వైకుంఠపాళీ – ముందుమాట : మొదటి భాగం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

తొలిపలుకులు:

ప్రకృతిలో నిత్యం ప్రసరించే అంతఃచేతనం మానవ హృదయాల్లో ప్రవేశించినపుడు అక్షరాలనే నక్షత్రాలు హృదయాకాశంలో తళుక్కుమంటాయి. మాటలనే మేఘాలు క్రమ్ముకుంటాయి. భావనాత్మక పరంపరలనే వర్షపు జల్లుల్లా జలజలా జాల్వారుతాయి. అప్పుడు, రససృష్టికి బీజం పడుతుంది.

“మాటే ముత్యము – మాటే మృత్యువు” అన్నది ఆర్యోక్తి. “వాగ్ఘృదయే” అని వేదం కూడా చెబుతోంది.

మంచి మనసు పలికే మాటలు కరకు హృదయాల్ని కూడా కరిగిస్తాయి, కదిలిస్తాయి. కుత్తుకలుత్తరింప చూసే కత్తుల్ని సైతం నిలువరిస్తాయి. అలానే, కర్కశమైన మాటలు ’ధనుర్వినిర్ముక్త శరము వోలే’ సజ్జన హృదయాల్ని భేదిస్తాయి, గాయపరుస్తాయి.

ఈ ప్రపంచం ’బ్రతకు’ – ’చావు’ అన్న రెండు పదాల చుట్టూ తిరుగుతోంది. మంచిమాటకు బ్రతుకు చిగురిస్తే, చెడుమాటకు మోడువారుతుంది.

జీవితాలతో విధి ఆడుకునే “వైకుంఠపాళీ”లో ఈ మాటలే పాచికలు.

* * * * *

కొన్ని మాటలు, ఒక సూచన, కథ:

దాదాపు మూడు నెలలక్రితం మిత్రులు ఐ.విఎన్.ఎస్.రాజు గారితో కొన్ని ఆధ్యాత్మిక విషయాల్ని మాట్లాడుతున్నప్పుడు, నేను చెబుతున్న ఆధ్యాత్మిక విషయాల్ని “వైకుంఠపాళీ” ఆటను ఆధారం చేసుకుని ఓ కథారూపంలో వ్రాయండని ఆయన సూచించడం జరిగింది. మొదట్లో నాకు అంత ఆసక్తి కలగలేదు. కానీ పరమపదసోపాన పటాన్ని ముందువేసుకుని పరిశీలనగా చూస్తున్నప్పుడు మా గురువుగారు విశదీకరించిన ధర్మసూక్ష్మాలకు సాంకేతికరూపంగా ఒక్కో గడీ కనిపించింది.

గురుశుశ్రూషరూపేణ సంగ్రహించిన వేదాంత విషయాలు, స్వానుభవంలో నేర్చిన పాఠాలు, మిత్రులు-శత్రువులు-హితులు-అహితులు మొదలుగాగల అనేకులైన విషయబోధకుల సాంగత్యం ద్వారా ప్రాప్తించిన వివేకసంపత్తి మొదలైనవాటిల్ని జోడించి, ఆ జోడనకు స్వల్పంగా కాల్పనికతను సమకూర్చి, యథామతిగా వ్రాసిన ఓ సాధారణ రచన ఈ “వైకుంఠపాళీ”.

ఇదేమీ అపురూపమైన ప్రక్రియ కాదు. పద్మపురాణంలో ’ఆధ్యాత్మరసరంజని’ అనే అధ్యాయంలో కఠినమైన వేదాంత విషయాల్ని కథారూపంలో ప్రతిపాదిస్తారు వేదవ్యాసమహర్షి. ఆయన వ్రాసిన మహాభారత, భాగవతాలు రసరమ్యాలైన కథనాలే. అలాంటి మహోతృష్టమైన దివ్యరచనల ముందు గుడ్డిదీపంలాంటిదీ రచన.

