అవునా , నిజమేనా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

అప్పటికే అక్కడ మెంబర్స్ అందరూ చేరివున్నారు. శమంత వెళ్ళేసరికి సీనియర్ రచయిత్రులు ఓ వైపు జూనియర్లు మరోవైపు వాళ్ళవాళ్ళ పలకరింపుల్లో మునిగిపోయారు. “హాయ్” అందరికీ ఉమ్మడిగా ఓ చిరునవ్వు విసిరి పెద్దవాళ్ళవైపు తిరిగి చేతులు జోడించింది. “ఎలావున్నావు? ఈ మధ్యన ఎక్కడా కనిపించడం లేదు… నల్లపూసైపోయారు”

ఒక్కోసారి నువ్వు మరో సారి మీరు అనే వాగేశ్వరి చిరునవ్వుతో యోగక్షేమాలు విచారించింది. ఇంతకూ అత్యవసరంగా మీటింగ్ పెట్టుకుందుకు కారణం ఎవరో కోన్ కిస్కా కిషన్ రావు గారి రచనకు అత్యుత్తమ అవార్డ్ నిచ్చి సత్కరించడం. ఆ ఫలానా పుస్తకాన్ని ఈకలు పీకి చర్చించి ఒక ప్రెస్ నోట్ పంపించడానికి.

“ఎంత సిగ్గు చేటు! ఎంత సిగ్గు చేటు! స్త్రీ ని అంతహీనంగా చిత్రించిన పుస్తకానికి ఇంత వున్నత స్థానమా? వీల్లేదు ఈ అరాచకాలను మనం కొనసాగనివ్వరాదు.”

అందుకే అధ్యక్షురాలు అంతగా ఆవేశపడిపోతుంటే ఆమె పెదవులమీద లీలగా ఓ మొలక నవ్వు కదలాడింది. “ఈవిడగారేం తక్కువతిందా? మొన్నామధ్యన యూనివర్సిటీ ప్రొఫెసర్ల చుట్టూ చూట్టూ తిరిగి తిరిగి యూనివర్సిటీ పురస్కారాన్ని దక్కించుకోలేదూ! బాహాటంగానే చెబుతారుగా సాహిత్య సామ్రాజ్యమంతా నా చేతుల్లోనే వుంది నన్ను కాదన్న వాళ్ళు తుడిచిపెట్టుకు పోతారని”

శమంత ఒక శ్రోతలాగేవుండదలచుకుని వచ్చింది. “ఏదేమైనా నోరు విప్పను.” అని ప్రతిన బూని మరీ వచ్చింది. అధ్యక్షుల వారి ఉపన్యాసం అవిరామంగా సాగి పోతూనేవుంది. ప్రతి వాళ్ళనీ తూర్పార బడుతూనేవుందావిడ.

“ఇంతకూ ఆ పుస్తకాన్ని సూచించినది నోబల్ ప్రైజ్ కి నామినేట్ అయిన అవ్వల సోమయాజులు గారూ , సాంస్కృతిక రాయబారి అప్పల నరసింహ మూర్తీ అట..”

ఉలిక్కి పడింది శమంత. అవ్వల సోమయాజులు గారికి వృద్ధరచయిత్రుల్లో చాలామంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పూర్వ విద్యార్ధినులు. ఆరడుగుల పొడుగుతో దబ్బపండు ఛాయతో జిగేలు మనే అతని పట్ల ఆకాలంలో చాలా మందికి హీరో వర్షిప్ వుండేదనేది జగమెరిగిన కొండమీది గోల. పెళ్ళాన్ని ఇంటి గోడలకు కట్టేసి రంగేళీ రాజాలా ఆయన అక్షరాలా పదహారు వేల గోపికల కృష్ణుడయాడని చెప్పుకోవడం అప్పుడు పుట్టిన అమ్మయికీ తెలుసు.

ఇంతకూ వాళ్ళిద్దరికీ, అదే అవ్వల సోమయాజులు గారికీ అప్పల నరసింహం గారికీ , కోన్ కిస్కా కిషన్ రావుకూ సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. కాగల కార్యం మరెవరో తీర్చినట్టు ఎవరో ఆ సందేహాన్ని వ్యక్తం చెయ్యనే చేసారు.”ఆ ఇద్దరికీ వీడు అమ్మాయిలను సప్లై చేస్తాడటా…..” ఎందుకైనా మంచిదని గొంతు తగ్గించి మరీ చెప్పిందావిడ.

