ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

విజయవాడ పట్టణంలో 2006 అక్టోబర్ నెలలో జరిగిన జాతీయ తెలుగు రచయితల సమావేశాల్లో భాగంగా “ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం” అన్న అంశంపై నేను చేసిన ప్రసంగం యొక్క పాఠం ఇది.

వ్యాసంగా ప్రచురించే సందర్భంగా కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది.

*****

“వేదికను అలంకరించిన పెద్దలకు, సభికులకు నమస్సులు.

ఇంత పెద్ద వేదిక నుండి ప్రసంగించడం ఇదే మొదటిసారి కాబట్టి సభామర్యాదల్లోగానీ, విషయ నిరూపణలో గానీ లోపదోషాలు జరిగితే మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమావేశంలో ప్రసంగించడానికి నాకు ఇచ్చిన అంశం – ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం. దీనిపై నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను.

భాష ప్రాముఖ్యత – ఇంటర్నెట్

మనిషి జీవించడానికి ఊపిరి ఎంత ముఖ్యమో, ఆ జీవితాన్ని కొనసాగించడానికి భాష కూడా అంతే ముఖ్యం. ఆలోచనలు రాని, లేని మనసు ఉండదు. అలా అలల్లా వచ్చే ఆలోచనలను వ్యక్తం చేసేందుకు ఉన్న మాధ్యమమే భాష. ఆ భాషకు శబ్దం ఒక రూపమయితే లిపి మరొక రూపం. అలా లిపిబద్ధమైన ప్రాచీన భారతీయ భాషల్లో తెలుగు ఒకటి.

వార్తయందు జగము వర్తిల్లుచుండును’ అనే ఆర్యోక్తి మేరకు ప్రపంచ మానవ జీవితం భాష చుట్టూ, ఆ భాష ద్వారా పుట్టుకొచ్చే సమాచారం చుట్టూ తిరుగుతోంది. నేటి కాలాన్ని సమాచార విప్లవ కాలంగానే పరిగణించడం జరుగుతోంది. ఎన్నెన్నో సాంకేతిక పరికరాల ద్వారా వినూత్నమైన ప్రచ్ఛన్న ప్రపంచాన్ని నిర్మించే శక్తి ఈ సమాచార విప్లవం ద్వారా సాధ్యమవుతోంది. ఈ ప్రచ్ఛన్న ప్రపంచాన్నే వర్ల్డ్ వైడ్ వెబ్ అని లేదా ఇంటర్నెట్ అని పిలుస్తున్నాం.

నేటి ఇంటర్నెట్ అమల్లోకి రావడానికి ప్రయత్నాలు 1960వ దశకంలోనే మొదలయ్యాయి. అర్పానెట్ అన్న పేరుతో మొదలైన ఈ వ్యవస్థ 1970 దశకం నాటికి ఇంటర్నెట్ రూపాంతరం చెందింది. అయితే ఏ కొద్దిమందికో పరిమితమైన ఇంటర్నెట్ పర్సనల్ కంప్యూటర్ల తయారీ, వాటి వాడకం పెరగడంతో 1980వ దశకంలో జనసామాన్యానికి దగ్గరవసాగింది. 2000వ దశకం నాటికి నిత్యజీవితంలో ఓ భాగమయింది.

వాడుక భాషలో ఇంటర్నెట్‍గా వ్యవహరించబడే వర్ల్డ్ వైడ్ వెబ్ మనం జీవిస్తున్న ప్రపంచానికి సమాంతరంగా మరో ప్రపంచాన్ని నిర్మిస్తోంది. భౌతికంగా అడ్డువచ్చే భౌగోళిక హద్దులు లేనటువంటి ప్రపంచమది. ఆ ప్రచ్ఛన్న ప్రపంచంలో తెలుగువారు కూడా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.

శాసనాలు ఒక పరిచయం history documentary

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

ఇంటర్నెట్ లో తెలుగు వారు

1996లోనే భావన.నెట్ వారి ’తెలుసా’ శీర్షికతో మొదలైన తెలుగువారి ఇంటర్నెట్ ప్రయాణం యాహూ రచ్చబండ మీద స్థిరపడి ఇప్పటికీ చైతన్యవంతంగా ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ తొలి ప్రయత్నాలు మొదలైన కాలానికి ఇంటర్నెట్‍ వాడకానికి అనుకూలమైన తెలుగు లిపి రాలేదు.

తెలుసా‘ శీర్షికలోనే శ్రీనివాస్ అనే సభ్యుడు సింగపూర్‍కు చెందిన తమిళ ప్రొఫెసర్ ఒకరు తయారుచేసిన తమిళ్ ఫాంట్ గురించి ప్రస్తావిస్తూ ’మనకు తెలుగు ఫాంట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుం’దంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో వెనుకబడి లేమని చెబుతూ సిరిగిన.కామ్ వారు ’తెలుగులిపి’ అనే వర్డ్ ప్రాసెసర్‍ను విడుదల చేసారు. ఈ తెలుగులిపి సహాయంతో రచనలను టైప్ చేసి JPG ఫైల్‍గా భద్రపరచి, ఆ ఫైల్‍ను ఇంటర్నెట్ లోకి అప్లోడ్ చేయడం ప్రారంభమయింది. ఈవిధంగా ఇంటర్నెట్‍లో తెలుసు ఫాంట్ లేని కొరతను కొంత మేరకు తీర్చడం జరిగింది.

ఇదే ఒరవడిలో తెలుగుపీపుల్.కామ్ వారు ’లిఖిత’ అన్న పేరుతో ఓ వర్డ్ ప్రాసెసర్‍ను విడుదల చేయడమే కాక వారి వెబ్సైట్‍లోని శీర్షికలన్నింటినీ తెలుగులోనే నిర్వహించడం మొదలుపెట్టారు. సభ్యులు తమ రచనలను, అభిప్రాయాలను నేరుగా తెలుగులోనే వ్రాయగలగడం తెలుగు ఇంటర్నెట్ చరిత్రలో ఓ మైలురాయి అని చెప్పవచ్చు.

ఇటీవలే వచ్చిన యూనీకోడ్ సౌలభ్యం ద్వారా ఇంటర్నెట్లో తెలుగు వ్రాయడం మరింత సులభతరమే కాదు విస్తృతం కూడా అయింది.

ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా తెలుగు భాషను ఉపయోగించి సెర్చ్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ వారు ఆఫీస్ 2003లో తెలుగు ఇంటర్‍ఫేస్‍ను విడుదల చేసారు.

బ్లాగ్‍ఆంధ్రా.కామ్ వారు ’ఆశాగళం’ పేరుతో ఆన్లైన్ రేడియో ప్రసారాలను ప్రారంభించారు. ఈ పాడ్కాస్టింగ్ సైట్‍లో సభ్యులు తమతమ స్వరాలను సులభపద్ధతిలో శ్రోతలకు వినిపించవచ్చు. నచ్చిన అంశాలపై స్వంత కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయవచ్చు.

ఇలా తెలుగుపీపుల్.కామ్, ఈమాట.కామ్, దట్స్ తెలుగు.కామ్, గ్రేట్‍ఆంధ్రా.కామ్, సాహితి.ఆర్గ్, తెలుగుస్రవంతి.ఆర్గ్, తెలుగుతోరణం, ఇడియల్‍బ్రైన్, సుజనరంజని, రాగలహరి – ఇలా ఎన్నో వెబ్సైట్స్ తెలుగు భాషకు గౌరవాన్నిస్తూ ఇంటర్నెట్ లో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి.

ఇప్పుడు మరిన్ని ఇంటర్నెట్ తెలుగు విశేషాలను వివరించే ప్రయత్నం చేస్తాను.

