అచ్చ తెనుగు ఆత్మగీతం : అంతర్యానం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

1

కిరణ్ ప్యూర్ పొయెట్.

ప్రస్తుతం తెలుగు కవిత్వ వాతావరణం ఎలా వుందో అందరికీ తెలుసు. అకవిత్వం మత్తులో రాజ్యమేలుతున్న డిస్కో ఛానల్స్ లో ఈ కవి వొదగడు. కొంచెం ప్రత్యేకంగా చూడాలి. మరికొంచెం ఓపిగ్గా చదవాలి. మరి కాస్త హృదయం పవిత్రంగా పెట్టుకొని చదవాలి. అప్పుడే, మనవి కాని, మనము చూడని మరో స్వప్నాలని మనం అందుకోగలం. అప్పుడే కవి మనవాడు అవుతాడు. మనమెరుగని తాత్విక అలౌకిక స్వాప్నిక వర్ణాల్ని మనకు అద్దుతాడు.

మిత్రులారా! కిరణ్ ప్రచార కవి కాడు. కవిత్వాన్ని శ్వాసిస్తూ ఎక్కడో ఆంధ్రదేశానికి దూరంగా బతుకుతూ సంచరిస్తున్న సమూహంలోని వొంటరి కవి. రాసిలో వ్రాసినది చాలా తక్కువ. ఎక్కువ వ్రాయాలనే వ్యామోహంగానీ, వ్రాయాల్సినంత ఎక్కువగా వ్రాయలేదనే చింత తెలీని విచిత్రమైన చిత్ర కవి కిరణ్. తాత్వికత అనే కంప్యూటర్ భాషను అర్థం చేసుకోడానికి, తన కవిత్వంలో ప్రకృతి నొక సాఫ్ట్వేర్ గా ఇన్స్టాల్ చేసుకున్న కవి.

లత గొంతుకి ఎంతటి ఎలాస్టిసిటీ వుందో కిరణ్ ఊహలకి అంతటి తూగు వుంది. (కొంచెం అతిశయోక్తికి క్షంతవ్యుణ్ణి.) ఎటువంటి ఆర్భాటం, తొందరపాటు లేకుండా చాలా తరుచుగా మాత్రమే కవిత్వం వ్రాస్తుంటాడు. అయాం సిక్ ఆఫ్ దిస్ మెస్ అనే భావం ప్రతి అక్షరంలోనూ వినిపిస్తుంది.  కిరణ్ తాత్వికతకు మొదలు అన్వేషణ. అన్వేషణ మొదలయ్యేది ప్రకృతిలోనుంచి.

"ఆకాశం చూస్తూ

ఒంటరి పూవు

వెన్నెల పరుస్తూ

ఒంటరి చంద్రుడు

దొంగలా తచ్చాడుతూ

ఒంటరి మబ్బు

అనేక ఏకాంతాలపై

సామూహికంగా

చినుకుల దాడి”

అంటూ తనపై తనే ప్రశ్నల వర్షం కురిపించుకుంటాడు. పూర్తిగా కాదు కానీ, కొంతవరకు కిరణ్ లో బైరాగియన్ తోవ కనబడుతోంది. అందుకే “ఎటు నుంచి చదవాల్సిన / పుస్తకం ఇది?” అని అనుమానపడతాడు. వెంటనే “మెలికలు తిరిగే ప్రశ్నార్ధకాల ప్రవాహంలో / నేనూ ఓ చుక్కనే!” అంటూ చెప్పుకొంటాడు. మళ్ళీ వెంటనే, “ఎలా మొదలేయాలనేదే / అసలు సమస్య” అని మరో వర్షానికి మేఘమథనం చేస్తాడు.

కిరణ్ కవిత్వం పైపైకి బోలెడంత మౌనంగా వుంటుంది. కానీ, చదివే కొద్దీ లోలోని శబ్దాలు పలకరించడం మొదలుపెడతాయి. ఆ సౌండ్స్ కి వొకానొక రిథం వుంటుంది. వొకవేళ మీరు ఆ రిథంకి ఆకర్షితులై అక్కడే ఆగిపోతే కిరణ్ మనకు అర్థమవ్వడు. ఆ రిథం దాటుకొని ముందుకుపోయిన తర్వాత మరొక స్పేస్ వుంటుంది. అదిగో అక్కడే ఈ కవి సంచరిస్తుంటాడు. అక్కడే ఈ కవిని మనం పట్టుకోవాలి. అప్పుడుగానీ, మనకు కిరణ్ కవిత్వం అర్థమవ్వదు.

ఏళ్ళు మారినా
ఊళ్ళు మారినా
మట్టిలో కలిసే
మబ్బు వాసన మారలేదు
 
ఎన్నెన్ని అనుభూతులు
వెదజల్లి
గుండెలోతుల్లో
జ్ఞాపకాలు వెలికితీస్తుందో!

 

ఒక్కసారి
మబ్బుల్లో పుట్టి
మట్టిలో పొర్లాలనుంది...

