‘తెలుగు విలన్లు’ కావలెను

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎస్వీ రంగారావుకళలకి, కళాకారులకి భాష, ప్రాంతీయ బేధాలు ఉండవు, ఉండకూడదు అని అంటారు. కానీ, సినిమాను ఒక కళగాను, సినిమా నిర్మాణాన్ని సృజనాత్మక కళగాను భావించేవారు మాత్రం, ప్రస్తుతం తెలుగులో విచ్చలవిడిగా సాగుతున్న పరభాషా నటీనటుల దిగుమతిని ఖండించి తీరతారు. కనీస భాషా పరిజ్ఞానం లేకుండా, తెరపై వారి హావభావ విన్యాసాలని గమనిస్తే, ఎవరికైనా చిరాకు వేసేది తథ్యం.

కాలానుగుణంగా మారిన పరిస్థితులు, మారుతున్న ఇతివృత్తాలు సాకుగా తీసుకొని, కొత్త ముఖాల కోసం మన నిర్మాతలు చేసే అన్వేషణ ఉత్తరాది నుండి చేసుకునే దిగుమతులతో ఆగుతుంది. పరిస్థితులు ఇలాగా కొనసాగితే, ఒకానొకనాడు తెలుగు సినిమాలలో తెలుగువారు ఉండేవారు అని చెప్పుకోవాల్సిన దుస్థితి కూడా వచ్చి తీరుతుంది.

కళాత్మక ప్రతిరూపాలుగా చెప్పుకునే మన సగటు సినిమాల్లో హీరోయిన్ పాత్రకుండే పరిధులు తెలుసు కాబట్టి, ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకునే హీరోయిన్ల గురించి అంత బెంగ పడాల్సిన పని లేదు. కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమయ్యే పాత్రలే. కాని, ప్రతినాయకుడి పాత్రల కోసం కూడా మన నిర్మాతలు పరభాషా నటుల కోసం ముఖ్యంగా ఉత్తరాది నటుల కోసం వెంపర్లాడటం అర్ధంకాని విషయం.గోవిందరాజుల సుబ్బారావు

ఒకప్పుడు నాయకుడికి ధీటుగా ప్రతినాయక పాత్రలో అశేషజనావళిని రంజింప జేసిన గోవిందరాజుల సుబ్బారావు, ఆర్.నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు,
నాగభూషణం, సత్యనారాయణ, రావుగోపాలరావు, రాజనాల, ప్రభాకరరెడ్డి, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు లాంటి తెలుగు పేర్లు వెండితెరపై చూసి చాలా కాలమే అయ్యింది.

ఇప్పుడు సాయాజి షిండెలు, అశుతోష్ రాణాలు, అశీష్ విద్యార్ధిలు, ముఖేష్ ఋషి లాంటి పేర్లే కనిపిస్తున్నాయి. వీరి నటనను తక్కువ చేసి చెప్పటమైతే కాదు కానీ, ఆ మాత్రం నటులు మన తెలుగులో లేరా అని అనుమానం వస్తుంది. వీరి కోవలో వస్తున్న ప్రదీప్ రావత్ లు, రాహుల్ దేవ్ వంటి మరెందరో విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి మాత్రమే.

ఒకప్పటి ఎస్వీరంగారావు లేదా ఇప్పటి ప్రకాష్ రాజ్ తరహా ప్రతినాయకులు ఆంద్రదేశంలో లేరనే ఒప్పుకోవాలేమో!

Your views are valuable to us!