ఈ వ్యాసం మొదటగా పొద్దు.నెట్ లో ప్రచురితమయింది.
-
దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా?
-
ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా?
-
మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా?
సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం.
Pirates of the Caribbean సినిమా తీసుకోండి. లేదా Spiderman సినిమా తీసుకోండి. అందులో జరిగేవేవీ నిజం కాదని మనకు తెలుసు. అయినా సరే సినిమా హాల్లో చీకట్లో కూర్చుని ఒక స్వప్నలోకంలోకి వెళ్ళిపోయి స్పైడర్మ్యాన్ అమాంతం గాల్లో ఎగురుతుంటే నమ్మేస్తాం. సినిమా హాల్లో లైట్లారిపోగానే మరో లోకానికెళ్ళి పోవడానికి సిధ్ధమైపోతాం. కానీ అన్ని సినిమాలు మనల్ని ఇలా కొత్తలోకాలకి పయనింప చేయడానికి ఉద్దేశించినవి కావు. ఈ మధ్యనే తనికెళ్ల భరణి గారు తీసిన సిరా (Ink) అనే లఘు చిత్రం మనల్ని అద్భుత లోకాల్లోకి కాకుండా ఒక రచయిత హృదయపు లోతుల్లోకి తీసుకెళ్ళి అక్కడ జరిగే సంఘర్షణలను, ఆలోచనావేశాల్ని మనకు సాక్షాత్కరింప చేస్తుంది. ఇదంతా కాకుండా మన రొటీన్ జీవితాలనుంచి విరామం కలిగించి ఆనందం పండించే ఉద్దేశంతో నవరసాలను కలగలిపి నిర్మించే సినిమాలు మరో రకం.
ఒక కళా రూపంగా సినిమాను మిగిలిన కళలతో పోలిస్తే చాలా వ్యత్యాసాలున్నాయి. అందుకు కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది సినిమా అనే ప్రక్రియ వికసించిన సందర్భం. సినిమా సాంకేతిక విప్లవం కారణంగా సాధ్యమైన ఒక సాధనం. మిగతా కళారూపాలయిన సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, శిల్పకళల లాగా సినిమాని మొదట్లో ఒక కళారూపంగా గుర్తించలేకపోయారు.
సాధారణంగా కళ ఎప్పుడూ కళాకారుని సృష్టిపైనే ఆధారపడి వుంటుంది. మోనాలిసా (Mona Lisa) చిత్రాన్ని తీసుకున్నా, గీతాంజలి (Gitanjali) కావ్యాన్ని తీసుకున్నా వాటి ఉద్దేశం కేవలం కళ మాత్రమే. అంతే కాకుండా ఒక కళాఖండం సృష్టించడానికి కావలసిన వాటిల్లో ముఖ్యమైంది మనిషి మేథస్సు మాత్రమే. చిత్రలేఖనం చేయడానికి కావలసిన రంగులు, కథ లేదా కవిత రాయడానికి కావలిసిన పేపరు మరియు పెన్ను కళాకారుని సృష్టికి కావలిసిన సాధనాలు మాత్రమే. పెన్నూ పేపరూ లేనంత మాత్రాన ఒక కవిని కవిత్వం రాయకుండా ఆపలేవు. తన హృదయమనే పుస్తకంపై ఎప్పుడూ తన ఆలోచనలను లిఖించగలుగుతాడు. అలాగే చిత్రకారుడు కూడా! ఒక చిత్రాన్ని చిత్రించడానికి అతనికి కాన్వాసు, camel పెయింటులు అవసరం లేదు. సముద్రపుటొడ్డున బీచ్ లో ఇసుకపై కూడా తన చిత్రాలను సృష్టించగలడు. కానీ సినిమా అలా కాదు. సినిమా తీయడానికి ఫిల్ము ఎంత అవసరమో, అలాగే ఒక మంచి కథ, నటీనటులు, నిర్మాత, దర్శకుడు, అన్నిటికంటే ముఖ్యంగా సినిమాను డబ్బులిచ్చి చూసి ఆదరించే ప్రేక్షకులు అవసరం. మిగిలిన కళలలా కాకుండా సినిమాని సృష్టించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కాకుండా చాలామంది కళాకారుల సహకారంతో మాత్రమే సాధ్యమయ్యే ఒక కళ(ల)!
