“పదయ్యింది లేవండీ..ఆఫిసు లేదా?” – సుప్రభాతం.
“లేదే సెలవు పెట్టా మిగిలిపోతున్నాయి సెలవులు”.
“ఏమంత రాచకార్యముందనీ..?”.
“ఉన్నవి వాడుకొటానికేగా..హాయిగా తిరిగొస్తా”.
గబగబా లేచి టిఫిన్ తిని బయలుదేరా. సెలవెందుకు పెట్టానో తెలిస్తే..పగలబడి నవ్వుతుంది. ఎవ్వరికి చెప్పినా వెర్రోడికిందే జమకడతారు. అందుకు సంసిద్దమయ్యే బయలుదేరా.
కాళ్ళు తిన్నగా మునిసిపల్ స్కూల్ గేట్ దగ్గరాగాయి. అబ్బా! సరిగ్గా 50 ఏళ్ళు ఆస్కూల్ వదిలి.
జీళ్ళు ,తేగలు ,అమ్మే ముసలమ్మ స్థానం ఖాళీగాఉంది.
కొత్త భవనాలు లేచినా పాతభవనం చెక్కు చెదరలేదు. కోనేటి గట్టు..ఆడిన ఆటలు..ఒక్కొక్కటి మళ్ళీ పరకాయ ప్రవేశం చేసాయి.
పరిసరాలు పలకరిస్తుంటే మెల్లగా నడిచాను ఆఫీస్ వైపు.
ప్రధానోపాధ్యాయుడు. గది దగ్గర ఆగాను.
“పోవటమా..మానటమా..” – తటపటాయింపు.
ఇంత దూరం వచ్చి ఆగితే…. అదో వెలితి..లోపలికెళ్ళాను..
“నమస్కారం..”
“రండి కూర్చోండి” అంటూ కుర్చీవేపు తలూపాడు.
కూర్చొన్నా.
“చెప్పండి” అంటూ సూటిగా చూసాడు.
మళ్ళీ “నమస్తే” అని., నా పేరు చెప్పా!
“నాకు కొన్ని పాత వివరాలు కావాలి ఇవ్వగలరా” అంటూ మొదలెట్టా..
“స్టడీ సర్టిఫికేటా..అబ్బాయిదా అమ్మాయిదా మనవడిదా ? పేరు, చేరిన సంవత్సరం , చెప్పండి” అంటూ పేపరందుకున్నాడు.
“అబ్బే అలాంటిది కాదు …వింతగా అనిపించొచ్చు” అని మెల్లగా నవ్వి చెప్పాను. “నేను ఇదే స్కూల్ లో చదివాను దాదాపు 50 సంవత్సరాల క్రితం అప్పటి తరువాత ఇప్పుడే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీదొచ్చాను. మీ రికార్డులు చూసి అప్పటి విద్యార్థుల వివరాలు చెప్పగలరేమో అనే ఆశతో వచ్చాను.”
నాకే నవ్వొస్తుంది కానీ ఉబలాటం ఉండనియ్యటం లేదు. అతను నిశ్చేష్టుడై నిలిచిపోయాడు.
“యు మీన్ మీ రు చదివినప్పటి వివరాలా!!!” అంటూ తెల్లబోయాడు.
ఓ నిమిషమాగాక ..మెల్లగా నవ్వాడు.
“మీ సీరియస్ చూసి ఎగతాళి చేయలేక పోతున్నాను మాష్టారూ. అయినా 10 ఏళ్ళ రికార్డులే ఉండవు. 50 సంవత్సరాలంటే మాటలా..ఒక్కటే సమాధానం..ఇంపాసిబుల్”.
అనుకున్నదే సమాధానం నాకేమంత షాక్ గా లేదు.
“పోనీండి…థ్యాంక్స్” అంటూ లేచాను.
“కుర్చోండి కూర్చోండి” అంటూ కుర్రాణ్ణి పిలిచి టీ తెమ్మన్నాడు. “వెరీ ఇంటరెస్టింగ్ ….శ్రమ అనుకోకుంటే అసలు విషయమేమిటి ?ఎందుకా వివరాలు? చెప్పగలరా?” ఉత్కంఠ తో ముందుకు వొంగాడు.
నవ్వి ..సిగ్గుపడుతూ చెప్పాను…
“నేనిక్కడ 4 ,5 తరగతులు చదువుకున్నాను. ఆ పాత భవనంలో నే మా క్లాసులుండేవి అప్పుడు చుట్టూ ఇన్నిభవనాలు లేవు అంతా మైదానం. బడి చుట్టు తిరుగుతూ ఆడుకునే వాళ్ళం. మీకు తెలియదనుకోండి శేషగిరి రావు గారు మా క్లాస్ టీచర్..చండ శాసనుడు..కమల గారు లెక్కలు చెప్పేవారు మంచివారు. మీకో విషయం చెప్పాలి నాతో ఒకటవ తరగతి చదువుకున్నవారు కూడా మా స్వస్థలం లో ఇప్పటికీ మిత్రులు గానే ఉన్నారు కలుస్తుంటాం. వాళ్ళు ఉన్నచోటే ఉంటున్నారు కాబట్టి కుదిరింది. అలాగే అక్కడక్కడ మిస్సయిన లింకులు కలపగలనేమో అని ఓ ఆశ. అందరూ కాకున్నా నాతో క్లోజ్ గా ఉన్నవారు ఒకరిద్దరుంటారుగా. ఎప్పటికైనా గుర్తుపడతారు..అలాంటి సంఘటనలున్నాయి అప్పట్లో..” కొద్దిగా గర్వంగా చెప్పాను.