 

2

సుమారు గత 10 సంవత్సరాల నుండీ సుబ్బు, రఘు, కిరణ్ లను ఆంతరంగికంగా గమనిస్తూ, పరీక్షిస్తూ, అప్పుడప్పుడు కోప్పడుతూ వున్నవాణ్ణి గనుక వారి సృజనవికాస దశదిశలు అందరికన్నా నాకు బాగా తెలుసు అని నమ్ముతున్నాను. (రఘు, సుబ్బుల గురించి వేరే సందర్భంలో ప్రస్తావిస్తాను).

కిరణ్ వొకానొక ట్రెడిషనల్ విజన్ లో కనిపించే కార్పొరేట్ కెర్నల్ పొయెట్. అలాగే కార్పొరేట్ షెల్ లో దారితప్పిన ట్రెడిషనల్ వ్యూ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇతనిది. ఈమాట ఏదో తమాషాకి అంటున్నది కాదు. ఇదో గందరగోళ వైరుధ్యాల జీవనస్రవంతికి సంబంధించిన అంశం. సాహిత్యాన్ని మనోవైజ్ఞానిక స్కేల్ తో చూసే దృష్టి మనకు వుందని నాకు తెలీదు. ఆసక్తికరమైన ఈ చర్చకు ఇది సందర్భం కాదు. నాకు నేనైతే, కిరణ్ కవిత్వాన్ని అదే దృష్టితో చదువుతాను.

అందుకే ఇతని కవిత్వంలో అనేక లేయర్స్ కనిపిస్తాయి. ఒక లేయర్ కి మరొక లేయర్ కి మధ్య బోలెడంత ర్యాపో వుంటుంది.

వర్షం వెలిసిన
ఆకాశం
నవ్వే పూలు
వెన్నెల స్పర్శ
................
................
నాకు అర్థమైన సాయంత్రం
జుట్టు చెదిరిన ఆకాశం
విచ్చు కత్తులు
వేడి కొలిమి

ప్యూర్ పొయెట్రీ అంటేనే మెసేజ్ -వర్స్, that is concerned with exploring the essential musical nature of the language, rather than with conveying a narrative or having didactic purpose. అదే పనితనం “అంతర్యానం”లో మనం చూస్తాం.

3

కవిత్వాన్ని భిన్నంగా చెప్పాలనే తాపత్రయం కన్నా, కవిత్వాన్ని కవిత్వంగా చెప్పాలి; ఇంకా చెప్పాలంటే, కవిత్వాన్ని శుద్ధ కవిత్వంగానే చెప్పాలనే నిష్ఠాగరిష్టుడు కిరణ్. అందుకే, కిరణ్ కవిత్వంలో అనవసరమైన మర్యాద, అమర్యాదల గందరగోళాలు కనిపించవు. ఇదొక ఊట చెలమ. ఎంతెంత పిండుకోవాలో దాహార్తి స్థాయి నిర్ణయిస్తుంది. చెప్పాలనుకున్నది మొత్తానికి మొత్తంగా విప్పి చెప్పడు. సింపుల్ గా కీ ఇచ్చి వదిలేస్తాడు. మనమే దానిమ్మ గింజల్ని వొలుచుకొంటున్నట్లుగా అల్లుకొనిపోవాలి.

కిరణ్ కవిత్వం చాలా చక్కటి చిక్కదనమున్న రూపం. ఎక్కడా పట్టుకోల్పోడు. వస్తు రూపాల మధ్య చక్కటి బ్యాలన్స్ కనబడుతుంది. అయితే, నేటి ఆంధ్ర దేశంలో కుప్పలుతెప్పలుగా కుకవిత్వపు తుఫాను రేగుతున్న ఈకాలంలో తొలకరి సువాసనల ఫ్రెష్ నెస్ తో కిరణ్ కవిత్వం వినిపిస్తున్నాడు. అభినందించకపోయినా ఫర్వాలేదు. కానీ సహృదయంతో అనుభవించండి. ఇది చాలు.

పి.యస్ : మిత్రమా! మళ్ళీ కవిత్వం వ్రాస్తావనే నమ్మకం లేదు. వ్రాయకపోయినా ఫర్వాలేదు. ప్యూర్ పొయెట్రీ ప్రేమికులకు చక్కటి బహుమానాన్ని పంచావు. ఎన్నెన్నో ఈస్తటిక్ తలపులు తెరిచావు. నీ అంతర్యానపు పరిమళాన్ని ఇగిరిపోనీకు. కవిత్వం వ్రాయడం కన్నా, కవిత్వంలా బతకడం వొక రహస్య విద్య. ఈ టెక్నిక్ నీకు బాగా తెలుసు. కవిత్వంలా బతికే రహస్య స్వప్నాల్తో అప్పుడప్పుడు మమ్మల్ని పలకరిస్తున్నందుకు థ్యాంక్స్..

 

ఆల్ ద బెస్ట్ …

ఇక్బాల్ చంద్

బెంగుళూరు, 4-డిసెంబర్-2012

Your views are valuable to us!