్టర్ తాగుబోతు వంక గౌరవంగా చూస్తూ. మురళీగానం సాగుతున్నంత సేపూ తన తోలుసంచీ మీద దరువులు వేస్తునేవున్న కండక్టర్, కచేరీ ముగిసిన తర్వాత తన ప్రక్కన కూర్చున్న ప్రయాణీకుడితో తను కూడా చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నట్టు, కొద్ది రోజులు వేణుగానాన్ని సాధన చేసినట్టూ చెప్పుకొచ్చాడు. అరగంట క్రితం బూతులు తిట్టిన వ్యక్తినే ఇప్పుడు ’మీరు’ అంటూ గౌరవించసాగాడు.

తూలుతూనే లేచి, అప్పుడే నడకలు నేరుస్తున్న పసిపాపలా తడబడుతూ క్రిందకు దిగాడు. అతను పూర్తిగా క్రిందకు దిగబోయేలోగా బస్సును ముందుకు ఉరికించాడు డ్రైవర్. పట్టు జారి క్రింద పడిపోయాడా నిర్భాగ్యపు కళాకారుడు. బస్సులో ఉన్నవాళ్ళందరూ ’ఓ’ అంటూ గట్టిగా అరిచారు.

అందరి కంటే ముందుగా శర్మ క్రిందకు దిగాడు. బలమైన దెబ్బ తగిలి రక్తం ఓడుతున్న అతని తలను తన ఒడిలోకి తీసుకున్నాడు. తెల్లటి అతని పంచె మీద ఎర్రగా అంటుకుంది రక్తం. తన కండూవాను అతని తలకు చుట్టి “బస్సులోకి పట్టండి. ఆసుపత్రికెళ్దాం!” అన్నాడు. మరో నలుగురు చేరి అతన్ని ఎత్తుకుని బస్సులోకి ఎక్కారు. పోలీస్ కేసు అవుతుందేమోనన్న భయంతో డ్రైవర్ ఓ ప్రయాణీకుడు దారి చెబుతుంటే దగ్గరలోనే ఉన్న చిన్న ఊళ్ళోకి బస్సును మళ్ళించాడు.

ఆ ఊరికంతా కలిపి ఒకే ఒక ఆర్.ఎం.పి డాక్టర్ ఉన్నాడు. తన దగ్గరవున్న సరంజామాతో ప్రథమ చికిత్స చేసి పరిస్థితి చెడేలోపు ఏదైనా మంచి హాస్పిటల్‍కు తీసుకెళ్ళమని సలహా ఇచ్చాడు. ఆ వూరి నుండి ఇంకొద్ది దూరంలో కాస్త మంచి ఆసుపత్రి ఉన్నట్టుగా వివరాలు ఇచ్చాడు. డ్రైవర్, కండక్టర్, మరికొద్ది మంది ప్రయాణీకులు తలా కొంత డబ్బు వేసుకుని ఆ డాక్టర్‍కు ఇచ్చి మళ్ళీ బస్సును బయల్దేరదీసారు. సీట్లకు మధ్యన ఉండే జాగాలో తాగుబోతు కళాకారుడిని పడుకోబెట్టారు. అతనిలో జీవం అటు ఇటుగా కొట్టుకుంటోంది. శర్మ, ఉపాధ్యాయ అతనికి కాపలా కాస్తున్నారు.

డాక్టర్ చెప్పిన ఊరు చేరేసరికి సాయంత్రమైపోయింది. మొదట్లో మెడికో-లీగల్ కేసని మొరాయించిన ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు సాంప్రదాయస్తులుగా కనబడుతున్న శర్మ, ఉపాధ్యాయల్ని చూసి ఏ కళనో ఒప్పుకున్నారు. చకచకా చికిత్స మొదలుపెట్టారు.

అంతా సద్దుమణగడం చూసిన డ్రైవర్, కండక్టర్, మిగతా ప్రయాణీకులు మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. వారితో బాటే సీతాపతి కూడా మొహం చాటేసి వెళ్ళిపోయాడు. ఆసుపత్రిలో డాక్టర్‍తోను, సిబ్బందితోనూ మాట్లాడుతూ ఉండిపోయిన శర్మ, ఉపాధ్యాయ మిగతావాళ్ళు వెళ్ళిపోయారన్న సంగతిని ఆలస్యంగా గమనించారు. ఉపాధ్యాయ బాధపడుతుంటే ఓదార్చాడు శర్మ.

