ఆంధ్రులకు దొరికిన వజ్రపు తాళపుచెవి PBSఘంటసాలతో పి. బి. శ్రీనివాస్”ఓహో గులాబి బాలా! అందాల ప్రేమమాలా!” అనే అందమైన పాటను ఎన్.టి. రామారావు, జగ్గయ్య, జమున మొదలైనవారు నటించిన మంచిమనిషి సినిమాలో మీరు వినే వుంటారు!
ఆ పాటను ఆపాతమధురంగా ఆలపించిన గాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్. ప్రజలు ఈయనను PBS అన్న పొట్టి పేరుతో అభిమానంగా పిలుచుకుంటారు.
PBS సెప్టెంబర్ 22 వ తేదీ, 1933 లో కాకినాడలో జన్మించిన గాన గంధర్వుడు.
ఆయన గొంతు శ్రోతల మనసులలో శీతల తుషార సమీరంలాగా కదలాడుతూంటుంది అని అంటే అది అతిశయోక్తి కాదు.
PBS బాల్య స్మృతులు:
పి.బి. శ్రీనివాస్ గారి ఇల్లు వివిధ భావ సుమాల సమాహారం అని చెప్పవచ్చు. ఆయన తల్లిదండ్రులతో ఎన్నో మధుర స్మృతులు పెనవేసుకునివున్నాయని పిబినే అనేకమార్లు చెప్పారు.
తన బాల్యం గురించి పి.బి. శ్రీనివాస్ తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు:
“కాకినాడలో సంగీత క్లాసులకు వెళ్ళేవాణ్ణి. కానీ కఠినమైన పద్ధతి లో ‘వర్ణము ‘లను ఆలపించే విధానం నాకు నచ్చలేదు. అందుచేత ఆ పద్ధతిని వదిలిపెట్టేసాను. ఫార్మల్ బోధనా అనుసరణకు స్వస్తి పలికేసాను.”
“ఏకసంథాగ్రాహ్యత నాకు భగవంతుడు ఇచ్చిన వరము. ఒకసారి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ జి.బి. బాలసుబ్రహ్మణ్యం కచేరీకి వెళ్ళాను. ఆనాటి కచేరీలో ఆయన తోడి రాగంలో ఉన్న ఒక కీర్తనను పాడారు. ఇంటికి రాగానే అదే తోడి రాగంలో అచ్చం ఆయన లాగే పాడుతూన్నాను. అది విని, మా అమ్మ చాలా సంతోషించింది. అప్పటి నుండీ మా అమ్మ ‘సాంప్రదాయ సంగీత కీర్తనలను పాడమని’ నన్ను ప్రోత్సహించినది. కానీ నా మనసు ఎక్కువగా సినిమా పాటల వైపే మొగ్గు చూపిస్తూండేది.”
“కానీ మా నాన్నగారికి నా సినిమా పాటల పిచ్చి అస్సలు ఇష్టం లేదు. మా అమ్మ శేషగిరి అమ్మది సుమధుర గాత్రము. స్వీట్ వాయిస్ కల మా తల్లి నన్ను ప్రభావితం చేసింది. ముందు నీ డిగ్రీ సాధించు! B.Com పూర్తి చేయి!” అని షరతును విధించారు. అలా నా తల్లిదండ్రుల ఆకాంక్షలను పూర్తి చేసే ప్రయత్నం చేసాను.”
కొత్త గమ్యం వైపుకు అడుగులు:
ఈమని శంకరశాస్త్రి వద్ద PBS సంగీతము అభ్యాసం చేయసాగాడు. ఈమని గొప్ప వీణ విద్వాన్, సంగీత రాగ నిర్మాత. Emani SankaraSastri ఆర్కెస్ట్రాలో చేరాడు P.B.S.
కాలక్రమములో మిస్టర్ సంపత్ మున్నగు హిందీ సినీ సంగీతములో orchestra లో పాలుపంచుకోగలిగాడు పి.బి. శ్రీనివాస్. ఎస్.ఎస్.వాసన్ ప్రోత్సాహము లభించింది.
పి.బి. శ్రీనివాస్ కు రచనావ్యాసంగ అభిరుచి తో అవినాభావ సంబంధము ఏర్పడినది. ఆయన అడుగు పెట్టని సాహితీ మందిర భాగము లేదనే చెప్పాలి. కీర్తనలు, పద్యాలు, దోహాలు, ఘజల్సు; గీతములు – ఒకటేమిటి? దాదాపు సకల సారస్వత శాఖ లపైన వాలిన గాన కోకిల, సమస్త సాహితీ దివిజ గంగా జలాలలో ఈదులాడిన రచనా మరాళము ఆయన.
“నా గాత్రం బాగుంటుందని జెమిని వాసన్ ఈమని శాస్త్రికి చెప్పారు. ఈ వాక్కులు నా జీవితములోని స్వర్ణాక్షరములు” తరచు తలచుకునేవారు PBS.
శ్రీనివాస్ రమారమి 2 లక్షల పైనే కవితా గీత పుష్పాలను సంగీత తరువునకు పుష్పింపజేసారు. అనేక భాషలలో నిత్య అభ్యాసముతో, నిరంతర విద్యార్ధిగా నేరుస్తూనే, కలమును కదిలిస్తూ ముందుకు సాగిన సంగీత సాహిత్య కర్షకుడు.పి.బి.ఎస్.
2 నెలలు కఠోరశ్రమ సాధనను చేసి, కొత్త భాషలలో ప్రావీణ్యతనూ, పట్టునూ సాధించేవాడు. ఒకేసారి 8 భాషలలో “ప్రణవం” అనే పుస్తకాన్ని వ్రాసి, రిలీజ్ చేసారు.
పి.బి. శ్రీనివాస్ ఉర్దూభాషలో కూడా ప్రజ్ఞను కలిగిఉండటమును చూసిన లతామంగేష్కర్ విస్మయానికి లోనైనది. శభాష్ ఆఫ్తాబ్ ఖోకర్ ముద్ర తనదని పి.బి. శ్రీనివాస్ చెప్పేవారు.
ఇంగ్లీషు పాట:
పి.బి. శ్రీనివాస్ ఒక ఇంగ్లీషు సాంగును కూడా పాడారు. ఎస్. జానకి తో గాత్ర యుగళమును చేసారు.
“మానవుడు చంద్రగోళముపైన అడుగు పెట్టిన అద్భుత క్షణములు అవి. ఆ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్. జానకి , పి.బి. శ్రీనివాస్ లు స్వర్ణించిన ఆ గీతమే “Man to moon – Moon to God” అన్న పాట.
ఇంతకీ ఈ ఆంగ్ల గీత రచయిత ఎవరో తెలుసా? మరెవరో కాదు – మన పి.బి. శ్రీనివాస్.
అమెరికా ప్రెసిడెంటు నిక్సన్, చంద్రునిపై కాలూనిన మొట్టమొదటి ఆస్ట్రానమర్ లూయీస్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ P.B.S. ని ప్రశంసిస్తూ లేఖలను రాసారు.