ఇంటర్నెట్ – తెలుగు వెబ్ పరికరాలు, భాష – సాహిత్య ప్రయోగాలు

సాహితి.ఆర్గ్ వారు పద్యలేఖిని అనే ఇంటర్నెట్ పరికరాన్ని రూపొందించారు. ఈ వెబ్ పరికరం సహాయంతో ఔత్సాహిక పద్యరచయితలు తాము వ్రాసిన పద్యాల ఛందస్సును సరిచూసుకోవచ్చు. ఏవైనా ఛందోభంగాలు దొర్లివుంటే వాటిల్ని దిద్దుకోవచ్చు.

ఈమాట.కామ్ వారి సాహిత్యకృషి సర్వులకు విదితమైనదే. తెలుగుభాషలో వచ్చిన, వస్తున్న అన్ని రకాల సాహితీప్రక్రియలకు సంబంధించిన వివరాలను, చర్చలను అక్కడ చూడవచ్చు. ఈమాటలో వచ్చిన ప్రతి రచనపైన పాఠకులు తమ స్పందనలను రచయితలకు నేరుగా తెలియజేసే అవకాశం ఉండడం విశేషం. వేల్చేరు నారాయణరావు, చేకూరి రామారావు, యదుకుల భూషణ్ మొదలైన పండితుల వ్యాసపరంపరలు ఈమాటను పరిపుష్టం చేస్తున్నాయి.

కిరణ్‍ప్రభగారి సారధ్యంలో నడుస్తున్న సుజనరంజని వెబ్ పత్రిక జనమనోరంజని అని చెప్పడం అతిశయోక్తి కాబోదు.

తెలుగుపీపుల్.కామ్ లో శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారు నిర్వహించిన ‘ఛందస్సు తరగతులు’ యువతరానికి పద్యరచన పట్ల ఆసక్తిని పెంచింది. శ్రీమతి సుప్రభగారు నిర్వహిస్తున్న “శారదా ప్రసాదం” శీర్షిక వయోభేదాలతో నిమిత్తం లేకుండా అలరిస్తోంది. శ్రీ రాచూరి హయగ్రీవ మూర్తి గారు నడుపుతున్న ‘తెలుగు పద్యాల అంత్యాక్షరి‘ కార్యక్రమంలో ఆణిముత్యాల్లాంటి అలనాటి పద్యాలను చదివి ఆనందించే అవకాశం కలుగుతోంది.

నిశ్శబ్ద కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం మొదలైన ప్రక్రియలతో బాటు ’కవిత వ్రాసే ముందు’, ’రెండులైన్ల కవిత్వం వ్రాయండి’, ’గొలుసుకట్టు కథ’ మొదలైన శీర్షికలు తెలుగు సాహిత్య వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

అలనాటి జరుక్ శాస్త్రి పేరడీలకు కొనసాగింపుగా ’పేరడీలు’ అన్న శీర్షికలో ఎన్నెన్నో పేరడీలను ఔత్సాహిక రచయితలు వ్రాస్తున్నారు.

ఇలా సాహిత్యంతో బాటు నేటి రాజకీయాలు, సినిమాలు, సామాజిక సమస్యలు, టెక్నాలజీ, సంఘసేవ వంటి వైవిధ్యభరితమైన అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. వారు వెలిబుచ్చే అభిప్రాయాలు, చేస్తున్న సూచనలు ఆయా అంశాలపై వారికి గల అవగాహనను తెలుపుతున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు ఈ సూచనల పట్ల దృష్టి సారించగలిగితే ప్రజానాడి తెలిసే అవకాశం మెండుగా ఉంది. ఇక్కడ చెప్పుకోవల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ చర్చలు ఆంగ్లంలోనే కాక తెలుగులోనే ఎక్కువగా సాగుతుండడం.

ఇంటర్నెట్ లో కొత్త రచయితలు

ఏది ఏమైనా ఇంటర్నెట్ వల్ల తెలుగు సాహిత్యానికి ఎక్కువ లాభం కలుగుతోంది. వెనకటి కాలంలో తమ రచనలను పత్రికలకు పంపి, వాటి ప్రచురణ కోసం ఎదురుచూడ్డం జరిగేది. అదృష్టం బాగో లేక రచన వెనక్కు వస్తే కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు. అన్నీ బావుండి అచ్చులో వచ్చినా పాఠకుల ప్రతిస్పందన తెలుసుకోవడానికి ఎదురు చూడాల్సి వచ్చేది. ఒకరో ఇద్దరో పాఠకులు ఆ రచనను పొగిడినా, తెగిడినా ఆ స్వల్ప ప్రతిక్రియలతో రచయితల తృష్ణ తీరేది కాదు.

