శ్రీధర్ హౌస్ సర్జన్ కోర్సు పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి.
ఆ వూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు. తాము వుండే యిల్లు సముద్రతీరానికి నడక దూరంలో వుండేది. పచ్చని చెట్లు చల్లని గాలి ఎంతో బాగుండేది. బస్సు సౌకర్యమయితే వుండేది కానీ పట్టణం లక్షణాలు తక్కువ. తన తోటి పిల్లలంతా తోటలో ఆడుకునేవారు.
దగ్గరలో ఒక ఆంగ్ల వనిత యిల్లు వుంటూండేది. ఆమె యిల్లు చిన్నగా వున్నా చుట్టూ ఆవరణ చాలా పెద్దది. అందులో పళ్ల చెట్లు వుండేవి. కోళ్లు, బాతులని పెంచేది. ఆవే ఆమె జీవనోపాధి. కావలిసిన వారికి పళ్లు, కరివేపాకు, గుడ్లు అమ్ముతుండేది. పిల్లలు గేటు దగ్గరకొచ్చినా, కాంపౌండు పై నుంచి తొంగి చూసినా కర్ర పట్టుకుని వెంటపడేది. ఆమె పేరేమిటో ఎవరికీ తెలియదు గాని “డూడాబాయి డూడాబాయి” అంటూ పిల్లలు వెక్కిరించి పారిపోయేవారు.
ఒకనాడు మా పిల్లల దండంతా ఆమె యింటి వయిపు వెళ్లాం. గేటు తెరిచేవుంది గానీ డూడాబాయి ఎక్కడా కనిపించలేదు. చెట్టు నిండా సపోటా పళ్లు నోరూరిస్తుంటే అందరం తలోపండు కోసుకునే లోపున డూడాబాయి రానే వచ్చింది. “ఏయ్ పిల్లలూ ఏం చేస్తున్నారక్కడ పొండి పొండి” అంటూ కేకలు పెడుతూ చేతిలో కర్రతో మావెంట పడింది. అందరం కాలికి బుధ్ది చెప్పాం. అమె కర్ర విసరటంతో చివర్లోనున్న నా కాలికి తగిలింది. ఏడుస్తూ యింటికి పోయాను.
జరిగినదంతా వెక్కిళ్లు పెడుతూ అమ్మకి చెప్పాను. కర్ర తగిలిన చోట కాలు ఎర్రగా కందిపోయి తట్టు కనిపిస్తోంది. అమ్మకి చాలా కోపం వచ్చింది. ఆ వూరు వచ్చి నాలుగు నెలలే అయినా వాళ్ల వల్ల వీళ్ల వల్ల డూడాబాయి గురించి విని వుందేమో ఆమె ప్రవర్తన చికాకనిపించింది. పిల్లలు పళ్ల కోసం వెళితే కర్రతో కొట్టడం ఏమిటి? ఒక్క మనిషి ఏం చేసుకుంటుంది అవన్నీ? నయం కాలు విరగలేదు.
సంగతేమిటో కనుక్కుందామని శ్రీధర్ చెయ్యి పట్టుకుని డూడాబాయి యింటికి వెళ్లింది.
గేటు మీద చెయ్యి వేశాక కాస్త జంకుగా అనిపించింది. ఆమె యిల్లు, ఆమె పళ్లతోట పిల్లలు దూరి పాడు చేస్తే కసురుకోవడం న్యాయమే! తల్లి మనసు ఆపుకోలేక కొడుకు వకాల్తా పుచ్చుకొని పరుగెత్తుకొచ్చింది. ఆమె ఎటూ తేల్చుకునే లోపున ఆలస్యమైపోయింది. గేటు తెరిచిన చప్పుడుకి డూడాబాయి బయటికి వచ్చింది. ఏం మాట్లాడాలో అర్ధంకాక “మేడమ్, మా అబ్బాయి కాలుకి మీరు విసిరిన కర్ర తగిలింది చెప్పడానికి వచ్చాను” నీళ్లు నములుతున్నట్లే అంది అమ్మ.
“కమ్ యిన్సైడ్ మై చైల్డ్ కమ్! కమ్! రామ్మా” స్వరంలో ఎంతో మృదుత్వం. పిల్లల్ని అదిలించే స్వరం లేదు. లోపలికెళ్ళాము “నా పేరు సుమతి. మేము యీ వూరు బదిలీ మీద వచ్చి నాలుగు నెలలైంది. సారీ పిల్లలిదీ తప్పే మిమ్మల్ని విసిగిస్తుంటారు” అంటూ తలెత్తిన సుమతి ఆమె చర్యకి నిశ్చేష్టురాలయింది.
