గత భాగం: “ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్ వెంచ్యూర్స్”లో భాగంగా అనంత్ ను ఎంపిక చేసి సన్మానిస్తుంది ఓ ముంబై సంస్థ. అక్కడ వినోద్ దూబే, షైనా విలియమ్స్ అనేవారిని రంజనికి పరిచయం చేస్తాడు అనంత్. తన వాగ్ధాటితో మంచి పేరు తెచ్చుకుంటాడు అనంత్. టెక్నికల్ బ్లాగ్ తెరవడంలో తన పాత్రను సభలో కొద్దిగానైనా చెప్పలేదన్న బాధ రంజనిలో మొదలౌతుంది. అనుకోకుండా విశ్వేశ్వర్ అనే అంధుడు ఆమెకు పరిచయమౌతాడు. షైనా విలియమ్స్ తో అనంత్ షికార్లు కొడుతున్నట్టు తెలుసున్న రంజని పీడకలల్తో సతమతమౌతుంది. |
వచ్చిన ఆ ఐదుమందితో కేశవశర్మ మాట్లాడ్డం మొదలుపెట్టి దాదాపు గంట పైనే కావస్తోంది. లోనవున్న సుమతికి విషయమేంటో పూర్తిగా అర్థం కాలేదు గానీ ఆ వచ్చినవాళ్ళలో ఇద్దరు కుర్ర దంపతులనీ మిగిలిన ముగ్గురిలో ఇద్దరు అబ్బాయి తల్లిదండ్రులు, ఒకరు అమ్మాయి అన్న అని తెలిసింది. ఏదో వివాహ సమస్యల్లే ఉంది.
మరికొద్దిసేపటి తర్వాత ఆ యువ దంపతులు కేశవశర్మ కాళ్ళకు నమస్కరించారు. పెద్దవాళ్ళు కూడా ఆయనకు నమస్కారం చెప్పారు. ముత్తైదువులకు కుంకుమ ఇవ్వమని సుమతిని పిలిచాడు శర్మ.
వాళ్లందరూ అక్కడి నుంచి కదిలారు.
అందరి ముఖాలపైనా నవ్వులు.
“సుమతీ!” అని పిలిచాడు శర్మ.
హాల్లోకి వచ్చింది సుమతి.
“అంతా సక్రమంగా జరిగింది.” అన్నాడు శర్మ.
“వాళ్ళ ముఖాలపైని నవ్వే చెబుతోంది!” అంది సుమతి చిరునవ్వుతో.
“ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా?” అన్నాడు శర్మ.
“నాకు తెలియాల్సిన విషయాల్ని మీరు చెబుతారుగా!” అంది సుమతి.
తన పైన ఆమెకున్న నమ్మకాన్ని చూసి సంతోషించాడు శర్మ.
“ఈ సంబంధాన్ని కుదిర్చింది, పౌరోహిత్యం నిర్వహించిది నేనే. అందువల్ల వాళ్ళు యుద్ధానికి రాలేదనుకో! ఆ అమ్మాయి తల్లిదండ్రులకి మా నాన్నగారు బాగా తెలిసినవారు. అందుకనే ఇక్కడికొచ్చారు.” అన్నాడు శర్మ.
“ఓహో! ఇంతకీ సమస్య ఏమిటో?” అంది సుమతి.
“చర్విత చర్వణం. ఈకాలం కొత్త దంపతుల్లో చాలామందికి ఎదురయ్యే సమస్యే! తల్లా-పెళ్ళామా?” అన్నాడు శర్మ నవ్వుతూ.
“మీకు ఎదురుకాని ఈ సమస్యను ఎలా పరిష్కరించారో?” అని అర్ధోక్తిలో ఆగింది సుమతి.
“సుమతీ! కొన్ని సమస్యల్ని ప్రత్యక్షంగా అనుభవించకపోయినా ఆ సమస్యల్ని దగ్గరి నుంచి చూడ్డం ద్వారా అవగాహన పెరుగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇక్కడా అదే జరిగింది.” అన్నాడు శర్మ.
“మరి, చివరకు వాళ్ళ సమస్య పూర్తిగా తీరినట్టేనా?”
