బలగం సినిమా – రేషనల్ ఎండ్ ఎకనమిక్ ఏంగిల్స్ : మరిన్ని సినిమా విశేషాలకు చదవండి “మాయాబజార్”
బలగం సినిమా చాలా ఆలస్యంగా చూసాను.
తాడేపల్లిగూడెం లో ఉన్న థియేటర్ లో చూద్దామని హాలువరకూ వెళ్ళాక ముందురోజే ఆ థియేటర్ నుంచి ఆ సినిమా తీసేసారని తెలిసింది. అంచేత ఓటీటీ లో చూసాను.
బోలెడు రివ్యూలు చదివాకా చూసానేమో, ఆ పాటలు అనేకసార్లు విన్నాకా చూసానేమో, పెద్దగా ఎమోషనల్ ఫీల్ రాలేదు. అంచేత ఈ సినిమాని నేను ఎమోషనల్ ఏంగిల్ లో కాక రేషనల్ ఎండ్ ఎకనమిక్ ఏంగిల్స్ లోనే చూసాను.
ముందు ఆ అంశాలు రాసి చివరగా మూఢ నమ్మకాలు, ఎమోషన్లు గురించి నాకు తోచింది రాస్తాను.
ధ్వని పాడ్కాస్ట్ యాప్ – వందల కొద్ది ఆడియోలను ఉచితంగా వినండి
బలగం సినిమా పాత్రలు – వాటి స్వభావాలు:
కొమురయ్య పెద్దకొడుకు అయిలయ్య
మొండితనానికి నిలువెత్తు రూపం. పొలంలో అద్దె ట్రాక్టరు నడిపే వ్యక్తి దగ్గరనుంచి బావ వరకూ ప్రతిచోటా సర్రుమంటూ ఆవేశపడతాడు. ఈ ఆవేశం వల్ల వచ్చే ఆర్దిక నష్టం అతణ్ణి ఏమాత్రం మార్చదు. కొడుకు వ్యాపారం కోసం ఎకరం అమ్మిన అయిలయ్య ఆ తర్వాత ఆ డబ్బుతో కొడుకు మొదలుబెట్టిన వ్యాపారాలు దెబ్బతిన్న విషయం గాని, తనకు తెలియకుండా కొడుకు చేసే అప్పుల విషయమై ఏ మాత్రం తెలియకపోవటం కొంచెం అసహజంగా ఉన్నా అసంభవం ఐతే కాదు.
రెండో కొడుకు మొగిలయ్య
పాత్ర ప్రవేశం నుంచీ ’భార్య చాటు భర్త’గానే ఉన్న మొగిలయ్య, తండ్రి సమాధి విషయం వచ్చేవరకూ అనామకుడే. సూరత్ లో ఉద్యోగం చేసే మొగిలయ్య కథలో వయసు రీత్యా మరో ఇరవయ్యేళ్ళైనా సూరత్ లో ఉండవలసినవాడు. కనుక అక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకోవటం తప్పు కాదు. సమాధి స్థలం సరిగ్గా మొగిలయ్య వాటాకే వచ్చిందా? ఒకవేళ అమ్ముకోవాలనుకొనే కొడుకుకి కొనుగోలుదారుడు సమాధి విషయంలో అభ్యంతరపెడితే ఆ సమాధి ఉన్న పొలం భాగం పెద్దకొడుకు తీసుకుంటాను అని ముందుకు రావచ్చు. బహుశః కథలో చిక్కదనం కోసం మొగిలయ్య భార్య సమాధి స్థలాన్ని మార్చమని తన బావతో వాదించినట్టూ, అక్కకి మద్దతుగా వెళ్ళిన మొగిలయ్య బావమరిదిని అయిలయ్య నెట్టేసినట్టూ చూపించి ఉండవచ్చు.
కూతురు లక్ష్మి
ఒక సగటు నిస్సహాయ గృహిణి. మొగుడికి జరిగిన అవమానాన్ని సర్ది చెప్పలేకపోయినా, పుట్టింటికి దూరమైనందుకు ఇన్నేళ్ళూ కుమిలిపోయిన స్త్రీ.
