సమాజం కూడా చిత్రమైనది. కాఫీ తాగాలని అనిపించినపుడు టీ తాగమని డిమాండ్ చేస్తుంది. టీ తాగుదామనుకొన్నప్పుడేమో కాఫీ కే పరిమితమవమంటుంది.
టీ, కాఫీ – రెండూ కలిపి తాగగలిగే నేర్పరులు కొందరు. ’ధన్య సుమతులు’. వారికి నా సలాములు!
సంగీతలక్ష్మి లతమ్మ, దీదీ మమతాబెనర్జీ, పురచ్చితలైవి జయలలితా, దేవీమా ఉమాభారతి, అలనాటి హిందీ చిత్రకన్య(!) ఆశా పరేఖ్ – నాకు తెలిసి వీళ్ళందరూ కుమారీలనే అనుకొంటా!
షోలే ఠాకూర్ సంజీవ్ కుమార్, మాజీ నేతలు కలామ్‍జీ, వాజపేయి మాస్టారు, అమృతాప్రీతమంతటి కవి సాహిర్, అమృతాన్నే ప్రీతంగా బతికి పోయిన మరో ఉర్దూ కవి మజాజ్ – వీరందరూ కుమారులేనట!
పైవారందరూ వారి వారి రంగాల్లో గొప్పవారనడంలో సందేహం లేదు. మరి వకవేళ వాళ్ళు వివాహితులై వుంటే అంతటి ప్రతిభ కనబరచేవారా? అని అప్పుడప్పుడూ అల్పంగా సందేహం వేస్తూవుంటుంది. ’అలాగేనేమో!’ అని అనేసుకుందామంటే పెళ్ళి చేసుకొనీ గొప్పవాళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు కదా! అలాంటప్పుడు వివాహం కెరీర్‍కు అడ్డంకా? కాదా! కొందవి అవ్వొచ్చు. మరొకరికి కాకపోవచ్చు. మధ్యమార్గం – మార్గమధ్యం ఎప్పుడూ ఉంటాయి మరి!
నాకు మిత్రుడైన ఒకానొక సినీ పురుషోత్తముడు ఒకరాత్రి మూడు, నాల్గు అంకాలు దాటాక వొక మధువొలికే మాట చెప్పాడు – “పోస్ట్ మోడ్రన్ కాలంలో ఉత్తమభార్య లేక ఉత్తమ భర్త లేర”ని! అదేవిధంగా, అదేమోగానీ రాజశేఖరుడు చెప్పినట్లు ఉత్తమ కవిత చెప్పే కవి వున్నప్పుడు ఉత్తమ శ్రోత దొరకడని, ఉత్తమ శ్రోత వున్నప్పుడు ఉత్తమ కవి దొరకడని, ఇద్దరూ వొకేసారి దొరికితే ఉత్తమ కవిత్వం వస్తుందట! దీన్నే కొంచెం మార్చి చెప్పుకొంటే, ఉత్తమ భర్తకు/భార్యకు తగిన జోడీ దొరకడం కష్టం. బండికి అటునిటు కట్టే ఎడ్లు ఒకే ఎత్తులో ఉంటే కాడికి బ్యాలెన్సు దొరుకుతుంది. అలాగే, అటునిటునుండే చక్రాలు ఒకే సైజులో తప్పనిసరిగా ఉండాలి. లేదంటే బండి బోల్తా కొడుతుంది. కానీ ఈ బేవఫా జిందగీలో నిమ్నోన్నతలదే ఇష్టారాజ్యం!
ఉత్తమకవికి తగ్గ శ్రోత, ఉత్తమ భర్త/భార్యకు సరితూగెడి జోడీ ఎక్కడో తప్ప తరచూ దొరకరు. అలా పరస్పరం దొరకబడ్డవారు ధన్యులు. ఒకవేళ అలాంటివారే గనక వుంటే, వారు ఈ హ్యామర్ను చదివితే వారికి నా ధన్యవాదాలు. చదవకపోయిన నమోవాకాలు!
ఇక వివాహావివాహితులు అనేకమంది. కొంతమంది ఫుల్‍టైమ్, మరికొంతమంది పార్ట్ టైమ్. కొద్దికాలం కోసం భార్య పుట్టింటికి వెళ్తే అప్పుడు పార్ట్ టైమ్, అలిగో లేదా పోట్లాడో వెళ్ళిందనుకోండి అప్పుడు ఫుల్‍టైమ్. దీనిని ’గృహదహనం’ అని కూడా అనవచ్చు.
మళ్ళీ మొదటికి వద్దాం!
వివాహం అవసరమా? అవసరం అంటే అవసరం. లేదు అంటే లేదు. ఇదో ప్రసూతి వైరాగ్యంలాంటిది. ఈమధ్య మా శిష్యుడిలాంటి మిత్రుడొకడు కొత్తగా ఉద్యోగంలోకి చేరాక, త్వరబడి ఎంత చెప్పినా ఆగకుండా పెళ్ళి చేసుకొన్నాడు. నెల తిరిగింది. “ఏరా అబ్బాయ్!” అంటే “సార్! ఇయ్యాల మనసు బాగోలేదు. ఆఫీసు టైం తర్వాత బైటకెళ్దాం.” అన్నాడు.
కట్ చేస్తే……సీన్ అంతంలో “క్షవరం ఐతేగానీ వివరం కాలేదు సార్!” అని గొల్లుమన్నాడు.
అయ్యా! అదీ విషయం!!