ఒక పాట జ్ఞాపకం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈ మధ్య మేం నాన్నగారి (కౌముది) కవిత్వం పుస్తకం “అల్విదా” వేసే ప్రయత్నంలో  మా తమ్ముళ్ళు, మా మేనల్లుడు ఖమ్మంలో మా ఇంట్లో గుట్టలుగా పడి వున్న  నా పాత కాయితాలన్నీ వెతికే యజ్ఞంలో పడ్డారు.

పాత కాయితాలు వెతుకుతున్నప్పుడు ఏం దొరుకుతాయి? కొన్ని జ్ఞాపకాలు! నెమలీకలు! ఎండిన రావి ఆకుల బుక్ మార్కులు! రంగు వెలిసిన ఉత్తరాలు.

ఎటో వెళ్ళిపోయిన స్నేహితుల స్మృతులు! నిన్నటి చేతిరాతలోంచి నిండుగా నవ్వే అమాయకపు ఆ ఆత్మీయ ముఖ పుస్తకాలు! మరలి వస్తే బాగుణ్ణు అనుకునే కొన్ని క్షణాలు!

పై చదువు నా అసంపూర్తి కల. నను వెంటాడిన కల.

చాలా మంది అప్పటి నా స్నేహితుల కంటే నా చదువు అర్థాంతరంగా ముగిసింది,  డిగ్రీ పూర్తి కాకుండానే, పై చదువుల కలని సగంలోనే తుంచుకొని, క్రుంగదీస్తున్న ఆర్థిక కష్టాలకు తల వంచుకొని, ఉద్యోగంలో చేరిపోవాల్సి వచ్చింది. ( అక్కడ ఆగిపోయిన చదువుల రైలుని తరవాత మళ్ళెప్పుడో అతి కష్టం మీద పట్టుకున్నాననుకోండి!)

నిజానికి కవిత్వం నా ఫస్ట్ లవ్ కాదు! ఎక్కువ కథలే రాసే వాణ్ని. కవిత్వం కేవలం స్నేహితుల కోరిక మేరకే రాసే వాణ్ని.

గొప్ప స్నేహమో, స్నేహ రాహిత్యమో కవిత్వం రాయిస్తుంది.  మంచి స్నేహం మంచి కవిత్వంలాంటిది! ఆ లేత స్నేహంలో వున్న కిక్కు ఇంకెందు వెతికినా దొరకదు కాదు దొరకదు.

నా మంచి మిత్రులు కొందరు అందమయిన  నోట్ పుస్తకాలు చక్కని బొమ్మలతో బైండ్ చేసి, “దీని నిండా కవిత్వమూ, కథలు రాసివ్వు,” అని అడిగే వాళ్ళు. అట్లా అడిగితే తప్ప  అసలు రాయాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇక బయటికి పంపడానికి చచ్చేంత మొహమాట పడేవాణ్ణి. మొదట్లో అచ్చయిన నా రచనలేవీ నేను నేనుగా పత్రికలకు పంపినవు కావు. నా మొహమాటాన్ని గమనించి, స్నేహితులే కవర్లు, స్టాంపులూ తెచ్చి, పోస్ట్ చేసే వాళ్ళు. నా రచన తిరుగుటపాలో వచ్చిన రోజు వాళ్ళే దిగాలు పడే వాళ్ళు, “అందుకేగా, నేను పంపలేదు?!’ అని నవ్వే వాణ్ని నేను

అచ్చయిన రోజు మా వూళ్ళో వున్న ఇరానీ హోటల్ కి తీసుకెళ్లి, వేడి వేడి సమోసాలూ చాయ్ (ఆ రోజుల్లో అవే  నా పెద్ద కోరికలు) ఇప్పించే వాళ్ళు. ఈ పూట ఈ నాలుగు ముక్కలూ రాస్తున్న క్షణాన  ఆ స్నేహితుల చిరునవ్వుల మొహాలన్నీ నా లోపలి మనోవిజన్ లో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి.

2

అట్లాంటి కాయితాల్లోంచి,  నా మేనల్లుడు  “మామా, ఇందులో కొన్ని పాటలు వున్నాయి,” అంటూ వొక కాయితం తీసి నాలుగు వాక్యాలు వినిపించాడు. తీరా గుర్తుకు తెచ్చుకుంటే, అది ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం నేను రాసిన పాట ప్రతి.

ఈ పాట వెనక చాలా కథ వుంది.

అప్పుడే నేను ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరిన కొత్త –  పద్దెనిమిదేళ్లు నాకు. నన్ను అందరూ “బాల కార్మికా!’ అని పిలిచే వాళ్ళు. కానీ, చేరిన మూడు నెలలకే నన్ను ఆదివారం ఎడిటర్ గా మార్చారు. నా జీతం పెంచాలని నండూరి రామమోహన రావు గారు వొకటికి పది సార్లు మేనేజ్మెంటుకి చెబితే, వాళ్ళు వినలేదు. “అతనొక్కడికీ పెంచితే, మిగతా వాళ్ళు గొడవ చేస్తారు,” అని వాళ్ళు పక్కన పెట్టేశారు.