సినిమాకి కావల్సిన మనుషుల సంగతి ఒక వైపైతే సినిమా అనే ప్రక్రియకు అవసరమైన యంత్రసముదాయాలు మరోవైపు. సినిమాలోని దృశ్యాలను చిత్రీకరించడానికి అవసరమైన కెమెరా తోపాటు, ఫిల్ముని డెవలప్ చేసే సామాగ్రి, రసాయనం, ఫిల్ముపై చిత్రీకరించిన దృశ్యాలను ప్రదర్శించడానికి ప్రొజెక్టర్లు, నటీనటుల సంభాషణలను మనకి వినిపించి, కనిపించేలా చేసే దృశ్యశ్రవణ ఉపకరణాలు లాంటి సరంజామా లేకుండా సినిమా అనే ప్రక్రియను ప్రేక్షకులు సంపూర్తిగా అనుభవించడానికి సాధ్యం కాదు. అందుకే సినిమా ఒక ఆర్టా? క్రాఫ్టా? అనేది ఎవరూ తేల్చలేకపోయారు. ఇప్పటికీ ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది .
“The aim of every artist is to arrest motion, which is life, by artificial means and hold it fixed so that a hundred years later, when a stranger looks at it, it moves again since it is life. Since man is mortal, the only immortality possible for him is to leave something behind him that is immortal since it will always move. This is the artist’s way of scribbling ‘Kilroy was here’ on the wall of the final and irrevocable oblivion through which he must someday pass.”
అని కళ మరియు కళాకారుని బాధ్యతను వివరిస్తారు William Faulkner.
అలాగే “The Cinema is essentially the observation of a phenomenon passing through time” అంటారు Andrei Tarkovsky. వీరన్నట్టుగా సినిమా ద్వారా మన జీవితంలోని వివిధ ఘట్టాలను చిత్రరూపంలో బంధించి క్షణకాలంలో కరిగిపోయే అనుభవాలను శాశ్వతం చేసి నిత్యానందం పొందవచ్చు. ఒక్క సినిమాకి తప్పితే మరే కళకూ ఇలా చేయడం సాధ్యం కాదు. అందుకే సినిమా మిగిలిన కళలకంటే ఒక మెట్టు పైనుంది. కానీ మన వాళ్ళు తీసే సినిమా లను కళారూపాలని పిలవచ్చా? అంటే అనుమానమే! సినిమాకున్న సత్తాని మన వాళ్ళు ఇంకా తెలుసుకోకపోవడం ఇందుకు ఒక కారణం. ఒక వేళ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు రూపొందిద్దామని ప్రయత్నించినా అందుకు కావలసిన ప్రజ్ఞా పాటవాలు మన వాళ్ళు కనబరచడం లేదు.
మనం చాలా సార్లు వింటూనే వుంటాము మన సినిమాలు అంతర్జాతీయ సినిమాల స్థాయిలో లేవని. అసలు మన సినిమాలకు, ఆస్కార్ అవార్డులు పొందుతున్న ఇతర దేశాల సినిమాలకు వున్న తేడా ఏంటి? ఎందుకు ఆ సినిమాలను మంచి సినిమాలంటారు? మన సినిమాలు చేసిన పాపమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా అనే ప్రక్రియలో వున్న వివిధ అంశాలను చర్చించడం ద్వారా మరియు సినిమా తీయడానికి అవసరమైన భాష మరియు వ్యాకరణాలను తెలుసుకోవడం ద్వారా మాత్రమే అవగతమౌతుంది.
ఎవరు అవునన్న కాదన్నా సాగరసంగమం ఒక మంచి సినిమా. అలాగే ఒక శివ అయినా, ఒక అన్వేషణ అయినా! అలాగే ప్రతి వారం విడుదల అవుతున్న సినిమాల్లో దాదాపు 90 శాతం చెత్త సినిమాలే! మరి కొన్ని సినిమాలు మంచి సినిమాలుగా ప్రజల ఆమోదం ఎందుకు పొందుతాయి, మరి కొన్ని సినిమాలు ఎందుకు పొందవు అన్న దానికి సమాధానం కష్టమే. అలాగే మన సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎందుకు చేరలేకపోతున్నాయి అన్న దానికీ ఒక్క మాటలో సమాధానం చెప్పడం కష్టం. కళాత్మక దృష్టితో తీసిన సినిమాలు వ్యాపార పరంగా లాభాలు గడించకపోయినప్పటికీ కళాహృదయం కలిగిన వారి మన్ననలు పొందుతాయన్నది నిజం. అంత మాత్రాన కేవలం కళ మీదే దృష్టి పెడితే నిర్మాత పెట్టుబడులు వెనక్కి రాకపోవచ్చు. నిజానికి ప్రపంచంలోని వివిధ దేశాల దర్శకులయిన Jean-Luc Godard, Stanley Kubrick, Krystzof Kieslowski, Andrej Wajda, Satyajit Ray, Mrinal Sen, Francis Ford Coppola లాంటి దర్శకులు తమ సినిమాలను కళాత్మకంగా రూపొందిస్తూనే కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించారు. మరి వారిలాంటి విజయాలు ఎలా సాధించారు? మనమెందుకు సాధించలేకపోతున్నాము? అని మనల్ని ప్రశ్నించుకుంటే ఒకటే సమాధానం దొరుకుతుంది. వాళ్ళు తమ సినిమాలను బాగా తీశారు. మన వాళ్ళు తీయటంలేదు.
ఇలా తీస్తే మంచి సినిమా, ఇలా తీస్తే చెడ్డ సినిమా అని చెప్పడానికి నియమాలేవీ లేనప్పటికీ మన సినిమాలు చూసి, ఒక అకీరా కురసావా (Akira Kurosawa) సినిమానో, ఒక ఇంగ్మర్ బెర్గ్మన్ (Ingmar Bergman) సినిమానో చూస్తే ఇట్టే తెలిసిపోతుంది, మన సినిమాలు వాటితో పోల్చలేనంత దీన స్థితిలో వున్నాయని. అసలు మన సినిమాలను వాళ్ళ సినిమాలతో పోల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటే ఈ చర్చను ఇంతటితో ఆపెయ్యొచ్చు. అలా కాకుండా మన సినిమాల్లో నాణ్యత లోపించిందని అభిప్రాయపడి అందుకు కారణాలేంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం సినిమా అనే ప్రక్రియలోని వివిధ అంశాలను పరిగణించి విశ్లేషిస్తే పరిష్కారం దొరక్కపోవచ్చుగానీ సమాధానం దొరకొచ్చు.
నిశ్చల చిత్రాలను క్షణానికి 24 ఫ్రేములను ప్రొజెక్టర్ ద్వారా తెరపై ప్రదర్శించడం ద్వారా చిత్రాలకు చలనాన్ని సృష్టిస్తాము కాబట్టే సినిమాని చలనచిత్రమంటాము. చిత్రకారులు చిత్రంలోని వివిధ అంశాలను ద్విమాత్రీయ అంతరాళంలో కూర్చి నిశ్చల చిత్రాన్ని సృష్టించినట్టే, సినిమాలో కూడా, కెమెరా చూడగలిగన అంతరాళంలో నటులను, వస్తువులను, వివిధ రకాలుగా కూర్చవచ్చు, పేర్చవచ్చు. సినిమాకి డ్రామాకు వున్న తేడా ఇదే! డ్రామాలో నాలుగు గోడలమధ్యనే ఏంచేసినా చెయ్యాలి. నిజానికి నాలుగు కాదు మూడు గోడలే; నాలుగో గోడ ప్రేక్షకులు కాబట్టి. అదే సినిమాకు ఈ పరిమితులు లేవు. సినిమాకు వున్న ఒకే ఒక పరిమితి ఏంటంటే నిజజీవితంలోని త్రిమాత్రీయ అంతరాళమును ద్విమాత్రీయ అంతరాళం పై చిత్రీకరించాల్సి రావడం. కానీ 3D టెక్నాలజీ సహాయంతో ఈ పరిమితులు కూడా తొలిగిపోయాయి. కానీ 3D టెక్నాలజీతో వున్న ఇబ్బందులు, వ్యయ ప్రయాసల దృష్ట్యా చాలా మంది 3D టెక్నాలజీ ని దూరంగా వుంచారు. అందుకే సినిమా అనే ప్రక్రియ మొదలయి వందేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ 2D సినిమాలదే పై చేయి. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని నా అంచనా.
సాధారణంగా సినిమాలో ఉండేది ద్విమాత్రీయ అంతరాళం పై చిత్రీకరించిన నిశ్చల చిత్రాలే కనుక చిత్రకారుడు చిత్రాలను సృష్టించేటప్పుడు అనుసరించే సూత్రాలనే సినిమా తీసే దర్శకుడు కూడా పాటించినప్పుడే సినిమాకున్న నిజమైన సామర్థ్యాన్ని వుపయోగించినట్టవుతుంది.ఇంతకు ముందు చెప్పినట్టు తెరపై ప్రదర్శించే సినిమాకు, స్టేజిపై ప్రదర్శించే నాటకానికి చాలా తేడా వుంది. రెండింటి వుద్దేశం ఒక్కటే – కథ చెప్పడం. కానీ ఈ రెండు కళ ల మధ్య తేడా వాటి వాటి సంవిధానంలో వుంది.
ఒక స్టేజిపై జరుగుతున్న డ్రామాను వున్నదున్నట్టు కెమెరాలో చిత్రీకరించి తెరపై ప్రదర్శిస్తే సినిమా అవుతుందా? ఖచ్చితంగా కాదు. కెమెరా అనేది చిత్రాలను రికార్డు చేయగల ఒక పరికరం మాత్రమే! అంత మాత్రాన కెమెరా లో చిత్రీకరించిన ప్రతి విషయం సినిమా అని పిలవబడడానికి అర్హత కలిగి వుండదనేది నా అభిప్రాయం. ఎలా అయితే కార్బన్ కాపీ పెట్టి కాపీ చేసిన మోనాలిసా బొమ్మను చిత్రలేఖనం అనలేమో అలాగే కెమెరా లో చిత్రీకరించిన ప్రతి విషయం సినిమా కాదు. ఒక వేళ స్టేజి దాటి స్టూడియోలో సెట్టింగ్ లోనో, నిజమైన ప్రదేశాలలోనో చిత్రీకరించిన ఒక కథను సినిమాగా పరిగణించినప్పటికీ ఆ సినిమాను మంచి సినిమా అని పేర్కొనాలంటే కుదరదు.
సినిమా అనే ప్రక్రియలో ఒక ముఖ్య అంశం ఎడిటింగ్. సినిమాలోని వివిధ అంశాలయిన నటన, Shot Composition, లైటింగ్, ధ్వని, సంగీతం, సెట్ అలంకరణ, Staging, Mis-en-Scene లాంటి అంశాలన్నీ ఏదో ఒక కళ నుంచి అరువుతెచ్చుకున్న అంశాలే కానీ కేవలం ఎడిటింగ్ (Film Editing) మాత్రమే సినిమాకి సంబంధించిన ఏకైక నవ కల్పన.
మన సినిమాల్లో ఎడిటింగ్ చాలావరకు దర్శకుడు ఎన్నుకున్న షాట్లను వరుస క్రమంలో కూర్చడం వరకే పరిమితమయ్యింది. ఎడిటింగ్ అనే ప్రక్రియను మన వాళ్ళు యాంత్రికంగా చూడడమే ఇందుకు కారణం కావచ్చు. ఎడిటింగ్ అనే ప్రక్రియను కళాత్మకంగా రూపుదిద్దిన వారిలో ముందుగా మనకు గుర్తొచ్చే పేర్లు Lev Kuleshov, Sergei Eisenstein, D.W. Griffith, Walter Murch. వీరితో పాటు Edward Dmytryk, Jean Luc Godard, Luis Buñuel, Andy Warhol, John Cassavetes, René Clair లాంటి సినీ ప్రముఖులు కూడా ఎడిటింగ్ ఒక కళగా అభివృధ్ధి చెందడానికి దోహదం చేసారు.
సినిమాలో ఎడిటింగ్ యొక్క పాత్రను తెలుసుకోవాలంటే Lev Kuleshov చేసిన ప్రయోగం గురించి మనం తెలుసుకోవాలి. ముందు ఒక పాత్రలో వుంచిన వంటకాని చూపించి ఆ తర్వాత ఒక వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి ఆకలి గొన్న వాడిగా బాగా నటించాడని చె ప్పారట. ఆ తర్వాత ఒక అందమైన అమాయి చిత్రం చూపించి ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి కాంక్ష కలిగిన వాడిగా బాగా నటించాడని చె ప్పా రట. అలాగే ఒక చనిపోయిన వృధ్ధ స్త్రీ శవపేటిక చూపించి ఆ తర్వాత ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి శోకం కలిగిన వాడిగా బాగా నటించాడని చెప్పారట. నిజానికి పైన ఉదహరించిన మూడు దృశ్యాలలోనూ చూపిన వ్యక్తి మొహంలో ఎటువంటి హావభావాలు లేనప్పటికీ అంతకు ముందు చూసిన దృశ్యానితో అనుసంధానించి చూడబట్టే ప్రేక్షకులు ఒకే దృశ్యాన్ని మూడు రకాలుగా అనువదించుకునారని Lev Kuleshov తన ప్రయోగం ద్వారా నిర్ధారించారు. అలాగే The Battleship Potemkin సినిమాలో Sergei Eisenstein ఎడిటింగ్ ద్వారా The Odessa Steps sequence లో సినిమా చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే దృశ్యాలను మనకందించారు.
A Clockwork Orange, 2001:A Space Odyssey లాంటి అత్యద్భుత సినిమాలు రూపొందించిన Stanley Kubrick ఇలా అంటారు: “నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. సినిమా అనే ప్రక్రియలోని వివిధ అంశాలలో నాకు ఎడిటింగ్ అంటేనే అత్యంత ఇష్టం. ఎడిటింగ్ ముందు చేసే ఇతర కార్యకలాపాలన్నీ చివరిగా ఎడిటింగ్ చేయడానికి మాత్రమే”. ఒక్క Stanley Kubrick మాత్రమే కాదు Alfred Hitchcock కూడా ఎడిటింగ్ ద్వారా కొత్త కోణాలను ఆవిష్కరించాడు. ఈ విధంగా ప్రపంచంలోని వివిధ దర్శకులు, ఎడిటర్లు ఎడిటింగ్ అనే సాంకేతిక ప్రక్రియ ద్వారా తమ సినిమాలకు కొత్త మెరుగులు దిద్దడమే కాకుండా తద్వారా సినిమా చూసే ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందించగలిగారు. ఇలాంటి ప్రయత్నమే మనవాళ్ళూ చేస్తే మన సినిమాల నాణ్యత పెరగొచ్చు.
ఎడిటింగ్ లాగే సినిమాలో ముఖ్యపాత్ర పోషించే మరో విషయం స్టేజింగ్. సినిమా తెరను మూడు అక్షాలుగా విభజించి, తెరకు నిలువుగా వుండే భాగాన్ని X-అక్షముగానూ, తెరకు అడ్డంగా వుండే భాగాన్ని Y-అక్షముగానూ, తెర పై ప్రదర్శించే దృశ్యములోని దఘ్నతను Z-అక్షములుగా అంగీకరిస్తే ఈ మూడు అక్షముల చుట్టూ సినిమాలోని పాత్రధారులు, మరియు కెమెరా జరిపే కదలికలను స్టేజింగ్‌గా నిర్వచించవచ్చు.ఈ విధంగా జరిపే కదలికల ద్వారా ప్రేక్షకులలో భావోద్వేగాలను కలుగచేసి సినిమాలో తాదాత్మ్యం అయ్యేలా చేయవచ్చు. మన సినిమాల్లో ఈ విషయం లోపిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఈ మధ్యనే వచ్చిన ఏ సినిమానైనా తీసుకున్నా లేదా పాత తెలుగు సినిమా ఏదైనా తీసుకున్నా, వీటిలోని పాత్రధారులు సాధారణంగా కెమెరా ముందుకు వచ్చి తమ సంభాషణలను చేస్తారు. అందుకే ఒక సినిమా స్థానికంగా (దేశీయంగా) పెద్ద హిట్టయినప్పటికీ ఆ సినిమాను అంతర్జాతీయ సినిమాలతో పోల్చలేము. అలా అని కెమెరాను అటు ఇటు తిప్పేసి, క్రేన్‌లెక్కించేసి నానా హడావుడి చేసినంత మాత్రాన అది గొప్ప సినిమా అయిపోదు.
సినిమా లో ఎటువంటి కెమెరా కదలికకు ఆస్కారముందో, దాని ద్వారా సీను ఎలా గొప్పపరచబడుతుందో తెలుసుకోవాలంటే Kryzsztof Kieslowski తీసిన Red సినిమాలోని మొదటి సీను చూస్తే అర్థమవుతుంది. అలా అని ప్రతి సినిమాలోనూ కెమెరా మరియు పాత్రధారులు చైతన్యం కలిగి వుండాల్సిన అవసరం లేదు. ఎందరో విమర్శకుల మన్ననలు పొందిన తైవానీస్ సినిమా What time is it there? లో దర్శకుడు Tsai Ming-Liang దాదాపు సినిమా మొత్తం నిశ్చలం గానే చిత్రీకరించారు. కానీ ఈ సినిమాను ఒక అద్భుత కళాఖండంగా వర్ణించారు చాలా మంది. ఈ సినిమాలో పాత్రధారులను, కెమెరాని స్థిరంగా వుంచడం ద్వారా తైవానీస్ ప్రజల నిశ్చల జీవితాలను మన కళ్ళముందుంచుతాడు దర్శకుడు.
మనం రూపొందిస్తున్న సినిమా యొక్క స్వభావాన్ని బట్టి ఈ స్టేజింగ్ అనే అంశం దర్శకుడు నిర్ణయించినప్పటికీ కొన్ని సూచనలను పాటించడం ద్వారా మరియు వివిధ దర్శకుల శైలిని తెలుసుకోవడం ద్వారా స్టేజింగ్ గురించి తెలుసుకోవచ్చు. వుదాహరణకు, Jennifer Van Sijll తన పుస్తకం Cinematic Storytelling లో ఇలా చెప్తారు.
“సాధారణంగా మనం చదవడం, రాయడం ఎడమవైపు నుంచి కుడివైపుకి చేస్తాము కాబట్టి, తల తిప్పి ఎడమవైపుకి చూడడం కంటే కుడివైపుకి చూడడం సుళువు. అలాగే గురుత్వాకర్షణ శక్తి కారణంగా తల ఎత్తి పైకి చూడడం కంటే కిందికి చూడడం సుళువు. అందువల్ల సినిమాలో మంచిని పోషించే పాత్రధారులు తెరపై ఎడమవైపు నుంచి కుడివైపుగా కదులుతున్నట్టుగానూ, చెడును పోషించే విలన్ పాత్రధారులు కుడినుంచి ఎడమవైపుగా కదులుతున్నట్టుగానూ చిత్రీకరిస్తే ప్రత్యక్షంగా చెప్పకుండానే పరోక్షంగానే మంచిని పోషించే పాత్రధారులపై సానుభూతిని, విలన్ పాత్రధారులపై ఏహ్యభావాన్ని ప్రేక్షకుల మనోభావాల్లో కలిగించవచ్చు”
ఇదే విధంగా మంచి చెడుల మధ్య సంఘర్షణలను చిత్రీకరించడానికి కూడా ఈ పధ్ధతి వుపయోగపడుతుందని Jennifer Van Sijll అభిప్రాయ పడతారు. Alfred Hitchcock తన సినిమా Strangers on a train లో ఈ సిధ్ధాంతాలను వుపయోగించే మంచి చెడుల మధ్య సంఘర్షణలను చిత్రీకరించారు. అలాగే మిగిలిన అక్షాల దృష్ట్యా పాత్రధారులు జరిపే కదలికల ద్వారా మరిన్ని భావోద్వేగాలను ప్రేక్షకులలో కలిగించవచ్చు. ఈ సిధ్ధాంతాలను అవలంబించాలా వద్దా అనేది దర్శకుని వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఈ విధంగా విభిన్నంగా