హంసలు నీర-క్షీరాలను వేరుచేసే విధంగా రసజ్ఞులైన పాఠకులు కూడా ఈ కథలోని సారభాగాన్ని స్వీకరించాలని ప్రార్థన. ఈ కథలోని సారభూతమూ, ఉపయుక్తమైన విషయాలన్నీ అస్మద్గురువరేణ్యులకు చెందుతాయి. లోపాలు, దోషాలన్నీ నాకే చెందుతాయి.

నాలోనే గింగిర్లు కొడుతుండే ఆధ్యాత్మిక చింతనల పౌనఃపున్యాలను అనుకోనివిధంగా ’ట్యూన్’ చేసి, ప్రసారయోగ్యంగా మార్చిన ఐ.వి.ఎన్.ఎస్. రాజుగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పెద్దకథ వ్రాయడం ఇదే మొదటిసారి కావున సహృదయులైన పాఠకులు తగిన సూచనలు, సలహాలతో వెన్నుతడతారని ఆశిస్తూ…

మీ

కడప రఘోత్తమరావు

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

* * * * *

 

||శ్రీః||

|గణేశాయై నమః|

 

వైకుంఠపాళీ

 

ఒక్క విసురులో మొత్తం ముగిసిపోతుంది.

అది కల కావొచ్చు. ఆట కావొచ్చు. జీవితం కావొచ్చు. లేదూ ఈ సృష్టే కావొచ్చు.

ఆధారమే లేక ఉన్నచోటునే వేళ్ళాడుతున్న ఈ ప్రపంచంలో, మారుమూల ఏ నట్టడవిలోనో, ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే ఒకానొక ఋషి మేధస్సులో చటుక్కున మండిన నిప్పుకణిక వంటి ఆలోచన, పెరిగి పెద్దదై, మూడు కాలాలనూ చుట్టొచ్చి, ఐదు భూతాలనూ ఆవహించుకుని, రంగు-రుచి-వాసన-శబ్ద-స్పర్శల్ని అనుభవించి, కోపాన్ని తరిమేసి, మోహాన్ని అదిమేసి, మతిమరుపును రూపుమాపేసి, తనలో తాను, తన కోసమే తాను, తన వల్లనే తానుగా నిలబడినప్పుడు ఒక చిన్న మెరుపు. మిణుగురు పురుగంతే!

విశాలమైన ఈ ప్రపంచాన్ని విడగొట్టి చూస్తే మిగిలేది అణువే. మిణుగురు వెలుగూ అణువంతనే. మనసులోని వెలుగూ అణువంతనే! అప్పుడే పుట్టిన పసిపాప కూడా అణువంతనే! అణువులోని మహత్తు అణువుకే తెలుసు!

సముద్రపుటొడ్డున ఇసుకరేణువులు. ఒక్కొక్కటీ అణుమాత్రం. ఒక్కక్కటే కూడితే అనంతం. అణువులో అనంతం. అనంతానంత అణువులు. పేర్చుకొంటూ….కూర్చుకొంటూ…ఒక అణువు మరొకదాన్ని ఢీకొడుతుంది.

ఒకటి + ఒకటి = ప్రళయం. ఇది నమ్మలేని నిజం. అణువు సామాన్యమైనది కాదు.

ఈ విశాల విశ్వంలో భూమి ఎంత చిన్న పరమాణావో!

వేలెడంత మానవుల్లో ఎన్ని కోట్ల అణువులో!

ఒక్కో అణువునూ కదిపి, కుదిపి, నడిపించే “అహం” పరమాణువా? మహత్తా?

* * * * *

వైకుంఠం.

ఆ సౌధం ఆ మూలెక్కడో లేదు.

సరిగ్గా వైకుంఠం నడిమధ్యలో, సర్వమూలమై, భవ్యంగా వెలుగుతూ నిలబడుంది.

ప్రధానద్వారం వద్ద ద్వారపాలకులైన జయ-విజయులు భక్తితత్పరులై, విష్ణుగుణ సంస్మరణ పారవశ్యులై, కానీ జాగురూకులై నిలబడివున్నారు.