అల్లుడు నారాయణ
రైసుమిల్లూ, రియల్ ఎస్టేటూ, బోర్ వెల్సూ వేసే వ్యాపారం. ఈ మూడింటికీ ముడిసరుకు రైతుల దగ్గరే ఉన్నా, అధిక వాణిజ్య ప్రయోజనాలు పొందే వ్యాపారాలు మూడూ నిర్వహించే రైతుబిడ్డ. ఆ మధ్య “సామాజిక స్మగ్లర్లు ఫలానా కులస్తులు” అనే పుస్తకం రాసిన ’స్వయంప్రకటిత అభినవ అంబేడ్కర్’ మరి ఈ నారాయణ పాత్రలో స్మగ్లర్ ని చూస్తాడో లేదో! వ్యాపారం తప్పు కాదు కనుక నారాయణ ధనవంతుడవటంలో తప్పుపట్టటానికి ఏమీ లేదు. బావమరిది మొండితనానికి నారాయణకి రావలసిన కోపమే వచ్చింది. కానీ మరీ ఇరవయ్యేళ్ళపాటు ఏ సందర్భంలోనూ వీళ్ళు కలుసుకోలేదా? అలాంటి కుటుంబాలూ ఉండొచ్చు.
మనవడు సాయిలు
ఆర్ధిక అంశాలే పూర్తిగా నడిపించిన పాత్ర, హీరో ప్రియదర్శి వేసిన సాయిలు పాత్ర. అనుభవ రాహిత్యం, మితిమీరిన ఆత్మవిశ్వాసం, ముందుచూపులేమి కలగలసిన పాత్ర. పల్లెలో గిరాకీ లేని వ్యాపారాలు పెట్టి నష్టపోయి చివరకు చిట్టీల వ్యాపారం కూడా సరిగ్గా చెయ్యలేక చేతులు కాల్చుకొని అప్పులపాలవుతాడు. ఆ అప్పులను తీర్చటానికి “కట్నం ఎడ్వాన్సు” ని వనరుగా భావించాడు. అంతవరకూ తను పెద్దగా పట్టించుకోని మేనత్త కుటుంబాన్ని, ఇల్లును చూసేక అర్జంటుగా మనసు మార్చుకున్న అవకాశవాది. అలాంటి వాడికి పదకొండో రోజుకి ముందురోజు రాత్రి “ఎవరి స్వార్ధం వారిది” అనే ముసలి తాత డైలాగ్ తో జ్ఞానోదయం కావటం కేవలం “క్లైమాక్స్” కోసమే తప్ప నిజ జీవితంలో అంతటి మార్పు అసాధ్యం! ఎందుకంటే యమకింకరుల్లాంటి ఫైనాన్సు రికవరీ ఏజెంటు కళ్ళ ఎదురుగా ఉండగా “పోయి నిజం చెప్పేస్తరా” అనటం సాయిలు వ్యక్తిత్వానికి అసాధ్యం.
కొమురయ్య
చివరగా, సినిమా మొదట్లో చనిపోయిన కొమురయ్య పాత్ర. ఇతడికి మూడో సంతానమైన కూతురు పుట్టేకా భార్య చనిపోతుంది. ఆ తర్వాత కొమురయ్య చనిపోయేవరకూ అంటే దాదాపు నలబయ్యేళ్ళు భార్యలేకుండా ఉన్నాడు. డెబ్బై ఏళ్ళ వయసులో, కనపడ్డ ఆడవారితో కాసనోవా మార్కు డైలాగులతో ఉన్న కొమురయ్య పాత్రని కొంతమంది తప్పు పట్టారు. ఇదే సందర్భంలో నాకు గుర్తొచ్చిన ఇంకో పాత్ర, కేశవరెడ్డి రాసిన “అతడు అడవిని జయించాడు” నవలలో ఉండే ముసిలాడు. ఆ ముసిలాడు ఊళ్ళో వచ్చేపోయే ఆడవారిపై బూతు పరిహాసాలు విసురుతూ వారితో తిట్లు తినటం ఉంటుంది. కొమురయ్య మోటు సరసాలు మనకు ఎలా అనిపించినా, పల్లెల్లో అటువంటి “పాత్రలు” కనపడతాయి. ఆ మేరకు ఇది సహజమైన పాత్రే.
