ఎందుకు నాన్నా ఇలా చేస్తారు ,
మా మనసును ఎందుకు తెలుసుకోరు .. ?
ఏమిటి అమ్మా మాకీ బాధ ,
మా ఇష్టాలెందుకు తెలుసుకోరు ?
అందరు డాక్టర్లు అయిపోతారా ,
అందరు ఇంజనీర్లు అయిపోతారా ,
చదువు , చదువు అంటూ మీరు
ఎందుకు నాన్నా విసిగిస్తారు ?
సచిన్ అంటే సంబరపడతావ్ ,
సానియాని చూస్తే శభాష్ అంటావ్ ,
రెహమాన్ పాటకు రెపరెపలాడతావ్ ,
చిరును చూస్తే చిందులు వేస్తావ్ .
మేం బ్యాట్ తో వస్తే బ్యాడ్ బాయ్ అంటావ్ ,
ఆటలు అంటే అమ్మో అంటావ్ ,
పాటలు పాడితే పాడౌతావంటావ్ ,
డాన్సు వేస్తే ధుమధుమలాడతావ్ .
వారమ్మా ,నాన్నా మీలానే
అడ్డం చెప్పి ఉండుంటే ,
అనే ఊహ మీకెపుడైనా
కలిగిందా అమ్మా ,నాన్నా ?
టీచర్ ,లాయర్ ,పోలీస్ ,నర్సు
సమాజానికి పనికి రారా ?
అందరు పల్లకి ఎక్కితే ,
మోసేవారు ఎవరమ్మా ?
మా మనసును మీరు తెలుసుకొని ,
మాకిష్టమైనా రంగంలో రాణించేలా చూస్తారా ,
మా సంతోషంలో ఎల్లపుడు ,
తోడుగా మాతో ఉంటారా …?
********