వారిని దాటి వెళ్తే…

“అహోభాగ్య మహోభాగ్యం..” అంటూ చేతులెత్తి మ్రొక్కుతున్న ముక్తభక్తకోటి.

“దైవయోగేన పూర్వపుణ్యేన…” వచ్చామని కన్నులు మూసి తన్మయత్వంతో స్థాణువుల్లా నిలబడిపోయిన మునులు.

“యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్…” అనే పుణ్యధామమిదేనా అని సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు ఋషులు.

“అంభస్య పారే భువనస్య మధ్యే…” అనే ఉపనిషత్కీర్తనలను ఉచ్ఛకంఠంతో పాడుతున్న గంధర్వబృందాలు.

“నమో విష్ణవే బృహతే…” అని కేలు మోడ్చి నిలబడ్డ ఇంద్రుని అంతరంగ గానం సాగుతోంది.

“నాహమ్ జానే…నాహమ్ జానే” అని హరి అనంతగుణగానాన్ని చెయ్యలేక ఆగిపోతున్నాడు వేలనాల్కల శేషుడు.

“ఏకమ్ సత్…” అని నాల్గుముఖాలతో చతుర్ముఖుడు చేస్తున్న జపం వాయుసంచారంతో కూడి వైకుంఠమంతా తేలి వస్తోంది.

“త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి…” అని అందరి ప్రార్థనలనూ ఏకసూత్రంగా నివేదిస్తోంది జగన్మాత.

కనురెప్పపాటులో సమస్త సృష్టినీ పుట్టించి, నడిపించి, లయింపజేసే ఆ జగన్నాటక సూత్రధారి…అదిగో…అక్కడే ఉన్నాడు.

అక్కడొక్కచోటేనా?

ఆహా…ఆ ప్రక్కనా ఉన్నాడు. ఈ ప్రక్కనా ఉన్నాడు.

అంతేనా!

లేదు..లేదు..జగన్మాతలో ఉన్నాడు. బ్రహ్మలో ఉన్నాడు. అక్కడ నిండిన వాయువులో ఉన్నాడు. ఇంద్రాది సమస్త దేవతల్లోనూ, గంధర్వాదుల్లో మనోనేత్రమై, ఋషుల హృత్కమలాల్లో మెరుస్తూ, మునుల మనోవీధుల్లో సంచరిస్తూ, మానవుల మస్తిష్కాల్లో కనబడీ కనబడక, జంతుజాలాల్లో ప్రేరకుడై, చెట్లల్లో రసమై, పర్వతాల్లో శిఖరమై, చివరకు గడ్డిపోచల్లోని అమాయక సౌందర్యసిక్త అస్తిత్వంలోనూ…ఆ మహావిష్ణువే…అలరారుతున్నాడు.

* * * * *

“ఎంత బాగా చెప్పారండీ!” అంది సుమతి.

పూజాసామగ్రీని ఆమె కడుగుతున్నంతసేపూ అక్కడే కూర్చొని వైకుంఠవర్ణనం చేస్తున్నాడు కేశవశర్మ.

“మహానుభావులు వ్రాసినదాన్ని బట్టీయం వేసిన బడుద్ధాయిని నేను. వారి ఎంగిలిని తిని, దాన్నే అరిగించుకొలేని అల్పుణ్ణి. నేను చెప్పడమేమిటే పిచ్చిదానా!” అన్నాడు కేశవశర్మ.

ఆయన “పిచ్చిదానా!” అన్నప్పుడల్లా సుమతికి ఏదో సంతోషం. తిట్టులో కూడా అభిమానాన్ని పొదిగితే అది పొగడ్తే అవుతుందని ఆమె అభిప్రాయం.

“మీరన్నది నిజమే! కానీ ఎదుటివాళ్లకు అర్థమయ్యేలా, మనసుకు హత్తుకునేలా చెప్పడం అందరికీ రాదు కదండీ!” అంది సుమతి.

