హచికో – మనసును తాకే సినిమా!

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

మొన్నామధ్య HBO లో వచ్చిన ‘హచికో – ఎ డాగ్ స్టోరి’ అన్న సినిమాను చూసాను. మొదటి నుండే మనసును కట్టిపడేసే సినిమాల్లో ఈ సినిమాను కూడా చేర్చవచ్చు.

సంక్షిప్త కథః

రోనీ అనే అబ్బాయి స్కూల్లో “మై ఫేవరేట్ హీరో” అనే విషయంపై ప్రసంగిస్తూ తన ఫేవరేట్ హీరో ‘హచికో’ అనే కుక్క అని చెబుతూ, దాని కథను తోటి పిల్లలకు చెబుతాడు.

రోనీ తాత ప్రొఫెసర్ పార్కర్ విల్సన్. అతను ఒక కాలేజ్ లో సంగీత అధ్యాపకుడు. తను నివాసముంటున్న చిన్నవూరి నుండి రోజూ ట్రైన్లో పట్టణంలో ఉండే కాలేజ్ కు వెళుతుంటాడు. ఒకరోజు అతనికి స్టేషన్ లోపల, బ్యాగేజ్ నుంచి జారిపడిన ఒక చిన్ని కుక్కపిల్ల దొరుకుతుంది. దాని మెడ మీద ఉండే కాలర్ పై జపనీసు భాషలో ఏదో రాసుంటుంది. దాన్ని తన తోటి ఉపాధ్యాయుడైన కెన్ అనే జపనీయుడికి చూపుతాడు. ఆ కాలర్ పై రాసినదాన్ని చదివి జపనీ భాషలో “హచీ” అంటే “అదృష్టం” అని అనువాదం చేస్తాడు కెన్. ఆ కుక్కపిల్లను అడుగుతూ ఎవ్వరూ రాకపోవడంతో పార్కర్ తనే తీసుకెళ్ళి పెంచుకొంటాడు. పార్కర్ భార్య కేట్ కు అది ఇష్టముండదు. కానీ రోజులు గడిచే కొద్దీ తన భర్త యొక్క సంతోషాన్ని చూసి తను కూడా ఆ కుక్కపిల్లపై ఇష్టాన్ని పెంచుకొంటుంది.

హచీ పెరిగి పెద్దదౌతుంది. కానీ మిగతా పెంపుడు కుక్కల్లాగా బాల్ విసిరేస్తే పరుగెత్తుకెళ్ళి పట్టుకురావడం వంటివేవీ చెయ్యక చాలా సీరియస్ గా ఉంటుంది. పార్కర్ దానికి ఆటలు నేర్పించాలని ఎంతగానే ప్రయత్నిస్తాడు కానీ సాధ్యం కాదు. ఐతే హచీ ప్రతిరోజూ పార్కర్ తో బాటు రైల్వే స్టేషన్ దాకా వచ్చి, అతను ట్రైన్ ఎక్కి వెళ్ళేంతసేపూ అక్కడే ఉంటుంది. సాయంత్రంవేళకు అంటే పార్కర్ కాలేజ్ నుంచి తిరిగొచ్చేవేళకు మళ్ళీ స్టేషను కెళ్ళి బైటే కాచుకుని కూర్చుంటుంది. పార్కర్ వచ్చాక అతనితో బాటు ఇంటికి వస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. స్టేషన్లోని టికెట్ కలెక్టర్ మొదలుగొని, బైట హాట్ డాగ్స్ అమ్మే వ్యక్తి దాకా అందరికీ హచీ పరిచయమౌతుంది.

ఒకరోజు స్టేషన్ దగ్గరకు వచ్చిన పార్కర్ చేతిలోని బంతిని ఎగిరి ఎగిరి అందుకుంటుంది హచీ. ఎప్పుడూ సీరియస్ గా ఉండే హచీ అలా చేయడం చూసి ఆశ్చర్యం వేసిన పార్కర్ బంతిని దూరంగ విసురుతాడు. హచీ పరుగెత్తుకెళ్ళి బంతిని వెనక్కి తెస్తుంది. దాంతో పార్కర్ చాలా సంతోషపడ్తాడు. అక్కడున్న అందరికీ “ఇదే మొదటిసారి! హచీ బంతిని పట్టుకోవడం ఇదే మొదటిసారి!” అని చెప్పుకుంటాడు.

కానీ కాలేజ్ కు వెళ్ళిన ప్రొఫెసర్ పార్కర్, సంగీత పాఠం చెబుతూ గుండెపోటుతో తరగతి గదిలోనే చనిపోతాడు.

హచీ ఎప్పటిలా తన యజమాని కోసం స్టేషన్ బైట ఎదురుచూస్తూవుంటుంది. పార్కర్ కూతురు, అల్లుడు వచ్చి హచీని ఇంటికి తీసుకువెళ్తారు. భర్త పోవడంతో ఆ ఇంట్లో ఉండలేక ఆ వూరినే వదిలిపెడ్తుంది కేట్. హచీని పార్కర్ కూతురు తీసుకెళ్తుంది. కానీ హచీ వాళ్ళింట్లో ఉండలేకపోతుంది. ఒకరోజు తలవాకిలి తెరవగానే బైటకి దూకి స్టేషన్ వైపుకు పరుగెత్తుకెళ్ళిపోతుంది. పార్కర్ అల్లుడు స్టేషన్ కు వచ్చి హచీని తీసుకెళ్తాడు. కానీ ఆ మరుసటిరోజు హచీలో ఉన్న అలజడిని గుర్తించిన పార్కర్ కూతురు గేటును తీసి, హచీని వదిలిపెడుతుంది. వీధిలోకి పరుగెత్తే ముందు హచీ ఆ అమ్మాయి చేయిని ప్రేమగా నాకుతుంది. ఆ అమ్మాయి కన్నీళ్ళ పర్యంతమౌతుంది.

అలా స్టేషన్ కు వచ్చిన హచీ అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. టికెట్ కలెక్టర్ హచీ దగ్గరకొచ్చి “హచీ! పార్కర్ ఇక రాడు. నువ్విక్కడ కాచుకొని లాభం లేదు.” అంటాడు. కానీ హచీ కదలదు. అక్కడే, అలానే మరో తొమ్మిది సంవత్సరాలు పాటు హచీ అదే జాగాలో తిరిగిరాని తన యజమాని కోసం కాచుకుని కూర్చుంటుంది.

న్యూసుపేపర్ రిపోర్టర్లు రావడం మొదలుపెడతారు. ట్రైన్లలో ప్రతి ఒక్కరూ హచీ గురించే మాట్లాడుకొంటుంటారు. హచీతో బాటు టికెట్ కలెక్టర్, హాట్ డాగ్స్ వ్యాపారి మొదలైనవాళ్ళు కూడా ఫేమస్ ఐపోతారు.

తొమ్మిదేళ్ళ తర్వాత తన భర్త సమాధి వద్ద అంజలి ఘటించడానికి వచ్చిన కేట్, స్టేషన్ ఎంట్రన్స్ వద్ద కూర్చొనివున్న హచీని చూసి ఆశ్చర్యపోతుంది. హచీ చాలా ముసలిదైపోయుంటుంది. బొచ్చు దాదాపు ఊడిపోయి, నడవలేక నడుస్తుంటుంది. కానీ యజమాని కోసం ఎదురుచూడ్డం మానదు. గతించిన తన భర్త పట్ల ఆ జంతువుకు ఉన్న విశ్వాసాన్ని చూసి చలించిపోయిన కేట్, హచీని పొదివిపట్టుకొని కన్నీళ్ళపర్యంతమౌతుంది. “మరో ట్రైన్ వచ్చేవరకూ నీతో పాటు కూర్చుంటాను” అని అంటూ హచీతో బాటే కూర్చుంటుంది కేట్.

కొన్ని రోజుల తర్వాత హచీ అక్కడే, తను రోజూ యజమాని కొసం ఎదురుచూసే స్థలంలోనే, కన్నుమూస్తుంది.

ప్రొ.పార్కర్ మనవడు రోనీ అకితా జాతికి చెందిన కుక్కపిల్లను, తన తాత మరియు హచీ నడిచిన రైల్వే ట్రాకు పైనే తీసుకెళుతుండగా సినిమా ముగుస్తుంది. ఇది జపాన్లో జరిగిన యదార్థ కథను ఆధారంగా తీసిన సినిమా అని చివర్లో చూపిస్తారు.

యదార్థ కథ వివరాలుః

1924 లో ప్రొ. యుయేనో అనే వ్యవసాయ శాస్త్రవేత్త, అకితా జాతికి చెందిన కుక్కపిల్లను పెంచుకొవడానికి తెచ్చుకొని దానికి “హచికో” అని పేరుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రొ. యుయేనో  1925 లో తరగతి గదిలోనే గుండెపోటుతో చనిపోతాడు. కానీ హచికో రోజూ తన యజమాని ఎక్కే షిబుయా రైల్వే స్టేషన్ కు వచ్చి అతని కొసం ఎదురుచూసేది. అలా పది సంవత్సరాల పాటు ఎదురుచూసిన 1935 లో చనిపోయింది.

హచికో స్వామిభక్తికి నివాళులందిస్తూ షిబుయా స్టేషన్ ఎదురుగా, ఎక్కడైతే పదేళ్ళపాటు హచికో కూర్చునేదో, అదే స్థలంలో ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసారు జపాన్ ప్రజలు. హచికో చనిపోయిన రోజున ఆ విగ్రహం ముందు వేలాది శునకప్రేమికులు చేరి ఉత్సవం జరుపుతారట.

ఈ నిజజీవిత కథను విన్న హాలివుడ్ నటుడు రిచర్డ్ గేర్ కన్నీళ్ళు పెట్టుకొన్నాడట. తనను అంతలా కదిలించిన హచికో జీవితాన్ని ఆధారంగా చేసుకొనే రిచర్డ్ గేర్ ఈ సినిమాను తనే నిర్మించి, నటించాడు.

గొప్ప తారాగణం, కళ్ళు మిరుమిట్లుగొలిపే గ్రాఫిక్స్, ఎక్కడో తెలియని గ్రహమండలంలో అర్థంకాని భాషలు మాట్లాడే అంతరిక్షవాసులు మొదలైనవేవీ లేకుండా మనసును నేరుగా తాకి, కదిలించే ఈ సినిమాను మీరు కూడా ఒకసారి చూడండి.

Your views are valuable to us!