అయితే ఇంటర్నెట్ వ్యవస్థలో ఈ అవస్థలన్నీ దాదాపు తొలగిపోయాయని చెప్పవచ్చు. దాదాపు అని ఎందుకంటున్నానంటే ఇంటర్నెట్ పత్రికల్లోని కొన్ని సంప్రదాయ ప్రచురణ రంగంలోని నియమాలను పాటిస్తూ నియతకాలికంగా, పరిమిత సంఖ్యలో మాత్రమే రచనలను వడపోసి ప్రచురిస్తున్నాయి కాబట్టి. కానీ తెలుగుపీపుల్.కామ్ వంటి ఇంటర్నెట్ పత్రికలు మాత్రం సరళీకృత విధానాలను అనుసరిస్తూ, రచయితలను ప్రోత్సహిస్తున్నాయి. అంటే డైనమిక్ కంటెంట్ పబ్లిషింగ్ పద్ధతిలో వచ్చిన రచనను వచ్చినట్టుగా ప్రచురించడం ఈ సైట్ల ప్రత్యేకత. అంటే ఇక్కడ ఎడిటింగ్ వ్యవస్థ లేదని అర్థం కాదు. ప్రతి రచనను క్షుణ్ణంగా చదివి, అవసరమనిపిస్తే మార్పులు చేర్పులు చేసే ఎడిటర్లు ఉన్నారు. కానీ ఈ ఎడిటర్లు సంప్రదాయిక పత్రికల సంపాదకుల్లా కఠినమైన నియమాలను పాటించక స్వేచ్ఛాపద్ధతుల్ని అనుసరిస్తూ కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ వెలుగులోకి తెస్తున్నారు.

ఇలా సరళీకృతమైన కంటెంట్ అప్రూవల్ వ్యవస్థ వల్ల రచయితలు తమ రచనలను 24 గంటల లోపే అచ్చులో చూసుకుంటున్నారు. రచన ముద్రించబడిన కొన్ని నిముషాల నుండే పాఠకుల స్పందనలను అందుకుంటున్నారు. ఇవన్నీ కొత్త రచయితలను ఉత్సాహపరచడంలో ఉపయోగపడుతున్నాయి. అలానే నాణ్యానికి మరోవైపున, ఘాటు విమర్శలు, వ్యంగ్య విమర్శలు కూడా వచ్చి పడి కొత్తవారిని కంగారు పెట్టేస్తున్నాయి. సుదీర్ఘ చర్చలకు దారి తీస్తున్నాయి. అనేకమార్లు తమ తమ వాదనల్ని సమర్థించుకోవడం కోసం అటు రచయితలు, ఇటు పాఠకులు లోతైన అధ్యయనానికి పూనుకుంటున్నారు. చదవాల్సిన పుస్తకాలను పరస్పరం సూచించుకుంటున్నారు. కొందరైతే ఆ పుస్తకాలను బహుమతులుగా పంపిన దాఖలాలు ఉన్నాయి.

ఇలా పెరిగిన భావవైశాల్యంతో, విస్తరించిన అవగాహనతో కొత్త రచయితలు ఎదుగుతున్నారు. కొన్నిసార్లు లబ్ధప్రతిష్టులయిన రచయితలను ఈ కొత్త రచయితలు సూటిగా ప్రశ్నించడంతో బాటు విమర్శిస్తున్నారు కూడా. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. దీని ద్వారా ఒక్క సాహిత్యానికే కాక భాషకు కూడా మేలు చేకూరుస్తుందని నా అభిప్రాయం.

