చిన చేపను పెద చేప
చిన మాయను పెను మాయ !!
చిరంజీవ చిరంజీవ… సుఖం లేదయా !!!!
మల్లేసు ఒక చిన్న దొంగ.
మంత్రిగారి ఫార్మ్ హౌస్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అదే సమయంలో మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు.
“వీడే సార్, మన ఫారం హౌస్ లో ఉన్న సామాను గదిలోకి చొరబడ్డాడు!”
“ఏరా ఎదవా! ఇదేవరిదో తెలిసే వచ్చావా?”
“అయ్యా పోరాపాటై పోయింది మన్నించండి”
“అంటే తెలిసే వచ్చావ్ “
“ఆయ్”
“నీకో పని ఇస్తాను చేస్తావా? ఏంటి! “
“అయ్యా, మీరు దేవుడయ్యా, మీరు ఏపని చెబితే అది సేత్తానయ్యా!”
“ఒరేయ్ అప్పన్న! ఈడ్నిరేపటినుంచి మన ఇంటికి రమ్మని చెప్పు. మన బళ్ళు తుడుస్తాడు.”
“అల్లాగేనయ్యా “
“నడవరా ఎదవా! అయ్యగారు దేవుడు కాబట్టి నిన్ను వదిలేసారు!” అని అప్పన్న మల్లేసుని తోలుకొని ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళాడు అప్పన్న.
ఒక్క పది నిముషాలలో ఒక విలేఖరి ఫార్మ్ హౌస్ కు వచ్చాడు .
లైవ్ లో కధనం :
Flash Flash: “పట్టుబడిన దొంగకు ఇంట్లో కొలువు – ఫలానా మంత్రిగారి దయాగుణం”
Scroll…Scroll…”మంత్రి గారు తన ఫార్మ్ హౌస్ లో దొంగతనం చేస్తూ పట్టు బడ్డ మల్లెసుకి తన ఇంట్లో ఉద్యోగం ఇచ్చారు. “
పట్టుబడిన మల్లేసు తో ఇంటర్వ్యూ, పట్టుకున్న అప్పన్నతో ఇంటర్వ్యూ, ఉద్యోగంలో పెట్టుకొన్న మంత్రిగారి జీవిత చరిత్ర పఠనం. మొత్తం పదిహేను నిముషాల వీడియోను నూటా యాభైసార్లు రీలు తిప్పిన న్యూస్ ఛానల్. దాన్నే కాస్త అటుదిటుగా మార్చి చెప్పుకొన్న మిగతా ఛానల్స్. మొత్తాని ప్రతి న్యూస్ ఛానెల్ ఆ బ్రేకింగ్ న్యూస్ మొట్టమొదటగా తమ ఛానల్లోనే వచ్చినట్టు డప్పు కొట్టేసుకొన్నారు.
“ఒరే మల్లేసూ! ఆ పనిని నువ్వు చాల తెలివిగా చేసావురా. ఇంకో గొప్ప పని ఇస్తాను చేస్తావా?” రమ్ముని నీటుగా గ్లాసులోకి వొంపుకొంటూ అడిగారు మంత్రిగారు.
“అయ్యా, మీ ఉప్పు తింటున్నాను. మీరేది సెప్పిన సేసేత్తాను. మరి గొప్పపని ఇత్తే పేణం పోయినా సేసేత్తాను.” విధేయత కూడా సిగ్గుపడేంతగా వొంగి పలికాడు మల్లేసు. ఈ మధ్యన వాడికి కాస్త కండలు, జబ్బలు పెరిగాయి గామోసు ఆ పాత చొక్క సంకల్లో ఇరుక్కుపోయింది.
“నీ వినయం చూసి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయిరా. నువ్వు చేబోయేది గొప్పపని గదా, ఈ వేషం పనికిరాదు. నువ్వు కొద్దిగా వేషం మార్చాలి. మన సినిమా మేకప్ ఆర్టిస్టు నీకు రంగులు పూస్తాడు. సాయంత్రం నేను చెప్పినట్లు చెయ్యి!”
