ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శాసన సంక్రాంతి

Like-o-Meter
[Total: 1 Average: 5]

శాసన సంక్రాంతి – మరిన్ని వ్యాసాలను “చరిత్ర” విభాగంలో చదవండి

Sankranti as understood from South Indian inscriptions


దానం – సనాతన ధర్మం

దానం సనాతనధర్మంలోని ప్రధానగుణం. దీనిని త్యాగం అను కూడా పిలువవచ్చు.

మన దగ్గర ఎక్కువగా ఉన్నదాన్ని దాచుకోకుండా ’కృష్ణార్పణమస్తు’ అని ఇతరులకు ఇవ్వడమే దానం.

ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేది ఉత్తమదానం. కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేసేది మధ్యమ దానం. ప్రతిఫలం పొందడం కోసమే చేసేది అధమ దానం అని పెద్దలు వర్గీకరించారు.

 

దానం చేయడానికి ఉత్తమమైన సమయాలు

 

దానాన్ని ఎప్పుడైనా చేయవచ్చు. అయితే కొన్ని ఉత్తమ సమయాలలో చేసే దానం ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పుణ్యక్షేత్రానికి వెళ్ళిన రోజు, జన్మదినం లేదా జన్మనక్షత్రం ఉన్న రోజు, సూర్య, చంద్రగ్రహణాలు మొదలైనవి దానానికి ఉత్తమమైన సమయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

వీటికంటే విశేషమైనవి మాస సంక్రమణాలు. అందులో ఉత్తరాయణ సంక్రమణం మరింత విశిష్టమయినదని శాస్త్రవచనం.

ఉత్తరాయణ సంక్రమణం అంటే మకర సంక్రమణం. ఇదే మన వాడుకలో సంక్రాంతి పండుగగా వ్యవహరించబడుతోంది.

 

WATCH THIS FASCINATING ACCOUNT OF HISTORY OF VIJAYANAGARA EMPIRE ON ANVESHI CHANNEL

 

ఉత్తరాయణ సంక్రాంతి – దానాలు

 

పూర్వం ఈ సంక్రాంతి మహాపర్వకాలంలోనే అతిఎక్కువ సంఖ్యలో దానాలను చేసేవారు. ఈ దానాలు రకరకాలుగా చేసేవారు.

దేవాలయాలకు, మఠాలకు, ఆచార్యులకు, విద్వాంసులు మొదలైనవారికి భూదానం చేసేవారు. అలానే ఆలయాలు, మఠాలకు అనుబంధంగా ఉండే కార్మికులకు జీతాలను చెల్లించేందుకు దానాలు చేసేవారు.

ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నదానం చేసే సత్రాలకు భూదానం చేసేవారు.

రైతులు, ఇతర వృత్తిపనుల వారికి పన్నుల మినహాయింపును ఇవ్వడానికి సంక్రాంతి సమయాన్ని ఎంచుకునేవారు.

పూలతోటలు, పళ్ళతోటలు పెంచి, ఆ ఫలసాయాన్ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాలకు, అన్నసత్రాలకు పంచడానికి గాను భూమిని ఈ సంక్రాంతి రోజునే విశేషంగా దానం చేసేవారు.

పాడుబడిన బావులు, చెరువులను సరిచేసే నిమిత్తం చేసే ధనసహాయాన్ని కూడా ఈ సంక్రాంతి రోజునే ఎక్కువగా చేసేవారు.

ఈ దానాలన్నీ కూడా స్వర్గం దొరకాలి అన్న ప్రతిఫలాపేక్షతోనే చేసినవి అయినా కూడా వీటి వల్ల ఆనాటి సమాజానికి ఎంతో కొంత మేలు జరిగింది.