“నా తప్త లోహో లోహేన సంధీయతే – కాల్చకుండా ఒక లోహం మరో లోహంతో అతుక్కోదు. ఆవిధంగానే కష్టాలనే వేడి తగిలిన మనుష్యులు ఆ కష్ట నివృత్తి కోసం దగ్గరౌతారు. ఈ కొత్త దంపతుల విషయంలో కూడా అదే జరిగింది. దైవీకమైన దోషాలను శాంతికర్మలతోను, మానవ తప్పిదాలను నేర్పుతోనూ నివారించుకోవాలని చాణుక్యుడు చెబుతాడు. ఆవిధంగా వాళ్ళిద్దరి మధ్యా ఉన్న అనుమానమనే తప్పును శాస్త్ర విజ్ఞానమనే నేర్పుతో తొలగించడంతో ఈరోజు ఒక్కటైయ్యారు.”
“బాగుంది. వారికి చెప్పిన శాస్త్ర విషయాల్నీ నాకూ చెప్పండి.”
“సుమతీ! ఈ శాస్త్రవిజ్ఞానమన్నది ఏ ఒక్కరికో, నలుగురికో తెలిసినదని అనుకోరాదు. మనందరికీ తెలిసిన విషయాలే! కానీ ఆ విజ్ఞానాన్ని ఎక్కడ, ఎలా అన్వయించుకోవాలో తెలియనప్పుడే సమస్యలు బయల్దేరుతాయి. మనుష్యుల జీవితాలన్నీ ’అభిప్రాయా’ల వల్లనే నడుస్తాయి. చెడ్డవారిపై మంచి అభిప్రాయమున్నప్పుడు వాళ్ళెలాంటి తప్పులు చేసినా సర్దిపుచ్చేసుకుంటాం. దీనికి వ్యతిరేకంగా మంచివారి పట్ల చెడు అభిప్రాయాల్ని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు మనకు మంచి చేయబోయినా తిరస్కరిస్తాం. కల్లు అమ్మినవాడు పాలు అమ్మబోతే ఆ పాలను కల్లుగానే భావిస్తుంది లోకం.”
“అవును! ఈ పోలిక చక్కగా ఉంది.” అంది సుమతి.
“తల్లిదండ్రుల్ని వదలి వచ్చాను గనుక నన్నే ప్రేమించాలన్నది ఆ అమ్మాయి అభిప్రాయం. నీతో బాటూ నావాళ్ళనూ ప్రేమించడం నా కర్తవ్యమన్నది అబ్బాయి అభిప్రాయం. రెండు పచ్చికుండలు ఢీకొంటే వాటికి రక్షణ ఉంటుందా?”
“లేదు. రెండూ పగిలిపోతాయి.”
“వాళ్ళ జీవితాలూ అలానే అయ్యాయి. జీవితం యొక్క అర్థాన్నీ, లోతునీ తెలుసుకోని యువత పచ్చికుండల్లాంటివే. అలాంటివాళ్ళు అభిప్రాయభేదాలతో ఒకరినొకరు ఢీకొంటే మిగిలేదు పగిలిన జీవితాలే!”
“సులభమైన పోలికతో ఎంతో బరువైన సత్యాన్ని చెప్పారండీ!” అందు సుమతి మెచ్చుకోలుగా.
“పిచ్చిదానా! ఇందులో నా స్వంతమైన మాట ఒక్కటీ లేదు. అంతా మన పూర్వీకులు చేసిన ఉపదేశాల్లోనివే!” అన్నాడు శర్మ.
ఒప్పుకుంటున్నట్టుగా తలాడించిన సుమతి “ప్రియమైనవాళ్ళు స్వార్థపరులు కాకూడదని మీరే ఒకసారి చెప్పారు. అలా చూసినపుడు తన భర్తను ఆ అమ్మాయి అలా అడగడంలో తప్పులేదుగా?” అంది.
తన నుండి మరిన్ని విషయాలను రాబట్టడానికే ఈ ప్రశ్న వచ్చిందని అర్థం చేసుకున్న శర్మ కొనసాగించాడు.
