చాలా లేటుగానైనా సనిమాలలో మంచి పాత్రలు లభించి, తమ నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న నటుల్లో రాజబాబు ఒకరు.
తెలుగు సినీ ప్రపంచానికి తన అద్భుత హాస్య నటనతో నవ్వులను పంచి ఇచ్చిన నటుడు కీర్తిశేషుడు రాజబాబు ఇష్టాగోష్టిలో తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేవారు.
VIP అనే పదానికి ఆయన ఇచ్చిన సరదా నిర్వచనం ఒకటి ఉంది.
రాజబాబు ప్రకారం ‘వి’ అంటే వడ. ‘ఐ’ అంటే ఇడ్లీ. ‘పి’ అంటే పొంగల్.నేటి చెన్నై, ఆనాటి మద్రాసు పట్టణంలోని పాండీ బజారులో చిన్నా చితకా వేషాల కోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణాలను చేసిన రోజులవి.
కాకా హోటళ్ళలో ఈ విఐపిలతోనే కడుపులను నింపుకుని, పార్కులోని చెట్ల క్రింద కాలక్షేపం చేసేవారు మేటి నటులైన సత్యనారాయణ, వంగర, కాకరాల మొదలైనవారు. ఆ లిస్టులో మన రాజబాబు కూడా ఉన్నాడు.
కాలే కడుపు ఓ ఇడ్లీ ముక్కనో, వడనో లేదా గరిటెడు పొంగలో దొరికితే చాలు తనుకు తాను వి.ఐ.పి.గా ఫీలయ్యేవాడంట రాజబాబు!