పాము భయం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి…పాము పాము”అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని “ఎక్కడ?ఎక్కడ?” అంటూ యింట్లోకి దూసుకెళ్ళాడు.

భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి, నోట మాట రాక, పాము దూరిన వైపు చేయి చూపింది సోమిదేవమ్మ. పాతకాలం యిల్లు, పట్టపగలైనా వెలుతురు తక్కువగావుండి మసకగా వుంది.

ఏ సామాన్ల సందులో యిరుక్కుందో తెలియదు. ఎంత ప్రమాదమైన పామో తెలియదు. ఒక గది లోంచి వేరే గదిలో దూరిందా? వంటింటిలో ప్రవేశించిందా? పాపం ఒక్కామె యింట్లో వున్నట్టుంది అనుకుంటూనే కరీంభాయ్ “లైటు స్విచ్ ఎక్కడమ్మా?”అని అనగానే తన తల దగ్గరున్న స్విచ్ వేసింది సోమిదేవమ్మ.

ఆ గదిలో సామాన్లు ఎక్కువ లేవు కాబట్టి దాక్కొనే అవకాశం లేదు. పక్క బెడ్రూములో పెట్టెలు జరిపి, మంచం కింద చూశాడు. ఎక్కడా కనిపించ లేదు. ఇక వంటింటిలో దూరి వుంటుందనుకుని అక్కడా వెతకడానికి అడుగు ముందుకు వేశాడో లేదో

“ఆ! ఆ! లోపలికెళ్ళకు మడి వస్తువులన్నీ మైల పడిపోతాయి!” అన్న సోమిదేవమ్మ అరుపులు వినబడ్డాయి.

“అయితే పాముతో పాటే వంటిట్లో పని చేసుకుంటారా అమ్మా? ఒక్కరే వున్నట్లున్నారు. విషం పామయితే ప్రమాదం కదా? మైల పడితే మళ్ళీ మడి చేసుకోండి.” అంటూ వినిపించుకోకుండా వంటింట్లో జొరపడ్డాడు కరీంభాయ్. చేసేది లేక నిలువు గుడ్లేసుకుని చూస్తుంటే “అమ్మా! మీరు మంచం మీద కాళ్ళు పైన ప్ట్టుకుని కూచోండి పాము దొరికాక మిమ్మల్ని పిలుస్తాను .”

“అయ్యో! నన్ను పిలవడమెందుకు? దాన్ని చంపేయ్! నా కసలే పాములంటే చచ్చే భయం.” అని అంటూ మంచం మీద మఠం వేసుకుని కూర్చుంది సోమిదేవమ్మ .

అది వంటిల్లా? ఘోరమైన యుధ్ధరంగంలా వుంది. నీళ్ళ ఎద్దడి నుంచి నాలుగు బిందెల నీళ్ళు పట్టి వున్నాయి. పప్పులు, బియ్యం, మిగతా వంట సామాన్లు పోసుకున్న డబ్బాలకు లెక్క లేదు. “ఎంతమంది వుంటున్నారో మరీ – యిన్ని సామాన్లా?”అనుకున్నాడు కరీం భాయ్. ఒక్కొక్క సామాను జరుపుకుంటూ పోతే వంట గట్టు కింద చివర వూరగాయ జాడీలు ఏదెనిమిది వున్నాయి. వాట్ని కదిలించబోతే ‘బుస్స్!’మన్న శబ్దం వినిపించింది.

“అమ్మగారూ! దొరికింది”అన్న మాట వింటూనే ఒక్క అంగలో వంటింట్లోకి వచ్చి “ఎక్కడ?” అంది సోమిదేవమ్మ.

“యిదిగో యీ వూరగాయ జాడీల వెనుక..”

“అయ్యో! అయ్యో! నా మడి ఆవకాయలన్నీ మండిపోయాయి. ఈ పాముకేం పోయేకాలమొచ్చిందో నా ఆవకాయ జాడీల దగ్గిరే చోటు దొరికిందా? ఏడాదంతా ఎలా గడపాలి? ఆవకాయలేందే ముద్ద దిగదే నా ఖర్మ!”

“ఇంతకూ చంపాలా లేక అలానే వదిలేయనా? వేగంగా చెప్పండి నాకవతల పని వుంది.” అని తొందరపెట్టాడు కరీం భాయ్.

“బాబ్బాబు చచ్చి నీ కడుపున పుడతాను. మావారు వూరు వెళ్ళారు. వారు వచ్చే దాకా వంటింట్లో పాముతో నేనెలా వుండాలి? చంపేయ్ బాబూ నీకు పుణ్యముంటుంది.” వేడుకొంది సోమిదేవమ్మ.

“సరే! మరి ఆలోచించకుండా మీరు బెడ్ రూము తలుపేసుకుని కూర్చోండి. రెండు నిముషాల్లో దీని పని పూర్తి చేస్తాను.” హామీ ఇచ్చాడు కరీం భాయ్.