మంత్రిగారు వాళ్ళ బావమరిది చేత సినిమాలు కూడా తీయిస్తారు. మొత్తం సినిమా లోకంలా ఉంటుంది ఒక్కో సారి వాళ్ళ ఫార్మ్ హౌస్.
మల్లేసుకు చాలా రకాల వేషాలు వేసి, గొప్ప గొప్ప పనుల్ని చాలా చాకచక్యం గా చేయించారు మంత్రి వర్యులు. మల్లేసు మంచి ఉద్యోగ భద్రతతో మంత్రి గారి ఇంటిలోనే కార్లు తుడుస్తూ ఉన్నాడు.
మల్లేసు పనుల్లో గొప్పదనం పెరిగేకొద్దీ మంత్రిగారి ఐశ్వర్యం పెరిగిపోతూవుంది…శిశిపాలుడి చీవాట్ల చిట్టా పెరిగేసినట్టు. మల్లేసు కూడా అయ్యగారిచ్చిన ప్రతి పనిలోనూ తల వరకూ మునకేసి చాల మెళకువలు నేర్చేసుకొన్నాడు. ఇప్పుడు మల్లెసు లెవెల్ ఐ ఫోన్ వరకూ వచ్చేసింది. వాడు అయ్యగారికి తెలియకుండా ఆయన వాడితో మాట్లాడే మాటల్ని, అప్పజెప్పే ’గొప్ప’ పనుల్నీ రికార్డు చేయడం మొదలుపెట్టాడు.
ప్రతి గొప్ప పనికి వెళ్ళేముందు మేకప్పు వేసే వాడిని సరదాగా ఆటపట్టిస్తూ, వాడి చేత మేకప్ రహస్యాల కూపీ లాగడం మొదలుపెట్టాడు. ఎదురుగా టేబుల్ మీద నిలువుగా నిలబడున్న ఐఫోన్ నిశ్శబ్దంగా వీడియోలు తీయడం మేకప్పోడికి తెలిసేది కాదు. ఇలా సందు దొరికినప్పుడల్లా సమాచారం రహస్యంగా సేకరించి తన డబ్బుతో కొనుక్కొన్న రెండో ఐఫోన్ లో దాచేవాడు. ఆ ఫోను తన దగ్గరుంటే ప్రమాదమని దానిని తన ప్రియురాలి దగ్గర ఉంచేవాడు. (అవును, మల్లేసుకు ఇప్పుడు చాలా ’ఎగస్ట్రా’ ఫిటింగులున్నాయి)
ఓరోజు ప్రియురాలి అద్దె వొడిలో పడుకొని, అది అరువు ముద్దుల్ని వొలికిస్తుంటే “సుక్కా! ఒకేళ నా గొప్ప పనుల్ని సూసి కన్నుకుట్టినోళ్ళెవ్వరైనా నన్ను పట్టేసుకుంటే, ఇద్గో ఈ పోన్ను ఆ ఫలానొక్క మంత్రిగారికి నువ్వే వెళ్ళి గబుక్కునిచ్చేయాల!” అన్నాడు తన స్వంత ఐఫోన్ ను చూపిస్తూ.
“అదేంటి మల్లేసూ! ఆ ఫలానొక్క అయ్యగారికి, మీ అయ్యగారికీ తూతూ మైమై అంటకదా?” లేని నిజాయితీని అసహ్యంగా వొలకబోసింది సుక్క.
“సెప్పినట్టు సెయ్. సరిత్ర అడక్కు!” అన్నాడు మల్లేసు.
దొంగ కే తెలుసు దొంగ మనసు .
మంత్రిగారు మల్లేసుకు పురమాయించే ’గొప్ప’ పనుల్ని పనికిరాని ఈ సమాజం, కోరల్లేని చట్టం “నేరం” అని పిలుస్తూవుంటాయి. మల్లేసు “నేరాలు” తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మల్లేసుకి తన గొప్పదనంపై రోత పుట్టడం మొదలైంది. కానీ అయ్యగారి పిడికిలి పట్టును వదిలించుకోవడం అంత సులభం కాదు. పైగా తన గొప్పదనమే తన పుట్టికి పెట్టిన చిల్లు అని తెలుసుకొన్నాడు. ఇప్పుడు అయ్యగారిపైనా, సుక్క పైనా లోలోపలే విసుక్కోవడం మొదలుపెట్టాడు.
