తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైం టాప్ 10 సినీ ఆల్బమ్స్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆవకాయ.కామ్ పాఠకులకు దసరా శుభాకాంక్షలు!

బాలసుబ్రమణ్యం పాడటం మొదలెట్టిన 1966 లోనే నేనూ పుట్టేను. ఆ తర్వాత నా జీవితంలో మొదటి 15-20 సంవత్సరాలు రేడియోలో తెలుగు సినీమా పాటలు వినడం తప్ప వేరే ఏమీ చేసినట్టుగా అనిపించదు. అయితే అందులో ఆశ్చర్యమేమిలేదని అనుకోవచ్చు. 50-60లు, కొంతవరకూ 70లు కూడా, తెలుగు సినీ పాటలకు స్వర్ణయుగం. గాయకులైనా, సంగీత దర్శకులైనా, సాహిత్యకారులైనా ఎవరికి ఎవరూ తీసిపోరన్నట్టుగా కుదిరేరు ఆ రోజుల్లో. సినీ దర్శకులు కూడా మంచి పాటల కోసం సందర్భాలు సృష్టించి మరీ కధలు రాయించుకొనే వారు. 80ల నుంచి ఈ పరిస్థితి మారింది.

నాకు 40లు వచ్చిమార్కెట్లోకి iPODలు వచ్చిన తరవాత ఓ రోజు నాకిష్టమైన పాటలన్నీ సంగ్రహిద్దామన్న కోరిక పుట్టింది. 30లలో వచ్చిన మాలపిల్ల నుంచి ఈనాటి వరకు నాకిష్టమైన పాటలన్నీ, దాదాపు 2000లు పాటలు, collect చేసి మళ్లీ మళ్లీ వినడం మొదలుపెట్టేను.అలాగా గత ఈ నాలుగు అయిదు సంవత్సరాలలో తెలుగు పాటల మీద ఓ అవగాహన వచ్చి, ఓ Top 10 albums of All time list తయారుచేద్దామని అనుకొని ఈ ప్రయత్నం మొదలెట్టేను. అయితే కొన్ని విషయాలు ముందే చెప్పాలి. మొదటిది, నేను ఓ సాధారణ శ్రోతనే కానీ విమర్శకుడిని కాదు. సంగీతాన్ని వినే హృదయం ఉన్నా, శాస్ర్తీయ సంగీత పరిజ్ఞానం లేదు. అందుకని ఈ లిస్టుని ఓ తెలుగు పాటల అభిమాని స్వంత అభిప్రాయంగా మాత్రమే పరిగణిoచమని మనవి. రెండవది, ఇది సినీ లిస్టు కాబట్టి ఇందులో త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారుల మీద తీసిన చిత్రాలు లేవు. మూడవది, చిత్రం సాంఘికమా, జానపదమా లేక పౌరాణికమా అన్నది చూడలేదు. ఏ తరహా చిత్రమైనా పాటలు ఎంత న్యాయం చేసేయి అన్నది మాత్రమే లెక్క. నాల్గవది, వందల వేల సినిమాల్లోంచి పదో, ఇరవయ్యో ఎంపిక చేయడమ్ చాలా కష్టం. కొన్ని omissionలు, commissionలు తప్పవు. కొన్ని సినిమాలు… డాక్టర్ చక్రవర్తి, అందాల రాముడు, పంతులమ్మ,గీతాంజలి, దేవుడు చేసిన మనుషులు లాంటి ఎన్నో—- ఈ లిస్టులో లేనందుకు నేనే ఎంతో బాధపడ్డాను. ఇక ఐదవది, అతి ముఖ్యమైనది. ఏదో ఒకటో రెండో పాటలు బావుంటే సరిపోదు. ఆల్బంలో అధిక శాతం పాటలు ఓహో అనిపించాలి. అలాంటి వాటి ప్రస్తావన మాత్రమే ఇందులో ఉంది.

ఇక లిస్టులోకి వెళదాము….

మొదటి పదేకాకుండా ఇంకో పది పేర్లని చెప్పాలంటే నా దృష్టిలో అవి ఇవి.

20) మంచి మనుషులు – కే.వి.మహాదేవన్

19) మరో చరిత్ర  – ఎమ్మెస్ విశ్వనాథన్

18) తూర్పు పడమర  – రమేష్ నాయిడు

17) సాగర సంగమం – ఇళయరాజా

16) NTR మల్లీశ్వరి – ఎస్. రాజేశ్వరరావు

15) భక్త తుకారాం – ఆదినారాయణరావు

14) అందమైన అనుభవం – ఎమ్మెస్ విశ్వనాథన్

13) ANR ప్రేమ నగర్ — కే.వి.మహాదేవన్

12) శంకరాభరణం –కే.వి.మహాదేవన్

11) సిరిసిరిమువ్వ- కే.వి.మహాదేవన్

తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైం టాప్ 10 సినీ ఆల్బమ్స్ ఇవిగో…

Courtesy: Wikipedia10) ఏకవీర –కే.వి.మహాదేవన్

“తోటలో నారాజు తొంగి చూసెను నాడు”, “ప్రతీ రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి”, “నీ పేరు తలచినా చాలు”, “ఏ పారిజాతములీయగలనో”, “ఒక దీపం వెలిగింది” పాటలు అందరికి గుర్తుండే ఉంటాయి. ఒక రాజుల కధకి కావలసిన Dignity అన్ని పాటల్లోనూ కనిపిస్తుంది.


9) పండంటి కాపురం –ఎస్.పీ.కోదండపాణి.

ఒక అచ్చ తెలుగు కుటుంబకధకి పూ ర్తిగా అమిరే సంగీతం. అన్ని తరహా పాటల మేళవింపు. “ఈనాడు కట్టుకున్నబొమ్మరిల్లు”(romantic), “మనసా కవ్వించకే నన్నిలా” (విషాదం), “బాబూ వినరా అన్నాదమ్ముల కథ ఒకటి” (family  ideals ), “ఇదిగో దేముడు చేసిన బొమ్మా” (philosophical)….. ఒక్కొక్కటి ఒక్కొక్క తరహా. అన్నీ ఆణిముత్యాలే.



8) గుండమ్మ కధ –ఘంటసాల

శాస్త్రీయ సంగీతమే కాదు, సరళ సంగీతమైనా ఘంటసాలకి తిరుగులేదనిపించే పాటలు. సన్నగ వీచే, మౌనముగా నీ మనసు పాడిన పాటలు ఈరోజుకీ మైమరిపిస్తాయి. లేచింది మహిళ లోకం, ప్రేమ యాత్రలకు, అలిగిన వేళనే, ఎంత హాయి… దేనికేదీ తక్కువ కాదు.



7) మిస్సమ్మ – ఎస్.రాజేశ్వరరావు.

రాజేశ్వరరావు మార్కు అచ్చ తెలుగు పాటలు. ఆడువారి మాటలకు, బృందావనమది అందరిది… ఆ రోజుల్లో తెలుగురాని ఉత్తర భారతీయులు కూడా పాడుకున్న పాటలు. దక్షిణ భారతమంతా మ్రోత మోగించిన పాటలు.  అసలు సిసలైన తెలుగు పాటలకు నిలువెత్తు దర్పణంగా మిగిలిపోయిన పాటలు. “రావోయి చందమామ”, “తెలుసుకొనవె యువతి”, “కరుణించు మేరి మాతా” ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఎంతో popular songs కింద లెక్క.


6) మూగమనసులు — కే.వి.మహాదేవన్

ఈ రోజుకీ పాటంటే పాడుతా తీయగా చల్లగాలా ఉండాలనిపిస్తుంది . ఉత్సాహం ఉరికే పాటంటే గోదారీ గట్టుందిలా ఉండాలనిపిస్తుంది. విషాదమంటే ముద్దబంతి పువ్వులో పాటలా ఉండాలనిపిస్తుంది. కొంతమంది ఈ పాటలు గుండమ్మ కదా, మిస్సమ్మల కన్నా ఏ విధంగా గొప్ప అని అడగొచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఆ రెండు సినిమాలలో పాటలలో depth ఈ పాటలలో కన్నా కొంచం తక్కువ. మూగ మనసులు పాటలు పైన చెప్పినట్టు ప్రతి GENREలోనూ ఒక peakకి వెళతాయి.


Courtesy: infosamay.com5) దేవదాసు –సుబ్బరాయన్

ఏమీ కొత్తగా చెప్పనక్కరలేదు. Telugu cinema చరిత్రలోనే బహుళ ప్రజాదరణ చిత్రం, పాటలూనూ. అయితే  ఎందుకు ఐదవ స్థానం, మిగత నాలుగూ ఈ చిత్రం పాటల కన్నా ఏ విధంగా మిన్న అని నిలదీస్తే నాకు మాత్రం ఈ కింది నాలుగు సినిమాల పాటలు కట్టడంలో ఆయా సంగీత దర్శకుల ప్రతిభ ఈ పాటల కన్నా ఇంకా ప్రస్ఫుటంగా తెలిసోచ్చిందేమో అని అనిపిస్తుంది. ముందే చెప్పినట్టు giving rankings to all time greats is a dicey business.


4) జయభేరి –పెండ్యాల నాగేశ్వరరావు

ఇద్దరు మహామహుల –పెండ్యాల, ఘంటసాల — అత్యుత్తమ కలయిక. ఈ రోజుకీ నవ యువ గాయకులు తమని తాము నిరూపించుకోవాలంటే “రసిక రాజ తగువారము కామా”  “మది శారదాదేవి మందిరమే” లలో ఏదో ఒకటి పాడి మెప్పించాల్సిందే. గాయక ప్రతిభకి నేటికీ ఈ పాటలు ఒక లిట్మస్ టెస్ట్. శాస్ర్తీయ సంగీతం ప్రధానంగా ఉండే ఈ ఆల్బంలో “నీదాన నన్నదిరా” లాంటి సున్నితమయిన పాటలూ మెప్పిస్తాయి. “రాగమయీ రావే”, “నందుని చరితము”, “యమునా తీరమున” వంటి పాటలు కూడా ఎంతో జనరంజకమైనవి.


3) మాయాబజార్ – ఘంటసాల

“వివాహ భోజనంబు” అల్ టైం బ్లాక్ బస్టర్. “అహ నా పెళ్లి యంట”, “చూపులు కలసిన శుభవేళ”, “లాహిరి లాహిరి లాహిరిలో”, “నీవేనా నను తలచినది”, “సుందరి నీ వంటి దివ్య స్వరూపం”…..ఏ పాటని తీసుకుంటే అదే సూపర్ హిట్. ఇప్పుడే కాదు ఇంకో వందేళ్ళయినా ఈ పాటలు ఇలాగే ever greenగా ఉంటాయి.


2) ముత్యాల ముగ్గు — కే.వి.మహాదేవన్

ఈ పాటలని ఇలా రెండో స్థానంలో శిఖరాగ్రాన నిలబెట్టినందుకు కొందరు ఆశ్చర్యపోవచ్చు. కానీ నా దృష్టిలో “ఏదో ఏదో అన్నది” “ గోగులు పూచే” పాటలు తెలుగు సినీ చరిత్రలోనే most romantic songs లిస్టులో ఉంటాయి. ”నిదురించే తోటలోకి” పాట ఒక అత్యత్తమ విషాద గీతం. “ముత్యమంతా పసుపు” పాట తెలుగుతనానికి ఒక విశిష్ట ప్రతీక. తెలుగురాని మహాదేవన్, తెలుగు ప్రజలకిచ్చిన  కానుక ఈ ఆల్బం. Hats off to you!! Mahadevan. I am indebted to you all my life. మహాదేవన్ అత్యుత్తమ సంగీతం ఇచ్చిన సినిమాలు పదుల, వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ విన్న ప్రతిసారి మత్యాలముగ్గు ఆల్బం నన్ను కట్టిపడేస్తుంది.


1) లవకుశ – ఘంటసాల

ఏ ఆల్బం గురించి ఏమనుకున్నా, దేనికంటా ఏది బెటర్ అని ఎంతో ఆలోచించినా, ప్రథమ స్థానంలో ఏ సినిమాని నిలబెట్టాలన్న విషయంలో నేనెప్పుడూ తర్జన భర్జన పడలేదు. సంగీత దర్శకుడిగా ఈ చిత్రం ఘంటసాల విశ్వరూపం. సుశీల, లీల తదితర గాయనిగాయకుల ప్రతిభకి నిలువెత్తు దర్పణం. దైవచింతన ద్వారా కాకుండా సినిమా పాటలు వినడం ద్వారా మోక్షం సాధిద్దామనుకొనే నాలాంటి “తేడా మనుషులకి” ఏకైక ఆయుధం. అద్భుతం, అమోఘం, అనితర సాధ్యం అని ఎన్ని విశ్లేషణాలు వాడినా తక్కువే.. ఒక్క మాటలో చెప్పాలంటే “బొందితో కైలాసం”

Photo Courtesy: Wikipedia & Infosamay.com


Your views are valuable to us!