కరచాలనం ఒక చక్కటి అనుభూతి అనడంలో సందేహం లేదు.
వ్యక్తిని బట్టి అనుభూతి మారుతుంది. కొంతమంది మృదువుగా, మరి కొంతమంది అంటీ అంటకుండా, ఎంతసేపటికీ చెయ్యిని వదలనివారు కొందరు. ఇలా రకరకాల షేక్ హ్యేండ్స్. కొంతమంది ఇచ్చే షేకులకు చేతులు విరుగుతాయా అనిపిస్తుంది. స్నేహితుడి కరచాలనం ఒక రకంగా, పై అధికారితో ఒకరకంగాను, కిందిస్థాయి ఉద్యోగితొ ఒక రకంగా, ప్రియురాలితో మరోరకంగా రకరకాల అనుభూతుల కరచాలనాలు.
వీటన్నిటికీ మించి మరో గొప్ప కరచాలనం వుందండోయ్! కానీ దాన్నెవరూ కోరుకోరు. అదే చెయ్యియ్యడం లేదా హ్యాండియ్యడమండీ. ఈ రకమైయిన కరచాలనానికి ఏ రకమైన మధురానుభూతీ వుండదు, కోపానుభూతి తప్ప!
* * * * * * *
౨.
రాత్రి పన్నెండోగంట దాటిన తర్వాత నేనూ, ప్రజక్త ఆ క్యాంటీన్ కు వెళ్తే ఒక పడుచుజంట మూల కూర్చోని మాటాడుకుంటున్నారు. అమ్మాయి గలగల మాటాడుతుంటే, అబ్బాయి ఆమె కళ్ళల్లోకి అదే పనిగా చూస్తూవున్నడు.
కొంచెం టీజ్ చేద్దామని బుద్ది పుట్టి ప్రజక్తతో “చూడు! అమ్మాయిలు అబ్బయిల్ని ఎలా చూపుల్తొ చంపుతున్నారో!” అన్నాను.
“భాయీ, నీకు తెలీదు! అమ్మాయిల చూపు సంగతి…” అని ఆ రాత్రి పెద్ద ఉపన్యాసమే దంచింది.
ప్రజక్త మాటల్లో చెప్పాలంటే ఓరచూపుతో అబ్బాయిల్ని కుక్కపిల్లల్లా తిప్పుకోరు అమ్మాయిలు.అయితే కొంతమంది పురుషుల విషపు చూపుల కంటే కూడా అమ్మాయిల ఓరచూపులు బెటర్ అంటూ అని ముగించింది.
* * * * * * *
౩.
స్పర్శ – అన్నీటికన్నా గొప్ప సెన్సరీ ఆర్గాన్.
శిశువుని తాకిన స్పర్శానుభూతి నిజంగా వర్ణనాతీతం. చాలాకాలం తర్వాత ఇంటికి వచ్చిన బిడ్డను తాకినప్పుడు అమ్మ కళ్ళల్లో అనుభూతికి వెల గట్టే షరాబు ఇంకా భూమి మీద పుట్టలేదు. గతించిన చాలాకాలం తర్వత నాన్న ఫొటోని తాకినప్పుడు కంటిలో ఊరిన చెమ్మానుభూతిని హృదయమే చదవగలదు.
నిజానికి నేటి కొత్త లోకంలో మనం స్పర్శను కోల్పోతున్నాము. ప్రపంచంలో ఉండాల్సిన స్పర్శానుభూతినీ డబ్బు వ్యాపారం చేస్తూంది. స్పర్శను వొదులుకోవడమంటే దయ్యానికి మన ఆత్మలను తాకట్టు పెట్టినట్లు. ఆత్మను వొదులుకోవడమంటే అమ్మను అమ్మినట్లు.
* * * * * * *