ఇంటర్నెట్ వల్ల మారుతున్న తెలుగు భాష

ఈ ఇంటర్నెట్ వాడకం వల్ల తెలుగు భాషలో కొత్త పదాలు వచ్చి చేరుతున్నాయని అనిపిస్తోంది. ముఖ్యంగా సరదా సంభాషణల్లో ఇలాంటి పదాల సృష్టి జరుగుతోంది. ఉదాహరణకు “ఇన్‍బాక్స్ చెక్కుకో..”, “కామెంటు పోస్టాను..” మొదలైనవి. Check your inbox అని ఇంగ్లీష్‍లో వ్రాయడానికి బదులుగా “చెక్కుకో” అని, posted my comment అనడానికి గాను “పోస్టాను” అని వ్రాస్తూ ఆంగ్లపదాలను తెలుగు పదాల్లా ఉపయోగిస్తున్నారు. భాషను సులభతరం చేయాలని, ఆధునీకరించాలని వాదించే వారు ఈ తరహా పద ప్రయోగాలను ఆహ్వానిస్తారో లేక తిరస్కరిస్తారో చూడాలి.

Check, comment వంటి పరభాషా పదాలను చెక్కుకో, పోస్టాను అంటూ తెలుగీకరించడం ఒకవైపు జరుగుతుండగా మరొకవైపు వీటిలికి తెలుగు సమనార్థకాలను తయారుచేయడం జరుగుతోంది. ఉదాహరణకు inbox కు లోపలిపెట్టి లేదా ఉత్తరాల డబ్బా అని వాడుతున్నారు. అలాగే internet ను అంతర్జాలమని పేర్కొంటున్నారు. Net got disconnected అన్నదాన్ని ’వల తెగిపోయింది’ అని చెప్పేవారు ఉన్నారు. ఇవన్నీ సరదాగా చేస్తున్న ప్రయోగాలే అయినా వీటి ద్వారా తెలుగు భాషకు ఒనగూడే లాభనష్టాల బేరీజు వేసే రోజు త్వరలోనే వస్తుందేమోనని నా ఊహ!

ఇంటర్నెట్ తెలుగు వెబ్సైట్స్ – ప్రవాసాంధ్రులు

విదేశాలలోనే పుట్టి, పెరిగి, అక్కడే జీవిస్తున్న తెలుగు యువతరానికి తెలుగు భాషా వెబ్సైట్స్ వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇది నా మాట కాదు. తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఇంటర్నెట్ లేని కాలంలో తమ పిల్లలకు మాతృభాషను నేర్పాలంటే పుస్తకాల తెప్పించుకోవడం, స్వంత ఊళ్ళకు వెళ్ళి కొద్దిరోజులు అక్కడే ఉండడం వంటివి చేయాల్సి వచ్చేది. ఇంటర్నెట్ వల్ల ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు తెలుగును చాలా సులభంగా నేర్పగలుతున్నారు. ఇది నేను ప్రవాసాంధ్రుల నుండి స్వయంగా తెలుసుకున్న విషయం. ఇలా ఇంటర్నెట్ తెలుగు భాషకు ఒక వరంగా మారుతోందని అనిపిస్తోంది.

“ఇంటర్నెట్ లో తెలుగు” అన్న విషయంపై నాకు తెలిసిన నాలుగు విషయాలను మీతో పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించిన కృష్ణా జిల్లా రచయితల సంఘం వారికి మరొక్కమారు హృత్త్పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతసేపు నా మాటలను ఓపికగా విన్న సభికులందరికీ నమస్సులు.

anveshi channel memberships

2 thoughts on “ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం

  1. పైన వ్యాసంలో ’తెలుగులిపి’ అనే వర్డ్ ప్రాసెసర్ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ‘తెలుగు ఫాంట్’ స్థానంలో ‘తెలుసు ఫాంట్’ అని వచ్చింది. సవరించగలరు.

  2. రఘోత్తమరావు గారు!! చాలా చక్కటి ప్రసఙ్గం చేశారు. బాగుందండి

Your views are valuable to us!

%d bloggers like this: