అద్దంలో జీవితాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఇప్పటికి గంటసేపటి నుంచి అరుగు మీదే కూర్చొనుంది అరవై ఏళ్ల రత్తమ్మ. మధ్యాహ్నంలోపే వచ్చే పోస్టబ్బాయి సాయంత్రం మూడైనా రాలేదు. రేపే దసరా పండగ. కూతురు, అల్లుడు, ఇద్దరు మనవళ్లు పొద్దునే వచ్చారు. దసరాకి మూడు రోజుల ముందే వస్తానని చెప్పిన కొడుకు మాత్రం రావట్లేదు. మొన్ననే రాముడు రాసిన ఉత్తరం వచ్చింది. ఆఫీసులో అర్జంటు పనులవల్ల వేరే ఊరు వెళ్ళాల్సి వస్తున్నదని, వస్తూ తెద్దామనుకున్న డబ్బులు మని ఆర్డరులో ఆరోజే పంపుతున్నానని చెబుతూ ఉత్తరం రాసాడు. వీడితో ఎప్పుడూ ఇంతే. వస్తానని చెప్పిన ఏ రోజు రాడు. ఏం ప్రైవేటు ఉద్యోగాలో ఏమిటో, పండగలు, పబ్బాలు కూడా జరుపుకోనీరని నిట్టూరుస్తున్నది. 

అరకొరగా మిగిలిన డబ్బులతో కూతురు, అల్లుడికే కొత్తబట్టలు కొన్నది. పిల్లలకి బట్టలు కాకపోయినా, చేతుల్లో పెడదామంటే  చిల్లు గవ్వ మిగల్లేదు. పండగ సామాను కొనేప్పటికే పచారి షాపు పంతులుకి వంద బాకీ పడింది. ఏం చేయాలో పాలు పోవటం లేదు రత్తమ్మకి. 

ఆయనే ఉంటే ఇలా ఉండేదా అనుకుంటూ కళ్ళు వొత్తుకుంది. రత్తమ్మకు పరంధామయ్యతో పెళ్లయ్యేనాటికి పదెకరాల పొలం ఉండేది. ఒక కొడుకు, కూతురితో దర్జాగా కాలం వెళ్ళబోసింది. ప్రతి పండగా సందడిగా గడిచిపోయేది. అవేవో కంప్యూటర్ చదువులంటూ మూడెకరాలు రాముడి కోసం, మరో మూడెకరాలు కూతురు శాంత పెళ్లి కోసం ఖర్చైపోయాయి. మిగిలిన నాలుగెకరాల మీద రాబడి అంతంత మాత్రంగానే ఉన్నా, చేతిలో పైసా లేని దుస్థితి ఏనాడు చూసెరుగదు. 

రాముడికి గవర్నమెంటు ఉద్యోగం కాకపోయినా, ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారు అంతా. వెంటనే పెళ్లి కూడా జరిగింది. మనవడు పుట్టాడని తెలియకుండానే యాభై ఏళ్లకే హఠాత్తుగా పరంధామయ్య కన్ను మూసాడు. ఒక్కదానివే ఈ ఊళ్లో ఎందుకంటూ తన కూడా తీసుకెళ్లాడు రాముడు పట్నానికి. అస్తుపిస్తు ఆదాయంతో రాముడు ఎలా వెళ్ళదీస్తున్నాడో చూసి కడుపు తరుక్కుపోయింది రత్తమ్మకు. 

ఇక అక్కడ ఉండలేక, ఊరికెళతానని రాముడితో చెప్పినప్పుడు వాడు కూడా చాలా బాధపడ్డాడు. నెలకి అయిదొందలు పంపుతానని కూడా మాటిచ్చాడు. చెప్పినట్లే మాట మీద నిలబడ్డాడు. ఇంతలో మనవడు ఇంజనీరింగేదో చేస్తానంటున్నాడు, చాలీచాలని జీతంతో కష్టంగా ఉందంటూ, మొన్న సంక్రాంతి నాటికి మిగిలిన నాలుగెకరాల్లో మూడెకరాలు అమ్మించాడు! ఇప్పుడు ఆ నాలుగెకరాల మీద ఆదాయం కూడా పోయింది. అయిదొందలతో కష్టంగా ఉంటుందేమో అని మరో వంద రూపాయలు పెంచాడు! ఇప్పుడు ఆ ఆరోందల కోసమే కళ్లల్లో వత్తులు పెట్టుకు కూర్చుంది రత్తమ్మ. 

తెల్లారక ముందే ఆ కళ్లు మూసేసింది.

 

* * * * * *

 

 

నిముషానికోసారి మొబైల్లో మెసేజు కోసం చూసుకుంటున్నాడు అరవై ఏళ్ల రామారావు, ఇంకా డబ్బులు జమ అయినట్లులేదని బ్యాంకు వాళ్లని, కొడుకునీ తిట్టుకుంటూ. 

ఒక్కగానొక్క కొడుకని ఫణిని ఎంతో గారాబం చేసాడు. అప్పటికీ భార్య చెప్పిన మాట వినకుండా, కొడుకు అడిగినదేదీ కాదనకుండా చేసాడు, నెత్తిన పెట్టుకున్నాడు. పదో ఏటికే వాడు తన జేబులో సిగరెట్టు తీసుకొని నోట్లో పెట్టుకుంటే మురిసిపోయాడు. వాడు వేసే అల్లరిచిల్లర వేషాలు చిలిపితనంగా భావించాడే కానీ, కొడుకుని ఏనాడు దండించలేదు. ఎందుకంటే, తనకన్నా చక్కగా చదువుకుంటాడని, ఎక్కువ కట్నం తెస్తాడని ఆశతో! 

అమ్మ పోయిన ఐదేళ్లకే భార్య కూడా పోవటంతో పూర్తిగా ఒంటరివాడైపోయాడు రామారావు. దాంతో అప్పటికి

పాతికేళ్లుగా ఉన్న దిక్కుమాలిన అలవాట్లకి హద్దులే లేకుండాపోయాయి. తల్లీ భార్య ఉన్న రోజుల్లో కూడా తనకి ఎదురులేకుండా మేనేజ్ చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం రిటైరయ్యాక వచ్చే ఆదాయం కూడా పరిమితమయ్యింది. ప్రైవేటు ఉద్యోగులకి వచ్చే పెన్షన్ రెండు వేలు కూడా లేదు. చేతికొచ్చిన పి.ఎఫ్. డబ్బులో సగం, కొడుకు వ్యాపారానికి కావలంటే ఇచ్చేసాడు. నిజం చెప్పాలంటే, కొడుకు ఆత్మహత్య చేసుకుంటాననే బ్లాక్ మెయిలింగ్ కు దడిసి ఇచ్చాడు. మిగిలినదాని మీద వచ్చే ఇంటరెస్టు కూడా ఇంటి అద్దెకి, తిండికే సరిపోవటంలేదు, ఇక మందుకేం మిగులుతుంది? సిగరెట్లకేం మిగులుతుంది?
 

కంప్యూటర్ చదువు పేరుతో, తండ్రి చేత మూడు ఎకరాలు అమ్మించిన రోజులు గుర్తుకొచ్చాయి రామారావుకి. పట్నంలో పెద్ద చదువులు చదివేస్తున్నానని అపురూపంగా చూసుకుంటున్న పొలాన్ని కూడా నాన్న అమ్మేశాడు. పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగం వచ్చి కొడుకు తమని చూసుకుంటాడన్న ఆశ పాపం ఆయనది. ఖర్చుపెట్టి చదివినా, వచ్చిన అత్తెసరు మార్కులకు మామూలు ఉద్యోగమే రాలేదు. కట్నం కోసమైనా పెళ్లి చేసుకుందామనుకుని, ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. తండ్రికి కట్నం ఇవ్వరాదని, తీసుకోరాదన్న ఆదర్శం మరి! అదృష్టం బాగుండి, ఏదో ప్రైవేటు కంపెనీలో ఓ చిన్న ఉద్యోగం వచ్చింది. లేదంటే, పెళ్లైన వెంటనే పరువు కూడా పోయేది. 