అయిదు నిముషాలు కష్టపడి జాడీలు అటూ ఇటూ జరిపి పాముని చంపాడు కరీం భాయ్.

“అమ్మా! పాము చచ్చింది. బయటికి రండి. పెద్దగానే వుంది.” అనగానే తలుపు తెరుచుకు ఒక్క ఛెంగులో బయటికి వచ్చింది సోమిదేవమ్మ. చచ్చిన పాముని చూసి నిశ్చింతగా నిట్టూర్చింది.

“దాన్ని బయట పారేయ్ నాయనా! ఎంతైనా పామనగానే భయపడి మనకి హాని చేస్తుందో లేదో గాని దాని ప్రాణం మనం తీసేస్తాం.” అని ఓ సన్నాయి నొక్కు నొక్కింది.

కరీం భాయ్ చచ్చిన పాముని దూరంగా పారేసి కర్ర గోడవారగా పెడుతూంటే, సోమిదేవమ్మ యాభయ్ రూపాయలు చేతిలో పెడుతూ “మైల పడ్డవన్నీ పారేసి మళ్ళీ స్నానం చెయ్యాలి. నీ వుపకారాం మార్చిపోలేను నాయనా.”

పై మాట వినగానే”అమ్మా! మీరు పారేయదల్చుకున్నవేమిటో చెప్తే, రిక్షా తెచ్చుకుని నేను పట్టుకెళ్ళి పోతాను. పిల్లలవాడిని మీ పేరు, పాము పేరు చెప్పుకుని నాలుగు రోజులు తింటాం. బయట పారేయకండి.” అని ఆగి, ఆ వెంటనే “అమ్మా! అన్నట్లు, కొంతసేపు ముందు చచ్చి నా కడుపున పుడతానన్నారుకదా? మీ సామాన్లు ఎలా మైల పడ్డాయి? నేను ముట్టుకుంటే మైల పడ్డాయా? పాము ముట్టుకుంటే మైల పడ్డాయా? నేను కాక ఎవరొచ్చినా యివన్నీ తీసి పాముని చంపుతారు.” అంటూ ఆమె యిచ్చిన యాభయ్ రూపాయలు తీసుకున్నాడు.

సోమిదేవమ్మకి అర్ధం అయింది ప్రాణ భయం వున్నప్పుడు మాట్లాడిన మాటలు భయం తీరాక వుండవని. “ఆగాగు నీ పిల్లల కోసం కాస్త ఆవకాయ పొట్లం కట్టి యిస్తాను. మరెప్పుడూ యిలా మాట్లాడను. యిలాంటి సంఘటనలు నాలుగైదు ఎదురైతే నా ఛాదస్తం తగ్గుతుందేమో!”

ఆవకాయ కాస్త పెద్ద పొట్లమే కట్టి యిచ్చింది సోమిదేవమ్మ. సంతోషంగా తీసుకున్నాడు కరీం భాయ్.

మర్నాడు సాయంత్రం ఆమె భర్త అవధాని వూరినుంచి వచ్చాడు. కాఫీ చేసి గ్లాసుల్లో పోసి వీధి అరుగు మీద కుర్చీల్లో కూర్చుని తీరికగా పాము దూరిన వుదంతం భర్తకి వివరిస్తోంది సోమిదేవమ్మ. ఇంతలో కరీం భాయ్ అటుగా వెళ్తుండటం చూసి “యిదిగో అబ్బాయ్! మాట ఒకసారి యిలా రా !”అంటూ సోమిదేవమ్మ పిలిచింది.

“మళ్ళీ పాము వచ్చిందేమిటమ్మా? పిలుస్తున్నారు.”

“లేదు నాయనా మా వారు యిప్పుడే వూరినుంచి వచ్చారు. నీ గురించే చెప్తున్నాను. అనుకోకుండా నువ్వు కనిపించావు. నిన్ను మావారికి చూపిద్దామని పిలిచాను. యితడేనండీ నిన్న ఎంతో సాహసంతో పాముని చంపాడు.”

“చాలా సహాయం చేశావు నాయనా! సమయానికి దేవుళ్ళా వచ్చి మా ఆవిడ భయం పోగొట్టావు .”

“దానిదేముంది బాబూ! ఎవరయినా అంతే చేస్తారు.అన్నట్లు అమ్మగారూ మీ వూరగాయ తిన్నాక తెలిసింది అంత రుచి గల వూరగాయ తినలేకపోయినా వాసనయినా చూద్దామని వచ్చి వుంటుంది ఆ పాము. పాపం దానికి ఆయువు మూడి పోయింది.”

“భలేగా చెప్పావు భాయ్! నీ మేలు మర్చి పోలేము.”అన్నాడు అవధాని నవ్వుతూ.

“వస్తాను బాబూ శలవు” అంటూ నిష్క్రమించాడు కరీం భాయ్.

Your views are valuable to us!