అప్పుడు నండూరి నన్ను రేడియో స్టేషనుకు తీసుకు వెళ్ళి, “ఈ కుర్రాడు నాకు చాలా అవసరం. ఇతనికి నెలకి కొంత డబ్బు వచ్చేట్టు ఏదో వొకటి రాయించుకోండి,” అని ఉషశ్రీగారికి అప్పజెప్పారు.

“నీ పేరేమిటన్నావ్, నాయనా?” అని ఉషశ్రీగారు అడిగారు.

“అఫ్సర్” అన్నాను నెమ్మదిగా. అప్పుడాయన నన్ను పైనించి కింది దాకా చూసి, “ఆహా, ఇంకో మహమ్మద్ రఫీనా, మా ప్రాణానికి?!” అని మరీ మొహమ్మీదే అనేసరికి నండూరి చిన్నబుచ్చుకున్నారు. నా పరిస్థితి చెప్పక్కర్లేదు ఇక! కానీ, మౌనం వొక్కటే అప్పటి సమాధానం.

అయినా సరే, ఉషశ్రీగారికి నాలిక కరచుకునే అలవాటు లేదు. నండూరి వూరుకునే రకం కాదు.  “ఇతను పేరులోనే తురకం! వొక అవకాశమిస్తే  మీకే తెలుస్తుంది తరవాత!” అని పట్టుబట్టారు నండూరి. “సరే, చూద్దాం. రేపు సాయంత్రం కల్లా వొక పాట రాసి తీసుకురా! మా ఖర్మ మరీ ఎక్కువ కాలితే, నువ్వే పాడుదువు కానీ! పాటలో విప్లవాలూ గట్రా ఏడ్వకు. ప్రేమ పాట రాస్తే, అసలే గొడవా లేదు,” అన్నారు.

ఉషశ్రీ మాట తీరు నచ్చక, మరునాడు నేను నండూరి దగ్గరికి వెళ్ళి, “నేను ఆ పాటే కాదు, అసలు ఆయన అడిగితే ఏమీ రాయను,” అని చెప్పేశాను. అప్పుడు నండూరి,” నువ్వేమిటో ఆయనకి తెలియదు, నీ పేరు తప్ప! ఇప్పుడు సరే, ఈ “పేరు” వల్ల ఇంకెప్పుడయినా ఇట్లాంటి గొడవ  తప్పదు నీకు. ఆ  గొడవ  ఏదో  ఇప్పుడే వచ్చేసిందనుకో. ఆయన నీకు అవకాశం ఇవ్వడం కాదు, నువ్వేమిటో తెలుసుకొనే అవకాశం ఆయనకి నువ్వే ఇచ్చి చూడు. అట్లా ఆలోచించు. అయినా, ఉషశ్రీ మాట తీరే అంత! మనుషుల  మీద అలిగి, పాటని వదులుకోవద్దు.”

అట్లా అనడమే కాదు, పాటలో లయ గురించి హిందీ, తెలుగు పాటల నించి కొన్ని ఉదాహరణలిచ్చి, కొన్ని పల్లవులు పాడి, ఉత్సాహం నింపి పంపిన సాయంత్రం నేను నా గదిలో కూర్చొని వొక గంటలో అల్లిన పాట ఇది. ఈ పాట ఇచ్చిన తరవాత ఉషశ్రీ గారు చదివి, “స…లక్షణంగా వుంది. నువ్వే రాశావా, నాయనా?” అని కాస్త వెటకారంగా అన్నారు, సలక్షణంలో  “స” “ల” వొత్తి పలుకుతూ.

అప్పుడు ఈ పాట ఎవరు పాడారో ఇప్పుడు గుర్తు లేదు. కానీ, అప్పట్లో నాకు అదొక గుర్తింపు.  పాట రికార్డ్ అయిన తరవాత నలుగురైదుగురు మెచ్చుకున్న తరవాత కానీ ఉషశ్రీగారు శాంతించలేదు. “నీలో పలుకుంది రా! గెలిచావ్ పో!” అన్నారు మరో ప్రోగ్రాం కి కాంట్రాక్ట్ ఇస్తూ – అట్లా వొక దాని వెంట వొకటి ఇస్తూనే పోయారు. వ్యాసాలు, కథలూ, పద్యాలూ… కానీ, ఆయన నా చేత ఎక్కువ పాటలే రాయించే వారు, ఎందుకంటే పాటలకు ఎక్కువ రెమ్యూనరేషను వుండేది కాబట్టి! నాకు నాలుగు రాళ్ళు ఎక్కువ ఇప్పించాలనీనూ.