నాన్న ఉన్నప్పుడే, ఉద్యోగం బాగోలేదు వ్యాపారం చేసుకుంటాను మిగిలిన పొలం అమ్మేయమంటే ఒప్పుకోనే లేదు. నాన్న పోయాక, అమ్మ కూడా ఎంతకాలం పొలాన్ని పట్టుకు వేళ్లాడిందని! అప్పటికీ నెలకు అయిదొందలు ఎర వేసా… అయినా అమ్మ ఒప్పుకోలేదు. చెల్లెలు, బావ కళ్లు కూడా పొలం మీదే ఉన్నాయని చూచాయగా తెలుసు. అది తెలిసే ఏ పండగకీ ఊరు వెళ్లలేదు, పండగలకి డబ్బూ పంపలేదు. చివరికి మనవడి చదువుకని అడిగేసరికి ఏమనుకుందో మూడెకరాలు అమ్మేసి డబ్బు పంపింది. 

స్టాక్ మార్కెట్లో లక్షలు సంపాదిద్దామని నేను వేసిన ప్లాను కూడా మూడు నెలల్లో మూడెకరాల డబ్బుని మింగేసింది. అది తెలిసి ఎన్నెన్ని కారాలు మిరియాలు నూరారు చెల్లి, బావాను! తన భార్య కూడా ఎంత చీదరించుకుందని ఆ రోజు!  అందుకేగా ఆ రోజు దసరా పండక్కి అమ్మ దగ్గరికి వెళ్లలేదు. అమ్మ పోయిందని తెలిసిన తర్వాత ఇక వెళ్లక తప్పలేదు. మిగిలిన ఆ ఒక్క ఎకరానికి ఎంత యాగీ చేసారు. 

ఆ ఒక్క ఎకరమైనా హాయిగా ఎంజాయ్ చేద్దామంటే, రెండో రోజుకే “నాన్నా, ఈ అమ్మాయి నీ కోడలు” అంటూ ఫణి పరిచయం చేసేప్పటికి హతాశుడయ్యాడు. వాడు చదివిన చదువుకు కోట్లలో కాకపోయినా కనీసం మూణ్ణాలుగు లక్షలైనా కట్నం వస్తుందనుకున్నాడు. అదీ పాయె! నా బావమరిది వ్యాపారంలో పార్ట్నర్ గా చేరుతున్నాను, ఓ అయిదు లక్షలు ఇవ్వమంటూ, ఇచ్చేదాకా వదిలితేనా? ఇచ్చిన వెంటనే వెళ్ళి వేరు కాపురం పెట్టాడు. నెలకో అయిదు వేలు పంపుతానన్నాడు. ఏదీ, ఇంతవరకూ ఒక్క పైసా పంపలేదు! 

ఎప్పుడో చదువుకున్న రోజుల్లో తండ్రి పంపిన డబ్బులతో దర్జాగా తాగిన బతుకు నాది. పెళ్లైన తర్వాత దర్జా పోయి, దొంగతనంగా తాగాల్సివచ్చేది. తాగి తాగి చస్తాడంటారు కానీ, ఇప్పుడు తాగటానికి లేక నేను చచ్చిపోతున్నాను. 

ఖళ్ ఖళ్లుమని దగ్గుతూ మెసేజ్ చూస్తుకుంటున్నాడు. “నాన్నా ఈ నెల వ్యాపారం బాగోలేదు. రేపొచ్చినప్పుడు ఓ వెయ్యి సర్దుబాటు చేస్తాను” 

రామారావుకి ఆ రేపు ఇక రాలేదు.

* * * * * *

 

Your views are valuable to us!