చందమామ తెచ్చెనమ్మ చందనాల వెన్నెలలు
వెన్నెలల చందనాల హత్తుకున్న బొమ్మలు
అవి ఎవ్వరివమ్మా? అవి ఎవ్వరివమ్మా? ||చందమామ ||
మిత్రులను వెక్కిరించి, అన్నయ్యను గోకి
పొన్నచెట్టు కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు
పొదరిళ్ళలోన నక్కినక్కి నవ్వేటి క్రిష్ణుని
తనివితీర చూడాలని తహతహలా జాబిలికి ||చందమామ ||
“అల్లరి మానాలంటూ” ఆకతాయి క్రిష్ణుని
తల్లి జనని యశోదమ్మ తర్జనిని చూపించి
రేపల్లెల గోపెమ్మల కొంగులందు దోబూచి
ఆటలాడ తనతోటి తహతహలు జాబిల్లికి ||చందమామ ||
యమున అలల నేస్తాలతొ, ఈదులాటలో నేర్పరి
నీలినీలి కెరటాలలొ కాళీయుని వేదిక పై
రస తాండవమాడేటీ నీలమోహన కృష్ణుని
తనివితీర చూడాలని తహతహలు జాబిల్లికి ||చందమామ ||