అనిల్ కు “మానవతావాది”గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటమెక్కువ. తన తల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం ఇష్టం లేక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేసి “మానవతావాది”గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తనకు కూడా జరగాలని విల్లు వ్రాసి అదే ఆసుపత్రికి దాని ప్రతి, తన శాశ్వత చిరునామా ఇచ్చి మరీ వచ్చాడు.
ఈమధ్యన తనని చూసి తన మిత్రుడు ప్రేరణ పొంది, దీర్ఘ వ్యాధితో మంచాన పడ్డ తన తండ్రిని ఒప్పించి విల్లు వ్రాయించి ఆయన చనిపోతే అదే ఆసుపత్రికి ఆయన శవాన్ని దానం చేసాడు – అనిల్ మిత్రుడు మనోహర్.
రోజులు గడచిపోయాయి ఇప్పటి వరకూ అనిల్ తన వాక్చాతుర్యం తో వందమందిని ఒప్పించి వారి శవాలను మెడికల్ కళాశాలలకు దానం చేయించాడు. అంతే కాదు వారిలో చాలామందితో అవయవదానం కూడా చేయించాడు. మొత్తం మీద రోటరీ వారు అనిల్ లోని ఈ మానవాతావాది ని గుర్తించి సాదరంగా, సగౌరవంగా సన్మానించారు. ఈ విషయం తెలుసుకున్న ఒక టివి ఛానల్ వారు అనిల్ చేసిన ఈ సేవ వలన, నూతన జీవితాన్ని పొందిన వ్యక్తుల వివరాలు సేకరించి వారి ని ఇంటర్వ్యూ చేసి ఒక మంచి ప్రోగ్రాం తయారు చేసి ఆ సాయంత్రం ప్రసారం చెసారు. ఆ ప్రోగ్రాం లో చూపులేనివాళ్ళు కొత్త కళ్ళు వచ్చిన సంతోషాన్ని, కిడ్నీ దానం స్వీకరించిన వాళ్ళు వాళ్ళ అనుభూతిని కొత్త జీవితాన్ని, లివర్ దానం పొందిన వాళ్ళు వాళ్ళ కృతజ్ఞతను ఉద్విగ్నతతో పంచుకున్నారు.
అనిల్ కీర్తి ఆంద్ర దేశం నలుదిశలా వ్యాపించింది. అవయవ దానం కోసం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఒక మెడికల్ కాలేజీ భాగస్వామ్యం తో మొత్తం దేశం అంతా అంతర్జాలం ద్వారా ప్రచారం చేసి తన సేవా కార్యక్రమాలను విస్తరించాడు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా పొందాడు.
[amazon_link asins=’8189955357,B00HWWEFO6,B01IBBGIBE,B00HWWOTZ6′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’fcf0cda6-3eda-494b-891f-0f95f803d2a7′]
ఇంటికి వచ్చి సేదతీరుతున్న సమయంలో తన బాల్య మిత్రుడు గోపీ వచ్చి:
“ఒరేయ్ అనిల్! మీ కాలనీలో ఉన్న శివాలయంలో ఈ సాయంత్రం సనాతన ధర్మం అనే అంశంపై ఒక ప్రసంగం ఉంది. అందుకే కొంచం ముందు వచ్చి నిన్ను కలసి పోదామని వచ్చాను” అని చెబుతూ అనిల్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు .
బాల్య మిత్రుని రాక అనిల్ కి చాల సంతోషాన్ని ఇచ్చింది. ఎప్పుడూ ధర్మం అంటూ తనకంటూ ఏమీ పెద్దగా సంపాదించుకోలేదు గోపీ. ఉన్న గవర్నమెంట్ జాబు ద్వారా వచ్చే జీతంతో పిల్లల్ని చదివించుకొంటూ తండ్రిగారిచ్చిన ఇంటిలో ఉంటూ చాల తృప్తి గా జీవితం సాగిస్తున్నాడు గొపీ. కాలమే తనకున్న ఎనలేని సంపదగా భావిస్తాడు. అందుకే ఎక్కువగా అనిల్ ను కలవడానికి కూడా రాడు .
“రాక రాక వచ్చావురా చాల సంతోషం. కమలా! చూడు మీ గోపీ అన్నయ్య వచ్చాడు కాఫీ పట్టుకొని రా” అని తన భార్యను పురమాయించాడు అనిల్.
