ఇంతా చేసి నువ్వు మట్టిలో ఆడుకునే దయ్యపు పిల్లవి. తడి ఇసకలో త్రిశంకు లోకాలు పొదిగే పంతాలమారి మొల్లవి. భూమ్యాకాశాల్నీ ఎకాయెకిన కలిపి చుట్టే హిరణ్యాక్షుడి మొదటి చెల్లివి. కెరటాలు ఎగదువ్వి మిడిసిపడే సముద్రం తల తాటిస్తూ గాలిలోకి లంఘించావు ఆలస్యంగా ఆంజనేయుడి అక్కలా. ఐతే నీ కోణంగి చూపుల సూర్య కిరణాన్నీ నిలవరించే గండరగండ ఘన పదార్థం ఎప్పటికీ ఓ బ్రహ్మపదార్థం. వెళ్తూ వెళ్తూ ఎందుకో అలా వేళ్ళు కదిలిస్తావు … అక్కడ గాలి ఫియానోమెట్లమీంచి రివ్వుమనే పిట్టల గుంపు కృష్ణ పాదాల్లా బుడిబుడిగా కనిపిస్తున్న నీ అక్షరాలు కాగితాల్ని దాటొచ్చి కప్పేసే వామనుడి అడుగులు. ప్రపంచమనే మహత్కావ్య పుటల్ని అశ్రుకాంతిలో తిరగేస్తూ, అచ్చుతప్పుల్ని చూసి మండిపడతావు. గతులు తప్పని భ్రమణాన్ని గ్రహాలు నీ శిరస్సులోకి మార్చుకుంటాయి.…