వాళ్ళిద్దరినీ చూసిన ఆ హాస్పిటల్ యజమాని శర్మతో – “స్వామీ! నా పేరు హరనాథ్. ఈ హాస్పిటల్ నాదే. ఇబ్బంది అని అనుకోబోతే, మీరు మా ఇంటికి రండి. పైన ఓ గది విడిగా ఉంది. మీరిద్దరు ఈ రాత్రికి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఉండీ చేసేదేమీ లేదు. మావాళ్ళు చూసుకుంటారు. రేపొద్దునకి బహుశా తెలివి రావొచ్చు.” అన్నాడు.

ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు శర్మ, ఉపాధ్యాయలు. ఆ ఇద్దరికీ ఇలాంటి అసందర్భంలో ఇరుక్కోవడం ఇదే ప్రథమం. ఇద్దరికీ మడి, మైలల ఆశంక బాధిస్తోంది. అంతేకాదు మరుసటి రోజు ఉదయం ఆహ్నికం గురించి బెంగ పట్టుకుంది. వాళ్ళ బాధను గ్రహించినట్టుగా – “ప్రొద్దున్నే మీరు అనంతకృష్ణశాస్త్రిగారి ఇంటికెళ్ళే ఏర్పాటు చేస్తాను. వారు మా వెనక వీధిలోనే ఉంటారు. శివాలయం అర్చకులు.” అన్నాడు హరనాథ్. సంక్షిప్తంగానూ, సారభూతంగానూ ఉన్న అతని మాటలు ఆ వైదీకుల మనసులను ఆకట్టుకున్నాయి.

“అతనికేం ప్రమాదం లేదుగా డాక్టర్?” అని అడిగాడు ఉపాధ్యాయ. ’ఏమీ లేద’న్నట్టుగా తల ఊపి “వెళ్దామా?” అన్నాడు హరనాథ్. అతన్ని అనుసరించారు శర్మ, ఉపాధ్యాయలు.

_ _ _ _ _ _ _

హరనాథ్ సమకూర్చిన పళ్ళు, పాలతో ఆ రాత్రి భోజనాన్ని ముగించారు శర్మ, ఉపాధ్యాయలు. విశాలమైన ఆ మేడ మీద గదిలో నేలపై నడుంవాల్చారిద్దరూ. కాసేపటి నిశ్శబ్దం తర్వాత – “శర్మా! ఆ తాగుబోతు మీద నీకు అవ్యాజమైన కారుణ్యం పుట్టుకొచ్చింది. ఎందుకంటావ్?” అని అడిగాడు.

“తాగుబోతైనా మన లాంటి మనిషేగా ఆచార్యా!” అన్నాడు శర్మ.

“మేమందరం అసహ్యించుకుంటున్నా నువ్వు మాత్రం మొదటినుంచీ మామూలుగానే ఉన్నావ్. ఎందుచేత?”

“ఏమో! తెలీదు. అతని సంచీలో ఉన్న పిల్లనగ్రోవిని చూసినప్పుడే ఓలాగా అనిపించింది!””

“ఓహో….దాన్ని నువ్వు ముందుగానే చూసావా? అతనో కళాకారుడైవుంటాడని అప్పుడే ఊహించేసావా?” కౌతుకంగా అన్నాడు ఉపాధ్యాయ.

“అవును!” – ముక్తసరిగా అన్నాడు శర్మ.

మరికొన్ని క్షణాలు మౌనం పిదప – “ఐనా, అబ్బాయ్! వాడో పచ్చి తాగుబోతు. జూదరో, వ్యభిచారో కూడా ఐవుంటాడు. అలాంటి వాడికి అంత గొప్ప సంగీతం ఎలా అబ్బిందంటావోయ్?” అన్నాడు ఉపాధ్యాయ, అదేదో ప్రపంచపు వింతైనట్టుగా, జరగకూడనిది జరిగిపోయినట్టుగా.

“కళ అనేది పూర్వజన్మ సుకృతం. వ్యసనమన్నది ప్రస్తుత జన్మలోని విపర్యాసం. రెండింటికీ ప్రత్యక్ష సంబంధం లేదు.” అన్నాడు శర్మ.

“అతనిలో నిన్ను ఆకట్టుకొన్నది అదేనా?” అన్నాడు ఉపాధ్యాయ,

“అదొక్కటే కాదు ఆచార్యా! అంతటి మత్తులో కూడా లయ తప్పని నాదాన్ని పలికించాడతను. అతని మెదడు సారాయితో మసిబారినా, లోపలనున్న అంతఃచేతనంలో ఏదో శుద్ధత్వం ఉంది. ఆ శుద్ధత్వమే అతని చేతి వేళ్ళని కదిలించింది. సుస్వరమైన నాదోత్పత్తిని సాధించింది. వేణువు కాక చేతికో కలాన్ని ఇచ్చి రెండు వాక్యాలు వ్రాయమంటే అతని వల్ల కాకపోయిండేది.” అన్నాడు శర్మ.

కేశవశర్మ మాటల్లోని ఆంతర్యం ఉపాధ్యాయను ఇట్టే ఆకర్షించింది. శుద్ధ శ్రోత్రియుడైన ఉపాధ్యాయకు మంత్రాల ఘనాపాఠీయం ఉంది గానీ శర్మకు ఉన్న విశ్లేషణా విచక్షణ తక్కువే. ఆ విషయం అతనికి అనేక సందర్భాల్లో అర్థమైంది. అందుకే వయసులో చిన్నవాడైనా శర్మ చెప్పే మాటల్ని శ్రధ్ధగా వింటాడు.

“ఐతే శర్మా! ఇతనో శాపగ్రస్తుడైన గంధర్వుడంటావా?” అన్నాడు.

“గంధర్వుడా? అంతటి గొప్ప పోలికను సాధించే సాహసం చేయలేను. కానీ ఇతను కచ్చితంగా ఓ అపురూపమైన జీవి. వృథావ్యసనంలో చిక్కుకున్న శాపోపహతుడు. ఇంతకు ముందున్నట్టుగా కళ్ళు, కాళ్ళు స్వాధీనంలో ఉండని మత్తులో కూడా అద్భుతమైన లయజ్ఞానాన్ని చూపించడం అరుదైన విషయమే!” అన్నాడు శర్మ. సంగీతంలో శర్మకు చక్కటి అవగాహన ఉందని తెల్సిన ఉపాధ్యాయ అతని నిర్ణయాన్ని శంకించేందుకు వెళ్ళలేదు.

మళ్ళీ శర్మే కొనసాగించాడు – “ఆచార్యా! మీకు తెలుసు! శబ్దం లేకుండా ఈ ప్రపంచం లేదు. లయబద్ధమైన శబ్దమే నాదం. ఈ ప్రపంచం మొత్తం నాదస్వరూపం. నాదం పరమాత్ముని మరో రూపం. ’న నాదేన వినా గీతం న నాదేన వినా స్వరః| న నాదేన వినా రాగస్తస్మాన్నాదాత్మకం జగత్|’ అన్నాడు సంగీతదామోదర కర్త. అక్కడితో ఆగకుండా ’న నాదేన వినా జ్ఞానం న నాదేన వినా శివః| నాదరూపం పరం జ్యోతిర్నాదరూపీ పరం హరిః’ అని నొక్కి చెప్పాడు.” అని ఆగాడు.

“ఆహా! బావుంది. ’త్రైవర్గ ఫలదాః సర్వే దాన యజ్ఞ స్తవాదయః – ఏకమ్ సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం’ అని కూడా అన్నారు.” అన్నాడు ఉపాధ్యాయ.

“అవును! ’శబ్దమూర్తి ధరస్యైతె విష్ణోరంశ మహాత్మనః’ అంటుంది విష్ణుపురాణం. నాదానికి అక్షరాలు ఆశ్రయాలు. ఆ అక్షరాలకు లిపి మరియు శబ్దం అనే రెండు ముఖాలున్నాయి. శబ్దాలు విష్ణువు యొక్క అంశలు. దీన్ని మరింత స్పష్టంగా చెబుతూ – ’నాహం వసామి వైకుంఠే యోగినో హృదయే న వై | మద్భక్తా యత్ర గీయంతి తత్ర తిష్టామి నారదా’ అని అన్నాడు శ్రీహరి. వైకుంఠంలోనో, యోగుల హృదయాల్లోనే కాక ఎవరైతే తన నామ కీర్తనను గానం చేస్తుంటారో వారిలో కూడా నేనుంటానని నారదుడికి ఉపదేశించాడు నారాయణుడు.”

“బావుంది! ఇంతకీ తాళం అంటే ఏమిటి?” అడిగాడు ఉపాధ్యాయ.

“తల ప్రతిష్టాయాం అని ధాతువు. ఒక స్వరాన్ని ఎంతసేపు పాడాలని సూచించేది తాళం. దీన్ని చేతులతో దరువు వేయడం ద్వార తెలుసుకోవచ్చు. పార్వతీపతియైన మహారుద్రుడు చేసే నాట్యానికి ’తాండవ’మని పేరు. పార్వతీదేవి చేసే నాట్యానికి ’లాస్య’మని పేరు. ఆ రెండు పదాల మొదటి అక్షరాలైన తా, ల లను కూర్చితే పుట్టిందే ’తాళం’. ’నకారం ప్రాణ నామానాం దకార మనలం విదుః’ అని చెప్పినట్టుగా మన చెవుల్ని గట్టిగా మూసుకుంటే ’హూం’ అన్న ధ్వని నిరాటంకంగా వినబడుతూనే ఉంటుంది. అదే ప్రాణవాయు సంచార శబ్దం. వైశ్వానరాగ్ని ప్రజ్వలన చ్ఛటచ్ఛటలు. వెరసి అదే జీవనాదం. ఆ ’హూం’కార నాదం ఉన్నంతసేపూ మనలో శ్వాసోచ్ఛ్వాస ఒక ’తాళ’బధ్ధమైన రీతిలో సాగుతుంది. అది నిలచినరోజు జీవనతాళం ఆగిపోతుంది. వైశ్వానరుడు, ప్రాణాగ్ని శాంతులైన రోజున మనలోని నటరాజు తన అర్ధాంగితో కూడి తొలగిపోతాడు.. సర్వచేష్టాప్రదమైన మనిషి మరుక్షణంలో శవమనిపించుకుంటాడు. మూగబోతాడు. నాదహీనుడౌతాడు.” అన్నాడు శర్మ. అతని గాత్రం గద్గదికమౌతోంది.

ఉపాధ్యాయ కూడా మారుమాట్లాడలేకపోయాడు. శర్మలోని విశ్లేషణాశక్తి అతనిలోని విద్యాశక్తిని జయించింది. తాను పఠిస్తున్న ప్రతి అక్షరంలోని నాదాత్మకమైన పరమాత్ముని లీలను లీలామాత్రంగానైనా తెలుసుకోగలిన ఈ సుకృతానికి మూలం ఓ తాగుబోతన్న నిష్టుర సత్యం ఉపాధ్యాయను ఆసాంతం కుదిపివేసింది. ఇప్పుడు ఉపాధ్యాయకు ఆ తాగుబోతులో కూడా ఏదో సుందరత్వం కనబడసాగింది.

భగవంతుని సృష్టిలో ప్రయోజనంలేని వస్తువు గానీ, వ్యక్తి గానీ లేదన్న మరో ధర్మసూక్ష్మం అతనికి గోచరించింది. తన ప్రక్కనే పడుకునివున్న ఈ సాధారణ వ్యక్తిలో అసాధారణమైన సమన్వయశక్తి ఉందనీ, అది నీచ సన్నివేశాల్లో కూడా ఉత్తమమైన జ్ఞానాన్ని వెలికి తీయగలదని, అలా సర్వత్రా జ్ఞానాన్ని దర్శించగలగడమే జీవనసాఫల్యమని గ్రహించాడు ఉపాధ్యాయ.