ఆంగ్లవనిత కింద కూర్చుని, శ్రీధర్ కాలు చేతిలో తీసుకుని కందిపోయిన భాగాన్ని చేతితో నిమురుతూ” అయామ్ వెరీ వెరీ సారీ మై చైల్డ్. రియల్లీ వెరీ సారీ”అంటూ కంట నీరు పెట్టుకుంది.
“అయ్యో! అలా అనకండి! నేను కంప్లైంటు చెయ్యడానికి రాలేదు. మావారు వూరెళ్లారు వీడు ఏడుస్తూ రాగానే వేరే ఆలోచన లేకుండా మీ దగ్గరకు పరుగెత్తుకొచ్చాను. నేనే మీకు క్షమాపణ చెప్పాలి.”
“లేదమ్మా కంప్లైంటని నేననుకోవటం లేదు. ఏదో విధంగా నా యింటిలోపలికి వచ్చిన వ్యక్తివి అందరూ నా గురించి ఏమేమో అనుకుంటూ వుంటారు. నా గురించి సింపుల్ గా చెప్పాలంటే, నేను నా భర్త యీ వూరు వచ్చేసరికి నాకు యిరవై ఏళ్లు. నేను నా భర్త పీటర్ ఆఫీస్ వర్క్ అయాక బీచిలో గంటలతరబడి గడిపేవాళ్లం.
మావారికి పిల్లలంటే చాలా యిష్టం.నేను గర్భవతినని తెలిసిన రోజు పీటర్ సంతోషానికి హద్దులు లేవు. ఆరోనెల నడుస్తుండగా మెడిసిన్స్ తేవటానికి సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా జీపు ఆక్సిడెంటయి చనిపోయాడు. నా లైఫ్ లో దురదృష్టకరమైన రోజు. ప్రతిరోజు నాతో అనేవాడు మన యింటి చుట్టూ యింత ప్లేసు వుంది పళ్లచెట్లు వేస్తే పదిమంది పిల్లలు వాటికోసం వస్తారు. వాళ్లే మన బిడ్డకి ఫ్రెండ్స్ అవుతారు అని. అతని కోరిక మీద యీ పళ్ల చెట్ట్లు నాటించాను.”
“మరి మీ బిడ్డ?”
“అది మరొక బేడ్ లక్. పీటర్ పోయిన వార్తతెలిసి తెలివి తప్పి పడిపోయిన నేను మూడు రోజుల తరువాత హాస్పిటల్లో కళ్లు తెరిచాను. డాక్టర్లు నెమ్మదిగా చెప్పారు తెలివి తప్పి పడటంలో అబార్షన్ అయిందని. జీవించడానికి ఆశ ఏమాత్రం మిగల్లేదు. నాపేరెంట్స్ వచ్చి యింగ్లాండు వచ్చేయమన్నారు. నేనిష్టపడలేదు. నా పీటర్ నామీద పెట్టిన బాధ్యత నెరవేర్చడానికి యిక్కడేవుండడానికి నిర్ణయించుకున్నాను. యింత జరిగినా పిల్లలని నేను కసురుతానని మీఅందరికీ నామీద దురభిప్రాయం కాని ఏమాత్రం రెసిస్ట్ చెయ్యకపోతే వాళ్లకి మళ్లీ రావటానికి క్రేజ్ వుండదు. వాళ్లనలా అదిలించగానే వెంటనే వస్తారు. ఈరోజు అనుకోకుండా చేతిలో కర్ర జారి మీ బాబుకి తగిలింది. సారీ అమ్మా సారీ శ్రీధర్!” యింట్లోకి వెళ్లి ప్లేటులో సపోటా పళ్లు కోసి పెట్టి తీసుకోండి అంది.
“అయ్యో ఎందుకు మేడమ్ శ్రమ!” అంది అమ్మ కంగారుగా.
“ఫరవాలేదమ్మా తీసుకోండి” అంది డూడాబాయి.
మొహమాటంగా సపోటా ముక్క తింటూ” నాకో సందేహం మేడమ్! మిమ్మల్నందరూ డూడాబాయి అంటారు మరి మీ పేరు?”