ఆలోచించడం ద్వారా తమ సినిమాలకు కొత్త కోణాలను ఆవిష్కరించవచ్చన్నది మాత్రం నిజం. ఒక వేళ Jennifer Van Sijll సిధ్ధాంత పరిచిన అంశాలే నిజమైతే కిందనుంచి పైకి మరియు కుడి నుంచి ఎడమవైపుకి రాసే జపాన్, మరియు ఇరాన్ దేశస్థుల సినిమాల సంగతేంటి? వీళ్ళ సినిమాల్లో పైన చెప్పిన అంశాలు వ్యతిరేక క్రమంలో జరగాలి. ఈ సారి ఏదన్న జపనీస్ లేదా ఇరానియన్ సినిమా చూస్తున్నప్పుడు ఈ విషయాలను గమనించి చూడండి.
పైన పేర్కొన్న అంశాల లాగానే సినిమాలోని వివిధ అంశాలు వేటికవే ప్రత్యేకతలను కలిగివుంటాయి. ఉదాహరణకు కథాగమనం అనే అంశాన్ని తీసుకోండి. కథ ఎలా వున్నప్పటికీ కథాగమనంలో వ్యత్యాసం ద్వారా అంతకుముందు వేరే సినిమాలో చెప్పిన కథనే వైవిధ్యంగా మలచవచ్చు. కథాగమనంలో వైవిధ్యాన్ని చేకూర్చిన వారిలో మొదటివాడు Orson Wells. ఈయన రూపొందించిన Citizen Kane చిత్రం ద్వారా కథాగమనంలోనే కాకుండా సినిమా అనే ప్రక్రియలోని వివిధ విభాగాల్లోనూ ఈయన చూపిన ప్రతిభ మరియు వైవిధ్యం నేటికీ ఎవ్వరికీ సాధ్యం కాలేదన్నది నిజం. మనలో చాలా మందికి తెలిసినంత వరకూ కథాగమనంలో వైవిధ్యం చూపించిన సినిమా అంటే మొదటిగా గుర్తొచ్చేది Quentin Tarantino సినిమా అయిన Pulp Fiction. కానీ Quentin Tarantino మాత్రమే కాదు ప్రపంచంలోని ఎంతో మంది దర్శకులు కథా గమనంలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఈ మధ్యనే వచ్చిన కొరియన్ సినిమా Sad Movie అయినా, Akira Kurosawa రూపొందించిన Rashoman అయినా లేదా Quentin Tarantino ఒకప్పటి మిత్రుడైన Roger Avery దర్శకత్వం వహించిన The Rules of Attraction సినిమా అయినా చూసినవారు ఈ వైవిధ్యాన్ని కళ్ళారా చూడవచ్చు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో ప్రపంచ దర్శకులు వినూత్న ప్రయోగాలతో తమ సినిమాలను ఎప్పటికప్పుడు కొత్త రీతిలో రూపొందిస్తున్నారు. అలా అని వీరి దర్శకత్వ శైలిని, సాంకేతికతను కాపీ కొట్టి సినిమాలు తీయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. పైన పేర్కొన్న విధంగా మనం కూడా మన సినిమాల్లో వినూత్న పధ్ధతులకు స్వాగతం పలకాలని నా ఆకాంక్ష. ఇవాళ కాకపోతే రేపైనా ఈ మార్పు వస్తుందని, మన సినిమాలు కూడా Cannes, Berlin లాంటి సినిమా వుత్సవాలలో ప్రదర్శింపబడతాయని ఆశ.
*****
informative and thought provoking write-up..