 

శాసనాలు – సంక్రాంతి – దానాలు

 

తూర్పు చాళుక్య రాజైన రెండవ అమ్మరాజు తన తాటికొండ దానశాసనంలో “అస్మద్దేశ, సంతాన, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” ఉత్తరాయణ సంక్రాంతి రోజున దానం చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. కేవలం తనకొక్కడికే కాక తన దేశానికి, సంతానానికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి కావాలని కోరుకున్నాడు. ఇక్కడ సంతానం అంటే ప్రజలని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రాల ప్రకారం రాజు ప్రజలకు తండ్రివంటివాడు. ఈవిధంగా పూర్వపు రాజులు తమ వ్యక్తిగత పుణ్యానికి తోడుగా సమాజ శ్రేయస్సును కూడా కోరుతూ ఉత్తరాయణ సంక్రాంతినాడు విరివిగా దానాలు చేసేవారు.

కేవలం రాజులే కాదు ప్రజలు కూడా ఇదే ఉత్తరాయణ సంక్రాంతి రోజున తమ పుణ్యాభివృద్ధి కోసం యథాశక్తిగా దానాలు చేసేవారు.

కర్నాటక రాష్ట్రంలోని గుండ్లుపేటలో దొరికిన 11వ శతాబ్దంనాటి శాసనంలో ఎరెయంగ గావుండ అనే నేతగాడు, బేడగావుండ అనే పశువుల కాపరి ఇద్దరూ కలిసి నరనగల్ అనే ఒక గ్రామాన్ని మేతరొడెయ అనే వ్యక్తికి దానం చేసినట్టుగా ఉంది.

హొయ్సళ విష్ణువర్ధన కాలానికి అంటే 12వ శతాబ్దపు మధ్యభాగానికి చెందిన ప్రోలి అనే ఒక ఆలయనర్తకి 50 ఇనుప ఎడ్లు అంటే బర్రెలను ఆలయానికి దానం చేసింది.

నరసరావుపేట తాలూకాలోని ఎల్లమంద గ్రామంలో దొరికిన 12వ శతాబ్దం నాటి శాసనంలో బుడ్డన్న అనే వ్యక్తి ఒక చెరువును నిర్మించి దానిని కావూరు త్రికోటీశ్వరస్వామి ఆలయానికి దానంగా ఇచ్చాడు. ఈ దానం ఉత్తరాయణ సంక్రాంతి రోజునే చేసాడు.

12వ శతాబ్దానికి చెందిన హొయ్సళ రాజు మొదటి నరసింహుడు, అతని ప్రధాని ఇద్దరూ ఒక ఆలయాన్ని, ఒక చెరువును నిర్మించి వాటిల్ని ప్రజల ఉపయోగార్ధం ఉత్తరాయణ సంక్రాంతి నాడు దానం చేసినట్టు తెలిపే శాసనం ఉంది.

గుంటూరు జిల్లా, ఎడవల్లిలో దొరికిన సా.శ. 1157వ సంవత్సరానికి చెందిన శాసనం ప్రకారం నారాయణ అనే ఒక వ్యక్తి నాదిండ్లలోని మూలస్థాన మహాదేవ ఆలయానికి 55 మేకలను ఉత్తరాయణ సంక్రాంతి నాడు దానం చేసాడని చెబుతోంది. స్థానిక బోయవాళ్ళు ఆ మేకల్ని పెంచి, వాటి పాలతో తయారైన నెయ్యిని కొలిచి ఆలయానికి అందించడానికి ఒప్పుకున్నారన్న అంశం కూడా ఇదే శాసనంలో ఉంది.

 

ముగింపు

 

ఇలా కొన్ని వందల శాసనాలు ఆనాటి పాలకులు, ధనికులు, సామాన్య ప్రజలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఉత్తరాయణ పుణ్యకాలమైన మకర సంక్రాంతి నాడు విరివిగా దానాలు చేసేవారని చెబుతున్నాయి. ఈ దానలన్నీ కూడా “అస్మద్దేశ, సంతాన, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అన్న సత్సంకల్పంతోనే చేసేవారని చెబుతున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్న తేడాలు ఉన్నప్పటికీ ఉత్తరాయణ సంక్రాంతి దానాలు అన్ని సముదాయల వాళ్ళు చేసేవారని శాసనాలు చెబుతున్నాయి. అంతేకాదు, అన్ని సముదాయల వాళ్ళు లబ్ధిని పొందారని కూడా చెబుతున్నాయి.

ఇదే మనం తప్పక తెలుసుకోవలసిన “శాసన సంక్రాంతి