1983లో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన సాగర సంగమం తెలుగు సినిమా చరిత్రలో తనదైన అధ్యాయాన్ని లిఖించింది.
మాయాబజార్ తరువాత అంతటి పకడ్బందీయైన స్క్రీన్ ప్లే ఉన్న చిత్రంగా దీన్ని పేర్కొనవచ్చు. అంతేకాక, దర్శకుడు కె. విశ్వనాధ్ అన్ని చిత్రాల్లోకీ గొప్ప కథ, స్క్రీన్ ప్లే ఉన్న చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలోనూ ప్రదర్శితమైన విశ్వనాధ వైభవం మిగతా చిత్రాల్లో అక్కడక్కడా మాత్రమే కనిపిస్తుంది.
సినిమా ప్లాట్:
అపూర్వమైన ప్రతిభగల ఒక నాట్యాచార్యుడు వ్యక్తిగత విషయాలలో తగిలిన ఎదురు దెబ్బలకు ఎలా అధఃపతనానికి చేరువైనాడో, మళ్ళీ ఎలా పైకి రాగలిగాడో హృద్యంగా చెప్పడం సాగర సంగమం సినిమాలోని అసలు విషయం. వ్యక్తిగత విషయాలకంటే లక్ష్యం గొప్పదైనదని, ఆ లక్ష్యసాధనవల్లే సాధారణ మనిషి ఋషి అవుతాడని, అజరామరుడౌతాడని నిరూపించినదీ చిత్రం.
ప్రముఖ వ్యక్తి కూతురి నాట్యప్రదర్శనపై నిక్కచ్చియైన అభిప్రాయాన్ని వెల్లడించి, ఆవిడ కాబోయే భర్తచే “బాస్టర్డ్” అని తిట్టించుకొని, అప్పటి వరకూ మందు బాటిల్లోనే బందీయైవున్న తనలోని అసలు ప్రతిభను ప్రదర్శిస్తే విరజిమ్మిన నక్షత్రాల్లా, వెదజల్లిన మంత్రాక్షతలుగా గ్లాసులు ఎగిరే దృశ్యం కధానాయకుల్లోని వైలక్షణ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే విధానంలో ఒక కొత్త పంధా.
కధానాయకుడి నిర్మొహమాటపు వ్యవహారంవల్ల విసిగి, కష్టపడి ఇప్పించిన ఉద్యోగాన్ని నిలుపుకోలేదన్న అక్కసుతో తనను ఈసడించుకొన్న మిత్రుణ్ణి ఆ మిత్రుడే స్నేహం పై రాసిన కవితను వినిపించి కరగింపజేసిన దృశ్యం, కవి-పాఠకుడు-రసాత్మకత-మార్పు అన్న చక్రాన్ని వినూత్నంగా ఆవిష్కరింపజేస్తుంది.
అప్పటిదాకా కలలానే మిగిలిపోయిన “ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్” ఆహ్వానపత్రికను పొందడం, అందులో అనూహ్యంగా తన ప్రోగ్రామ్ కూడ ఉండడంతో కధానాయకుడు పొందిన భావనల పరంపరను సాగిదీసి విసుగెత్తించకుండా సంక్షిప్తంగా, నిశ్శబ్దంగా దర్శకుడు ప్రస్తుతి చేసిన తీరు మనసును తాకుంది.
తను “వదినా” అని పిలుచుకొనే ప్రాణస్నేహితుని భార్య కృష్ణాష్టమి అని చిన్ని కృష్ణుని పాదాలను వేసుకొంటే, తాగి లోనికి రాలేనని బైటే ఉండిపోతే, ఏమీ తినలేదని తెలుసుకొన్న ఆ వదిన బైటకే వచ్చి ఇంత తీపిని చేతిలో పెడితే “నేను ఎక్కువగా తాగలేదు వదిన” అని సంజాయిషీ ఇచ్చుకొంటే “నేను అడగలేదుగదయ్యా” అని ఆవిడ అంటే ఆ తల్లి చేయి పట్టుకొని కధానాయకుడు కుమిలిపోవడాన్ని డజన్ల కొద్దీ వయోలిన్లు, లీటర్ల కొద్దీ గ్లిజరిన్ను వాడకుండానే ప్రేక్షకుల గుండెల్ని బరువెక్కించగలగడం ఈ ఒక్క చిత్రంలోనే చూడగలం.
నాట్యం నేర్పడానికి వచ్చిన గురువుకు, తన తల్లికి మధ్యనున్నది అక్రమ సంబంధం కాదని, కళ ద్వారా కలిగిన పవిత్రమైన గురు-శిష్య సంబంధమని, వాత్సల్యం ద్వారా ఏర్పడిన తల్లీ-బిడ్డ సంబంధమని, మానవీయ విలువల పైన స్థిరపడిన ఓ అపూర్వ మైత్రి తెలుసుకొన్న ఆ అమ్మాయి చేత భారీ సంభాషణల్ని వల్లె వేయించకుండా “మాతృదేవో భవ, పితృదేవో భవ” అని తల్లికి నమస్కరింపజేయడం, “ఆచార్య దేవో భవ” అని కధానాయకుడికి నమస్కరింపజేయడం టెక్నికల్ గా ఒక గొప్ప విషయం.
అలానే కధానాయకురాలు తన కూతురు నర్తిస్తున్న వేదికపైనే కధానాయకుడు నర్తిస్తున్నట్టే ఊహించుకోవడం ద్వారా ఆమె ఆశయం అప్పటికీ, ఇప్పటికీ అదేనని, శారీరికమైన మరే భావాలు ఆమెలో లేవని నిరూపించిన తీరు కూడ అద్వితీయమైందే.
కళకి చావు లేదని అది పరంపరానుగతంగా చిరంజీవియని, దానివల్ల గురు-శిష్యులు కూడా లోకంలో చిరంజీవులుగా మిగులుతారని అత్యంత హృద్యంగా, హృదయంగమంగా ప్రకటించిన సాగరసంగమం సినిమా రసజ్ఞులైన ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఆణిముత్యం.
నటీనటుల భావాలేమిటి?
బహుశా కమలహాసన్, జయప్రద, శరత్ బాబులకు ఈ చిత్రంలో నటించడం ద్వారా కలిగిన కళాసంతృప్తి మరింకే చిత్రం ద్వారా కలిగి ఉండదని నా అభిప్రాయం. అడపాదడపా కమలహాసన్ నోటి ద్వారా విన్నా ఇప్పటిదాకా నేను చూసినంత వరకూ ఏ ఇంటర్వ్యూలోనూ జయప్రద ఈ చిత్రాన్ని పేర్కొనలేదు. ఎందుకో మరి?
ముగింపు
ఈ సంవత్సరానికి పాతికేళ్ళు పూర్తి చేసుకొన్న ఈ అపురూప చిత్రం గురించి కొన్ని విషయాలను పంచుకొన్నందుకు నాకు కూడా ఎనలేని ఆనందం కలుగుతోంది. మరి ఈ చిత్రాన్ని (మరోసారి) చూసి మీరూ దర్శక, నటులకు జేజేలు పలకండి!!
*****