అమితాబ్ బచన్ అక్టోబరు 11, 1942 లో జన్మించారు.
అప్పటికి ఒక పక్కరెండవ ప్రపంచ యుద్ధము, ఇటు భారత స్వాతంత్ర్య సమరము జరుగు తున్నాయి. అలహాబాదులో వీధులు “ఇంక్విలాబ్ జిందా బాద్!స్వాతంత్ర్యము వర్ధిల్లాలి !” అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి.
ఆమె 8 నెలల గర్భవతి. బయటి ఉద్యమము ఆమెలో ఆవేశాన్ని రేకెత్తించినది. తాను కూడా ఊరేగింపులో పాల్గొని, అందరితో కలిసి అడుగులు కలిపి, ముందుకు నడవాలి – అనే ఉత్సాహం ముప్పిరి గొన్నది.
అంతే! ఆమె ఇంటికి గడియ పెట్టి బయలుదేరినది. అది గమనించారు వారి కుటుంబ సభ్యులు. ఆ గృహ యజమాని హరివంశ రాయ్ ఆ సమయంలో ఇంట్లో లేరు.అందు చేత ఆమె రక్షణ భారాన్ని తమ కర్తవ్యంగా భావించి, “అమ్మా! మీరు ఉట్టి మనిషి కారు. మీ కడుపులోని బిడ్డ క్షేమముగా ఉండాలి కదా! కాబట్టి గడప దాటి రావడానికి వీలులేదు.” అంటు ఆమెను వారించారు. ఆమె భర్త వచ్చిన తర్వాత అందరి ఛలోక్తులతో వాతావరణము సందడిగా మారిపోయినది.
“హరి వంశ రాయ్! మీరు పుట్ట బోయే అబ్బాయికి ఇంక్విలాబ్ రాయ్ అని నామకరణం చేయండి” అంటూ ఆయన పత్ని తేజ్ సింగు విప్లవ ఉత్సాహాన్ని వివరిస్తూ, జరిగిన సంఘటనను యావత్తూ వివరించారు.
అలాంటి ఉద్విగ్న వాతావరణములో జన్మించిన పిల్ల వాడే Big B గా ప్రఖ్యాతి గాంచిన అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ .