“పురచ్చి తలైవర్” అని అరవ వాళ్ళు ఆప్యాయతగా ఎం.జి.రామచంద్రన్ ని పిలుస్తారు. ఈ తమిళ కథానాయకుడు శ్రీలంకలోని కాండీ పట్టణములో జన్మించారు. (17వ తేదీ, జనవరి – 1917 – డిసెంబర్, 24, 1987).
పాత తెలుగు సినిమాలలో రాజనాల లాగా, తమిళ చిత్రాలలో ప్రతినాయక పాత్రలలో ప్రసిద్ధి కెక్కినవారు ఎం.ఎన్.నంబియార్ .
ఒక రోజు రామచంద్రన్ కు, నంబియారుకు జరిగే కత్తి యుద్ధం సీనులను నిర్మాత, దర్శకులు చిత్రిస్తున్నారు. వారి ఖడ్గ యుద్ధం ఉదయం నుండీ షూటింగు చేస్తున్నారు. హీరోయిన్ గా నటిస్తున్నవారు మన భానుమతి. వారి పోరును చూస్తూ, హీరోది పై చేయి ఐనప్పుడల్లా ఆమె సంతోషాన్నీ, అతను లోబడినప్పుడు భీతినీ ఇలాగ ముఖ కవళికలో నానా రసాద్యవస్థలనూ ప్రతిఫలించాలి. అంతే! ఆమె పాత్రకు ఉన్న పరిమితి అది.
ఎంతకీ ఆ పోరాట ఘట్టము ఓ.కే. అవటం లేదు. డైరెక్టరుకు హీరో, విలన్ కత్తి విసుర్లు అస్సలు నచ్చడమే లేదు. మధ్యాహ్నమూ, అపరాహ్నమూ కూడా అవురున్నాయి. పాపం! ఇవతల భానుమతికి ఆకలి దంచేస్తూన్నది. చూసి, చూసి విసుగెత్తి, గట్టిగా అరిచింది “రామచంద్రన్!నంబియార్ కబంధ హస్తాల నుండి నన్ను రక్షించడానికి ఇంత సమయం తీసుకుంటున్నారేంటి? ఆ ఖడ్గాన్ని ఇలా ఇవ్వండి, చిటికెలో నాకు కావల్సిందేదో నేనే సాధించుకుంటాను.”
అటో ఇటో తేల్చేసే స్వభావం గల ఆమె పరుషమైన మాటలకు అక్కడ ఉన్న యావన్మందీ నిశ్చేష్ఠులై, చూస్తూ నిలబడ్డారు. గుండు సూది వేస్తే ఖంగున వినిపించేటంత నిశ్శబ్దం నెలకొన్నది. అగ్ర నటుడైన ఎం.జి.ఆర్.కు ఎక్కడ కోపం వస్తుందోననే భయంతో అంతా ఖిన్నులై, శిలా ప్రతిమల వలె ఉన్నారు. కానీ అనుకోకుండా వింత జరిగింది.
అకస్మాత్తుగా భానుమతి నోటి నుండి వెలువడిన ఆ పలుకులకు హీరోకు నవ్వు తెప్పించాయి. తెరలు తెరలుగా నవ్వాడు అలనాటి కథా నాయకుడు, కాబోయే తమిళ సీమ ముఖ్యమంత్రి.
అసహనంతో , ఆకలి వేస్తూంటే చిర్రెత్తుకొచ్చిన ఆమె స్థితి అతనికి అప్పటికి బోధ పడింది. అంతేకాదు, ఆనాడు స్వల్పంగా నవ్వే నంబియార్ పెదవులపైన కూడా మందహాసాలు విరబూసాయి.