తను లోపల తిట్టుకొనేది అయ్యగారికెలా తెలుస్తుందిలే అనుకొన్నాడు వాడు. కానీ పాముచెవుల అయ్యగారికి అన్నీ తెలుస్తూనేవున్నాయి.
రెండు నెలల తరువాత ..
“ఒరేయ్ మల్లేసు! నువ్వు కొన్ని రోజులు బెజవాడ వెళ్రా…రేపే వెళ్ళు. ఆ చంటిగాడిని డ్రైవ్ చేయమను. నువ్వు చెయ్యకు. ఇక్కడ పరిస్థితులు కొంచం బాగాలేదు.” అన్నారు మంత్రిగారు.
“అలాగే అయ్యగారు! “
మొదటిసారి మల్లేసుని ’గొప్ప’ పనేమీ ఇవ్వకుండా అంత దూరం పంపుతున్నాడు మంత్రి. మల్లేసుకు తేడా తెలిసిపోతోంది.
మొన్న చేసిన ’గొప్ప’ పని…అదే నేరం…చాల పెద్దది. అసలు విషయం ఏమాత్రం పైకి పొక్కినా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటివరకూ చేసిన 85 నేరాలకూ పోలీసులు 85 మంది అనామకుల్ని పట్టుకొని నేరం మోపారు. ఇప్పుడు తన ’గొప్ప’ పనిలో ప్రాణం పోగొట్టుకొన్న సదరు వ్యక్తి అయ్యగారి పార్టీలో పెద్ద సీనియరు, కాబోయే ముఖ్యమంత్రినూ. చచ్చిపోయిన సీనియరు తరువాత తమ అయ్యగారే సీనియర్. అయ్యగారు చేయించింది మహా ’గొప్ప’ పనే. అందుకే ఇన్ని జాగ్రత్తలు!
ఉదయాన్నే చంటి కారు లో బయలుదేరాడు మల్లేసు. వెంట ఒక భారీకాయుడు ఉన్నాడు. మల్లెసు మనసు కీడు శంకించింది.
సూర్యపేట చేరగానే ఒక దారి పక్క దాబాలో టీ కోసం ఆగితే ఆ ధృఢకాయుడు “మీరు వెళ్ళండి. నేను రాను” అని చెప్పి కార్లో ఉండిపోయాడు.
మల్లేసు, డ్రైవర్ చంటి దాబాలోకి వెళ్లారు. ఎదురుగా వున్న టివీలో న్యూస్ ఛానల్ పెట్టారు. ఐదు నిముషాల్లో టీ వచ్చింది. అంతలో ఛానల్లో పెద్దక్షరాల్లో ఒక నిప్పు వార్త…Flash news – “మల్లేసు అనబడే ఒక పనివాడు మంత్రిగారి అల్పాహారంలో విషం కలిపి పరారు. మంత్రి పరిస్థితి విషమం. మల్లేసు కోసం పోలీసుల గాలింపు.”
మల్లేసుకు ఈ వార్త చూసి గుండె జారిపోయింది. అయ్యగారే ఆ ఫ్రూట్ జ్యూస్ ను ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొని రమ్మని చెప్పారు. తను తెచ్చాడు. గ్లాసులో పోసివ్వమన్నారు. పోసి ఇచ్చాడు. కానీ టీవీలో తను మంత్రిగారికి ఇస్తున్న సీన్ మాత్రమే చూపిస్తున్నారు. అది CCTV లో రికార్డు. చూపిందే చూపుతున్నారు టివివాళ్ళు !!