“మీరన్నది నిజమే” అంటూనే తన పొగడ్తను నిలబెట్టుకునే భార్యను చూస్తే అలవిమాలిన ప్రేమ పుట్టుకొస్తుంటుంది శర్మకు. అమాయకత్వంతో కూడిన అజ్ఞానం కూడా అందమైన సుఖమేనని పెళ్ళయ్యాకే తెలిసింది అతనికి.

తను చేస్తానని భార్య అన్నా పూజాపాత్రలన్నింటినీ ముందేసుకుని తుడవడం మొదలెట్టాడు శర్మ.

దైవసేవలో ఎవరి భాగం వారిదేనన్న నిరంహకార స్వార్థాన్ని అర్థం చేసుకున్న సుమతి వంటింట్లో మిగిలిపోయిన పనుల్ని చేసుకోవడానికి వెళ్ళింది.

* * * * *

“ఏకాంతిక జన ప్రియా..” అన్నది జగన్మాత.

చిరునవ్వు నవ్వాడు శ్రీహరి.

క్షణమాత్రంలో లక్ష్మి కోరుకున్న ఏకాంతం ఏర్పాటయింది.

బ్రహ్మాది దేవతలు, మనుష్యాది జీవరాశులూ జగన్మోహనుని మన్మనోరథంలో లీనమైపోయారు.

“తత్క్షణంలో మీలా భార్య హృదయాన్ని తెలుసుకునేవారు లేరు!” అంది లక్ష్మి, కృతజ్ఞతాపూర్వకంగా.

“నా హృదయంలో వాసమున్నదెవరో మరి?” అన్నాడు శ్రీవత్సధారి.

సిగ్గుపడింది హరిపాదసేవోద్యమి.

“ఏకాంత వినోదం కావాలన్న నీ మనోసంకల్పం నెరవేరుస్తున్నాను…ఇదిగో…” అంటూ ఓ వస్తువును పరిచాడు జగత్పతి.

“వైకుంఠపాళీ…” అన్నది జగదంబ.

“నేను వీరవైష్ణవుణ్ణి….” అని నర్మగర్భంగా నవ్వాడు ఏకో నారాయణుడు.

“ప్రకృతి వికృతి గాకుండా నిలుపుతున్నశక్తి అదేగా…” అంది వేదాభిమానిని.

“అన్నీ తెలిసినా, నేటి ఆటలోని పావులేమిటో తెలియవుగా!” అన్నాడు సర్వంతర్యామి.

“మీ కుమారుని సృష్టిలో మీకు తెలియని పావులా!” అంది మహామాయ.

“నే నన్నది పద్మసంభవుని సృష్టిలోని పావులు కాదు. పద్మజాదేవి దృష్టిలోనివి.” అన్నాడు మాయాదూరుడు.

“అబ్బాయి సృష్టిలో పుట్టినవాటినే ఎంచుకోవాలని ప్రార్థన!” అంది వేదపీఠ.

“అవశ్యం. నా పావును ఎంచుకున్నాను. నీవూ ఎంచుకో!” అన్నాడు వేదవేద్యుడు.

“ఒక్క పావేనా? ఆట రక్తి కట్టడానికి నావి రెండు, మీవీ రెండు ఉండాలి.” అంది చతురానన జనని.

“రెండే చాలా?” అన్నాడు చతుర్వేదోదితగుణసంపన్నుడు.

“చాలు” అంది పద్మావతి.

“పాచికలివిగో…” అన్నాడు పద్మహస్తుడు.

పద్మాక్షి ఒక్క విసురు విసిరింది.

ఖణ్ మంటూ పడ్డాయి పాచికలు.

* * * * *

(సశేషం)

4 thoughts on “వైకుంఠపాళీ – ముందుమాట : మొదటి భాగం

  1. చాలా బాగుంది. వైకుంఠపాళి నవల పూర్తి అయినచో, ఎక్కడ కొనవచ్చునో తెలియచేయగలరు.

Your views are valuable to us!

%d bloggers like this: