“ఆత్మబలం” తెలుగు సినిమా నిర్మాణం జరుగుతున్న రోజులలోని కొన్ని సరదా జ్ఞాపకాలను కథానాయకి బి.సరోజాదేవి కబుర్లలో చెప్పారు.
తను జోడీగా నటించిన హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడించినది.
“నాగేశ్వర రావుకు అసలు కోపమే ఎరుగని తవం. ఎప్పుడూ నవ్వుతూ, జోవియల్గా ఉంటారు. జోక్సు వేస్తూంటారు, నవ్విస్తూంటారు . ఏ విషయం తీసుకున్నా, అనర్గళంగా ఆ అంశం పై మాట్లాడుతూండడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. షూటింగు సమయంలో కూడా ఇతరుల లాగా చిరాకు పడరు ,కోప తాపాలకు ఈయన అతీతులేమో! అని నాకు అనిపిస్తూంటుంది.” అని అన్నారావిడ.
ఇక ఆత్మబలం సినిమా సరదా ఘటనకు వస్తే….
ఆ సినిమా షూటింగు జరుగుతూన్నప్పుడు బి. సరోజ బంధువులు, సన్నిహితులూ ఆమెను చూడడానికి వచ్చారు. ఆమె వాళ్ళను కలవడానికి లేస్తూ ఉండగా అక్కినేని ఆమె జడను పట్టుకున్నారు.
“నీ జడ నా చేతిలో ఉంది. ఎలా వెళ్తావు? వెళ్ళాలన్నా వెళ్ళలేవు.” అన్నారు నాటకీయ ఫక్కీలో.
బి. సరోజ కూడా తమాషా చేస్తూ ఆయన విగ్గును పట్టుకుని – ”ఇప్పుడు మీ విగ్గు నా చేతుల్లో ఉంది. నా జడ లాగితే నష్టమేం లేదు గానీ, మీ విగ్గు ఊడితేనే డేంజర్.” అని అన్నారు.
ఆ మాటకు వెంటనే జడను వదిలేసారు నాగేశ్వర్ రావు. అంతేగాక “తల్లీ! నీకో నమస్కారం. ఇంత మందిలో నా విగ్ కాస్తా ఊడిపోతే నాకెంతవమానం!? అమ్మా! మనిద్దరి మధ్యనా గలాభా ఎందుకులే, వెళ్ళి రా తల్లీ! పోయి రావమ్మా!” అన్నారు.
“అలా రండి దారికి!” అంటూ బంధువుల్ని కలవడానికి వెళ్ళారు బి.సరోజ
అప్పటి రోజులు బంగారు రోజులు. షూటింగులలో, మధ్య మధ్య విరామం వ్యవధిలో అందరూ కలివిడిగా ఉండే వాళ్ళం. అందరూ ఎలాటి భేషజాలూ, అహంకారాలూ లేకుండా ఒకే కుటుంబ సభ్యుల్లాగా మసలుకునే వాళ్ళం. అలాంటి రోజులు తలపునకు వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతూంటుంది” అని ఆనాటి జ్ఞానపకాలను ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు బి. సరోజాదేవిగారు.
*****