“కాఫీ తరవాతలే! అమ్మాయిని కాసిని మంచినీళ్ళు తెమ్మను!” అన్నాడు గోపీ.
ఈలోగా కమల మంచినీళ్ళ గ్లాసుతో వస్తూ “చాల సంతోషం అన్నయ్యగారు ఇలా అకస్మాత్తుగా వచ్చినందుకు!”అంది.
“వీడేదో మనకోసమే వచ్చాడని అనుకోకు. ఇక్కడ ఏదో ప్రసంగం ఉందట అందుకని కొంచం ముందు వచ్చి ఇలా మనల్ని కలిసాడు!” అన్నాడు అనిల్.
“ఎలాగైనా అన్నయ్యగారు మన ఇంటికి రావడం సంతోషమే” అని కమల కాఫీ తేవడానికి లోనికి వెళ్ళింది.
ఉభయకుశలోపరి మొదలైంది ….
ఈలోగా కమల కాఫీతో వచ్చి కప్పులు అందించి తనూ ఒక కుర్చీలో కూర్చుని “ఏ ప్రసంగం అన్నయ్యగారు? ఎక్కడ?” అని అడిగింది.
“మీ కాలనీలో ఉన్న శివాలయంలో ఈ సాయంత్రం 6. 30 కి సనాతన ధర్మం అనే అంశంపై ప్రసంగముందమ్మా! ఆ చెప్పే వక్త మంచి ధార్మికుడు కాబట్టి విషయాన్ని కూలంకషంగా చెబుతారు!” అన్నాడు గోపీ.
“అలాగా!” అని కమల అనేలోగా ..
“ఇంకా 20 నిముషాలే ఉంది . కనుక పద నువ్వూ నేనూ కూడా వెళ్దాం!” అన్నాడు అనిల్. అంటూనే “నువ్వా నాతో ఎక్కువ కాలం గడపవు కనుక నేనూ నీతో ఆ ప్రసంగానికి వస్తా పద అక్కడైనా ఇద్దరం కలసి కాసేపు కూర్చోవచ్చు!” అని అనిల్ గోపీ పట్ల స్నేహభావాన్ని చూపిస్తూనే అసంతృప్తినీ వ్యక్తపరిచాడు.
అది గ్రహించిన గోపీ మారుమాట్లాడకుండా “పదా!” అన్నట్టు చూసాడు.
* * * * *
దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి ఉంది. ప్రసంగకర్త విష్ణు శర్మ రావడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటుచేసుకొంది
నేరుగా వ్యాసపీఠమ్ చేరుకొని నమస్కారాదులు చేసి పూమాలను స్వీకరించి కృష్ణార్పణం అని చెప్పి ప్రార్ధన చేసి ప్రసంగం ప్రారంభించారు.
ఒక కొత్త అనుభూతిని అనిల్ పొందాడు. తను ఇప్పటివరకూ ఎటువంటి ప్రసంగాలకు వెళ్ళలేదు. కనీసం టివీ లో వచ్చే ఆధ్యాత్మిక ప్రవచనాలు సైతం వినలేదు. తన తండ్రిగారి కమ్యూనిస్ట్ సిద్దాతం, ఆయన భావజాలం అనిల్ ను ఎంతో ప్రభావితం చెసాయి. అలాగని పూర్తిగా భారతీయ ఆధ్యాత్మిక భావాలను విస్మరించడు. కమల మాత్రం రోజూ ఇంట్లో పూజ చెస్తుంది. ఆమె నమ్మకాన్ని అనిల్ గౌరవిస్తాడు. నిజానికి ఆమె కోసం కూడా ఇలా ఈ ప్రసంగానికి వచ్చాడు.
’సంచిత పాపం’ అనే అంశంపై జరుగుతున్న ప్రసంగం ఒక్కసారి అనిల్ ని బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చింది.