అంతలోనే తనతో పాటే వచ్చిన ఆ ధృఢకాయుడు దాబాలో ప్రవేశించి మల్లేసుని పట్టుకోబోయాడు. మల్లేసు తప్పించుకొని పారిపోయాడు. అంతే ఆ ధృఢకాయుడు పిస్టల్ తో మూడు రౌండ్స్ కాల్చాడు.
మల్లేసు కుప్ప కూలిపోతూ ఐఫోనులో ఏదో నెంబర్ నొక్కి ప్రాణం వదిలాడు.
ఆ రాత్రే ప్రియురాలు సుక్క మల్లేసు చెప్పినట్లు ఆ టివీ ఛానల్ కు వెళ్లి మల్లేసు సొంత ఐఫోన్నిచ్చి అందులోని మొత్తం డాటాను డౌన్లోడ్ చేసుకోమని చెప్పింది. తను చేస్తున్నదంతా పెన్ కెమెరాలో బంధించింది.
మల్లేసు రహస్య వీడియోల గురించి మంత్రిగారికి విషయం చేరవేసింది సుక్కే. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన ఆమె నుంచి సమాచారం అందుకొన్న మంత్రి మల్లేసును లోకం నుంచే తప్పించాడు. మల్లేసు అర్థాంతరపు, అన్యాయపు చావు సుక్కలో మార్పు తెచ్చింది. మంచితనం అప్పుడప్పుడూ బ్రతికి వస్తూవుంటుందని నిరూపించింది.
అన్ని పనుల్నీ మల్లేసు కోరినట్టే జరిపించింది సుక్క.
ఆ వ్యతిరేక వర్గపు మంత్రి మరునాడు తనకు దొరికిన సాక్షాలతో మల్లేసుని ఆదరించిన మంత్రి చేరిన హాస్పిటల్లో హాజరయ్యాడు. రెండు గంటల పాటు తలుపులు మూసి చర్చ నడిపాడు. లోగుట్టు చర్చల తర్వాత ఆ వ్యతిరేక వర్గం మంత్రి కిమ్మనకుండా ఉండిపోయాడు.
మరునాడు సుక్క నుంచి మల్లేసు సీక్రెట్ వీడియోలు అందుకున్న టీవీ ఛానల్ అధినేత ఆ వ్యతిరేక వర్గం మంత్రి ఇంటికి వెళ్ళడం. అంతే, ఆ ఛానల్ కూడా కిమ్మనకుండా ఉండిపోయింది.
మొత్తం సంగతుల్నీ గమనిస్తూనే వుంది సుక్క.
మూడు రోజుల తర్వాత….
ఉదయం 9 గంటలకు మరో టివీ ఛానల్లో మల్లేసుతో మంత్రి చేయించిన నేరాల బాపతు సంభాషణలు, మేకప్ మ్యాన్ మాటలు, చిత్రాలు, వీడియోలు ఒక్కొక్కటే బయటపడ్డాయి. దానితో పాటు మల్లేసు ప్రియురాలు ఈ వివరాల్ని మొదటగా టీవీ ఛానల్ కు ఇస్తున్నట్టుగా చిత్రీకరించిన స్టింగ్ వీడియోను చూపించడం మొదలుపెట్టింది మరో టీవీ. ఆ పై వ్యతిరేక వర్గం మంత్రిని కలవడానికి మొదటి టీవీ అధినేత వెళ్ళడంపై ప్రశ్నలను లేవనెత్తసాగింది.
చిన్న నేరగాళ్ళను బడా నేరస్తులుగా మార్చే రాజకీయుల్ని, అరాచకాల పై అరువు గొంతును తెచ్చిపెట్టుకొని అరిచే కుహనా మీడియాను, ప్రజాహితం కోసం కాక స్వప్రయోజనాల కోసం అన్ని విలువల్నీ తాకట్టు పెట్టే ప్రతి ఒక్కరి అసలు రంగునూ ఒక్కదెబ్బతో బైట పెట్టిన మల్లేసును “భళా మల్లేసు” అని చాలమంది అనుకున్నారు.
ఇప్పుడు మల్లేసు చచ్చి బ్రతికినవాడు!