తమిళ్ సినిమా మలై కళ్ళన్తె, తెలుగులో అగ్గిరాముడు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న చలనచిత్రాలు.
ఈ రెండింటిలోనూ కథానాయిక పద్మశ్రీ భానుమతీ రామక్రిష్ణ.
అప్పటికింకా ఎం.జి.రామచంద్రన్ తమిళ సినిమా రంగములో నిలదొక్కుకోలేదు. సీనియర్ నటియైన భానుమతి అతన్ని”రామచంద్రన్!” అని ఏకవచనంతో చనువుగా పిలిచేది.
బహుముఖ ప్రజ్ఞాశాలియైన భానుమతికి కొంత హస్త సాముద్రికము కూడా వచ్చు.
ఓసారి ఒక సినిమా చిత్రీకరణ సందర్భంలో, సెట్టింగ్సు వద్ద ఆమె తీరుబడిగా ఉన్నప్పుడు అటుగా వచ్చిన M.G.R.ను పిలిచి అతని చేతి రేఖల్ని పరిశీలించింది. ఆ చేతుల్లోని రేఖలను చూసి ఆమె అంది – “రామచంద్రన్! నీకు భవిష్యత్తులో రాజపరిపాలనాయోగము ఉన్నది.”
అప్పట్లో దాన్ని స్పోర్టివ్‍గా తీసుకున్న రామచంద్రన్ నమ్మశక్యం కానట్టుగా నవ్వేసారు.
పులియకుళం వద్ద షూటింగు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన సంభవించింది.
*****
ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఆ చీఫ్ మినిష్టరుకు అభినందనలు చెప్పడానికి భానుమతీ రామక్రిష్ణ వెళ్ళారు.
ఆమెను చూస్తూనే అన్నారు ఎం.జి.రామచంద్రన్ ఇలాగ,”అమ్మా! ఆ రోజు మీరు చెప్పిన జ్యోతిష్యం నిజమైనది. మీ వాక్కు ఫలించినది.” నిజానికి ఆమెకు కూడా తాను చెప్పిన హస్త సాముద్రికము సరిగా గుర్తు ఉన్నదో లేదో గానీ, రామచంద్రన్ మాత్రం ఆమె “నోటి చలువ”ను బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు.
*****