“ఎందుకు భగవంతుడు మనల్ని పుట్టించి ఈ కర్మ బంధంలో ఈ సంసారంలో పడవేస్తాడు? అనే ప్రశ్న చాల మందికి వస్తూవుంటుంది. నిజానికి రామాయణ, భారత, భాగవతాలు విని ఎవరు ఎక్కువగా సంశయాల్ని పొందుతారో, ఎన్ని ప్రశ్నలు వేస్తారో వారికే ఆస్తికత నిజంగా అబ్బుతుంది. పరమాత్వ తత్వం తెలుసుకునే అవకాశం అటువంటి వారికే లభిస్తుంది. ఈ ప్రశ్న నన్ను ఇలా సమాధానమిచ్చాను – ఇంట్లో హాయిగా ఉంటూ ఆటలాడుకొనే పిల్లలను బలవంతంగానైనా బడికి పంపుతాం ఎందుకు? ఎందుకంటే మన చిన్నప్పుడు కూడా బడికి పోవడానికి ఏడ్చాచాం, గోలపెట్టాం కానీ బడికెళ్ళి చదువులు చదివినందువల్ల ఇప్పుడు పడుతున్న సుఖం యొక్క అనుభవం మనకు ఉంది. మన పిల్లలకు లేదు. కనుకనే మన చిన్నారుల బెంగను చూసి కరిగిపోం. బడికి పంపడం మానం. బడికి వెళ్ళడం మొదట కష్టమైనా అది తాత్కాలికమైనది అని మనకు అనుభవపూర్వకంగా తెలుసు. దాని వలన విస్తారమైన ప్రయోజనాన్ని బిడ్డలు పొందగలరని కూడా మనకు తెలుసు. ఇదే పద్ధతే భగవంతునిది కూడా! దుర్లభమైన, ఉత్తమమైన ఈ మానవజన్మ ద్వారానే జీవి సాధన పరిపుష్టం కావలి కనుక ఈ జన్మను మనకు ఇచ్చి భూమిపైకి వదులుతాడు.”
ఆగాడు విష్ణుశర్మ. శ్రోతలందరూ శ్రద్ధగా వింటున్నది చూసి మళ్ళీ కొనసాగించాడు…
“నేను ఇలా చెప్పగానే ఆ అడిగిన వ్యక్తి సంతృప్తితో సమాధానపడ్డారు. మన వేద వాజ్ఞ్మయం ఎన్ని సందేహాలు కలిగిస్తుందో అంతే సులభమైన సమాధానాలు కూడా ఇస్తుంది కూడా! క్లిష్టమనుకొన్న విషయం ఇట్టే తేలిపోవడంతో ఇంతేనా అని అనిపిస్తుంది. కానీ దీనికి కొంత శ్రమ, అధ్యనం అవసరం.”
విష్ణుశర్మ మాటలు అనిల్ కు చాల బాగా నచ్చింది. అతను ఆలోచనల్లో పడ్డాడు.
* * * * *
బాల్య మిత్రుని బలవంతంతో ఆరోజు రాత్రి భోజనం అనిల్ ఇంటిలోనే చేయడానికి ఒప్పుకున్నాడు గోపి.
భోజనాల వేళలో “గోపీ! ఆయన చెబుతుంటే వినడానికి బావుందిరా. ఇలాటి ప్రసంగాలను నేను వినడం ఇదే ప్రధమమ్. నిజంగా కార్యాకారణ సంబంధం వలెనే ఈ పుట్టక చావు ఉంటాయా? మరి నేను పెట్టిన ట్రస్ట్ ద్వారా పుట్టు గుడ్డులకు చూపు వస్తుందే! అది కూడా కార్యాకారణ సంబంధానికి అనుగుణంగానే జరిగిందా? ఈ ట్రస్ట్ ద్వారా చాల మంచే జరుగుతుందే మరి పితృకార్యాలు చేయనివారు అధర్మం చేసినట్లేనా? ఋజువులు దొరకని పితృలోకాలు, స్వర్గసుఖాలు కోసం ఈ జన్మలో ఏది ధర్మమో, న్యాయమో, సాధ్యమో, అది చేయక గుడ్డిగా దహన సంస్కారాలు చేసి కొందరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశాన్ని జారవిడచడం ధర్మమా ?” అని చాల ఉద్విగ్నం గా అదిగాడు అనిల్.
గోపీ కొంతసేపు మౌనం వహించాడు. ఆలోచనలన్నీ కూడగట్టుకొని మాట్లాడ్డం మొదలెట్టాడు:
“నేను నమ్మిన ధర్మాన్ని ఆధారంగా నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ మాటలు కొంత కర్కశంగా మూర్ఖంగా ఉన్నట్టు నీకు అనిపించవచ్చు. అందుకు నీవేమీ అనుకోకూడదు. మరి చెప్పమంటావా?” అన్నాడు గోపీ. అతనిలో తన బాల్య మిత్రుడి పట్ల ఆర్ద్రత ఉంది కానీ అవమానం కలుగుతుందేమోనన్న సంశయం కూడా ఉంది. అది గ్రహించిన అనిల్ “తప్పకుండా చెప్పరా! నా భార్య నమ్మకాలను గౌరవిస్తున్నట్టే నీ అభిప్రాయాల్ని గౌరవిస్తాను” అని భరోసా ఇచ్చాడు.