అవును మరి రేప్పొద్దున్న తనకు రావలసిన చాలా అవార్డ్ లు ఆయన చేతిలోనే వున్నాయి. తిట్టినా సాక్షం వుండరాదు. వారెవ్వా? ఏమి లింకు! సాహిత్య రంగంలో అత్యుత్తమ అవార్డ్ కూ అందమైన అమ్మాయిలకూ……..ఓహ్! అన్ ఇమాజినెబుల్! ఊహాతీతమైనది.

శమంతకు ముళ్ళ మీదున్నట్టుగా తోచింది. “ఇంతకూ ఇనీషియల్ గా ఆ పుస్తకం లిస్ట్ లో లేదట. దాన్ని పైకి తెచ్చిన మహాతల్లి ఆ ఫెమినిస్ట్ పేరమ్మ అట….. “

ఫెమినిస్ట్ పేరమ్మ – ప్రాస బాగా కుదిరింది మనసులోనే అనుకుంది శమంత. సభలో ఏం చర్చిస్తున్నారనేది ఏ మాత్రం నెత్తి కెక్కడం లేదు. ఆవేశంగా కుచ్చెళ్ళు ఎత్తి దోపుకుని కొంగులు బిగించి యుద్దానికి సిద్ధమైన వారిలా ఉన్నారంతా. ఇంతకూ ఆపుస్తకం చదివిన వాళ్ళు వేళ్ళ లెఖ్ఖలో కూడా లేరు. అక్కడో ఇక్కడో కాస్త విమర్శ చదివి వచ్చిన వాళ్ళే. పుస్తకాన్ని పూర్తిగా చదివిన శమంత నోరు విప్పలేదు_ విప్పదు కూడా.

“ఈ కిషన్ రావు గాడి కో సంస్థ వుంది దాన్నించి ఏటా అవార్డ్ లిస్తాడు. ఇద్దరికి ముందుగానే ఇచ్చేసి మూడో వారికి రాబోయే రోజుల్లో ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు “

శమంతకు మళ్ళీ నవ్వొచ్చింది. సరిగ్గా ఏడాది కిందటా ఇల్లాగే జరగలేదూ! చిన్న సాహితీ సత్కారాలే అయినా “ముందు సీనియర్లకిచ్చి గౌరవిస్తేనే రేప్పొద్దున మీకొచ్చేద” ని తెగేసి చెప్పలేదూ? అంతేనా ఇక్కడున్న పెద్దలంతా అవార్డ్ లు అందుకోలేదూ !! తమ దాకా వస్తే గాని తెలీదనేవారు ఇప్పుడిక దాన్ని మార్చుకుని తమ దాకా వచ్చినా తెలుసుకోరనుకోవాలిలావుంది.

మూడున్నర గంటల మీటింగ్ లో అవార్డ్ లు వచ్చిన వారందరినీ దుమ్మెత్తి పొయ్యడం వాటిని ఇవ్వరాదంటూ ఓ తీర్మానం వ్రాయడం , సంతకాలు, సవరింపులూ ముగిసి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళేసరికి రాత్రి పది దాటింది.

ఇంటికి వచ్చినా శమంతకు నిద్ర పట్టలేదు. చిన్నప్పటినుండీ అంతో ఇంతో చదివే అలవాటు దాంతో పాటు అదో ఇదో రాసుకోవడం తన మరో సహజ స్వభావంగా మారి పోయింది. చాలా రోజుల పాటు రచనలు అక్కడా ఇక్కడా ప్రచురితమైనా అంతో ఇంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఇలాంటి రచనా రాజకీయాలగురించి అంతగా తెలీదనే చెప్పాలి.

గుట్టు చప్పుడుగా రాసుకోవడం ఒకటో రెండో అచ్చులో వస్తే పొంగిపోవడం పదో పరకో ఎవరైనా పారితోషికంగా పంపితే ఆనందించడం తప్ప సాహిత్యానికీ దాని గుర్తింపుకూ మరో దగ్గరి దారి ఉంటుందనేది ఆమె ఊహకందని విషయం.