రేషనల్ & ఎకానామిక్ యాంగిల్స్:
ఎక్కువ ధనవంతుడు ఎక్కువ దోపిడీ దారుడు అనే కమ్యూనిస్టుల పిడీవాద తీర్మానానికి మినహాయింపులుగా ఈ సినిమాలో నారాయణ, సాయిలు పాత్రలు చూపించవచ్చు. సాయిలు చేసే వ్యాపారవస్తువులైన పిజ్జా, బిలియర్డ్సు అనేవి పల్లెకు పూర్తి అనవసరం. వాటితో పోలిస్తే నారాయణ చేసే బోర్లూ, రైసుమిల్లు వ్యాపారాలు రైతుకి అవసరమైనవే. వాటిలో ఎక్కువ రిస్కు ఉంది. ఎక్కువ శ్రమ నైపుణ్యాలు ఇమిడి ఉన్నాయి.
సమాజంలో మనుషులంతా ఏదో ఒక మోతాదులో హిపోక్రసీ వంట బట్టించుకున్నవారే. అందులో పల్లెలకీ, పట్టణాలకీ పెద్ద తేడా లేదు.
టైలర్ దగ్గర కొలతలు ఇచ్చేక కొమురయ్య చేపల కూర అడిగినప్పుడు, “పక్కింట్లో” అని చెప్పిన టైలరు భార్య, తీరా శవం దగ్గర ఏడ్చేటప్పుడు తానెంతో ఇష్టంగా చేపల కూర పెడుతున్నట్టు చెప్పింది. అలాగే మూడో రోజు వచ్చిన ఆవిడ ఏడూస్తూ, “మీ నాన్నని ఎంతబాగా చూసుకున్నారో…” అన్నది కాస్తా, “పిట్ట ముట్టలేదు” అనాగానే ప్లేటు పిరాయించటం చాలా బాగా చూపించారు.
కొమురయ్య చెల్లెలు నోటికి ఏది వస్తే అదే అనేసే మనిషి. సూరత్ నుంచి వచ్చిన సుజాతా, కొమురయ్య చనిపోయేనాటికి సాయిలుకి ఎంగేజ్‌మెంటు కావలసిన పిల్ల అంతా ఆవిడ బాధితులే. ఇలాంటివారు కూడా మనకు పల్లెల్లో ఎక్కువ కనపడతారు. వారి నోటి పదును ఎవరిని ఇబ్బంది పెడుతుందో ఊహించలేం. బహుశః వారు కూడా ఊహించలేరేమో.
ఊరికి ఒక కుటుంబాన్ని వెలివేసే (చట్టపరమైన) హక్కు ఉంటూందా? ఉండదు. కానీ చట్టం ఎలా ఉన్నా, తెలంగాణా పల్లెల్లో కులానికొక పెద్ద ఉండి, తన కులం వాళ్ళంతా కొన్ని కట్టుబాట్లకి లోబడేలా చూడటం ఉంది. అలాగే, తెలంగాణా పల్లెల్లో, ఆర్ధిక స్థితి తో సంబందం లేకుండా పెళ్ళి, చావు, పుట్టూక, రజస్వల ఇలా ప్రతి సందర్భానికీ మేక/ గొర్రె మాంసం తో భోజనాలు పెట్టకపోతే “బహిష్కరణ” ఎదుర్కోవలసి ఉంటుంది.
పాతరోజుల్లో అంటే 1960ల్లో ఐతే పదిమందికి భోజనాలు పెట్టటం, అందులో మేకని కొయ్యటం అనేవి ఎంతటీ నిరుపేదనైనా అప్పుల ఊబిలోకి నెట్టేసేవి కాదు. కానీ, మారిన ఆర్ధిక చిత్రంలో ప్రతీదీ కేటరింగు, చికెన్ కి రెట్టింపుకన్నా ఎక్కువ ధరలో మటన్, వస్తుమార్పిడి ద్వారా అప్పు తీర్చలేని పరిస్థితులు ఇవన్నీ, తెలంగాణా పల్లెల్లో కొందరి పేదరికానికి ఈ కట్టూబాట్లు కారణం అని నాకనిపించింది. చావు భోజనాలు పెట్టటానికి వడ్డీకి అప్పు తీసుకొని, దానిని ఏళ్ళ తరబడి తీర్చలేఖపోవటం కొన్ని కుటుంబాల్లో ఉంది. అలా భోజనాలు పెట్టకపోతే సాంఘిక బహిష్కరణ.
బలగం సినిమా – మూఢనమ్మకాలు:
సినిమాలో ఉన్న చట్ట వ్యతిరేక సంఘటనలూ, మూఢనమ్మకాలూ విషయానికొస్తే – కాకి పిండం అంశంగా వచ్చిన కథ ఇది మొదటిది కాదు. అలాగే, ఇది నా కథకి కాపీ అంటూన్న కథ కూడా కాదు.
కాకులు దొరక్క పెంపుడు కాకిని పంజరంలో తెచ్చి పిండం తినిపించే కథ ఈనాడు ఆదివారం మేగజైన లో 2016, ఆగస్టు 28 న వచ్చింది. అలాగే 1998 లో గొల్లపూడి మారుతీ రావు రాసిన “సాయంకాలమైంది” నవలలో కాకి పిండం తిన్నకా కొడుకు వైజాగ్ ఎయిర్ పోర్టు వైపు (అమెరికా) వెళ్ళడమే దృశ్యం వస్తుంది. కాకి పిండం ముట్టకపోవటం అంటే చనిపోయిన పెద్దలపట్ల అపచారం అనే నమ్మకం చాలా చోట్ల ఉంది.
అందమైన పుష్పాన్ని కూడా బ్లేడుతో కోసి భాగాలను విడదీస్తే దాని అందం పోతుంది. నా విశ్లేషణ కూడా అలాంటిదే.
నేను విడిగా చూసిన అంశాలు కలిపి చూస్తే ఇది కట్టిపడేసే సినిమా. క్లైమాక్స్ బుడగజంగాల పాట -“తోడుగా మాతో నడచి” పాట ప్రేక్షకులను ఎమోషనల్ ప్లేన్ లో ఉంచుతుంది. అలాగే కొమురయ్య అంతిమయాత్ర పాట కూడా అచ్చమైన తెలంగాణా మాండలీకంలో ప్రేక్షకులకు స్మశాన వైరాగ్యాన్ని తెప్పిస్తుంది. టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే “ఊరూ, పల్లెటూరు” పాటలో ఉపమానాలు చాలా గొప్పగా ఉన్నాయి.
“కాకి – పిండ” అనే కాన్సెప్టుతో వచ్చిన చాలా సాహిత్యం శోత్రియ క్రతువుల ఆధారంగానే, సంస్కృత మంత్రాల నేపధ్యంలోనే ఉండేది. ఇప్పుడు అది, తెలంగాణా పల్లెలో, పిండం తో పాటు, మాంసం, కల్లూ, మద్యం పెట్టే అచారాన్ని తెరకెక్కించి బహుజన ఆచారంగా కూడా చూపించారు.
“ఒక కథ లో ఎంత స్థానికత ఉంటే అది అంత విశ్వజనీయం అవుతుంది” అని ఒకచోట చదివాను. బలగం సినిమా, గోదావరి జిల్లా శాకాహార కుటుంబాల వారికీ, కల్లుని వెనుకబాటుతనంగా భావించే కుటూంబాల్లో వారికి కూడా నచ్చటం చూస్తే నాకు అదే గుర్తొచ్చింది.
బలగం లో పాత్రలన్నీ మనుషుల సహజ ఆలోచనలతోనే ఉన్నవి. విలన్లు, హీరోలూ, ఉదాత్తులూ, కౄరూలూ అంటూ విభజన లేని సినిమా.
తెలుగువారికి అర్థమయ్యేలా చెప్పాలంటే – “ఎ గ్లోబల్ మూవీ విత్ లోకల్ ఏంబియెన్స్.”
*****