ది కార్సికన్ బ్రదర్స్ – అలెగ్జాండర్ డ్యుమాస్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]


“ది కార్సికన్ బ్రదర్స్”- 1941 లో విడుదల ఐన ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రెగరీ రాటఫ్ డైరెక్టరు, ఎడ్వర్డ్ స్మాల్ నిర్మాత. ద్విపాత్రాభినయములకు ప్రధమ సోపానముగా సినీ చరిత్రలో స్థానం ఆర్జించింది. జూనియర్ డగ్లస్ ఫెయిర్  బాంక్స్ “కార్సికన్ బ్రదర్స్” లో కవలలుగా రెండు పాత్రలనూ ధరించాడు. ఈ టాకీలోని కథకు అనుసరణలుగా ప్రపంచ వ్యాప్తంగా వందలాది చలన చిత్రాలు వెలువడినాయి.

ఈ కథాంశములోని అద్భుత ఆకర్షణకు ఇవే నిలువెత్తు విలువెత్తు నిదర్శనాలు. చిన్ననాడే అమడ పిల్లలు(సయామీస్ కవలలు) విపరీత పరిస్థితులలో విడిపోయారు. పూర్తిగా విభిన్న పరిసరాల వాతావరణాలలో చెరొక చోటా పెరిగి పెద్దైనారు. వారి తల్లిదండ్రులను ‘హత్యించిన ‘ విలన్ లపై ప్రతీకారం తీర్చుకునే కథతో అనేక మలుపులతో ఆసక్తికరంగా ఉన్నది.

ఇద్దరు కథానాయకులూ ఒకే స్త్రీని ప్రేమించడం వంటి విచిత్రమైన మెలికలతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు! సినీ నిర్మాతలను సైతం ఆకట్టుకున్న ఈ స్టోరీ లైన్ ను కాసులవర్షం కురిపించే బంగారు గుడ్లు పెట్టే బాతునులాగా అందిపుచ్చుకున్నారు. తెలుగులో మనందరికీ సుపరిచితమే!

“ఇద్దరు మిత్రులు”, “రాముడు-భీముడు” మొదలుకొని హీరోల నటనా కౌశలములకు ప్రేక్షకులు బ్రహ్మ రధము పట్టారు. హీరోయిన్లతో కూడా ద్విపాత్రాభినయం చేసిన బొమ్మలు రిలీజ్ ఐనవి. “ఇద్దరు అమ్మాయిలు”, “గంగ-మంగ” వంటివి. కాలక్రమంలో త్రిపాత్రలు – వెండితెరపై నర్తించినవి.

నాలుగు, ఐదు, తొమ్మిది, పది పాత్రలుగా కూడా నటీనటులు తమ నటనాచాతుర్యాన్ని తెరపై శోభాయ మానంగా  దృశ్యమానం చేసారు.


ఆకాశరామన్న(కాంతారావు); నవరాత్రి(నాగేశ్వరరావు); దశావతారం (కమల హాసన్)….ఇలాగ పేర్ల లిస్టు కూడా ఒక ఉద్గ్రంధ రూపమే ఔతుందనడంలో అతిశయోక్తి లేదు.

*******


Alexandre Dumas“ది కార్సికన్ బ్రదర్స్” సినిమా  సౌధ నిర్మాణంలో కీలక వ్యక్తి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తావించాల్సినది ఫ్రాన్సులోని రచయిత అలెగ్జాండర్ డ్యుమాస్ (Alexandre Dumas – 24 July 1802 – 5 December 1870)గురించి.

యూరోపు దేశీయులు ఇతర దేశాలలో, వలసలు వచ్చారు. తద్వారా ఆసియా. ఆఫ్రికా ఖండాల ప్రజలు, ఆయా సంఘముల స్వరూపాలూ మార్పునకు లోనై, అస్తవ్యస్తం కాసాగినవి. ఆఫ్రికా దేశాల ప్రజలు, బానిసత్వంలో మగ్గిపోవాల్సిన దురవస్థ దాపురించింది. ఈ ఆపదలలో మునిగిపోయిన వాళ్ళు నీగ్రోలు అని వ్యవహరించబడుతూ, “నల్లవాళ్ళు” అని తిరస్కారానికి గురి అయినట్టి జాతి జనులు. వలస రాజ్యాల ఏలుబడి- కాలనైజేషన్ లకు దారి తీసినది. పాశ్చాత్య దేశంలో దళితునిగా పెరిగి పెద్దవాడైనాడు. అంటరానివానిగా- అక్కడ అతను అనేక పరాభవాలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఫ్రాన్సులోని Aisne Depatmentలోని, willers-kaaTareTs- విల్లెర్స్-కాటరెట్స్-(Villers-Cotterêts ) లో జన్మించాడు డ్యుమాస్. నాటకరచయితగా కీర్తిశిఖరాలను అధిరోహించాడు. The Count of Monte Cristo, The Three Musketeers, The Corsican Brothers  మున్నగునవి ఆతని కీర్తి కిరీటంలో కలికితురాయిలు. అలెగ్జాండర్ డ్యుమాస్ సయామీస్ కవల పిల్లలు ఇరువురు హీరోలుగా మలచిన కథతో- అలెగ్జాండర్ డ్యుమాస్ రచన ఆధారంగా నిర్మితమైన మూవీ The Corsican Brothers. అనితర సాధ్యమైన ప్రజ్ఞ, ప్రతిభలతో అలెగ్జాండర్ డ్యుమాస్ తన జీవితంలో అనేక అవమానాలను అధిగమించాడు. రమారమి నూరు భాషలలోనికి అలెగ్జాండర్ డ్యుమాస్ రచనలు అనువదించబడినవి. అట్లాగే ఇంచుమించు రెండు వందల సినిమాలకు డ్యూమాస్ ‘కలం పాళీ కదలికలు’ స్ఫూర్తిని ఇచ్చినవి. సాహిత్య సీమలో సమకాలీనులైన విక్టర్ హ్యూగో మున్నగు రచయితల కంటే- అలెగ్జాండర్ డ్యుమాస్ ఉన్నత స్థాయిని సముపార్జించాడు.

ఆంధ్ర కవి, గుఱ్ఱం జాషువా సారస్వత సమావేశాలలో ఇతర వ్యతిరేక కవులతో సౌమ్యంగానే పలికిన పలుకులు- చమత్కార భాషణములుగా మన్నింపు పొందినవి. అట్లాగే అలెగ్జాండర్ డ్యుమాస్ సంభాషణలూ, ఆడిన పలుకులూ సారస్వత స్థాయితో విమర్శకులచే మననము చేయబడుతూంటాయి.

కొస మెరుపు:-

ఒకసారి జాత్యహంకారులు తూష్ణీకరిస్తూ దూషించారు. వారి నిష్ఠుర వచనాలకు అతను  దీటుగా ఇచ్చిన చమత్కార సమాధానం ఇది. “My father was a mulatto, my grandfather was a Negro and my great-grandfather a monkey. You see, Sir, my family starts where yours ends.” అంటూ చురక అంటించాడు అలెగ్జాండర్ డ్యుమాస్.

Your views are valuable to us!