1960 – 1970 దశకంలో దక్షిణాది సినీ ప్రపంచంలో ఎన్నో గీతాలు“వీణా వాయిద్యము నేపథ్యంగా” వెలువడి, వీనుల విందొనరించాయి. 1964 విడుదల ఐన “కలై కొవిల్” సంగీత ప్రధానమై ప్రేక్షకలోకం మన్ననలను పొందింది.
“అభినందన” మొదలుగా గల అనేక హిట్ సినిమాలలో హీరోగా వేసిన అందాల నటుడు కార్తీక్. ఈతని తండ్రి ముత్తురామన్. ముత్తు రామన్ నటించిన సినిమా “కలై కోవిల్ “కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సినిమాకు సంగీత రచనను – విశ్వనాథన్ రామ్మూర్తి చేసారు. ఈ మ్యూజిక్ రూప కల్పనలో తెలుగు వైణికుడు చిట్టిబాబు వీణను వాయించాడు. అంతేకాదు అధిక శాతం పాలు పంచుకున్నాడు కూడా!
చిట్టిబాబు(October 13, 1936 – February 9, 1996) “లైలా మజ్ఞు” లో బాల నటునిగా ఉన్నాడు. కానీ అతడు నటుడిగానే పరిమితం అవలేదు. గొప్ప వైణిక విద్వాంసునిగా పరిణతి చెందాడు. మహామహోపాద్యాయ ఈమని శంకర శాస్త్రి వద్ద ఆత్మీయ శిష్యరికం చేసి, గురువుకు తగ్గ శిష్యుడు ఐనాడు.
అప్పటి అనేక సినిమాలలో చిట్టిబాబు యే వీణను శ్రావ్యంగా వాయించాడు. “బాపు” దర్శకత్వంలో వచ్చిన “సంపూర్ణ రామాయణము” లో టైటిల్ సాంగు “జగదానంద కారకా!” అనే త్యాగరాజు కృతి వినిపించిన వీణా నాదము చిట్టిబాబుదే!
రాజాజీ రచన “దిక్కర్త పార్వతి” కథ ఆధారంగా తీసిన సినిమాకు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అవడం ఒక ఎత్తు, ఈ అవార్డు గెలిచిన చలన చిత్రమునకు (కన్నదాసన్ రాసిన గీతాలకు) music director మరెవరో కాదు, చిట్టిబాబు యే! వాణీ జయరాం పాడిన “ఆగాయం మఘై పొగిందాల్ ………” పాట ఆ రోజులలో సూపర్ హిట్ ఐనది. చల్లపల్లి రంగారావు కుమారుడైన చిట్టిబాబు ” Veena is my mission in life” అని పలికాడు.
ప్రాచీన వేద శ్లోకాలు, అలాగే కర్ణాటక సంగీత బాణీలు ఆతని అంగుళుల కదలికతో మృదు స్వరాల వరాలై శ్రోతల శ్రవణేంద్రియాలకు లభించాయి. కోకిల స్వరములను వీణా తంత్రులపై వినిపించి , అనితర సాధ్య వైణిక విద్వాంసునిగా ప్రపంచమంతా ప్రఖ్యాతి గాంచాడు చిట్టిబాబు.