“నిజమే! కానీ తనవాళ్ళనుకున్న వారి విషయంలో కూడా మర్యాదలను అతిక్రమించరాదని పెద్దలు చెప్పారు. భర్త తనను ప్రేమించాలన్న అమ్మాయి అభిప్రాయం తప్పుకాదు. కానీ తననొక్కర్తినే ప్రేమించాలన్న షరత్తు మంచిది కాదు. ఎందుకంటే పరాయివాళ్ళందరూ శత్రువులు కారు. మన మంచిని కోరని బంధువుల కంటే మన ఉన్నతిని కోరే పరాయివాళ్ళే హితులు. కాబట్టి తన భర్త తల్లిదండ్రులు హితులా, అహితులా అన్నది తేల్చుకోకుండానే తొందరపడడం ఆ అమ్మాయి తప్పు.” అన్నాడు శర్మ.
“అవును. ఆ తొందరపాటు తప్పే!” అంది సుమతి అంగీకరిస్తున్నట్టుగా.
“సుమతీ! అందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఆ సుఖం మరో వ్యక్తి ద్వారానో, వస్తువు ద్వారానో, యంత్రాల ద్వారానో దొరుకుతుందని భ్రమపడుతుంటారు.”
“అంటే..!! సుఖం వీటన్నింటివల్లా దొరకదా?” అడిగింది సుమతి.
“ఊహూ!” అన్నాడు శర్మ తలను అడ్డంగా ఆడిస్తూ.
“ఆశ్చర్యం! అదెలా సాధ్యం? మీనుండి నాకు సుఖం లభిస్తోంది. స్వంత ఇల్లు ఉండడం వల్ల కూడా సుఖం కలుగుతోంది.” అని ఆగింది సుమతి.
విశాలంగా నవ్వాడు శర్మ.
“పిచ్చిదానా! నువ్వన్నదంతా సరిగ్గానే ఉంది. కానీ కేవలం నావల్లనో, ఈ నాలుగ్గోడల వల్లనో నీకు సుఖం దొరకడం లేదు.” అన్నాడు శర్మ.
“నాకు అర్థం కావడంలేదు!” అని బిక్కమొహం వేసిన భార్యను చూసి కదిలిపోయాడు శర్మ.
ఆమె భుజం పట్టుకుని “సుమతి! నావల్ల నీకు కలుగుతున్న సుఖం ఒక వ్యక్తిగా నేనిస్తున్నది కాదు. నా పట్ల నీలో ఉన్న’భర్త’ అన్న అనుసంధానం వల్ల. అలాగే ఈ ఇంటి వల్ల కలుగుతున్న సుఖం కూడా ’ఇది దేవుని నివాసం’ అన్న భావన వల్ల. ఇలా ఇలా అనుకోవాలని, అనుసంధానించుకోవాలని మనకు చెప్పి సరిదిద్దేదే శాస్త్రం. అర్థమైందా?” అన్నాడు శర్మ.
“అంటే సుఖమన్నది శాస్త్రం వల్లనే దొరుకుతుంది…” అని అంది సుమతి.
“అవును! మానవుల శరీరాలకు నిజమైన సుఖాన్నిచ్చేది శాస్త్ర విహితమైన ఆచరణ మాత్రమే!” అన్నాడు శర్మ.
“ఇదేనా మీరు వాళ్లకి చెప్పింది?” అంది సుమతి అతని భుజంపై తలను ఆనిస్తూ.
“ఇదే చెప్పాను….వాళ్ళకర్థమయ్యే విధంగా!”
“అర్థం చేసుకుంటే వాళ్ళంత అదృష్టవంతులు ఉండరు.”
“వాళ్ళు అదృష్టవంతులవ్వాలని ఆశీర్వదించు!” అన్నాడు శర్మ నవ్వుతూ.
“ఏ జన్మలో ఎవరు ఆశీర్వదించారో, ఈ జన్మలో నేను చాలా అదృష్టవంతురాల్నే.” అందు సుమతి.
“నిజంగా?” అని ప్రశ్నిస్తున్నట్టు అన్నాడు శర్మ.
“అవును. అనుమానమెందుకు? నన్నొక విలాసవస్తువుగా చూడని భర్త దొరికారు. నిజమైన సుఖమంటే ఏమిటో తెలిసిన భర్తతో జీవితం గడపడం అదృష్టం కాదా?” అంది సుమతి.
