మీర్జాగాలీబు మామిడిపండు – బేరా మేస్టారా మజాకా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అవును, గాడిదలే తినవు!

మీర్జాగాలీబు ఎంతటి మహాకవో అంతే హాస్యప్రియుడు కూడా!

ఆ కాలంలోని ఓ పిల్ల జమీందారుకు, గాలీబుకు మధ్య శీతలయుద్ధం జరుగుతూవుండేది. మామిడిపళ్ళ సీజనులో గాలీబ్‍ను గేలిచేయాలన్న ఉద్దేశంతో మామిడంటే గిట్టని ఆ కుర్రవాడు నిశ్చయించుకున్నాడు. మహా ఇష్టంగా మామిడిపళ్ళని తింటున్న గాలీబ్ వద్దకు వచ్చాడు. అప్పుడు గాలిబ్ పక్కనే ఓ గాడిద నిలబడివుంది.  దాని ముందు మామిడిపళ్ళ బుట్ట కూడా ఉంది. దాన్ని చూసిన కుర్ర జమీందార్ “చూశారా మహాశయా! గాడిద కూడా మామిడిపళ్ళని ఇష్టపడ్డంలేదు!” అన్నాడు. పండు తినడాన్ని ఆపి, పిల్ల జమీందార్ కళ్ళలోకి గుచ్చి చూస్తూ “జనాబ్! గాడిదలే మామిడిపళ్లు తినవు. వీటి రుచి వాటికి తెలియదులేండి.” అని అనేసి తినడంలో మళ్ళీ మునిగిపోయాడు గాలిబ్.

బేరా మ్యాస్టారా!మజాకా!

బేతవోలు రామబ్రహ్మం గారు ఇప్పుడున్న భారతీయ టాప్ 10 క్లాసికల్ స్కాలర్స్ లో  టాప్ పొజిషన్లో ఉంటారు. కవి, పండితులు, వ్యాఖ్యాత, అంతకు మించి గ్రేట్ టీచర్. పాఠం వింటున్నంత సేపు జెయంట్ వీల్ లో చక్కర్లు కొడుతున్నట్లు వుండేది. ఇప్పుడు కూడా యూనివర్సిటీ లో పాఠాలు చెబుతున్నారో రిటైర్ అయ్యారో తెలీదు (ఇలాంటి సమాచారలేమికి మీరు అనేకమార్లు క్షమించాలి నన్ను)

అన్నట్టు బే.రా. మాస్టారు చేయి తిరిగిన అవధాని కూడా. ఇప్పుడు అవధానాలు చేయడం లేదనుకుంటా! “దేవీ భాగవతం” పేరుతో సహా అవార్డ్ కూడా తెచ్చి పెట్టిన రచన. కానీ బే.రా. ప్రతిభ అంతా వేణీ సంహారం,  మృచ్చకటికం లో దాచిపెట్టారని నా నమ్మకం. తమాషా కోసమని ’ఆధునిక వేమన శతకం’ రాసారు.

ఎంత సీరియస్ గా కనిపిస్తారో అంతే చమత్కారంగాను వుంటారు. తరగతిలో కాని సభలో కానీ ఎవరైనా తేడాగా కనిపిస్తే ఒక సెటైర్ విసురుతారు. సదరు సెటైర్ ఆ వ్యక్తి ఒక్కడికి మాత్రం మొహం మీద గుద్దినట్లుగా కనిపిస్తుంది, మిగిలిన వారందరికి హాస్యంగా కనిపిస్తుంది! అయితే ఎవరిని వుద్దేశించి అన్నారో మాత్రం తెలీదు. అదీ సంస్కారవంతమైన చమత్కారమంటే.

మరీ ముఖ్యంగా టీ.వీ లో వచ్చే ఉగాది కవిసమ్మేళనాల్లో తొంబై శాతం చెత్త కవులో, కవియిత్రులో వస్తుంటారనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి సభలకు అధ్యక్షత వహించాల్సి వచ్చినప్పుడు,  బేరా మాష్టారి చమత్కారం గమ్మత్తుగా వుంటుంది. అవతలివారేమో బే.రా. గారి వ్యాఖ్యానాన్ని పొగడ్తగా భావించి మురిసి పోతుంటారు. కాని దాని అంతరార్ధం అర్ధం అయి చావదు. ఇలా చెబుతూ వెళితే ఇదో పెద్ద వ్యాసం అవుతుంది. దానికి మరో సందర్భం వెదుక్కుందాం.

అన్నట్లు చివర్లో ఒక మాట చెప్పక తప్ప్పదు. మాస్టారు గారికి రావల్సినంత గుర్తింపు రాలేదు. దానికి రెండు కారణాలు వున్నాయి.

౧) నేటి తెలుగువారికి పండితుల్ని గుర్తించే సెన్స్ పోయింది.

౨) ఆయన తనంత తానుగా లో ప్రొఫైల్ ను ఎంచుకోవడం.

తన సరుకును అవసరానికి మీరి మార్కెట్ చేసుకోవడమనేది ఈ ఆధునికుల్లో ఉండే నేర్పరితనం. అదృష్టవశాత్తూ నా గురువులెవరికీ ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు తెలీవు.

Your views are valuable to us!