భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వైవిధ్యం గల పాత్రలు కేవలం ఎన్టీఆర్, ఎఎన్ఆర్, శివాజీ గణేశ్ మాత్రమే పోషించారని చెబితే అది ఒక చారిత్రక సత్యమే.
ఎన్టీఅర్ విషయానికి వస్తే ఆయన చేసిన పాత్రల ప్రభావం, ఆయనకు ప్రేక్షకులు పంచిన అభిమానం ఆయన్ను చాల ప్రభావం చేసాయి. తద్వారా ఆయన తెలుగు దేశం పార్టీ ని స్థాపించి దేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని వ్రాయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసిన పాత్రల ప్రభావం కేవలం ఆయన వేష ధారణకు, ఉపన్యాసాలలో హావభావాలకు, పోలికలకు మాత్రమే ఎక్కువ గా ఉపయోగ పడ్డాయి అనడం ఒక సత్యమే! ఎందుకంటే, అప్పటికే కావలసినంత ధనార్జన చేసిన ఎన్టీఅర్ కు ఇంకా ధనం యొక్క అవసరం ఉంది అంటే అది ఆయన చేసిన పాత్రల ప్రభావం లేనట్లే. ఒకవేళ ఆయనకు ధనాపేక్ష లేదు అని అనుకుంటే ఎన్టీఆర్ ఒక అద్భుతమైన (శ్రీ కృష్ణ దేవరాయల హయాం లో లా కాకపోయినా ఆ చాయలలో) పాలన నడిచేది. కాని నడవలేదే !! ఎందుకంటే ఆయన్నే పదవీచ్యుతుణ్ణి చేసే స్థితిలో పాలన జరిగింది.
నిజానికి ఎన్టీఆర్ ఒక జీవితకాలపు అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నారు. ఆయనే కనుక నిస్వార్థంగా, చిత్తశుద్ధితో, తెలివైన పాలన అందిస్తే ముఖ్యమంత్రిగా కనీసం మూడు దఫాలు తెలుగు ప్రజలకు సేవచేసి సమైక్య ఆంధ్ర ప్రదేశ్‍ను చిరస్థాయిగా ప్రగతి పథంలో ఉంచేవారు. ఈనాడు కేవలం అక్షరాస్యత, సదవగాహన లేకపోవడం వలన ఏర్పడ్డ ప్రాంతీయ సామాజిక అసమానతలు ఉండేవి కావు. ఈ వేర్పాటు వాదాలు ఉండేవి కావు. ఎందరో మేధావులు ఈ తెలుగునాట తగు అవకాశాలు అందక తమ సేవలను, మేధాశక్తిని పర దేశాలకు, రాష్ట్రాలకు లేదా ప్రైవేటు వ్యాపారాలకు అందించారు. ఇందుకు కారణం వారికి ఎన్టీఆర్ తన హయాం లో ఒక చక్కటి నాయకత్వాన్ని అందించలేకపోవడమే.
చంద్రబాబు ఎదుగుదలకు కారణం ఎన్టీఆర్ అసమర్ధ పాలనే అనేది జగమెరిగిన సత్యమ్. ఆ వయసులో మనసు పండి మానవ సేవ ద్వారా మాధవ సేవ చేయగలననే భావన ఆయనకు ఎందుకు రాలేదు అంటే ఆయన పోషించిన పాత్రలు ఆయన వ్యక్తిత్వం పై బలంగా ప్రభావం చూపకపోవడమే. నిజమే నటన వేరు నిజ జీవితం వేరు కాని ఆ నటన ప్రాతిపదికగానే జనులు నీరాజనాలు ఇచ్చి తమ నాయకునిగా ఎన్నుకోన్నపుడు ఆ నటుడు అటువంటి నాయకత్వం ఇవ్వడమే ధర్మం. ఈ ధర్మాచరణ ఎన్టీఆర్ విషయంలో కానరాదు. అందుకే చరిత్రలో కేవలం ఆయన, ఆయన నటన, ఆయన స్థాపించిన పార్టీ మాత్రమే మిగిలాయి. ఆయన ప్రవేశ పెట్టిన పాలనా పరమైన పెనుమార్పులు లేవు! ఈ చారిత్రక తప్పిదమే చాలామంది రాజకీయ నాయకులు చేస్తూనే ఉన్నారు. కేవలం ప్రజల మోజు వలన పదవిలోకి వచ్చి ఆ పదవిని దైవప్రసాదంగా భావించక దుర్వినియోగం చేయడం వల్లనే చరిత్రలో కనీసం చెప్పుకోదగ్గ మంచి పేరును మన నాయకులు సంపాదించుకోలేక పోతున్నారు. ఇందుకు ఎన్టీఆర్ మినహాయింపు కాదు.
మన తెలుగుజాతి కొందరు నాయకులు చేసిన పెద్ద తప్పిదాలవలనే ఈనాడు దేశ విదేశాలలో సిగ్గు పడే స్థితిలో వేర్పాటు వాదం, పేదరికం, అవిద్య, అశౌచం, మొదలగు సామాజిక రుగ్మతలతో పోరాడుతూ ఉంది.
@ @ @ @ @ @
భక్త తుకారం, భక్త జయదేవ, మహాకవి కాళిదాసు, విప్రనారాయణ, తెనాలి రామలింగ కవి, చక్రధారి వంటి మహా భక్తుల పాత్రలలో పరకాయప్రవేశం చేసినట్లు నటించి, భక్తీ రసాన్ని తెలుగునాట ఒలికించిన అక్కినేని మహాభక్తునిగా మారలేదే? అది నటన, అవి పాత్రలు మాత్రమే కనుక. నారద పాత్రధారిగా పలు చలన చిత్రాలలో నటించిన కాంతారావుకి నారద భక్తి సూత్రాలు తెలుసు అనుకోవడం సామాన్య మానవులకు సబబు కాదు. అది ఒక నటన మాత్రమే అని నిర్ధారించుకోవాలి.
నిజ జీవితంలో ధర్మనిరతి, భక్తి అనేవి జీవి కి భగవంతునిపై ఉన్న అచంచల విశ్వాసం, చేసిన కర్మల ఫలితంగా వస్తాయి. పాత్రల పోషణ వలన రావు అనేది ఋజువైంది. ముఖ్యంగా నటులను ఆదర్శంగా చేసుకొని కొన్ని తరాలలో చాలమంది వ్యక్తులు జీవనాన్ని సాగించారు. అంటే నటుల నటనా కౌశలం వలన ప్రేక్షకులు ప్రభావితులై జీవితాన్ని చక్కదిద్దుకున్న దృష్టాంతాలు ఎక్కువగా ఉండవచ్చు. అంటే నటుడు తాను చేసిన పాత్ర వలన తనకుతానుగా పొందిన ప్రభావం కన్నా ఆ పాత్రను చూసిన ప్రేక్షకులే ఎక్కువ ప్రభావాన్ని పొందారు అనడానికి నిదర్శనం ఎన్టీఆర్ ని తెలుగు ప్రేక్షకులు ముఖ్యమంత్రిగా చేయడం.
తమిళ నాట ఎమ్జీఆర్ కూడా ఇందుకు ఒక నిదర్శనం. 70-80 ఏళ్ల వయసు మీదపడినా ఎన్నో ఉదాత్తమైన పాత్రలు పోషించినా ఇంకా లౌకిక విషయాలపై మక్కువ తీరని వారు ఉండడం సహజమే. నటుల నటన గురించి మాట్లాడడమే సబబు, వారి ఆధ్యాత్మికత గురించి కాదు అని లోకంలో రూఢి అయింది.
@ @ @ @ @ @
నటులు = రాజకీయ నాయకులు అనే సమీకరణ నిజమే ఎందుకంటే రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తే నటులు తెరపై నటిస్తారు. వీరురువు వారి అంతరంగాలలో ఒక దారుణమైన సందిగ్ధావస్థలో ఉంటారు.
ఎంతో గొప్ప ఉత్సుకతతో, ఆర్భాటంతో ఆరంభించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలవడం వెనుక ఈ నట-రాజకీయ సమీకరణమే పనిచేసింది. చిరంజీవికి డబ్బుకి కొదవ కాదే! ఐనా ఆయన సైతం ఒక జీవితకాలపు అవకాశాన్ని జారవిడుచుకొని చరిత్రలో వచ్చి పోయిన శతకోటి నాయకుల్లో ఒకానొకడిగా మాత్రమే మిగిలిపోయాడు. ఒకవిధంగా మరొక తెలుగు నటుడు ఇక రాజకీయ సాహసం చేయకుండా అడ్డుకట్ట వేసినందుకు చిరంజీవికి మన తెలుగు జాతి ధన్యవాదాలు చెప్పాలి.
కాలంలో వచ్చిన ప్రతి మార్పూ కలకాలం నిలవదు. నిలిచేది ధర్మబద్ధమైన మార్పు మాత్రమే. ఇంతవరకూ జరిగిన సంఘటనలు తెలుగుజాతికి ఈ ఖరీదైన పాఠం నేర్పాయి.
నేర్చుకొన్నవారికి నేర్చుకొన్నంత!
@ @ @ @ @ @