“న స్త్రీ సమం రత్నమ్” అని మనసులో అనుకుంటూ సుమతిని పసిపాపను పొదవిపట్టుకున్నట్టు తన చేతుల మధ్య తీసుకున్నాడు శర్మ.
* * * * *
“అద్భుతం మహాభాగా! మీ రెండో ఆటకాయ చివరి రెండు పాముల్ని దాటుకుని జన్మరాహిత్యమనే నూటాఇరవైమూడో గడిని చేరింది. ఈ ఆటకాయ నడకలో గ్రహించాల్సిన నడవడికను వివరించి, ఉద్ధరించండి!” అని ప్రార్థించింది విద్యాశీలయైన సులక్షణాదేవి.
“అవశ్యం దేవీ! ’నిష్కృష్టరూపేణ ప్రాపంచిక సుఖభోగరాహిత్యం వైరాగ్యం’ అని శాస్త్రకారులు చెబుతున్నారు. అంటే దుఃఖాలకే దారితీసే భౌతిక సుఖాల్ని వదిలిపెట్టి, ధర్మదేవత రూపంలో నేను ఉపదేశించిన ఉత్తమ కర్మలని ఆచరించడాన్నే వైరాగ్యమంటారు. అలాంటి వైరాగ్యధారులే ఈ వైకుంఠంలోకి ప్రవేశించడానికి అర్హులు. వైకుంఠమంటే పుణ్యజనసేవితపురం అని మరో అర్థం. ఆవిధంగా నా రెండో ఆటకాయ పుణ్యజనుల్లో ఒకటి. అది కామంలో కూడా ఆధ్యాత్మిక భావాన్ని చూడగలుగుతోంది. నా మొదటి ఆటకాయ కూడా అదే భావనతో నిండివుంది. వారి మధ్య జరిగిన, జరుగుతున్న కామకలాపం కలికాలంలో సాగే వికృతకామం వంటిది కాదు. ఇది శాస్త్ర సమ్మతమైన దాంపత్యసుఖభోగం. చర్మదేహాల రాపిడిని సుఖమని భ్రమపడకుండా, ఉత్తమమైన సంతానాన్ని ఫలంగా ఆశిస్తూ యజ్ఞానుసంధానంతో దాంపత్యజీవితాన్ని సాగించే వైరాగ్యశీలులకు జన్మరాహిత్యమే తదుపరి ప్రస్థానం. చూడు దేవీ! జన్మరాహిత్యమనే నూటాఇరవైమూడవ గదిలో ’ఠ’ అన్న అక్షరం ఉంది!” అన్నాడు జన్మాద్యష్టకర్తృత్వధారి.
“అవును స్వామీ! జన్మరాహిత్యానికీ ఠకారానికీ గల సంబంధం?” అని అడిగింది మారజనని.
“ఠ అంటే శూన్యమని అర్థం దేవి. చావు-పుట్టుకలనే చక్రం శూన్యమవడం అంటే ఆగిపోవడమే జన్మరాహిత్యం!” అన్నాడు సర్వజీవజన్మవిచ్చేదకారకుడు.
“ధన్యోస్మి దేవా! ధన్యోస్మి!” అని నమస్కరించింది మూలప్రకృతీస్వరూపిణి.
“నీ మొదటి ఆటకాయ బ్రహ్మలోకంలోనే ఉండిపోయింది. ఆటకాయలు నడకను మర్చిపోరాదు సుమా!” అన్నాడు
“చక్కగా గుర్తుచేసారు స్వామీ! అమోఘశీలురైన మీ ఆటకాయల ముందు నా కాయలు వెలవెలబోతూ కుంటినడకలు నడుస్తున్నాయి.” అంది చంద్రసమానానన.
“అలా అనకు దేవీ! వైకుంఠపాళిలోని నిచ్చెనలు విహితకర్మలకు నిదర్శనం. పాములు నిషేధ కర్మలను సూచిస్తాయి. ధర్మాధర్మాల ఎగుడు దిగుడు నడకే ఈ ఆట. పాచికలు క్రియల్ని సూచిస్తాయి. పాచికలపైని సంఖ్యలు కర్మల్ని సూచిస్తాయి. క్రియలంటే ప్రవృత్తి అని అర్థం. కర్మ అంటే క్రియాఫలమని అర్థం. జీవులు ఆటకాయలు. ధర్మపరులైన జీవులు మంచి కర్మలను చేసి, మంచి ఫలాన్ని పొంది, నిచ్చెనలను ఎక్కుతారు. అధర్మవర్తనులైన వారు చెడు కర్మలను చేసి, దుఃఖానికి లోనై, పాముల నోట పడతారు. ఆట పూర్తికావడమంటే మోక్షం లభించడమే. కానీ ఆట ముగిసేలోగా ధర్మపరులు అధార్మికులుగానూ, అధార్మికులు ధర్మపరులుగానూ మారుతుంటారు. కాబట్టి తాత్కాలిక స్థాయీ భేదాలకు అట్టే మనసు విరుచుకోకూడదు ప్రియా!” అన్నాడు సత్యధర్మపరాయణుడు.
“చిత్తం స్వామీ! సర్వులకూ మీరే ప్రేరకులు. మిమ్మల్ని స్మరిస్తూ నడిపిస్తే నా ఆటకాయలు కూడా ధర్మమార్గ సంచారులు కాగలరు.” అని భక్తితో మ్రొక్కి పాచికల్ని వేసింది జగదంబ.
పారిజాత హరణోద్యోగ ఉద్యుక్త కృష్ణసత్యాభామల్ని ఎదుర్కొన్న ఇంద్రుని ఐరావతానికి అలంకరించిన బంగారు గంటల్లా ధ్వనించాయి పాచికలు.
* * * * *
“రంజనీ! మీ కోసం ఓ విజిటర్ వచ్చారు…విశ్వేశ్వర్ ఈజ్ ద నేమ్!” అన్న రిసెప్షనిస్ట్ మాటలు విన్న రంజని ఆ వచ్చింది ఎవరాని ఆశ్చర్యపోతూ “ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చారు?” అంది.
“విశ్వేశ్వర్” అని గట్టిగా అన్న రిసెప్షనిస్ట్ “బ్లైండ్ పర్సన్!” అని మెల్లిగా అంది.
చివరి మాటతో రంజనికి వచ్చిందెవరో అర్థమైంది.
“ఓహ్! ఆయనా! ఎనీ మీటింగ్ రూమ్ వేకెంట్?” అని అడిగింది. “యా! మౌంట్ ఎవరెస్ట్!” అంది ఆ రిసెప్షనిస్ట్. “ఓకే! అతణ్ణి అక్కడ కూర్చోబెట్టు. ఐదు నిముషాల్లో వస్తాను.” అంది రంజని.
ఎప్పుడో రెండు నెలల క్రితం అనుకోకుండా కలిసిన విశ్వేశ్వర్ ఈరోజు తనని వెదుక్కుంటూ వచ్చిందెందుకో అని ఆలోచిస్తూ విజిటర్స్ లౌంజ్ లోకి వచ్చింది రంజని.
“హీ ఈజ్ దేర్! ఇన్ సైడ్!” అని మీటింగ్ రూమ్ కేసి చేయి చూపించింది రిసెప్షనిస్ట్.
తలుపు తీసిన చప్పుడు విన్న విశ్వేశ్వర్ ఛైర్ లో నుంచి లేచి నిలబడ్డాడు.
“అరెరే! ఎందుకు నిలబడ్డారు? కూర్చోండి…ప్లీజ్!” అని అంది రంజని.
“థాంక్స్ మేడమ్! నేను గుర్తున్నాను కదూ!” అన్నాడు అతను.
“ఎస్..ఎస్..గుర్తున్నారు! బట్ రిసెప్షనిస్ట్ మీ పేరు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా గుర్తుతెచ్చుకోలేకపోయాను!” అంది.
“బ్లైండ్ పర్సన్ అనగానే గుర్తుకొచ్చేసాను!” అన్నాడు అతను నవ్వుతూ.
“నో..నో…అలా కాదు!” అన్న రంజని కంగారుగా “సారీ!” అని అంది.
“నా గుడ్డితనం వల్లనే మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఆరోజు అంత గొప్ప సహాయం చేసారు. దేవుడు చేసే ప్రతిదానికీ ఒక అర్థముంటుంది. ఇందుకు మీరు సారీ చెప్పాల్సిన పనిలేదు.”
రంజని ఇబ్బందిగా ఫీలైంది. “మీరు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ!”
“కాఫీ” అన్నాడు విశ్వేశ్వర్.
ప్యాంట్రీకి డయల్ చేసి “టూ కాఫీ…మౌంట్ ఎవరెస్ట్ కు” అంది రంజని.
“ఏమిటీ? మనం మీ ఆఫీసులో లేమా?” అన్నాడు విశ్వేశ్వర్ చిరునవ్వుతో.
“గుడ్ జోక్! మా కంట్రీ హెడ్ చాలా క్రియేటివ్ థింకర్. మనం ఇప్పుడు టాప్ ఫ్లోర్…అంటే ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇక్కడున్న మీటింగ్ రూములన్నింటికీ వరల్డ్ ఫేమస్ మౌంటెన్స్ పేర్లు పెట్టాడాయన.” అంది రంజని.
“ఓహో! ఐతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూములకి నదుల పేర్లు పెట్టారా?” అన్నాడు విశ్వేశ్వర్.
“ఎగ్జాట్లీ! ఎలా గెస్ చేసారు?” అంది రంజని.
చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు విశ్వేశ్వర్.
“మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ లో ఏం పేర్లు పెట్టుంటారో చెప్పండి?” అంది రంజని, క్విజ్ మాస్టర్లా.
“మీరు నన్నేదో గొప్ప మేధావిననుకున్నట్టున్నారు!”
“ఇప్పటికిప్పుడైతే అలా అనుకోవడం లేదు. నా ప్రశ్నకి సరిగ్గా ఆన్సర్ చేస్తే తప్పకుండా అలానే అనుకుంటాను.” అంది రంజని.
“కాఫీ వచ్చేదాకా టైమ్ పాస్ అంటారు. సరే..లెట్ మీ థింక్…మ్ మ్ మ్…ఫస్ట్ ఫ్లోర్లోనివి అడవుల పేర్లతో ఉండొచ్చు. సెకండ్ ఫ్లోర్ లోనివి హిస్టారికల్ మాన్యుమెంట్స్ పేర్లతో ఉండొచ్చు. ధర్డ్ ఫ్లోర్ లోనివి జలపాతాల పేర్లతో ఉండొచ్చు.” అన్నాడు విశ్వేశ్వర్.
మెల్లిగా చప్పట్లు కొట్టింది రంజని “బుల్స్ ఐ…ఎక్స్పెప్ట్ సెకండ్ ఫ్లోర్” అంది రంజని.
“చూసారా! నేను మేధావిని కాను.” అన్నాడు విశ్వేశ్వర్.
“ఎందుక్కాదూ! మీకు నూటికి తొంభై మార్కులు వచ్చాయి. కాబట్టి మీరు జీనియస్సే!” అంది రంజని.
ఆఫీస్ బాయ్ కాఫీలతో రావడంతో వాళ్ళ మాటలు ఆగాయి.
ఒక సిప్ తర్వాత విశ్వేశ్వర్ అన్నాడు – “రంజని గారు! నేను మీకు థాంక్స్ చెప్పుకుందామని మిమ్మల్ని డిస్టర్బ్ చేసాను.”
“థాంక్సా? ఎందుకండీ?” అంది రంజని.
“ఆరోజు మీరు నన్ను కారులో తీసుకెళ్ళకపోయుంటే నా చెల్లెలు జైల్లోకెళ్ళేది!” అన్నాడు అతను.
తుళ్ళిపడిన రంజని “వాట్?” అని గట్టిగా అడిగింది.
“అవును మేడమ్! నా చెల్లెలు ఆ కాంప్లెక్స్ లో బిల్డింగ్ మెంటెనెన్స్ టీమ్ లో పనిచేసేది. ఓ ఫ్లాట్ ఓనర్ గారి డైమెండ్ జ్యువెలరీ సెట్ పోగొట్టుకుపోవడంతో, ఆమె ఇంట్లో పనిచేసేవాళ్ళందరి మీదనే కాక ఆ బిల్డింగ్ మెంటెనెన్స్ స్టాఫ్ పైన కూడా కేసు పెట్టింది. ఆ సెట్ పోగొట్టుకుపోయేందుకు కొన్ని గంటల ముందు నా చెల్లెలు ఆ ఫ్లాట్ కు వెళ్ళింది.”
“ఎందుకు?” అని అడ్డుపడి అడిగింది రంజని.
“నా చెల్లెలు హెల్ప్ డెస్క్ లో పనిచేస్తుంది. ఆ ఫ్లాట్ ఓనర్ ఇచ్చిన ఓ కంప్లెంట్ ను ఎలెక్ట్రీషియన్ పూర్తి చేసాడా లేదా అని చెక్ చెయ్యడానికి వెళ్ళింది. ఆమె, ఆ ఎలెక్ట్రీషియన్నూ వెనక్కు వచ్చేసిన చాలాసేపటికి ఆ ఓనర్ తన డైమెండ్ సెట్ పోయినట్టుగా తెల్సుకుని నేరుగా పోలీసులకి ఫోన్ చేసింది. వాళ్ళు రాబోయే కొద్ది నిముషాల ముందు బిల్డింగ్ మేనేజర్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఆపై ఓనర్స్ అసోషియన్ వాళ్ళకీ ఫోన్లు చేసింది. ఓ పదిహేను నిముషాల్లో పోలీసులూ, అసోసియేషన్ వాళ్ళూ నా చెల్లిని, ఆ ఎలెక్ట్రీషియన్నూ ఓ గదిలో కూర్చోబెట్టి నానా ప్రశ్నలూ వేసారు.”
“ఓహ్!” అంది రంజని, చైర్లోనుండి ముందుకు వంగుతూ.
“బిల్డింగ్ మేనేజర్ నాకు ఫోన్ చేయడంతో నేను మా ఊరి నుంచి బయల్దేరాను. ఇక్కడికి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండే సవారిపురం మాది. ఈ ఇన్సిడెంట్ పొద్దున పదకొండుకు జరిగింది. నాకు ఒంటిగంటకి మెసేజ్ వచ్చింది. అప్పుడు బయల్దేరి వచ్చాను. ఆ తర్వాత మీరు కనబడ్డారు. సమయానికి ఆ ఫ్లాట్ దగ్గరకు చేర్చారు. బై గాడ్స్ గ్రేస్…నా చెల్లెల్ని అక్కడినుంచి పొలీస్ స్టేషన్ కు వెళ్ళనీకుండా నేరుగా ఇంటికి తీసుకొచ్చేసాను. ఓ అరగంట ఆలస్యమైవుంటే ఆ అమ్మాయి స్టేషన్ లాకప్పులో ఉండేది. మీ టైమ్లీ హెల్ప్, హ్యుమానిటేరియనిజమ్ మమ్మల్ని కాపాడాయి.” అంటూ వివరించాడు విశ్వేశ్వర్.
“విశ్వేశ్వర్ గారు! మీరన్నారే – గాడ్స్ గ్రేస్ – అదీ మిమ్మల్ని కాపాడింది. నేను కాదు.” అంది రంజని.
“నిజమే మేడమ్! ది ఫిజికల్ ఫామ్ ఆఫ్ దట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ యూ! అందుకనే మీకు థాంక్స్ చెప్పాలని వచ్చాను.” అంటూ చేతులు జోడించాడు విశ్వేశ్వర్.
అతిగా పొగడకుండా, విపరీతంగా కన్నీళ్ళూ, విశేషణాలూ లేకుండా ఉన్న విశ్వేశ్వర్ మాటల్ని విన్న రంజనికి ఎందుకో తెలీకుండానే కంట్లో నీళ్ళొచ్చాయి.
“మీరలా అనుకోవడం మీ మంచితనానికి ఋజువు. డివైన్ డిజైన్ లో నేనొక లింక్ మాత్రమే! మీకంతా మంచి జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో, ఇప్పుడు మీ చెల్లెలు ఇంట్లోనే ఉంటోందా? ఏం చదువుకొంది?” అని అడిగింది రంజని.
“చెల్లెలి పేరు విశ్వజ్ఞ. బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసింది.” అన్నాడు విశ్వేశ్వర్.
“వోవ్! వెరైటీ నేమ్! ఐటీ కంపెనీలో ఎక్కడా ట్రై చెయ్యలేదా?”
“చేసింది. కానీ ఎక్స్పీరియెన్స్ లేదని ఉద్యోగం దొరకలేదు. అందుకని ఆ మెంటేనెన్స్ జాబ్ లో చేరింది.” అన్నాడు విశ్వేశ్వర్.
“రేపే రెజ్యూమే తీసుకురమ్మని చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ హర్ హియర్.” అంది రంజని.
మళ్ళీ చేతులు జోడించిన విశ్వేశ్వర్ “థాంక్స్ మేడమ్” అంటూ లేచాడు.
రంజని అతని చెయ్యి పట్టుకుని బైటకు తీసుకువచ్చింది. “ఎలా వెళ్తారు? బస్సా ఆటోనా?” అని అడిగింది.
“బస్” అన్నాడు విశ్వేశ్వర్.
అక్కడున్న హౌస్ కీపింగ్ బాయ్ ను పిల్చి “సార్ ను బస్టాప్ లో బస్సెకించి రా” అని చెప్పి పంపించింది.
– – – – – –
విశ్వజ్ఞకు తన టీమ్ లోనే ఉద్యోగం వచ్చేట్టు చేసింది రంజని.
రంజని పట్ల అరవింద్ కు ఉన్న గౌరవమే అనుభవంలేని విశ్వజ్ఞ కు ఉద్యోగం దొరికేట్టు చేసింది. తన చెల్లి జాయినింగ్ రోజున వచ్చిన విశ్వేశ్వర్, రంజని కాళ్ళకు దాదాపు దండం పెట్టేసాడు. ఊహించని ఈ అనుభవాలకు ఉక్కిరిబిక్కిరైంది రంజని.
తనకు, అనంత్ కు మధ్య పెరిగి పెద్దదౌతున్న అడ్డుగోడల్ని తల్చుకున్నప్పుడు కలిగే దుఃఖం విశ్వేశ్వర్ లాంటి పరాయివాళ్ళకు చేసిన సహాయం లాంటి వాటితో కొద్దిగా తీరినట్టు అనిపించసాగింది రంజనికి.
విశ్వజ్ఞ చురుకైన అమ్మాయని కొద్దిరోజుల్లోనే గ్రహించింది రంజని. చురుకుదనంతో బాటు కావల్సినంత లౌక్యం కూడా ఉందని మరికొద్దిరోజుల్లో తెలిసివచ్చింది.
పావని, స్టెల్లాలిచ్చిన సమాచారం ప్రకారం విశ్వజ్ఞ రంజనితో తనకున్న కొద్దిపాటి పరిచయాన్ని పెద్దది చేసి చెప్పుకుంటోంది. కొన్ని కొన్నిసార్లు రంజనికి చెప్పకుండా అరవింద్ తో నేరుగా కలవడానికి ప్రయత్నాలు చేసింది. టీమ్ లీడర్ ను దాటవేస్తున్నావెందుకని పావని అడిగితే నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.
ఐతే ఆ అమ్మాయి తనతో ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. చాలా ఒద్దికగా, వినయంగా ఉంటుంది. అలాగని పావనికి గానీ స్టెల్లాకి గానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేనేలేదు. ఇదే విషయం పావనితో అన్నప్పుడు “డబల్ ఎడ్జ్ స్వోర్డ్” అని కామెంట్ చేసింది పావని. అరవింద్ ను అడిగి చూడాలని అనుకున్నా కూడా అడగకుండా ఆగింది రంజని. ఎప్పుడోకప్పుడు విశ్వజ్ఞ ఇలాంటి తలబిరుసు పనులు చేస్తుండగా తను నేరుగా పట్టుకునే అవకాశం రాకపోదు. అప్పుడు ఏదో ఒకటి చేస్తే సరిపోతుందని భావించింది రంజని.
– – – – – –
(సశేషం…)