గోపీ చెప్పడం ప్రారంభించాడు…
“విష్ణుశర్మ గారు చెప్పినట్లు ఈ దేహం ఇచ్చింది నారాయణుడు. ఆ పాంచభౌతిక దేహం ప్రాణోత్క్రమణానంతరం ఈ పంచ భూతాలకే చెందాలి. ముఖ్యంగా అగ్నిముఖంగా జరిగే దహన సంస్కారాన్ని ’పితృ యజ్ఞమ్’ అంటారు. నువ్వు చేస్తున్న సమాజ సేవ చక్కని సమాజ సేవే కాని సనాతన ధర్మం ప్రకారం అది అవైదికమ్.
ఏ కార్యాకారణ సంబంధం ద్వారా ఎవరి కళ్ళు ఏ అంధుణ్ణి చేరతాయో ఎవరికీ తెలియదు. కాని అదేవిధంగా మరో కార్యాకారణ సంబంధం వలన అంధత్వం ఆ వ్యక్తికి వచ్చింది. ఈ జన్మలో తన కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించ వలసిందే! కానీ నువ్వు ట్రస్ట్ అసలైన కార్యాకారణ సంబంధాన్ని మార్చివేస్తోంది.
సమాజాన్ని, ప్రకృతిని, మానవ శరీరాన్ని (ఆయుర్వేదం ద్వారా ) ఖగోళాన్ని చక్కగా అధ్యయనం చేసి విధి విధానాలు నెలకొల్పగలిగిన మన పూర్వీకులు ఇలా ఆర్గాన్ డొనేషన్ ఎందుకు చేయలేదు? తైలద్రొణి లో దశరథ మహారాజు దేహాన్ని భద్రపరచ గలిగిన మన పూర్వీకులు ఈ ప్రక్రియ మాత్రం తెలియక చేయలేదా?
నువ్వు చేస్తున్నది తప్పని అనడంలేదు కానీ సనాతన ధర్మానికి విరుద్ధమవుతుందేమోనని సందేహిస్తున్నాను. పునర్జన్మను విశ్వసితే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. అలాగే విష్ణు శర్మ గారు చెప్పినట్లు సంచిత, ప్రారబ్ధ ఆగామి కర్మ ఫలాల గురించి అవగాహన ఉంటే ఇంకా విస్తృతంగా నమ్మకం ఉంటుంది . ఇంతకు మించి చెప్పలేను” అని ముగించాడు గొపీ.
* * * * *
నిన్నటి వార్త (The Hindu, Hyd Edition)
హుస్సేన్ సాగర్ లో మునిగిపోయి మరణించిన (ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య వలన) వారి కుళ్ళిపోయిన దేహాలను కనీసం 100 కు పైగా వెలికి తీసిన పవన్ కుమార్ అనే గజ ఈతగాడు పోలీసులకు, చాలామంది మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక పెద్ద హీరో. ఎందుకంటే భరించనలవి కాని దుర్గంధ భూయిష్టమైన వైతరణి లాంటి హుస్సేన్ సాగర లోతులను శోధించి కుళ్ళిన శవాలను భయటకు తీయడం ఎవరితరం? ఈ వృత్తే పవన్ కుమార్ కి మరొక లాభసాటి పనిని కల్పించింది.
గణపతి నవరాత్రుల అనంతరం గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసినపుడు వాటి ఫ్రేములకు వాడిన ఇనుప చువ్వలు హుస్సేన్ సాగర్ గర్భంలో ఉంటాయి . వాటిని వెలికితీసి అమ్మి ఆ డబ్బుతో జీవనాన్ని కొనసాగించడం అలవాటు చేసుకున్నాడు పవన్ కుమర్. నిన్న ఆ పనిలో హుస్సేన్ సాగర్ గర్భంలో చిక్కుకొని శవమై తేలాడు !!
* * * * *
కార్యకారణ సంబంధం మానవ మేధకు అంతుచిక్కని విషయం!!