ఉత్సాహం ఉరకలు వేసే ఆ వయసులో, ఆ ఆవేశపు ఉరుకుల పరుగుల సమయంలో  ఉషశ్రీ గారి దగ్గిర నేను చాలా నేర్చుకున్నాను.  ముఖ్యంగా, వాక్యాన్ని స్పష్టంగా, పదాల్ని స్ఫుటంగా పలకడం! శ్రోతల కోసం రాసే రచనా వ్యూహాలు! ఆ విషయాల్లో ఇప్పటికీ ఆయన ప్రతిభా, సమయస్ఫూర్తి అద్భుతమే అనిపిస్తాయి. “మనం చెప్పేది ధర్మం అయినా కాకపోయినా, చెప్పే పద్ధతి అవతలి వాడు కనీసం వినేట్టుగా వుండాలి. విన్న తరవాత వాడి ఖర్మ వాడిది. కవిత్వం రాయ్, కాకరకాయలు రాయ్, నీ స్వరానికి వొక పర్సనాలిటీ వుండాల్రా! లేకపోతే, నీకు పర్సనాలిటీ లేనట్టే!” అన్నారు వొక సారి మాటల సందర్భంలో!

ఆయన మహా పెర్ఫెక్షనిస్టు. శుద్ధవాది. పైగా, పైకి కర్ణకఠోరమనిపించే తిట్లు, మనిషి లోపల వెన్న అయినా సరే!  ఆయన్ని మెప్పించడం మహా కష్టంగా వుండేది. ఆయనకి నచ్చినట్టు రాయలేక,  వొక్కో సారి ఏడుపు వచ్చినంత పనయ్యేది. అట్లాగే, రేడియో ప్రసంగంలో ఏ కాస్త గొంతు తేడా వచ్చినా, రాజీపడే వారు కాదు. ఆ రోజుల్లో నాకు నోరు పెగలడం కష్టంగా వుండేది, నేను స్వతహాగా అంతర్ముఖుణ్ణి కావడం వల్ల!

“ఆ లోపల మొహం పెట్టుకోవడం మానేయ్ ముందు…! మైకులో మొహం పెట్టగానే, కొత్త అవతారం ఎత్తాల్రా…రాక్షస అవతారం! ఒరే, నువ్వు తెల్లారుజామున్నే లేచి, ఘట్టి చలిలో కృష్ణ నది వొడ్డుకి  పరిగెత్తుకు వెళ్ళి, గొంతెత్తి మాట్లాడు, కాదు అరవడం ప్రాక్టీస్ చెయ్! గొంతు ఎంత దూరం పోతే అంత దూరం అన్నమాట.” అన్నారో సారి!  నేను నిజంగా అంత పనీ  చేయలేదు కానీ, పొద్దున్నే లేచి, గొంతు పెట్టె మాత్రం కాస్త సరిచేసుకునే వాణ్ణి.  కథో, కవిత్వమో, ఏమీ దొరక్కపోతే, ఆ పూట ఏ నండూరివారి సంపాదకీయమో పెద్దగా చదివేసే వాణ్ణి.

ఉషశ్రీగారు అలా తను రేడియోలో వున్నంత కాలం నాతో ఏదో వొకటి రాయిస్తూనే వచ్చారు. తను వెళ్లిపోతూ, తన బాధ్యతలు తీసుకున్న ఇంద్రగంటి  శ్రీకాంత శర్మ గారి దగ్గిరకి తనే తీసుకువెళ్లి, “వీడు కాలాంతకుడు. మంచి పద్యం రాస్తాడు, కవిత్వం రాస్తాడు, కథ రాస్తాడు, వ్యాసం రాస్తాడు. వదులుకోకు,” అని రెండు ముక్కల్లో పరిచయం చేసి, వెళ్ళిపోయారు. ఆ తరవాత ఆకాశవాణికి నేను నిలయ విద్వాంసుడిని అయిపోయాను.

ఇక ఇదీ నా మొదటి పాట…!

3

పాట:

జల జల కురిసే వానల్లో చెక్కిలి మీటే చినుకేదో,

అలుపే లేని మాటల్లో అలకలు  తీర్చే పలుకేదో.

మధురోహల ఈ క్షణమే తొలి కలలకు  ఏరు వాక

చిరు చినుకుల  ఈ గుడిలోనే మన వాసం కడ దాక.

ఎన్ని వానలు నీకోసం ఎదురుకాశానో

ఎన్ని  కాలాలు నీలోన నిలిచిపోయాయో

వొకే వొక్క  క్షణం  మరి మరి నిన్నడిగా

ఆ వొక్క క్షణమే పది జన్మలయి నే నడిచా —                  ఈ మధురోహల—

 

నువ్వొచ్చే దారిలో నీ దేహపు విరితావికి

పరిమళించి నవ్వింది నునుబుగ్గల నేలమ్మ

నులివెచ్చని నీ వేలికొసల కొనగోటి వీణకు

సిగ్గుల మంచై వాలె, సెగ సెగలా  సూరీడు          ఈ మధురోహల—

 

ఇక యుగాలు నా చెంత లేవని

క్షణమొక యుగమయ్యే చింత లేదులే,

యుగమే క్షణమయ్యే మంత్రమేదో  తెలిసిందిలే

ఎడ తెరపిలేని వాన, ఎద తలుపులు తెరిచిందిలే

ఈ మధురోహల—

 

Your views are valuable to us!