“నా పేరు మేరీ డొనాల్డ్. పీటర్ నన్ను డోడా అంటూ పిలిచేవాడు. అది విన్న యిక్కడివాళ్లు డూడాబాయి అంటూ పిలవడం మొదలెట్టారు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆ పేరే అలవాటైపోయింది. ఇన్ని సంత్సరాలు గడిచాక నా అసలు పేరేమిటో నేనే మర్చిపోయాను.” అంది డూడాబాయిగా మారిపోయిన మేరీ డోనాల్డ్.
అమ్మ, తను ఆ యింటికి వెళ్లడంతో సంతోషం ఆమె కళ్లలో ప్రతిఫలించింది. “ఇక వెళ్తాం” అని లేవడంతో “అప్పుడప్పుడు రామ్మా! నా కాంపౌండు గోడ వరకూ వచ్చేవాళ్లే గాని గేటు లోపలికి ప్రవేశించిన వ్యక్తివి నువ్వే.” అని ఆప్యాయంగా అంది మేరీ.
“తప్పకుండా మేడమ్! శ్రీధర్ని కూడా తీసుకుని వస్తాను.” అంటూ బయలుదేరింది అమ్మ.
ఇచ్చిన మాట ప్రకారం ఆవూళ్లో వున్న నాలుగు సంత్సరాలు అప్పుడప్పుడు డూడాబాయి యింటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు కనుక్కుంటూ వుండేది సుమతి. ఒకసారి భర్తని తీసుకువెళ్లి పరిచయం చేసింది. “మావారు మేడమ్ పేరు సత్యమూర్తి. వెరీ గ్లాడ్ టు మీట్ యు.” అంటూ ఆదరంగా కూర్చోపెట్టింది. యోగక్షేమాలు అడుగుతూ”మీ మిసెస్ కలిసినప్పటినుండి నాకు చాలా క్లోజ్ అయింది. నా జీవితంలో మళ్లీ బంధుత్వాలు ఏర్పడ్డట్లయింది. నాకు కూతురులా అనిపించింది బిడ్డలు లేని లోటు తీరింది సుమతి శ్రీధర్ల పరిచయంతో.”
“మీ అభిమానం మేడమ్ థేంక్స్!” మొహమాటంగా జవాబిచ్చాడు సత్యమూర్తి. “ఇంక నేనెన్నాళ్లు జీవిస్తానో తెలియదు, నా యిల్లు తోట అంతా ఒక హాస్పిటల్గా మార్చటానికి డొనేట్ చేద్దామనుకుంటున్నాను. వాటికి తగిన ఏర్పాట్ట్లు చెయ్యగలరా? ఈ వూర్లో ఒక్క మీ ఫేమిలీతోనే యింత చనువు ఏర్పడింది,” అభ్యర్ధించింది
నాన్నగారు సివిల్ యింజినీరు కావడంతో పదిహేను రోజులు తిరిగి కాగితాలు సిధ్దంచేశారు. ఆమె తదనంతరం ఆ యింటిని హాస్పిటల్ గా మార్చడానికి అగ్రిమెంటయింది. ఆవూర్లో వున్న నాలుగేళ్లు నాలుగు నెలలుగా గడిచిపోయాయి. మేము మరో వూరు వెళ్తున్నామని చెప్పటానికి వెళ్తే ఆమె శ్రీధర్ నుదుటిని ముద్దాడి “పెద్దయాక పెద్ద డాక్టరువై నా హస్పిటల్లొ సేవ చెయ్యి బాబూ! మే గాడ్ బ్లెస్స్ యూ!” అంటూ మనసారా ఆశీర్వదించింది. ఏనాటి అనుబంధమో వూరు వదిలి వెళ్లటానికి గుండె బరువై కళ్లనీళ్లు వుబికాయి.
పధ్దెనిమిది సంత్సరాలు గడిచాక మళ్లీ ఆ వూరి పేరు వినగానే గత జ్ఞాపకాలన్నీ మనసులో మెదిలాయి. ఆ వూరు చేరి హాస్పిటల్లో అడుగుపెట్టిన శ్రీధర్ గోడమీద మేరీ డొనాల్డ్ ఫొటో పెద్దది చందనం మాల వేసి వుంది. ఫోటో చూడగానే “కమాన్ మై చైల్డ్!” అంటూ నవ్వుతూ ఆహ్వానించిన అనుభూతి పొందాడు శ్రీధర్.
ఆ అపరిచితానుబంధానికి శిరసు వంచి నమస్కరించాడు.