Like-o-Meter
[Total: 0 Average: 0]
1968లో “వరకట్నం” సినిమాను ఎన్.టి. రామారావు నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో రావి కొండలరావు నటిస్తూ ఉన్నప్పుడు ఓ గమ్మత్తైన ఘటన జరిగింది.
ఆ సినిమా క్యాస్టింగ్ విషయమై ఎన్.టి.రామారావుని కలిసారు రావికొండలరావు.
“బ్రదర్! కూర్చోండి. మంచివేషం ఉంది. మీరైతే బావుంటుంది. తమ్ముడితో మాట్లాడండి. డేట్స్ ఇస్తారు. All the best” అన్నారు అన్నగారు.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి ఔతూన్న రావి కొండలరావు తక్షణమే ఎన్టీయార్ తమ్ముడు త్రివిక్రమరావును కలిసారు. షూటింగ్ తేదీల కాగితం మీద సంతకాలు పెట్టారు. ఆ సంతకం పెట్టే సమయంలో “అమందానంద కందళిత హృదయారవిందుండనైనాను” అని రావి కొండలరావు తన “కనుబొమ్మలాట” అనే వ్యాసంలో ఉటంకించాడు.
అది షూటింగు తొలిరోజు.
వాహినీలో చాలా సహజమైన సెట్ వేశారు కళాదర్శకుడు ఎస్.కృష్ణారావు.
మేకప్ రూమ్‍కు వెళ్ళి కూర్చున్నారు రావి కొండలరావు. అక్కడ రావికి వేయాల్సిన కాస్టూమ్ తాలూకు పెద్దకోటు, జుబ్బా, తలపాగా- వగైరాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. భక్తవత్సలం మేకప్ వేస్తూ “సార్, కనుబొమ్మలు సన్నగా చేయాలి. కిందాపైనా తీసేస్తాను”అన్నారు చేతిలో బ్లేడును ఆడిస్తూ.
ఇంకేముంది? రావికొండలరావు ఉలిక్కిపడ్డారు. “వద్దండీ! నాకు అలవాటు లేదు. ఏ సినిమాలో అలా కనుబొమ్మలు తియ్యలేదు. బయట తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మగాళ్ళం కదా. వద్దు లెండి.” అని కొండలరావు అభ్యంతరం చెప్పారు. అప్పుడు మేకప్‍మ్యాన్ భక్తవత్సలం “మీ ఇష్టం! ఆ పెద్దాయన ఇష్టం!” అని సింపుల్ గా అనేసి ఊరుకున్నారు. ఆ పెద్దాయన ఎవరో కాదు ఎన్టీయారే.
మేకప్ పూర్తి చేసాక, మీసం కూడా అతికించారు భక్తవత్సలం. “ఇంకా మీకు బొట్టు పెట్టాలి. సెట్టుకి వెళ్తే పెద్దాయనే పెడతారు” అని చెప్పేసారు. పౌరాణికాలైనా, సాంఘిక సినిమాలైనా – ముఖ్యపాత్రలకి ముఖాన బొట్టు పెట్టవలసి వస్తే రామారావుగారే దిద్దేవారు.
డ్రెస్సు వేసేసుకుని సెట్లోకి వెళ్ళారు రావి కొండలరావు. తన వెనకాలే భక్తవత్సలం వచ్చి నుంచున్నారు. నందమూరి రామారావు ఈయనగారి మేకప్, దుస్తులూ ఎలాగ ఉన్నాయో నిదానించి చూసారు. ఆయన అలాగ ఎగాదిగా చూస్తూ ఉంటే, హెడ్ మాస్టరు ముందు స్కూలు పిల్లాడిలా బుద్ధిగా అటెన్షన్ ఫోజులో అట్టే నిటారుగా ఉండిపోయారు రావి కొండలరావు.
‘బేబీ లైటు’ను రావి కొండలరావు మొహం మీదికి తిప్పి, తేరిపార చూసి – “ఏమిటీ, ఐ బ్రోస్ తియ్యలేదేం?” అని అన్నారు రామారావు.
“సార్ వద్దన్నారు. అందుకనీ …” ఆని నసిగారు భక్తవత్సలం.
“వద్దనడమెందుకు? నో బ్రదర్! అలా చేస్తే కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. చూడండి” అంటూ ఎన్.టి.ఆర్. చెయ్యి చాచగానే అప్పటికే తన చేతిలో రెడీగా ఉంచుకున్న బ్లేడును ఠకాల్న అందించాడు భక్తవత్సలం. కొండలరావు నుదుటిమీద చెయ్యి ఆనించి, బ్లేడుతో సర్ సర్ ని కనుబొమ్మల్ని సరిచేసారు రామారావు.
కొండలరావు నోరెత్తితే ఒట్టు. ఒక కన్ను అయ్యింది. రెండో కన్నునూ కడు ‘విశాలం’చేసేసి “వూ!”అని గర్జించి “బ్రదర్ కి అద్దం చూపించండి” అన్నారు. కొండలరావు ముఖం మీద అద్దం ప్రత్యక్షమైంది.
“ఎలా ఉందిప్పుడు?” రావి కొండలరావుకి ఆట్టే తేడా కనిపించలేదు గానీ కంటి పైన చిన్నమంట! “ఏం?” అని రామారావు రెట్టించి అడగ్గా “చాలా బాగుంది” అని అన్నారు రావి కొండలరావు. మరి ఏన్.ఏ.టి. లో వేషమంటే సామాన్యమా?
గీసేసిన కనుబొమలతో బైట తిరిగితే చూస్తూన్నవాళ్ళు ఏమని అంటారో అని బెరుకు రావికొండలరావు మనసును అల్లకల్లోలం చేసేసింది పాపం!
అతనికి అప్పటికి తెలిసింది “ఇప్పటిదాకా జరిగింది మేకప్ టెస్టు మాత్రమే! ‘అసలు షూటింగ్’ ఆరోజు లేదు అని.
ఇంటిముఖం పట్టిన కొండలరావు అవస్థ చెప్పలేనిది్!
*****