“లక్ష్మి ,చిన్న తల్లి ,పెద్ద తల్లి , కృపాకర్ ,వాసు , నేను ఓ జట్టు. ఆ రోజుల్లో లక్ష్మి అంటే అంత క్లోజ్ ఒకరింట్లో ఒకరు తినే వాళ్ళం, హోం వర్క్ చేసేవాళ్ళం. ఆడటం పాడటం అన్నిట్లో మేమిద్దరమే జత. ఓ సారి నే నెపోలీయన్ వేషం వేస్తే మా అమ్మ నాన్నలతో బాటు తను కూడా ముద్దుపెట్టుకుంది. సెలవుల్లో కూడ కలిసె తిరిగాం. వేయి విషయాలు గుర్తున్నాయి. ఇప్పుడు చెప్పండి మరచిపోయుంటుందంటారా..????”.
“నో..నెవర్…” నేనే సమాధానమిచ్చుకున్నాను. టీ వచ్చింది.
అలాగే కృపాకర్ కూడా. అప్పటి మా ఇంటివెనకే వాళ్ల ఇల్లు. మొన్న అక్కడంతా తిరిగా అన్నీ కొత్త కొత్త ఇళ్ళు.అసలు పాతది కనుక్కోవటమే కష్టమైపోయింది. అయినా ఫలితం లేదు ఎవ్వరికీ తెలిదు. అక్కడ కొన్న వాళ్ళంతా ఓ పాతిక 20 సంవత్సరాల లోపే కొన్నారు. లక్ష్మి ఇంట్లో ఇప్పుడు ఓ పెద్ద లాడ్జ్ వెలసింది. అంతకు ముందు ఉన్న హోటల్ వాళ్ళు 30 సంవత్సరాల క్రితమే అమ్మేసి వెళ్ళి పోయారట. ఈ స్కూల్ భవనం ఆ కొలను ఇంకా చెక్కు చెదరక అలాగే ఉన్నాయి…గతానికి సాక్షిగా. ఆ గట్టు మీది ముసలవ్వ మాకు అప్పుకూడా పెట్టేది. పావలా ఉంటే ఓ నెల జీళ్ళు తినేవాళ్ళం.”
కాస్త ఉద్రేకపడ్డానేమో కంట్లో నీళ్ళూ….
“ఇలా ఇంతకుముందు ఎవరినైనా కలిసారా?” అడిగాడు.
“ఆ !! మా నాన్నగారి స్నేహితుల అబ్బాయి ని కలిసాను. వాడు మాస్కూల్ కాదు. అయినా వారం వారం కలిసేవాళ్ళం అప్పట్లో. వాళ్ళింటి పక్కననే ఓ పెళ్ళిసత్రం ఉండేది, పెళ్ళి జరిగితే అక్కడే రికార్డులకు డ్యాన్సులు వేసేవాళ్ళం. ఫలహారాలు మేసేవాళ్ళం. ఈ మధ్యే కలిసాం. కుటుంభ సభ్యులు కూడ వింతగా చూసారు. కొంతమంది చనిపోయారు..ఒకరిద్దరు విదేశాల్లో ఉన్నారు” అంటూ ఆగాను అవన్నీ గుర్తుకురాగా…..
“కనుక్కొని ఏం చేస్తారు?” అడిగాదు ఇంకాస్త ముందుకు వంగి.
“ఏమో…కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు…మళ్ళీ ఆ కోనేటి గట్టుమీద కబుర్లు చెప్పుకో వచ్చు కరువు తీరా కబుర్లు కలబోసుకో వచ్చు నాకు గుర్తున్నవే కొన్ని..మరిచిపోయినవి ఎన్నో..తవ్వుకుంటే దొరుకుతాయేమో…మరిన్ని..మిమ్మల్నేమీ ఇబ్బంది పెట్టలే కదా.. నా సోది తో” అంటూ లేచాను.
“లేదు లేదు మాష్టారూ మీ కబుర్లు మా ఉరు తీసుకెళ్ళిపోయాయి” అంటూ వెనక్కి వాలిపోయాడు. ఎవరు గుర్తొచ్చారో!!
కథ అయిపోయిందా అంటే అయిపోయినట్టే. ఇప్పటికి ఇంక పరిశోధన పొడిగించలెను. ప్లాను అయితే ఉంది.బయటి ఊళ్ళలోకెళ్ళాలని చూద్దాం . శరీరం సహకరించాలి. సెలవులు దొరకాలి.
అద్దాలు సవరించుకుంటూ ముందుకు కదిలాను….విధి మళ్ళీ పదండి వెనక్కు అంటూంటె ఎం చేయను? బయలుదేరా.