ఆదర్శ సోదరీమణులు – పిల్లల తెలుగు కథ
అనగా అనగా ఒక చిన్న వూరు . ఆవూర్లో వంద గడపల సామాన్యులతో పాటు నాలుగైదు సంపన్నుల లోగిళ్ళు ఉన్నాయి.ఆ వూర్లొ ఒక అక్కా ఒక చెల్లి.
అక్క బాల వితంతువు. చెల్లి నడి వయసు వితంతువు. భర్త పోయిన నాటినుంచి చెల్లెలు బయటికి వెళ్లేది కాదు.
పిల్ల పీచూ బాదరాబందీ లేదు. ఉన్న చిన్న పొలం మీద ఫలసాయం సంవత్సరానికి కొంత ధాన్యం వస్తాయి. చిన్నామె భర్త వదిలి వెళ్ళిన చిన్నఇల్లు. ఈ యిద్దరక్కచెల్లెళ్ళు ఎలా బ్రతుకు బండి లాగించుతారని వూరి వాళ్ళంతా చింతపడేవారు.
బ్రతికినంత కాలం బ్రతుకుని లాగుకునో, నెట్టుకునో నడపాల్సిందే!
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
చిన్నామెకు దిష్టి మంత్రం ,తేలు మంత్రం, యిరుకు మంత్రం, చప్పి మంత్రం వగైరా వస్తుంది. పల్లెటూరు కావున ఎవరో ఒకరు వస్తారు. యుక్తిగా తేలు మంత్రం వేయించుకునే టప్పుడు చిన్న పళ్ళెంలో బియ్యం, పెసరపప్పు వేసి రూపాయ బిళ్ళ దానిపై ఉంచి తెమ్మనేవారు. మంత్రించిన తరువాత రూపాయి, కొంత పప్పు, బియ్యం ఉంచుకుని, ఇంకొంత పప్పు బియ్యం మిగిల్చి, ఒక కొసలొ కొద్దిగా పసుపు కుంకుమ వేసి, తేలు కుట్టిన చోట పసుపు కుంకుమ అద్దమనేవారు. మిగతా వాటకి కూడా ఏవో తెమ్మనేవారు .
దిష్టి మంత్రానికి పిల్లల్నితేచ్చేటప్పుడు చిన్న గిన్నెలో అయిదు చెంచాల పంచదార తెమ్మనేవారు. అందులోంచి కొంత పంచదార అట్టే పెట్టుకుని మంత్రం వేసేక ఒక చెంచాడు పంచదారగిన్నెలో ఉంచి చిటికెడు పంచదార పిల్లల నోట్లో వేసే వారు. వీటితో వారికి రోజు గడుస్తుందా అంటే గడవదు గాక గడవదు. కానీ వారి కాఫీలోకి కొంత పంచదార సరిపోతుంది. ఎవరి పిల్లల్నయినా అతి ముద్దుగా ఆప్యాయంగా పలకరించేవారు. అందువల్ల పసిపిల్లలు తల్లులు వారి వద్దకు తరచూ వచ్చేవారు.
ఇక పెద్దామె ఉదయాన్నే ఏడు గంటలవగానే ఒక చిన్నసత్తు గిన్నె కొంగు చాటున పట్టుకుని సంపన్నుల ఇంటికి వెళ్లి ” ఏం చేస్తున్నారు అమ్మడూ?” అంటూ పలకరించేది. అది ఫ్రిజ్‍లు లేని కాలం . కూరల బుట్ట వద్ద కెళ్లి చిందరవందరగా పడి ఉన్న కూరలన్నీ చక్కగా ఏరి ఎండిపోయిన వాటిని వేరు చేసి, మంచివాటిని సర్ది చుట్టూ శుభ్రం చేసి “అమ్మడూ! యీ నాలుగూ ఎండిపోయాయి తీసుకు వెళ్ళనా? నువ్వైనా అవతల వేసేదే కదా! ఏదో పెద్దవాళ్ళం కూరో, పచ్చడో చేసుకుంటాం. సరేనా!” అని అంటే “వద్ద”నడానికి ఆ ఇల్లాలికి నోరు ఎలా వస్తుంది?
అలాగే యింకో యింటికి వెళ్లి కాస్త పని సహాయం చేసి “అమ్మాయ్ కొద్దిగా పుల్ల మజ్జిగ వుంటే పోయ్యమ్మా. చెల్లికి వేడి చేసింది” అని అడిగితే ఆ ఇంటి ఇల్లాలు తమకు ఉన్నంతలోనే ఆమె గిన్నెకు వంపేవారు.
*****
తమ అవసరానికి మించి ఏ కాస్త కయినా ఆశ పడేవారు కాదు. ఎవరినీ అనవసరంగా పీడించేవారు కాదు. వారి శక్తి తగ్గట్టుగా చేతి సహాయం చేసేవారు. ఒకరిని నొప్పించకుండా మాట్లాడేవారు. అందరి బాగును కోరేవారు.
ఇలా వారి స్వభావాల్ని చూసి వూరివాళ్ళు ఏదో విధంగా వారికి సహాయం చేద్దామని మహాలయ పక్షమని, దసరా పండుగని, దీపావళి అని ఏదో ఒక కారణం చెప్పి స్వయంపాకము, చీరలు మొదలైనవి ఇవ్వడం మొదలుపెట్టారు. కాయ, కూర, పండు ఎవరు అభిమానంతో ఏమిచ్చినా కాదనకుండా స్వీకరించే వారు. దాని ప్రతిఫలంగా మాటసాయమో, చేతసాయమో లేదూ వాళ్ళకు బాగా వచ్చిన మంత్రసహాయమో చేసేవారు.
చదువు లేకున్నా, వుద్యోగాలు లేకున్నా కేవలం మంచి మాట, మంచితనం, మంచి నడవడికతో కష్టమని అనిపించే జీవన రధాన్ని నడపవచ్చని రుజువు చేశారు ఆ సోదరీమణులు .
*****