ఈ ఐదారేళ్ళుగా సాహితీ పరిచయాలు వాటి వెనక పరమావధులూ గమనిస్తుంటే బాధా విచారంతో పాటు విస్మయంగానూ వుంది. ప్రపంచం ఎక్కడికెళుతోంది? మనం పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా అనేది అర్ధం కాకుండా వుంది. ఎంతమరచి పోదామన్నా మనసును కలత పెడుతున్న జ్ఞాపకం ఊడలుదిగి హృదయంలో పాతుకుపోయి అప్పుడో ఇఫ్ఫుడో సలుపుతూనేవుంది.

ఆ రాచపుండును కూకటి వేళ్ళతో ఎలా స్మాష్ చెయ్యాలి? ఇల్లూ వాకిలి పిల్లా జెల్లతో బిజీ గా ఉన్నప్పుడు ఎలాగూ తప్పలేదు…. తీరిక వేళల్లో ఏఅర్ధరాత్రో రాసుకుని అచ్చయినప్పుడు ఆనందపడటం ..అందుకే బాధ్యతలు తీరి కాస్త తెరిపి చేసుకున్నప్పుడు ఇలా ఎవరైనా సహిత్య సమావేశాలకు పిలిస్తే భావాలు కలబోసుకోవచ్చని కొత్త విషయాలు తెలుసుకోవచ్చని మనసు గదుల్ను సువిశాలం చేసుకోవచ్చనీ అంగీకరించింది.

అలాంటి సమావేశం ఒకటి ఆగ్రా లో జరుగుతున్నప్పుడు అప్రయత్నంగానే వెళ్ళడానికి సంసిద్దపడింది. ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని గొప్పదాన్నై పోదామన్న కోరిక కన్న ఆగ్రా చూడాలన్న తపన నలుగురితో సరదాగా గడపవచ్చన్న ఆశే ఎక్కువ.

కాని ఒకరిమీద ఒకరికున్న తామస ధోరణి ఎదుటి వారిని దుమ్మెత్తి పోసి తాము మంచివాళ్ళమని చాటుకునే తత్వం చదువుకుని విద్యాధికులైన వారిలో, అదీ సమాజాన్ని సంస్కరించగల రచయితత్రుల్లో చూసాక అవునా ఇది నిజమేనా అనిపించింది. అంతేనా విలువల వలువల్ను వదిలేసుకుని విచ్చలవిడిగా సంచరించడం తమ ప్రయోజనం కోసం ఎదుటీ వారిపై ఎంతటి నింద మోపడానికైనా సిద్ధపడటం పైకి అందంగా కనిపించే మేడి పండులా తోచింది సాహిత్యమనే వ్యాపార జగత్తు. ముఖ్యంగా ఆ సభల్లోనే “ఈ మొగుడు లేని ముండలందరూ పిలవగానే పరుగెత్తుకు వస్తారని” రచయిత్రులను దూషించడం మనసును కలచివేసింది.

ఏం చెయ్యాలి ? ఏం చెయ్యగలను ఈ చీడ కోసం ఎలాంటి పురుగులమందు వాడాలి ? ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది శమంత. కలత నిద్ర లోనూ సాహిత్య రాజకీయాలు అవార్డ్ లు మీటింగ్ లే.

అయిష్టంగా ఆరున్నరకు లేచి పేపర్ అందుకుంటూనే ఉలిక్కిపడింది మొదటి పేజీ లో పెద్ద కలర్ ఫొటోతో పాటు కుడి వైపున ఆకర్షణీయంగా కనిపిస్తున్న వార్త చూసి.

రచయిత్రుల అధ్యక్షురాలికి జీవిత కాల సాహితీ సాధనకు గాను సాహితీ పురస్కారం..అద్వితీయ మైన కోన్ కిస్కా కిషన్ రావు లక్ష రూపాయల అవార్ద్! ఆ పక్కనే కోన్ కిస్కా కిషన్ రావు పెద్ద మనసును పొగుడుతూ ఆవిడ స్టేట్మెంట్.

అప్రయత్నంగానే శమంత గట్టిగానే అనుకుంది ” అవునా , నిజమేనా?”

 

Your views are valuable to us!