’లబ్ డబ్’ అని లయాత్మకంగా ధ్వనించే హృదయ స్పంద నం బాహ్యప్రపంచానికి వినిపించని నిశ్శబ్దనాదోపాసన. అదే నేడు ఉపాధ్యాయ మస్తిష్కంలో రేగుతున్న నాద-లయ-విలయ తాండవలాస్యం. అతనికి ఇంకేమీ మాట్లాడాలని అనిపించలేదు.

తాళబధ్ధమైన నాదోపాసనకు వాగాడంబరంతో పనిలేదు.

_ _ _ _ _ _ _

“స్వామీ! హనుమంతుని వద్ద ఉండిన మీ రెండో ఆటకాయ పరమపదాన్ని చేరేసింది.”

“అవును దేవీ! పండితుడూ, సమదర్శి ఐన హనుమ అనుగ్రహంతో పరమపదం లభించడం అసాధ్యమేమీ కాదు! మాయ అనేది మత్తులాంటిది. ఆ మత్తుకు విరుగుడు సుజ్ఞానమే. అటువంటి నిజజ్ఞానానికి నిదర్శనం హనుమంతుడు. అంజనాసుతుని పాదసేవనంతో మాయ తొలగి, పరమపదం ప్రాప్తమౌతుంది”

“నా రూపమైన మాయ మత్తుమందులాంటిదా ప్రభూ?”

“దేవీ! అది కేవలం పోలిక మాత్రమే. వాస్తవ విషయం కాదు. మాయా, జయ, కృతి, శాంతి అన్నవి నీ నాల్గు రూపాలు. మాయా-వాసుదేవ, జయ-సంకర్షణ, కృతి-ప్రద్యుమ్న, శాంతి-అనిరుద్ధ అన్నవి మన మూల రూపాలు. మాయా-వాసుదేవులకు ప్రభవించిన వాడే బ్రహ్మ. ప్రపంచమంతా మాయామయమంటే లక్ష్మీమయమనే అర్థం. అప్రాకృతుడనైన నాకు, బ్రహ్మ సృజించిన ప్రాకృతబద్ధ జీవరాశులకు మధ్య తెరలా నీ ‘మాయా’ రూపం ఆవరించివుంటుంది. ‘మాయ’ అంటే భ్రమ కాదు. సత్యభూతమైన ఈ భౌతిక సృష్టికే ‘మాయా’ అన్న పేరు. ఈ భౌతికావరణాన్ని దాటి నా స్వరూపాన్ని ఎంతో కొంత తెలుసుకోవడమే ముక్తి. కానీ నీ ‘మాయా’ రూపాన్ని దాటడం అంత సులభం కాదు. ఎందుకంటే సర్వలక్షణసంపన్నురాలివైన నీ ఆకర్షణ అత్యంత బలమైనది. ప్రాకృతిక సుఖభోగాలనే మత్తును కలిగించేది. ఆ మత్తు వీడాలంటే భౌతికమైన దేహాన్ని దాటి, లోపలనున్న అంతఃచేతనాన్ని గుర్తించగలగాలి. అప్పుడే సునిశితమైన, ఆధ్యాత్మికజ్ఞానసత్త్వమైన మనోనేత్రం తెరచుకుని గీతలో చెప్పినట్టుగా  ‘శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః’ అన్న స్థితి అనుభవంలోకి వస్తుంది.”

“అంటే మీ రెండో ఆటకాయ అలాంటి స్థితిని నేడు సాధించిందన్న మాట! దానిదెంతటి సౌభాగ్యం! సర్వజ్ఞానాధారులైన మీ చేతితో నడపబడింది కాబట్టే సమదర్శిత్వాన్ని సాధించి ముక్తిని పొందింది. మీ రెండు కాయలూ పరమపదాన్ని చేరేసాయి. అంటే మీరు గెల్చినట్టే…ఆట ముగిసినట్టే!”

“నా ప్రియసఖివి. మరో పందెం వేసి నీ కాయల్నీ గట్టెక్కించు”

“చిత్తం మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం.” అంటూ అంబ పాచికల్ని వేస్తే అవి నారదుని మహతీ తంత్రీనినాదాల్లా సుస్వరంగా ధ్వనించాయి.

* * * * *