అవి మా చిన్నబ్బాయికి సంబంధాలు చూస్తున్న రోజులు. ముంబై వచ్చిన కొత్త. పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. ఏ అమ్మాయి వివరాలు వచ్చినా మా వూరి పురోహితునికి అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపేవారు మావారు. అవి పరిశీలించి కుదిరింది లేనిది వుత్తరం రాసేవారు. ఈ తతంగానికి పదిహేను యిరవై రోజులు పట్టేది. ఇలా లాభం లేదని జాతకాలు కొరియర్ చేసేవారు. ప్రతి జాతకంలో ఏవో లోపాలు చెప్పేవారు పురోహితుడు. చూస్తూ చూస్తూ జాతకం కుదరలేదని తెలిసి ఎలా చేస్తాం?
ఈ కొరియర్లు, పోస్ట్ కోసం ఎదురు చూపులు గమనించి మా అబ్బాయి (అదే పెళ్ళి కొడుకు) “జాతకాలు మేచ్ చేసే సాఫ్ట్ వేర్ వుంది. అది మన కంప్యూటరులో డౌన్ లోడ్ చేస్తాను. జాతకాలు సరిపడ్డాయో లేదో మనమే చూసేసుకోవచ్చు. మ్యాచ్ అయిన సంబంధం వివరాలు పురోహితునికి పంపి తెలుసుకుంటే సులువవుతుంది కదా! మీ యిద్దరి కష్టాలు చూడలేకపోతున్నాను.”అంటూ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేశాడు.
ఆదివారం వుదయం…
“అమ్మా! అమ్మాయివి నావి వివరాలు యిస్తే మేచ్ చేసి చూస్తాను “అన్నాడు.
“అయ్యో! నిన్ననే వాళ్ళ జాతకం తిప్పి పంపేశాము. ఏ అమ్మాయి జాతకం లేదు. మళ్ళీ ఎవరివైనా వస్తే చూద్దాం.” అన్నాను.
ఇన్ స్టాల్ చేశాక ఎవరిదో ఒకరిది చూసేదాకా మావాడికి తోచలేదు.
“మాయిద్దరివీ మేచ్ చెయ్యడం ఎందుకురా? పెళ్ళై నలభై ఏళ్ళయింది ముగ్గురు మనుమలు పుట్టారు యిప్పుడు చూసేదేముంది? అవ్వ! నవ్విపోతారు” నోరు నొక్కుకున్నాను.
‘ఏమీ ఫరవాలేదు. యీ మేచ్ చెయ్యడం ఎంతవరకు నమ్మవచ్చో తెలుస్తుంది. మీ యిద్దరిదయితే సందేహం వుండదుకదా రాసివ్వమ్మా!” అనునయించాడు.
రాసి యిచ్చాను.
@@@@@
“ఒరేయ్ స్నానం, ధ్యానం చేసి ఆ పని చెయ్యి!”
నవ్వుతూ “ఆల్రెడీ పెళ్ళైపోయింది. స్నానం చెయ్యకున్నా తప్పులేదు.”అంటూ వివరాలన్నీ ఒకటీ ఒకటీ ఎంటర్ చేస్తున్నాడు.
ప్రక్కన కూర్చుని విచిత్రంగా చూస్తున్నాను. కంప్యూటరు ఏం చెపుతుందోనన్న ఆతృత.
కాలింగ్ బెల్లు మోగితే తలుపు తియ్యడానికి వెళ్ళాను. పని మనిషి వచ్చింది.
లోపలికి వస్తూండగానే “అమ్మా!”అని గావు కేక పెట్టాడు.
“ఏమయింది చెప్మా! మా గణ మేళన అంత అద్భుతంగా చూపిందా కంప్యూటరు?” అనుకుంటూ ఒక్క అంగలో వెళ్ళాను.
మావాడు పడీ పడీ నవ్వుతూ కంప్యూటరు స్క్రీను వైపు చూపించాడు.ఏముందా అని చూస్తే….NOT SUITABLE FOR MATCH
ఆ….
నోట మాట రాలేదు. యిప్పుడు నాట్ సూటబులా! అల్లుడొచ్చి, కోడలొచ్చి ముగ్గురు మనుమలు పుట్టి పెళ్ళైన నలభై ఏళ్ళకి నాట్ సూటబులా? “యిది అసంభవం కంప్యూటరు మేచింగు తప్పు” అన్నాను.
“అలా తప్పులు దొర్లవు, ఎందరో మేధావులు కష్టపడి తయ్యారు చేసిన ప్రొగ్రాం. మీ పెళ్ళికి పురోహితుడు లంచం పుచ్చుకుని వుంటాడు.” సాఫ్ట్ వేర్ ఇంజనీరు తప్పు ఒప్పుకోలేదు.
“మరి యిన్ని సంవత్సరాలయా కాపురం చేస్తున్నాం కదురా?”అన్నాను కంప్యూటరు చెప్పినది రుచించక.
“అక్కడే వుంది కిటుకు జాతకాలు సరిపోయాయంటే అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. అవి కుదరలేదంతే మన ఆలోచనలు వేరేగా వుంటాయి. ఇవాన్నీ అంత డీప్ గా తీసుకోనవసరం లేదు అనడానికి మీ యిద్దరే నిదర్శనం.”
ఆ షాక్ నుంచి తేరుకుందికి గంట పట్టింది.
@@@@